Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: నారాయణ గురు చేసిన నేరమేమి?

ఎమ్బీయస్‍: నారాయణ గురు చేసిన నేరమేమి?

రిపబ్లిక్ డే పరేడ్‌లో కేరళ ప్రభుత్వం ప్రచారరథం (టేబ్లో)పై నారాయణ గురు బొమ్మ వుండడాన్ని కేంద్రం ఆమోదించలేదు అనగానే, ఆయన గురించి విననివాళ్లు బహుశా ఆయన ఏ టెర్రరిస్టో, కమ్యూనిస్టో, కనీసం నాస్తికుడో అయి వుంటాడు అనుకునేందుకు ఆస్కారం వుంది. అదేమీ కాదు. ఆయన ఓ సంఘసంస్కర్త, ఆధ్యాత్మిక గురువు. ఈళవ కులస్తులు ఆయన్ని దేవుడి స్థాయిలో కొలుస్తారు. మరి ఆయన ఎందుకు పనికి రాకుండా పోయాడో తిరస్కరించిన డిఫెన్స్ డిపార్టుమెంటు వాళ్లే చెప్పాలి, కానీ చెప్పటం లేదు. ఈయనదే కాదు, బెంగాల్ ప్రభుత్వం వారు తమ ప్రచారరథంలో నేతాజీ సుభాష్ చంద్ర బోసు బొమ్మలు పెడతామంటే రథాన్ని పెట్టడానికి వీల్లేదన్నారు. తమిళనాడు వాళ్లు చిదంబరం పిళ్ల బొమ్మ పెట్టినందుకు తిరస్కరించారు. ఎందుకో అర్థం కావటం లేదు. ఏమైనా అంటే నిపుణులు చేసిన నిర్ణయమిది అని ఒక్కమాటలో కొట్టి పారేస్తున్నారు. తక్కినవారి మాట ఎలా వున్నా, నారాయణ గురు విషయంలో ‘ఆయన దెందుకు ఆది శంకరాచార్యుడి విగ్రహం పెట్టవచ్చుగా’ జ్యూరీ సూచించడం చికాకెత్తిస్తోంది.

నారాయణ గురు (1856-1928) ఈళవ కుటుంబంలో పుట్టారు. ఈళవలు కేరళ హిందువుల్లో 23శాతం ఉంటారు. కల్లు గీయడం, కల్లు వ్యాపారం చేయడం, వ్యవసాయ కూలీలుగా పనిచేయడం ప్రధాన వృత్తి అనవచ్చు. చిన్నపాటి రైతులు, సాలెవాళ్లు, ఆయుర్వేద వైద్యులు కూడా ఉన్నారు. ఎవరో కొంతమంది డబ్బున్నవాళ్లున్నా, అత్యధికులు పేదలు, సామాజికంగా తక్కువగా చూడబడినవాళ్లు. ఇటువంటి కులంలో పుట్టిన నారాయణ 21వ ఏట తిరువాన్కూర్ వెళ్లి వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం నేర్చుకుని, నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చి సొంతూళ్లో ఒక పాఠశాల పెట్టి తను నేర్చుకున్నదంతా నేర్పసాగాడు. ఏడేళ్ల తర్వాత ఆయన అరువిపురం అనే చోటకు వెళ్లి తపస్సు చేశాడు. నాలుగేళ్ల తర్వాత 1888లో నదిలోంచి ఒక రాయి తీసి దాన్ని శివుడిగా ప్రతిష్ఠాపించాడు. ఆ గుడికి భక్తులు రాసాగారు కూడా. అప్పుడు బ్రాహ్మణులు కొందరు వచ్చి ‘చిత్తం వచ్చినట్లు ఏదో రాయి పెట్టేసి, దాన్ని శివుడని ఎలా అంటావు?’ అని పోట్లాడారు. ‘ఈయన బ్రాహ్మణ శివుడు కాదు, ఈళవ శివుడు.’ అని జవాబిచ్చాడీయన.

19, 20 శతాబ్దాలలో దేశమంతా జరిగిన సంస్కరణోద్యమాలలో మనం ఒకటి ప్రముఖంగా గమనించవచ్చు. చాలా చోట్ల సంస్కర్తలు బ్రాహ్మణులే, దాన్ని ఎదిరించిన ఛాందసులూ బ్రాహ్మణులే. కొన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు మరీ మూర్ఖంగా ప్రవర్తించి, మార్పును అడ్డుకోవడానికి ప్రయత్నించి భంగపడ్డారు. కేరళలో కులదాష్టీకాన్ని ఎదుర్కోవడానికి నారాయణ గురు ఆధ్వర్యంలో 1903లో శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం అని ఏర్పడింది. మనుష్యులందరిదీ ఒకే కులం, ఒకే జాతి, ఒకే మతం మానవత్వం అనే నినాదంతో యీ పీఠం యిప్పటికీ సాగుతోంది. నారాయణ గురు 1904లో శివగిరిలో ఒక స్కూలు ప్రారంభించి, ఈళవ కులస్తులకు మాత్రమే కాదు, అంటరానివాళ్లయిన పరయా, పులయార్ యిత్యాది నిమ్నజాతి పిల్లలకు కూడా వేదాలు నేర్పించాడు. అక్కడే శారదా మఠం పేర ఒక గుడి కట్టాడు. ఆ తర్వాత కేరళ, తమిళనాడులలో అనేక చోట్ల 45 గుళ్లు నిర్మించి హిందూమతాన్ని వ్యాప్తి చేశాడు. కర్ణాటకలోని మంగుళూరులో, శ్రీలంకలో కూడా గుళ్లు కట్టించాడు. వీటిల్లో విగ్రహ ప్రతిష్ఠాపన సంప్రదాయ పద్ధతుల్లో జరగలేదు. అద్దం, సూక్తులు చెక్కిన శిలాఫలకంతో సహా ఏ వస్తుపునైనా సరే, మూల విరాట్ స్థానంలో నెలకొల్పాడు.

హిందువుల్లో అస్పృశ్యతను నివారించడానికి కృషి చేశాడు. హరిజన ఆలయ ప్రవేశానికి దక్షిణాదిన మూలబిందువైన వైకోమ్ సత్యాగ్రహానికి కారకుడయ్యాడు. వైకోమ్ లోని శివాలయం వీధిలోంచి నారాయణ గురు వెళుతూంటే కొందరు అగ్రకులస్తులు అభ్యంతర పెట్టారు. దానికి నిరసనగా, ఆలయాల్లోకి అందరు కులస్తులను అనుమతించాలనే ఉద్యమం 1918 నుంచి ప్రారంభమైంది. దానికి మహాత్మా గాంధీ, పెరియార్ నాయకర్ వంటి వారు మద్దతిచ్చారు. 1924లో అది తారస్థాయికి వెళ్లి, 1936లో చట్టంగా మారింది. ఈ వైకోమ్ సత్యాగ్రహం థీమ్‌తో కేరళ ప్రభుత్వం 2019లో రిపబ్లిక్ డే ప్రచారరథం తయారు చేస్తే కేంద్రం అనుమతించలేదు. నారాయణ గురు మలయాళం, తమిళం, సంస్కృతంలలో 45 పుస్తకాలు రాశాడు. అనుకంపదశకం అనే పద్యమాలలో కృష్ణుణ్ని, బుద్ధుణ్ని, ఆదిశంకరుణ్ని, జీసస్ క్రైస్తును కీర్తించాడు.

ఆదిశంకరుడి అద్వైత సిద్ధాంతాన్ని ఆచరణలోకి తెచ్చి సర్వజన సౌభ్రాతృత్వాన్ని అమలు చేసి చూపించిన మహర్షిగా ఆయన్ను 1916లో రమణ మహర్షి గౌరవించారు. రవీంద్ర నాథ్ ఠాగూరు ఆయన్ని 1922లో శివగిరిలో కలిసి ‘‘ఆధ్యాత్మికతలో నారాయణ గురు కంటె ఉన్నతమైనవాడు, లేదా సరిసమానమైనవాడు కూడా నాకిప్పటిదాకా కనబడలేదు.’’ అన్నాడు. గాంధీ 1925లో కేరళ వచ్చినపుడు ఆయన్ని కలిసి ‘ఆయన దర్శనం కలగడం మహా భాగ్యం’ అన్నాడు. ఆయన 72వ ఏట 1928లో తనువు చాలించాడు. 1967లో ఆయనపై స్టాంపు వెలువడింది. 2009లో శ్రీలంక ప్రభుత్వం కూడా స్టాంపు విడుదల చేసింది. కేరళలో ఆయన విగ్రహాలు అనేక చోట్ల కనబడుతాయి.

ఈయన జీవితగాథలో అభ్యంతర పెట్టవలసిన అంశం మీకేమైనా కనబడుతోందా?  కానీ కేంద్రానికి కనబడింది. ఈయన బొమ్మ పనికి రాదు, ఆదిశంకరుడి బొమ్మ పెట్టండి అని సూచించింది. ఆయన ఘనత ఆయనది. ఈయన ఘనత యీయనది. రాష్ట్రానికి సంబంధించినది ఏదయినా ప్రచారరథంలో పెట్టవచ్చు. తెలంగాణకు సంబంధించి యివాళ తెరాస ప్రభుత్వం చార్మినార్ పెట్టవచ్చు. రేపు బిజెపి అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మి ఆలయం సెటప్ పెట్టవచ్చు. తప్పు పట్టగలమా? 1982 ఏసియన్ గేమ్స్ ప్రారంభంలో ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన నృత్యాలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి లంబాడాల నృత్యం చూపించారు. అప్పుడు కలకత్తాలో పనిచేస్తున్నాను. మా బెంగాలీ కొలీగ్స్ ‘ఆంధ్ర అంటే దక్షిణాది నృత్యం వుండాలి కదా, యిదేదో రాజస్థానీయులను చూపించారేమిటి?’ అని అడిగారు. వాళ్లూ ఆంధ్ర సంస్కృతిలో భాగమే అని సమాధాన మిచ్చాను.

అలా కేరళ ప్రభుత్వం నారాయణ గురును పెట్టినా, ఆదిశంకరుణ్ని పెట్టినా కేంద్రానికి తేడా ఏముంటుంది? నారాయణ గురు చేసిన తప్పేమిటి? వర్ణవివక్షత పాటించవద్దనడమా? వేదాలను నిమ్నజాతులకు కూడా బోధించడమా? కేంద్రం సమాధాన మివ్వకపోవడంతో పరిపరి విధాల ఆలోచనలు వస్తున్నాయి. నారాయణ గురు బిసిల పాలిట దైవం కాబట్టి, దీని ద్వారా ప్రతిపక్ష పార్టీ బిసిలకు ఆత్మీయమై పోతుందన్న భయమా? ఆలోచిస్తే వింతగా వుంది కదా! అసలు యిలా ఎందుకు ఆలోచించాలి అంటే బెంగాల్ ప్రభుత్వం నేతాజీ సుభాష్ 125వ జయంతి సందర్భంగా ఆయన బొమ్మ, ఐఎన్‌ఏతో ప్రచారరథం పెడతామంటే ఒప్పుకోకపోవడానికి కేంద్రం సహేతుకమైన కారణం చెప్పగలదా? బోసుని మేం గౌరవించామని చెప్పుకోవడానికి బెంగాల్ ప్రభుత్వానికి అవకాశం యివ్వకూడదన్న తపనా?

ఇక తమిళనాడు విషయానికి వస్తే విఓ చిదంబరం పిళ్ల బొమ్మ పెడితే కుదరదంటున్నారు. నౌకావ్యాపారంపై ఆంగ్లేయుల ఆధిపత్యం నడుస్తున్న రోజుల్లో ఆయన స్వదేశీ షిప్పింగ్ సంస్థ పెట్టి వాళ్లను ఛాలెంజ్ చేసిన సాహసి ఆయన. స్వదేశీ నినాదాన్ని బిజెపి గౌరవించేమాటయితే ఆయన బొమ్మను అంగీకరించి తీరాలి. కానీ నో అన్నారు. కారణమేమిటో చెప్పలేదు. తమిళ రాజకీయ నాయకుడొకడు ‘ఆయనెవరో విదేశీ అతిథికి తెలియదు, అందువలన కుదరదు అని చెప్పారు’ అన్నాడు. ఎవరలా చెప్పారో తెలియరాలేదు. మన నాయకులూ యితర దేశాలకు వెళతారు. అక్కడ కనబడిన ప్రతి విగ్రహం ఎవరిదో తెలుస్తుందా ఏమన్నానా? అయినా యీ టేబ్లోల మీద ఉన్న ప్రతి బొమ్మా చూసి ఆ అతిథి అడుగుతాడా? 2020లో బ్రెజిల్ అధ్యక్షుణ్ని అతిథిగా పిలిస్తే వెళ్లిన దగ్గర్నుంచి వివాదాల్లో మునిగి తేలుతున్నాడు. ఇప్పుడు రావలసిన కజకిస్తాన్ అధ్యక్షుడు రావడానికి ముందు నుంచీ తలమునకలా సమస్యల్లో మునిగి తేలుతున్నాడు. అక్కడి తిరుగుబాటు వలన రాగలడో లేదో కూడా తెలియదు.

తమిళనాడును బిజెపి మిత్రపక్షమైన ఎడిఎంకె పాలించిన ఐదేళ్లలో నాలుగేళ్లపాటు దాని ప్రచారరథాన్ని పెరేడ్‌లో అనుమతించారు. ఈ ఏడాది డిఎంకె అధికారంలోకి వచ్చింది. చిదంబరం పిళ్ల, మహాకవి భారతి, రాణి వేలు నాచ్చియార్, మరుదు సోదరుల బొమ్మలతో ప్రచారరథం రూపొందిస్తే కుదరదు పొమ్మన్నారు. కేంద్రం తీసుకుంటున్న యీ నిర్ణయాల పట్ల కేరళ, తమిళనాడు, బెంగాల్‌లలో అధికారపక్షాలే కాదు, యితర రాజకీయపక్షాలు కూడా నిరసన తెలుపుతున్నాయి. కేరళలో నారాయణ గురు మఠం సరేసరి! దీన్ని మీరు సమర్థిస్తారా అని కేరళ బిజెపిని లెఫ్ట్, కాంగ్రెసు అడుగుతున్నాయి. ఔనంటే వచ్చే ఎన్నికలలో ఈళవ ఓట్లు పోతాయోమో తెలియదు. 

కేరళ రథాల క్వాలిటీ బాగుండటం లేదు అని కుంటిసాకు చెప్పింది రాష్ట్ర బిజెపి. ఆది శంకరుడి బొమ్మ పెడితే క్వాలిటీ ఆటోమెటిక్‌గా పెరిగిపోతుందా? జవాబు చెప్పాల్సిన రక్షణశాఖ అఫీషియల్‌గా జవాబివ్వటం లేదు. నిపుణుల కమిటీ నిర్ణయించింది అంటున్నారు ఆర్థిక మంత్రిణి. ఇలా తిరస్కరించడం మాకు మామూలే. 56 ప్రతిపాదనలు వస్తే 35 తిరస్కరించాం అన్నారు. ఓకే, మీకా హక్కుంది, ఉపయోగిస్తున్నారు. కానీ కారణమేమిటో చెప్తే వచ్చే ఏడాది మళ్లీ యిలాటి ప్రతిపాదనలు చేయరు కదా. కేరళ ప్రచారరథంపై జటాయు నేచర్ పార్క్ థీమ్ పెడితే దాన్నీ తిరస్కరించారు. మరి దానికేమంటారు? కేంద్రం తన దాష్టీకాన్ని అడుగడుగునా ప్రదర్శిస్తోంది అనుకోవాలా? (ఫోటో – ఠాగూరుతో నారాయణ గురు, జటాయు నేచర్ పార్క్)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?