cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: బ్రెజిల్‌ అధ్యక్షుడి రాకపై ఎందుకీ వ్యతిరేకత?

 ఎమ్బీయస్‌: బ్రెజిల్‌ అధ్యక్షుడి రాకపై ఎందుకీ వ్యతిరేకత?

ఈ రిపబ్లిక్‌ పెరేడ్‌లో అతిథిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనరో వస్తున్నాడు. ఆయన రాకకు మన దేశంలోని కొన్ని వర్గాలు వ్యతిరేకత ప్రకటిస్తున్నాయి. వీరిలో చెఱుకు రైతులతో బాటు అతని విధానాలతో ఉన్న విభేదించేవారు కూడా ఉన్నారు. బోల్సొనరో ఎటువంటి మతరాజకీయాలు నడిపి అధికారంలోకి వచ్చాడో గత ఏడాది సరిగ్గా యిదే సమయానికి వ్యాసం రాశాను. (ఎమ్బీయస్‌: బ్రెజిల్‌లో మతరాజకీయాలు) అతను అధికారంలోకి వచ్చాక కూడా అతను అదే పంథాలో కొనసాగుతున్నాడు. 

అతివాద రైటిస్టు అయిన అతనికి మద్దతు యిస్తున్న వర్గాలను మూడు రకాలుగా విభజించవచ్చు. వ్యవసాయోత్పత్తులతో వ్యాపారం చేసే వర్గాలు (వీరిని ''బీఫ్‌'' అంటారు) మొదటి కోవలోకి వస్తారు. వీళ్ల కోసమే యితను ఇండియాతో పేచీ పెట్టుకుంటున్నాడు. రెండో కోవకు చెందిన వర్గాన్ని ''బైబిల్‌'' అంటారు. మతానికి, రాజకీయాలను ముడివేసి, చర్చి మద్దతుతో యితను అధికారంలోకి వచ్చాడు. ఇక మూడో వర్గాన్ని ''బుల్లెట్‌'' అంటారు. అంటే సైన్యం, దాని వెనక్కాల ఉన్న అమెరికా. ఇతను వృత్తిరీత్యా సైనికుడు. సైన్యానికి అపరిమిత అధికారాలు ఉండాలని వాదించినవాడు. అంటే ఒక 'బి' వెనుక మూడు 'బి'లు ఉన్నాయన్నమాట!

వ్యవసాయోత్పత్తుల వ్యాపారం చేసేవారు అడవులను నాశనం చేసి, వాణిజ్య పంటలు చేసి డబ్బు సంపాదిద్దామని చూస్తున్నారు. దాని వలన అక్కడుండే గిరిజనుల జీవితాలు అల్లకల్లోల మవుతాయని గత ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఇతను అవి ఎత్తేశాడు. పర్యావరణ రక్షణ నాన్సెన్స్‌ అన్నాడు. రక్షిత ప్రాంతాలను గుర్తించే పనిని స్వతంత్ర సంస్థ చేతుల్లోంచి తీసేసుకుని, తన ప్రభుత్వ శాఖకు అప్పగించాడు. గిరిజనులన్నా, మూలవాసులన్నా యితనికి మహా ఒళ్లు మంట, చిన్నచూపు. అధికారంలోకి వస్తూనే మూలవాసుల (ఇండియన్స్‌ అంటారు, మనం కాదు) అటానమీని తీసిపారేశాడు.  ఈ మధ్యే తన ఫేస్‌బుక్‌లో ''ఇండియన్స్‌ క్రమేపీ మారుతున్నారు. మనలాటి మనుష్యులుగా (హ్యూమన్‌ బీయింగ్స్‌)గా కొద్దికొద్దిగా మారుతున్నారు.'' అన్నాడు. 

దాంతో వాళ్ల హక్కుల కోసం పోరాడేవారందరూ వాళ్లు యిప్పటిదాకా మనుషులు కారా? అంటూ మండిపడ్డారు. కానీ యితనేమీ మాట వెనక్కి తీసుకోలేదు. ఈ మూలవాసుల పట్ల అనే కాదు, మైనారిటీలన్నా పడదు. తెల్లవారు కాని బ్రెజిల్‌ వాళ్లపై కూడా అతనికి చాలా చిన్నచూపు. 2017లో మాట్లాడుతూ ''ఆఫ్రికా నుంచి వచ్చిన బానిసల సంతతి వారు ఒళ్లు బలిసి వుంటారు. ఏ పనీ చేయరు. పిల్లల్ని పుట్టించడానికి కూడా పనికి రారు.'' అన్నాడు. ఇలా శ్వేతజాతి అహంకారం కలవారికి యిష్టుడయ్యాడు. ఇతను మహిళల పట్ల కూడా అదే దృక్పథం. వాళ్లకు మగవాళ్లతో సమానంగా జీతాలివ్వనక్కర లేదంటాడు. సాటి ఎంపీ పట్ల గతంలో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. 'నువ్వు రేప్‌కు కూడా పనికిరావు' అన్నాడు. 

ఈ అగ్రిబిజినెస్‌ లాబీ చాలా బలమైంది. బ్రెజిల్‌లో చెఱుకు విస్తారంగా పండుతుంది. కానీ 2018-19లో ఇండియాలో దాని కంటె ఎక్కువ చెఱుకు పండింది. అయితే పండినదానిలో మన దేశంలోనే చాలా ఖర్చయిపోతుంది కాబట్టి ప్రపంచపు చక్కెర ఎగుమతుల్లో మన వాటా 5% మాత్రమే, బ్రెజిల్‌ది 35%. అయినా వాళ్లకు మనను చూసి కన్ను కుట్టింది. ''భారత్‌లో చెఱుకు రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకుంటోంది. ఇది వ(ర)ల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ నియమాలకు విరుద్ధం. అలా ఆదుకోకూడదు'' అంటూ ఆ సంస్థ 2019 నాటి సమావేశంలో బ్రెజిల్‌ పెద్ద యుద్ధం చేసింది. నిజానికి మద్దతు ధర  ప్రకటించాక ప్రభుత్వం ఆ ధరకు కొనమని చక్కెర మిల్లులకు చెపుతుంది తప్ప నేరుగా కొనదు. ప్రభుత్వరంగంలో ఉన్న చక్కెర మిల్లులు అతి తక్కువ. ఏం చెప్పినా బ్రెజిల్‌ వినటం లేదు. మన మీద కత్తి కట్టిన బ్రెజిల్‌ అధ్యక్షుణ్ని అతిథిగా పిలవడమేమిటని చెఱుకు రైతుల సంఘనాయకులు అభ్యంతరం తెలుపుతున్నారు.

వ్యాపార వర్గాల మద్దతు ఉంది కాబట్టి బోల్సొనరో కార్మికులను అదుపు చేయడానికి చర్యలు చేపట్టాడు. సోషల్‌ సెక్యూరిటీ విధానాలలో, కార్మిక చట్టాలలో మార్పులు చేస్తూ, పని గంటలు పెంచుదామని చూస్తున్నాడు. పేదలకై ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదని, అసలు బ్రెజిల్‌లో పేదరికం అనేదే శుద్ధ అబద్ధమని అంటాడతను. బ్రెజిల్‌ ప్రభుత్వపు గణాంకాల ప్రకారమే బ్రెజిల్‌ జనాభా 21 కోట్లయితే దానిలో 5.5 కోట్ల మంది దారిద్య్రంలో ఉన్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ డేటా ప్రకారం లూలా హయాంలో కనుమరుగైన ఆకలిచావులు యిప్పుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. ప్రజల దృష్టిని మరలించడానికి వలసదారులు దొరికారు. ఐక్యరాజ్యసమితి వారి గ్లోబల్‌ కంపాక్ట్‌ (ఫర్‌ సేఫ్‌, ఆర్డర్లీ అండ్‌ రెగ్యులర్‌ మైగ్రేషన్‌) నుండి బోల్సొనరో వైదొలగాడు. వలస వచ్చేవారిని మర్యాదగా చూడవలసిన బాధ్యత తమకు లేదన్నాడు. 

రాజకీయాల్లో మతాన్ని, జాతీయవాదాన్ని కలిపేవారందరూ 'మనం-బయటివారు' అనే భావనను పెంపొందిస్తారు. దానిలో భాగమే యిది. ''బ్రెజిల్‌ జీసస్‌కు చెందుతుంది. దేవుడే బ్రెజిల్‌ భాగ్యవిధాత'' అని అతని నినాదం. 'మీ ఆదాయంలో 10% చర్చికి యివ్వాలి' అంటూ ఎవాంజలిస్టులు బాగా డబ్బులు పోగేశారు. అది చూసి యితను వాళ్లకు చేరువయ్యాడు. వాళ్ల సాయంతో అధికారంలోకి వచ్చాడు. ప్రమాణస్వీకారం తర్వాత మన జూడో క్రిస్టియన్‌ వారసత్వాన్ని, మన దేశపు సంస్కృతిని కాపాడతాను అన్నాడు. చర్చి స్వలింగసంపర్కాన్ని సహించదు కాబట్టి, వాళ్లకు వ్యతిరేకంగా యితను తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అధికారంలోకి వస్తూనే ఆ వర్గాల నుంచి వచ్చే ఫిర్యాదులను పట్టించుకోనక్కర లేదని హ్యూమన్‌ రైట్స్‌ మినిస్ట్రీకి ఆదేశాలిచ్చాడు. 

ఇక మూడో వర్గమైన బుల్లెట్‌ గురించి - ''మిలటరీపాలనలో చాలామందిని చంపేశారని గగ్గోలు పెడుతున్నారు. నన్నడిగితే యింకా చాలామందిని చంపి ఉండాల్సింది. ఈ ప్రజాస్వామ్యం, ఎన్నికల విధానం ద్వారా ఏమీ మార్చలేం. సైనిక పాలన తిరిగి రావాల్సిందే'' అని ప్రకటించిన మహానుభావుడు సైన్యానికి నచ్చకుండా ఎలా ఉంటాడు? తను అధికారంలోకి వస్తే నేరస్తులను చంపేస్తే పోలీసులపై కేసు లేకుండా చేస్తానన్నాడు. దీనికి తోడు మాజీ సైనికాధికారులు సభ్యులుగా ఉన్న ఆయుధవ్యాపారుల లాబీ మద్దతు పొందడానికి ''మంచి పౌరులకు తమను తాము రక్షించుకునే హక్కు ఉంది, అందుకు వారికి తుపాకాలివ్వాలి'' అంటూ ఆయుధ వ్యాపారుల మద్దతు సంపాదించాడు. 

ఇలాటి వాడికి సహజంగానే ట్రంప్‌ నుంచి అభినందనలు, ఆశీస్సులు లభించాయి. పైగా యితను బ్రెజిల్‌ ఆయిల్‌ బావులను వేలం వేసి, అల్కాంటారాలో అమెరికాకు మిలటరీ బేస్‌లకు చోటు యిద్దామనుకుంటున్నాడు. అయితే ప్రపంచంలో అమెరికా తప్ప తక్కిన అనేక దేశాలు యితని తీవ్రభావాలను, పక్షపాత విధానాలను నిరసిస్తున్నాయి. గత అధ్యక్ష ఎన్నికలలో బలమైన అభ్యర్థి ఐన లూలాపై అవినీతి ఆరోపణలు వచ్చి జైలుకి పంపారు. తగినన్ని ఆధారాలు లేకపోయినా జడ్జి, ప్రాసిక్యూటర్‌ కలిసి అతన్ని కటకటాల వెనక్కు పంపారనే అభిప్రాయం బలపడుతోందిప్పుడు. 580 రోజుల జైల్లో ఉన్నాక కోర్టు ఆదేశాల మేరకు యిప్పుడతను విడుదలై, దేశమంతా పర్యటిస్తూన్నాడు. అతని సభలకు జనాలు బాగా హాజరవుతున్నారంటే అధికారంలోకి వచ్చిన బోల్సొనరో పలుకుబడి తగ్గుతోందనేగా అర్థం!

మరి యిలాటి బోల్సొనరోను, ప్రపంచ వాణిజ్య సంస్థలో మనను వ్యతిరేకించేవాణ్ని మోదీ ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు అనే సందేహం రావడం సహజం. తనతో కొన్ని లక్షణాలు కలుస్తున్నాయని తోచిందో ఏమో చెప్పలేం. 2015 రిపబ్లిక్‌ దినోత్సవానికి ఒబామాను యిలాగే అతిథిగా పిలిచారు. మోదీ 'బరాక్‌, బరాక్‌' అంటూ యింటి పేరు కాకుండా అతని అసలు పేరును పిలిచి స్నేహం చాటుకున్నారు. మరుసటి ఏడాది ఆయన పార్టీ అమెరికా ఎన్నికలలో ఓడిపోయింది. ఈ బొల్సోనరోకు మరో మూడేళ్ల వరకు పదవీకాలం ఉంది లెండి.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2020)
mbsprasad@gmail.com