Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎలక్ట్రా కాంప్లెక్సున్న భార్యలు

ఎమ్బీయస్‌: ఎలక్ట్రా కాంప్లెక్సున్న భార్యలు

పిల్లల్లో కొడుక్కి తల్లి పోలిక వస్తే అదృష్టమని, కూతురికి తండ్రి పోలిక వస్తే అదృష్టమని మన దగ్గర అంటారు. తక్కిన దేశాలలో నమ్మకం సంగతి నాకు తెలియదు కానీ రూపంలో కాకపోయినా స్వభావంలో పోలిక గురించి చాలా మంది గర్వంగా చెప్పుకుంటారు. అనేకమంది తండ్రులు ‘‘మా అమ్మాయిదంతా నా పోలికే, అసలు మగాడిగా పుట్టాల్సింది. ఏ విషయాన్నైనా ఠక్కున పట్టేస్తుంది, ధైర్యంగా ముందుకు వెళ్లి సాధించుకు వస్తుంది.’’ అని గొప్పలు చెప్పుకుంటూ వుంటారు.

‘‘అవును, నేను మా అమ్మలా పడి వుండే రకం కాదు. నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తా, అచ్చు మా నాన్నలాగానే..’’ అని కూతుళ్లు చెప్పుకుంటూ వుంటారు. కొడుకు, కూతుళ్లలో కూతురికి బాగా చదువు వచ్చిందంటే, యిక కొడుకు గతి అధోగతే. ‘ఆడపిల్ల, దాన్ని చూసి నేర్చుకోరా, సిగ్గుపడు’ అని తండ్రి తిట్టిపోస్తూ వుంటాడు. ఈ తండ్రీకూతుళ్ల గొప్పలు చూసి విసిగి, తల్లి కొడుకుని సమర్థిస్తూ వుంటుంది. దాంతో వీళ్లో పార్టీ, వాళ్లో పార్టీగా తయారవుతూంటారు. 

కష్టపడుతూంటే క్రమేపీ జీవితంలో పైకి వస్తారు. ఇది సహజపరిణామం. కానీ మనిషికి స్వశక్తిపై నమ్మకం తక్కువ కాబట్టి తన అభివృద్ధిని వాస్తుకో, గ్రహసంచారానికో, ఏదైనా వ్యక్తికో కట్టబెడుతూ వుంటాడు. కొందరు పెళ్లయిన తర్వాత కలిసి వచ్చిందంటూ వుంటారు. పెళ్లయ్యాక మావగారు అండగా నిలిచి వుండవచ్చు, భార్య ఉద్యోగస్తురాలై ఖర్చు పంచుకుంటూండవచ్చు. భర్త వ్యాపారస్తుడైతే భార్య షాపులో కాస్సేపు కూర్చుంటూ వ్యాపారంలో తోడ్పడవచ్చు, లేదా పెళ్లినాటి తన బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు సర్దవచ్చు. దానితో సహజంగానే పరిస్థితిలో అభివృద్ధి వుంటుంది. దీన్ని ‘భార్య యింట్లో అడుగుపెట్టిన వేళ’కు కట్టబెడతారు కొందరు.

చాలామంది భర్తలు దీనికి పెద్దగా అంగీకరించరు కానీ కూతురి దగ్గరకు వచ్చేసరికి ‘మా అమ్మాయి పుట్టాకనే నాకు కలిసి వచ్చింది’ అనడానికి వెనకాడరు. ఎందుకంటే భార్య పరాయి యింటి నుంచి వచ్చింది. కూతురైతే తన సొంత రక్తం. తను తయారుచేసిన బొమ్మ. అందువలన క్రెడిట్‌ యివ్వడానికి ఏ మాత్రం సంకోచం వుండదు. కూతురు పుట్టేసరికి 30 ఏళ్ల దరిదాపుల్లో వుంటారు కాబట్టి పైమెట్టు ఎక్కడంలో వింతేమీ లేదు. కానీ ‘అది పుట్టాకే నాకు ప్రమోషన్‌ వచ్చింది/ కొత్త బిజినెస్‌ పెట్టగలిగాను’ వంటి సెంటిమెంట్లు కలుగుతాయి. ఆ సెంటిమెంటు మీదే తన బిజినెస్‌కు ఆమె పేరు పెడతారు.  భార్య కూడా కాదనదు, తన బిడ్డే కాబట్టి.

వీటివలన వచ్చే ప్రమాదం ఏమీ వుండదు కానీ కొందరు అమ్మాయిలకు దీనివలన అహంభావం తలకెక్కుతుంది. తండ్రి యిచ్చే యింపార్టెన్స్‌ వలన తనెక్కడి నుంచో దిగివచ్చిన దాన్ననే ఫీలింగు కలుగుతుంది. స్నేహితుల ముందు దాన్ని ప్రదర్శిస్తే వాళ్లు దూరం పెడతారు. పెళ్లయ్యాక భర్తకు మాత్రం యీ అహంకారం భరించక తప్పదు. భర్త పదం యొక్క విగ్రహవాక్యం ‘భరించువాడు’ అని! చివరకు ఓ శుభముహూర్తాన ‘మీ నాన్న కంటికి గొప్పగా కనబడితే కనబడవచ్చు కానీ నువ్వు అందరిలాటి ఆడ పిల్లవే.’ అని భర్త చెప్పేస్తే ఓర్చుకోలేరు, నిష్ఠూరపడతారు. 

కొందరు క్రమేపీ సర్దుకుంటారు. కొందరు సర్దుకోకుండా ‘నీకు మనిషి విలువ తెలియదు, పెళ్లాన్నయిపోయాను కాబట్టి లోకువ’ అంటూ పేచీలు పెట్టుకుంటారు. ఇది భార్యాభర్తల మధ్య గొడవగానే వుంటే కొద్దికాలానికి సద్దు మణుగుతుంది. కానీ అమ్మాయి తండ్రి మధ్యలో కలగజేసుకుని ‘చిన్నప్పటి నుంచి దానికి ఏం కావాలంటే అది కొనిచ్చాను. దాని మనసుకు కష్టం కలగకుండా చూశాను. దాని కంటివెంట నీరు కారిందో ఊరుకోను.’ అని అల్లుడికి హెచ్చరిక జారీ చేసే పరిస్థితి వచ్చిందంటే మాత్రం కాపురం ఏమౌతుందో చెప్పలేం.

ఎవరికైనా సరే, కౌమార దశ చాలా ముఖ్యమైనది. మగపిల్లలు  తండ్రికి వ్యతిరేకంగా, ఆడపిల్లలు  తల్లికి వ్యతిరేకంగా మారే దశ యిది. ‘ఇక నువ్వు చిన్న పిల్లవు కావు, జాగ్రత్తగా వుండు, వాళ్లతో తిరగవద్దు, వీళ్లింటికి వెళ్లవద్దు, సరైన బట్టలు వేసుకో, వెర్రిగా ఆటలాడకు, కాలో చెయ్యో విరిగితే ఎవడూ పెళ్లి చేసుకోడు’ అంటూ తల్లి కూతురిపై ఆంక్షలు పెడుతుంది. ఏ వెధవైనా తన మనసు చెడగొడతాడేమోనని నిరంతరం నిఘా వేసి వుంచుతుంది. ఇదంతా కూతురికి చికాకు. తండ్రికి ఫిర్యాదు చేస్తుంది.

ఆయన తన పనిలో బిజీ. ‘నీది మరీ చాదస్తం. అంతంత భయాలు అనవసరం. కాస్త స్వేచ్ఛ ఇయ్యి.’ అంటాడు భార్యతో. ‘మీకిలాటివి అర్థం కావు. ఎవడెలాటివాడో నేను పసిగట్టగలను, ఆడపిల్ల  విషయంలో ఏ వయసూ వాణ్నీ నమ్మడానికి లేదని ఒక ఆడదానిగా నాకు తెలుసు. కొంప మునిగేదాకా మీకు తెలిసిరాదు. దీనిలో కలగజేసుకోకండి’ అని భార్య చెపుతుంది. కూతురికి తండ్రి తనను అర్థం చేసుకునే వ్యక్తిగా, తల్లి దాష్టీకం చేసే రాకాసిగా తోస్తుంది. ఇంట్లో అందరూ తను చెప్పినట్లే వినాలని శాసించే నియంతగా తోస్తుంది. పాపం ఈవిడతో ఎలా వేగుతూ వస్తున్నాడో అని తండ్రిపై జాలి కలుగుతుంది.

ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రేమ కోసం తల్లితో పోటీ పడుతుంది. కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తున్నా తల్లి, అన్నయ్య ఆయనకు తగినంత గౌరవం యివ్వటం లేదని బాధపడిపోతుంది. బాగా చదువుకుని, ఉద్యోగం తెచ్చుకుని, తండ్రి సుఖంగా వుండేట్లు చూడాలని నిశ్చయించుకుంటుంది. తల్లి శత్రువై పోతుంది, తండ్రి ఆత్మీయుడై పోతాడు. దీనికి మూలకారణం లిబిడో అని ఫ్రాయిడ్‌ అంటాడు. అవన్నీ సుప్తమస్తిష్కంలో వుంటాయి కాబట్టి కనిపెట్టలేం కానీ   పిల్లలు  ఆపోజిట్‌ సెక్స్‌ పేరంటును విపరీతంగా అభిమానించడం చూస్తూనే వుంటాం. పెళ్లయ్యాక మంచి జీవితభాగస్వామి దొరికితే యివన్నీ సర్దుకుంటాయి.

తను తల్లి అయ్యాక, తన కూతుళ్లను జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం వచ్చాక, తల్లి తన క్షేమం కోసం పడిన తపన అర్థమవుతుంది. సానుభూతి, సహానుభూతి కలుగుతాయి. తల్లి యెడల ద్వేషం కరిగిపోతుంది. అంతకుముందే పెళ్లి సమయంలో తనకు తగిన వరుడి గురించి అమ్మ పడే ఆతృత కూడా ఆమెను మెప్పిస్తుంది. కాస్త ఆలస్యమైనా దానికి నచ్చినవాణ్ని చేద్దాం, పెళ్లి బాగా చేసి దానికి అత్తింట్లో మాట రాకుండా చూద్దాం అని తన గురించి తల్లి భర్తతో పోట్లాడినపుడు తల్లి విలువ గుర్తిస్తుంది.

పెళ్లయ్యాక భర్తతో అడ్జస్టు అయ్యే సమయంలో వచ్చే యిబ్బందులను ఓపిగ్గా వినేది అమ్మే. నాన్నైతే ‘ఇలాటి చిన్నవిషయాలు పట్టించుకోవడం వేస్టు.  నాకు చెప్పడం వేస్టున్నర’ అంటాడు. ఈ కారణం చేత భర్తతో గొడవలు వచ్చినపుడు అమ్మాయి తల్లి మాటకు ఎక్కువ  విలువ యిస్తోంది తప్ప తండ్రి చెప్తే వినడం లేదు. విడాకుల దాకా వచ్చిన కేసుల్లో చివరకు ఆడవాళ్ల మధ్య, కరక్టుగా చెప్పాలంటే భార్యాభర్తల తల్లుల అహంకారాల కలహంగా తేలుతోంది.

భర్త భార్యను తన తల్లితో పోల్చడం వలన, భార్య భర్తను తన తండ్రితో  పోల్చడం  వలన సంసారంలో గొడవలు మరింత పెరుగుతాయి. భార్య తండ్రి అలవాట్లతో, సామర్థ్యంతో భర్తను పోల్చి చూస్తుంది, చిన్నప్పటినుంచి తను సన్నిహితంగా చూసిన మగవాడు తండ్రే కాబట్టి! ‘రోడ్డు మీద వాడెవడో నన్ను చూసి కన్నుకొట్టినపుడు మీరైతే చవటలా ఊరుకున్నారు. అదే మా నాన్నయితే వాడి చెంప పగలకొట్టేవాడు’, ‘రైల్వే రిజర్వేషన్‌ లేకపోయినా టిటిఇకి లంచం యిచ్చి మా నాన్న బెర్త్‌ సంపాదించగలడు. మీకా చాకచక్యం లేదు.’, ‘మీ వయసు వచ్చేసరికి మా నాన్న సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు, మీకు ఉద్యోగం రాజీనామా చేయాలంటేనే భయం’, ‘మా నాన్నకు అవతలివాళ్ల మనోభావాలను గౌరవించాలనే జ్ఞానం ఉంది. మీకది లేదు, సెల్ఫ్‌ సెంటర్‌డ్‌. మీ సౌఖ్యం, మీ ఫీలింగ్స్‌ అంతే!’ ‘మా నాన్న సిగరెట్లు కాల్చడు, మందు కొట్టడు, మీకెందుకీ అలవాట్లు?’..

ఇలాటివెన్నో యిళ్లల్లో వినబడుతూంటాయి. ఈ అమ్మాయిలు గుర్తించని దేమిటంటే - ప్రతి వ్యక్తీ డిఫరెంటు. అవతలివాడి లాగానే సృష్టించే దండగమారి పని దేవుడు చేయడు. భర్త కుండే టాలెంటు భర్తకుంటుంది, తండ్రి కుండే టాలెంటు తండ్రికి వుంటుంది. అలాగే దుర్లక్షణాలూనూ. ఒక వ్యక్తి లోపాలోపాలు, ఆలోచనాధోరణి జీవితభాగస్వామికి తెలిసినట్లు సంతానానికి కూడా తెలియవు. భర్తను గురించి పూర్తి వివరాలు భార్య  పిల్లలకు చెప్పదు, తండ్రి పట్ల వారికి గౌరవం పోతుందని. ఒక వ్యక్తి, కూతురి దృష్టిలో గొప్పవాడు కావచ్చు కానీ భార్య దృష్టిలో కాదు. అతని నిజరూపం భార్యకు తెలుసు. కూతురికి తెలియదు కాబట్టి తన తండ్రి మహానుభావుడనుకుని ఆ యిమేజితో భర్తను పోల్చి, యీసడించి భర్త ఆదరాన్ని పోగొట్టుకుంటుంది. భర్తలు తమలో ఈడిపస్‌ కాంప్లెక్స్‌ ఉందేమో చెక్‌ చేసుకోవాల్సిన అవసరం వున్నట్లే భార్యలు తమలో ఎలక్ట్రా కాంప్లెక్స్‌ ఉందేమో చెక్‌ చేసుకోవాలి.    

ఇక ఎలక్ట్రా కథకు, యీ కాంప్లెక్స్‌కు పెద్దగా సంబంధం లేదు. ఎలక్ట్రా తన తండ్రితో కలిసివున్నది తక్కువ. అతను మహావీరుడని గౌరవం. అతనికి ద్రోహం చేసిందని తల్లిపై కోపం. పగ తీర్చుకోవడానికి కన్నతల్లినే హత్య చేసేటంత కోపం. ఆ మేరకే పోలిక. అందుకే ఫ్రాయిడ్‌ తండ్రి-కూతురు అనుబంధం గురించి చెప్పడానికి కూడా ఈడిపస్‌ కాంప్లెక్సంటే చాలన్నాడు. ఎందుకంటే ఈడిపస్‌ అంధుడై పోయి, రాజ్యం పోగొట్టుకుని అడవుల్లోకి వెళుతూంటే తోడుగా అతని కొడుకులు వెళ్లలేదు. కూతురు ఏంటిగోన్‌ మాత్రమే వెళ్లింది. మరణించేవరకు తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంది. అయితే ఫ్రాయిడ్‌ సలహా జంగ్‌ వినలేదు. ఎలక్ట్రా కాంప్లెక్స్‌ అనాల్సిందేనన్నాడు. సైకో ఎనాలిసిస్‌లో అదే నిలిచింది.

ఈ కాంప్లెక్సును వివరించడానికి నేను వేరే కథలు, సినిమాలూ ఏవీ చెప్పటం లేదు. ఇందిరా గాంధీ వైవాహిక జీవితాన్ని గుర్తు చేసుకోమంటాను. ఆమెకు తండ్రిపై వల్లమాలిన ప్రేమ. నెహ్రూకు కూడా కూతురంటే ఎంతో యిష్టం. జైలు నుంచి కూతుర్ని సంబోధిస్తూ రాసిన ఉత్తరాలే సాక్ష్యం. భార్య అస్వస్థురాలు. అందువలన ఆ ప్రేమంతా కూతురి మీదే ప్రసరించింది. అతనికి ఫిరోజ్‌ అంటే పెద్దంత గౌరవం లేదు. కానీ కూతురి అభీష్టం కాదనలేక పెళ్లి చేశాడు.

పెళ్లి తర్వాత కూడా ఇందిర తండ్రినే అంటిపెట్టుకుని వుండేది. వ్యక్తిగత సహాయకురాలిగా వుంటూ సకల వ్యవహారాలు చూసుకునేది. ఆమె చాలా కాలం తన పేరు ‘ఇందిరా నెహ్రూ గాంధీ’ అని చెప్పుకునేది. ‘నెహ్రూ’ ఇంటిపేరుపై ఆమె కంత ఆభిజాత్యం. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఫిరోజ్‌కు అది నచ్చలేదు. తండ్రితో పోల్చి భర్త పట్ల నిరాదరణ చూపేది ఇందిర. ఫిరోజ్‌ కుండే అభిమానులు ఫిరోజ్‌కి వుండేవారు. వారి వైవాహిక జీవితం భగ్నమైంది. ఈ పోకడలు వున్న వివాహితలుంటే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరుకుందాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?