cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ‘యజ్ఞం’ కథ

ఎమ్బీయస్‍:  ‘యజ్ఞం’ కథ

ఈ ఏడాది జూన్‌లో 96వ ఏట కాలం చేసిన కాళీపట్నం రామారావుగారు మహానుభావుడు. ఆయనతో నాకు పరిచయం వుంది. అనుభవాలున్నాయి. వ్యక్తిగా ఆయన ఎంత ఉన్నతుడో చెప్పాలంటే, మొదట కథకుడిగా ఆయన ఔన్నత్యం గురించి మాట్లాడాలి. చాలామందికి ఆయన పేరు పరిచితమే అయి వుంటుంది. ఆయన కథలు కూడా చదివే వుంటారు. ‘నచ్చిన కథ’ శీర్షిక నడిపినపుడు ఆయన రాసిన ‘‘జీవధార’’ కథ గురించి పరిచయం చేశాను. ఇప్పుడు ఆయనకు విపరీతంగా పేరు తెచ్చిపెట్టిన ‘‘యజ్ఞం’’ కథను పరిచయం చేస్తున్నాను. కథను చదవనివాళ్లు యీ సారాంశాన్ని చదవవచ్చు. 1964 ‘‘యువ’’ పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన యీ కథ అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఉత్తరాంధ్ర నేపథ్యంలో వున్న యీ కథ ఆధారంగా ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అనే తెలంగాణ నాయకుడు 1991లో పిఎల్ నారాయణ, భానుచందర్‌లతో గుత్తా రామినీడు డైరక్షన్‌లో సినిమా తీశారు. బయట సరిగ్గా ఆడిందో లేదో తెలియదు కానీ నందీ అవార్డులలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ (స్వర్ణనంది), కథారచనకు ద్వితీయబహుమతి గెలుచుకుంది. జాతీయ అవార్డులలో ఉత్తమ సహాయనటుడిగా పిఎల్ ‌నారాయణకు బహుమతి వచ్చింది. సామాజిక స్పృహ ఉన్న కథలు అనగానే మనకు స్టీరియోటైపు పాత్రలు తడతాయి. పేదలు అతి మంచివాళ్లు, రకరకాల దోపిడీకి గురవుతారు. ధనికులు అతి క్రూరులు. పేదల ధన, మాన, ప్రాణాలను దోచుకుంటారు. మధ్యతరగతివాళ్లు నిస్సహాయులుగానో, డబ్బున్నవారికి కొమ్ము కాసేవాళ్లగానో కనబడతారు. ఈ పాత్రలను అయితే తెలుపు లేదా నలుపులో చిత్రీకరిస్తారు. షేడ్స్ ఎక్కువగా వుండవు. ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా పేదల పట్ల జాలిపడుతూ చదివేయవచ్చు. ఏ పక్షాన ఉండాలో రచయితే మనకు చెప్పేస్తాడు కాబట్టి పెద్దగా ఆలోచించనక్కరలేదు.

కానీ యీ కథ అలాటిది కాదు. దీనిలో అన్ని పాత్రలతో మనకు సానుభూతి, సహానుభూతి కలుగుతుంది. ఏ వర్గం వారి స్టోరీ విన్నా వాళ్లను తప్పుపట్ట బుద్ధికాదు. దోపిడీ చేస్తూనే దోపిడికి గురయ్యే వర్గాలవి. చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను పెను చేప భక్షించే ఏర్పాటు ఉన్న సమాజం యొక్క స్వరూపాన్ని ఒక కథలోనే యిమిడ్చారు కా.రా.గారు. కథ చదివాక మనసు చెదిరిపోతుంది. ఇలాటి వాటికి పరిష్కారం ఏమిటాని ఆలోచిస్తూ వుండిపోతాం. అలా ఆలోచనలో పడవేసింది కాబట్టే యిది గొప్ప కథ అయింది, చివర్లో ఉన్న నాటకీయత వలన కాదు! మన గమనంలోకి రాకుండానే సమాజంలో జరుగుతున్న దోపిడిని, వ్యవస్థలోని లోపాన్ని సహజ పరిణామక్రమంలో భాగంగానే ప్రదర్శించారు రచయిత. అదీ వ్యాసరూపంలో కాదు, వ్యక్తుల అనుభవాల ద్వారా, వారు వెలిబుచ్చిన గోడు ద్వారా! 57 ఏళ్ల క్రితం కథ కదా అనుకోనక్కరలేదు. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ రోజులకూ యిది వర్తిస్తుంది. ఆట్టే మాట్లాడితే యింకా ఎక్కువ వర్తిస్తుంది.

శ్రీకాకుళానికి 15 మైళ్ల దూరంలో వున్న సుందరపాలెం అనే 400 వందల ఇళ్లున్న ఒక వూళ్లో ఉదయం పదిగంటల వేళ పంచాయితీ జరుగుతోంది. అప్పలరాముడనే 70 ఏళ్ల మాల కులస్తుడిపై ఫిర్యాదు. అతను పంచాయితీలో హరిజన మెంబరు. పెద్దమనిషిగా పేరున్నవాడు. ఫిర్యాదు చేస్తున్నవాడు గోపన్న అనే మాజీ షావుకారు. ఇద్దరూ బాగా స్నేహితులే. స్వతహాగా మంచివాళ్లే. పరిస్థితులే వాళ్లని ప్రత్యర్థి స్థానాల్లో నిలిపాయి. చాలాకాలంగా వున్న బాకీ తీర్చమని మూడేళ్ల క్రితం గోపన్న పట్టుబడితే ఏ తగాదా అయినా ఊళ్లోనే తేల్చుకోవాలి తప్ప కోర్టుకి వెళ్లకూడదని ప్రెసిడెంటు శ్రీరాములు నాయుడు పట్టుబట్టడంతో పెద్దలు కూర్చుని, వడ్డీ చాలా వరకు మాఫ్ చేసి, రెండువేల రూపాయలు బాకీ వుందని తేల్చి నోటు రాయించారు. కానీ మూడేళ్లగా రాముడు పైసా కూడా చెల్లు వేయలేదు. వడ్డీతో కలిసి బాకీ రెండువేల ఐదొందలైంది. రేపటితో నోటుకి కాలదోషం పడుతుంది. ఇప్పటికైనా యివ్వకపోతే ఎలా అని గోపన్న పట్టుబట్టాడు. ఇంకో మూడేళ్లు గడువియ్యి అంటున్నాడు రాముడు.

తీర్పు తీర్చడానికి కూర్చున్న ప్రెసిడెంటు శ్రీరాములు ఒక ఆదర్శవాది. అతను సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు. ఎనిమిదో ఏట స్థితిమంతులైన మేనమామల్లో ఒకరు తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అల్లుణ్ని పట్నం తీసుకెళ్లి కాలేజీదాకా చదివించారు. నాయుడు బిఎల్ చదువుతూ దేశసేవ పేరు చెప్పి చదువు మానేశాడు. అతన్ని ఎంపీయో, ఎమ్మెల్యేయో చేయాలని మేనమామల పట్టుదల. కాదు, నా గ్రామానికి ఏదైనా చేయగలిగితే నాకదే పదివేలు అంటూ పదిహేనేళ్ల క్రితం అతను వూరుకి వచ్చేసి సంస్కరించడం మొదలుపెట్టాడు. అప్పట్లో ఆ వూరు తక్కిన వూళ్లలాగే నిస్తేజంగా వుండేది, ఎవరూ మరొకరితో కలిసేవారు కారు. ఇతను వచ్చి హైస్కూలు పెడతానంటే అంతా ఎద్దేవా చేశారు. కానీ అతను సూర్యం గారనే డబ్బు నిక్కచ్చి మనిషి దగ్గరకు వెళ్లి, నచ్చచెప్పి స్కూలుకి 20 వేల రూ.ల విరాళం సంపాదించడనగానే అతని సామర్థ్యంపై నమ్మకం చిక్కింది.

నాయుడు హైస్కూలు కట్టించడంతో ఆగలేదు. దానికి రోడ్డు కావాలని ప్రభుత్వానికి నచ్చచెప్పి, రోడ్డు వేయించాడు. ఎలక్ట్రిసిటీ తెప్పించాడు, పంపింగు మిషన్లు, రైసు మిల్లులు వచ్చాయి. ఇతను చేస్తున్న పనులు చూసి, ఊరిలో ధనికులు స్థలాలిచ్చి అనేక రకాలుగా సాయపడ్డారు. ప్రభుత్వ ఆఫీసులు వచ్చాయి. ఆ వూరు ప్రభుత్వోద్యోగులకు ముద్దుబిడ్డయి కూర్చుంది. ఉద్యోగులు రాత్రింబవళ్లు జీపుల మీద, కార్ల మీద  ఆ గ్రామానికి వచ్చిపోతూ అభివృద్ధి పథకాలలో ఏదైనా ఆ గ్రామానికి యిచ్చాకే తక్కినవాటి సంగతి ఆలోచిస్తారు. సర్వముఖాభివృద్ధికి కారకుడని నాయుడంటే అందరికీ గౌరవం. అయితే అభివృద్ధి కొందరి జీవితాలను మరోలా ప్రభావితం చేసింది. వారిలో గోపన్న ఒకడు.

గోపన్న ప్రజలను పీడించిన షావుకారు కాదు. మంచివాడే. బట్టల వ్యాపారంలో డబ్బు రావడంతో పంటలు కొని అమ్మే వ్యాపారం కూడా పెట్టాడు. అయితే ఊరు వృద్ధి చెందాక మూడు కో-ఆపరేటివ్ సంస్థలు, నాలుగు బట్టలకొట్లూ వెలిశాయి. అరడజను మంది టైలర్లకు అక్కడ సంవత్సరం పొడుగునా పని తగిలింది. ఊళ్లోకి కొత్త హైక్లాసు బట్టలషాపులు రావడంతో అతని వ్యాపారం దెబ్బ తినేసింది. నలుగురు కొడుకులున్నా ఎవరూ సాయపడలేదు. వ్యాపారం దెబ్బ తింటోందని తెలియగానే గప్‌చుప్‌గా ఎవరికి చేజిక్కింది వాళ్లు మాయం చేసేశారు. చిన్న కొడుకులు ఆస్తి పంచమని కూర్చున్నారు. సుళువుగా వసూలయ్యే బాకీలు వాళ్లు తీసుకుని, ముప్పుతిప్పలు పెట్టేవి గోపన్నవి, పెద్ద కొడుకువి అన్నారు. వడ్డీల మాఫీలకు ఒప్పుకునే అప్పులు వాళ్లు తీర్చి, ఇల్లెక్కి కూచునే అప్పులు వీళ్లకు అంటకట్టారు. ఆ తర్వాత పొట్ట చేత్తో పట్టుకుని తలా ఓ దేశం పోయారు. ఐదారేళ్లు కష్టపడి గోపన్నా, పెద్దకొడుకు అప్పులన్నీ తీర్చేశారు. ఆ తర్వాత ‘ఇక్కడుంటే లాభం లేదు, పడమటి ఊళ్లకు వెళ్లి బతుకుతా అన్నాడు పెద్దకొడుకు. ఇక గోపన్న దిక్కులేని విధవ కూతుర్నీ, ఆమె ఐదుగురు పిల్లల్నీ పెట్టుకుని ఆ వూళ్లో వుంటున్నాడు.

ఇక రాముడి విషయానికి వస్తే అతనికి వున్నదల్లా రెండెకరాల ముప్ఫయి సెంట్ల భూమి. అప్పు తీరాలంటే పూర్తిగా అమ్మాలి. ‘నాకు నలుగురు కొడుకులు. మనవలు ఉన్నారు. ఇప్పటిదాకా రైతులం. భూమి అమ్మేస్తే కూలీలమై పోతాం. ఎప్పటికైనా అప్పు తీరుస్తాం కానీ యిప్పుడే తీర్చమని పట్టుబట్టవద్దు.’ అంటున్నాడు. అది పంచాయితీ. గతంలో ఊళ్లో చాలా గొడవలయ్యేయి. నాయుడు ఊరిపెద్ద అయ్యాక ఒక మండపం కట్టించి, ‘మన తగవులన్నీ యిక్కడే తీర్చుకుందాం. ఎవరైనా యిక్కడ తమకు న్యాయం జరగలేదని ఆరోపించి, కోర్టుకి వెళ్లిన రోజు యీ మండపాన్ని కూల్చేద్దాం’ అన్నాడు. అందువలన ఊళ్లోనే సామరస్యంగా రాజీ చేయాలని అందరి ప్రయత్నం. కానీ డబ్బు యివ్వాల్సిన రాముడి కుటుంబం కొరకరాని కొయ్యలా తయారైంది. రాముడు వృద్ధుడు, మీ సంగతేమిటి అని కొడుకుల నడిగితే వాళ్లు డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు.

అప్పు వున్నదా లేదా అంటే తఁవరంతా వున్నదన్నాక లేక ఎటు పోతుంది అంటారు. తీరుస్తారా లేదా అంటే తీర్చకపోతే ఊరుకుంటారా అంటారు. అయితే తీర్చండి అంటే మా దగ్గర ఏముంది? అంటారు. భూమి ఉందిగా అంటే అది అమ్మేస్తే మా బతుకేం కావాలి అంటారు. ఆ తెలివి అప్పు పుచ్చుకున్నపుడు లేదా అంటే అప్పుడు మేం చిన్నవాళ్లం, జ్ఞానం లేకపోయింది అంటున్నారు. జ్ఞానం వున్నవాళ్లే తీరుస్తారు అంటే అయితే వాళ్ల చేతే తీర్పించుకోండి అంటున్నారు. వీళ్ల వరస చూసి, ఊళ్లో వాళ్లకి చికాకెత్తిపోతోంది. ఎప్పటికీ ఏదీ తేలటం లేదు. ‘వివాదాల్లో ఉన్న బంజరు భూమి ఒకటుంది, అది యిప్పిస్తాం, దాన్ని సాగు చేసుకుని అప్పు తీర్చుకోండి’ అని సలహా చెపితే రాముడి నాలుగో కొడుకు, పట్నం వెళ్లి కొన్నాళ్లు వున్న సీతారాముడు ‘దానికి పెట్టుబడి పెట్టడానికి డబ్బెక్కడుంది? కష్టపడినా పండుతుందని నమ్మకమేముంది? అదేదో గోపన్నబాబుకే యిప్పించండి, అప్పు తీరేదాకా మేం అక్కడే కూలి చేస్తాం.’ అన్నాడు. గోపన్న దగ్గర మాత్రం పెట్టుబడికి డబ్బెక్కడుంది? ఆ ప్రతిపాదన వీగిపోయింది.

ఈలోగా రాముడి బంధువులు కొందరు చేరి ‘ఇదే షావుకార్లలో ఎవరైనా బాకీ పడి దివాలా తీస్తే భూమి అమ్మించి వీధిన పడేస్తారా? ఎలాగోలా సర్దుబాటు చేయరా? మా దగ్గరకు వచ్చేసరికే న్యాయాన్యాయాలు మాట్లాడుతున్నారు.’ అనసాగారు. గడువిచ్చినా ఎలా తీరుస్తారో ఎవరూ కమిట్ కావటం లేదు. ఇవతల గోపన్న ‘నేను అప్పులు తీర్చినపుడు వడ్డీలో మాఫీ అడక్కుండా అణాపైసలతో తీర్చాను. నా దగ్గరకు వచ్చేసరికి నా వడ్డీ అధర్మవడ్డీ అయిపోయింది. దాని క్కూడా గడువు కావాలన్నారు. పెద్దలందరూ చెప్పాక మీ దయ అని వూరుకున్నాను. ఇప్పుడా గడువు కూడా పూర్తయింది. మీ బుద్ధికి ఏం తోస్తే అది యిప్పించండి, అదే మహా ప్రసాదమనుకుంటాను.’ అని అంటూంటే నిర్దయగా వుండడం ఎవరి తరం కాలేదు. తమ వద్ద భూమి పెట్టుకుని రాముడి కుటుంబం మడత పేచీ వేయడం పెద్దలెవరికీ నచ్చలేదు.

ఆ మూడ్ రాముడు గమనించాడు. అందుకని ‘సభవారికి ఏమనిపిస్తోందంటే గోపన్న కొడుకులు అతన్ని వదిలేసి పోయారు, ఈ రాముడి కొడుకులు దుక్కల్లా పక్కనే వున్నారు. వాళ్లకు చెక్కా, ముక్కా లేకపోయినా రెక్కల కష్టం మీద బతగ్గలరు. అందువలన రాముడి మడిచెక్క అమ్మించేసైనా గోపన్నబాబు అప్పు తీర్పిద్దాం అనుకుంటున్నారు. సరే అలాగే కానీయండి.’ అన్నాడు. ఈ మాట పెద్దల్లో ఒకడైన లక్షుంనాయుణ్ని మండించింది. ‘అంటే - అది అప్పే అయినా తీర్చమనడం తప్పంటావ్’ అన్నాడు. రాముడు జవాబివ్వలేదు కానీ రెట్టించగా ‘‘బాబయ్యా, అది అప్పో, అప్పు కాదో, అయితే ఏనాటి అప్పో, ఎలా తేలిన అప్పో, అదంతా చదువుకోని మొద్దులం మాకు తెలియదు. పెద్దలు తమరున్నారు, శ్రీరావులు నాయుడు గారున్నారు, తమరే ఆలోచించి చెప్పాలి.’ అన్నాడు.

ఇదేదో ధర్మసంకటం లాటిది అనిపించింది అందరికి. శ్రీరాములు నాయుడు కాస్సేపు ఆలోచించి గోపన్నతో ‘మీ నోటు నేను చెల్లుపెడతాను. రాముడూ నువ్వు యీనాటి నుంచి బాకీ లేవు.’ అని తీర్పిచ్చి లేవబోయాడు. కానీ రాముడు ఒప్పుకోలేదు. నా మీద అలకతో యీ తీర్పిచ్చావు అని ఆరోపించాడు. ఆ తర్వాత తన భూమి ముసలయ్యకు అమ్మడానికి సిద్ధపడ్డాడు. కరణం పురోణిపత్రం తయారు చేశాక, ‘ఈ అప్పు న్యాయమైన అప్పు కాదని నేనెందుకు అన్నానో సభవారికి చెప్పి దీని మీద వేలుముద్ర వేస్తాను.’ అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసం యిచ్చాడు. కథకు యిదే కీలకమైనది. గ్రామీణ ఆర్థికవ్యవస్థ అతలాకుతలం ఎలా అయిందో, సంపద ఎలా చేతులు మారిందో మనకు తెలుస్తుంది. అతని ప్రసంగాన్ని, కథ ముగింపును ‘యజ్ఞం కథ ఓ వార్నింగ్’ అనే వ్యాసంలో క్లుప్తంగా చెపుతాను. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)

mbsprasad@gmail.com

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు