Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మోదీకి కీలకమైన యుపిని యోగి గట్టెక్కిస్తాడా? - 1/2

ఎమ్బీయస్‌: మోదీకి కీలకమైన యుపిని యోగి గట్టెక్కిస్తాడా? - 1/2

రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో గెలుపు బిజెపికి అతి ముఖ్యం. 2014లో యుపియే బిజెపిని దిల్లీ గద్దె ఎక్కించింది. గతంలో ఉత్తరాదిన తెచ్చుకున్న సీట్లకు అంతకు మించి గండిపడితే మోదీ ప్రధానపదవికి యిబ్బంది. ఇప్పుడున్న సూచనల ప్రకారం మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌లలో గతంలో కంటె తక్కువ పార్లమెంటు సీట్లు వచ్చే సూచనలున్నాయి. ఆ మేరకు తూర్పు, దక్షిణ, ఈశాన్యాల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకుని ఆ నష్టాన్ని పూరించుకోవచ్చని అనుకున్నా యుపిలో గతంలో తెచ్చుకున్న సీట్లు (80లో 73) తెచ్చుకుంటే తప్ప ప్రస్తుతం ఉన్న అంకె నిలవదు. నిలవకపోతే మోదీ కాకుండా వేరేవారి నేతృత్వంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడవచ్చు. మోదీ స్థానం తగ్గితే అమిత్‌ షాది కూడా ఆటోమెటిక్‌గా తగ్గుతుంది. అందువలన యుపిని నిలబెట్టుకోవడం మోదీ-అమిత్‌ ద్వయానికి అత్యంత ఆవశ్యకం. మొన్నటి ఉపయెన్నికల తర్వాత ప్రతిపక్షాలు ఏకమై బిజెపి ఓటు బ్యాంకుకు గండి కొడతాయన్న భయం ఒకటి పట్టుకుంది. ఇతర అంశాల మాట ఎలా ఉన్నా రాష్ట్రంలో పాలన బాగుంటే ప్రజలు అధికార పార్టీకి ఓటేస్తారన్నది వాస్తవం. ఆ విషయంలో యోగి 15 నెలల పాలన తీరు ఎలా ఉందనేదే తెలుసుకోవాలి.

ముందుగా ఒక విషయం గమనించాలి. ఉత్తర ప్రదేశ్‌ను పాలించడం మాటలు కాదు. అతి విశాలమైన రాష్ట్రం. ఒక్కో ప్రాంతం ఒక్కో రీతిగా ఉంటుంది. మూడు ముక్కలు చేస్తే తప్ప పాలించడం కష్టం. కానీ బియస్పీ తప్ప వేరే ఏ పార్టీ దాన్ని విభజించడానికి యిష్టపడటం లేదు. దానిపై పట్టు సాధిస్తే దేశంపై పట్టు వస్తుందని వాళ్ల ఊహ. ఏతావతా అది పాలించడానికి అలవికాని రాష్ట్రంగా మారింది. ప్రజల్లో క్రమశిక్షణ తక్కువ, అధికారుల్లో అలసత్వం ఎక్కువ. ప్రతిదాన్ని కులదృష్టితో చూసే వాతావరణం. ఎన్నో విధాలుగా సంస్కరించుకుంటూ వస్తే తప్ప ఆ రాష్ట్రం బాగుపడదు. దాన్ని సవ్యంగా పాలించినవాడు గత 50 ఏళ్లలో కానరాడు. అలాటి రాష్ట్రాన్ని ఏ మాత్రం పాలనానుభవం లేని యోగికి అప్పగించి బిజెపి చాలా సాహసమే చేసింది. ఉపయెన్నికల ఫలితాల తర్వాత పునరాలోచనలో పడి వుండవచ్చు.

యోగి తీవ్ర హిందూత్వ భావాలు ఎన్నికలు నెగ్గడానికి ఉపయోగపడవచ్చు కానీ పాలనాదక్షత సంతరించుకోవడానికి ఉపయోగపడవు. అతని కాబినెట్‌లో కూడా చాలామంది కొత్తవారున్నారు. 403 అసెంబ్లీ స్థానాల్లో 312 స్థానాలను బిజెపికి, 13 స్థానాలను దాని భాగస్వాములకు కట్టబెట్టిన ఓటర్లు యోగి నుంచి ఎంత ఆశిస్తారో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. దానికి తోడు 90 రోజుల్లో రాష్ట్రంలోని హైవేస్‌ అన్నిటిల్లో గుంతలు పూడ్చేస్తాననే లాటి భారీ వాగ్దానాలు చేశాడు యోగి. (సగం కూడా మరమ్మత్తు కాలేదు) అందువలన యోగి విజయవంతమైతే ఆశ్చర్యపడాలి కానీ విఫలమైతే ఆశ్చర్యపడనక్కరలేదు. వచ్చిన దగ్గర్నుంచి అతను తెల్లవారుఝామున 4 గంటల నుంచి అర్ధరాత్రి దాకా పనిచేస్తూన్నాడు. ఇ-టెండరింగ్‌ ప్రవేశపెట్టి కాంట్రాక్టర్ల అవినీతికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నాడు.

యోగిపై చెప్పుకోదగ్గ అవినీతి ఆరోపణలు యిప్పటిదాకా వెలుగులోకి రాకపోయినా యోగి పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేయడం లేదు. క్షేత్రస్థాయిలో అతని పాలన ఫలితాల నివ్వటం లేదు. అతని ఏడాది పాలనపై వ్యాఖ్యానిస్తూ మాయావతి ''ఏక్‌ సాల్‌, బురీ మిసాల్‌ (ఉదాహరణ)'' అని వ్యాఖ్యానించింది. అఖిలేశ్‌ ''తనదంటూ చెప్పుకోవడానికి బిజెపి ప్రభుత్వానికి ఏమీ లేదు. నేను పూర్తి చేసిన ప్రాజెక్టులకు యోగి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు.'' అని వెక్కిరించాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. పూర్వప్రభుత్వ నిర్వాకం కొంత ఉంటే యోగి మరింత చేర్చాడు. రాష్ట్ర జిఎస్‌డిపిలో (గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రోడక్ట్‌) ద్రవ్యలోటు, ఋణభారం 29.8% ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో యిది 15% ఉంటుంది.

ఇక బిజెపికి ఓట్లు కురిపించిన రైతు ఋణమాఫీ అమలైన తీరు గురించి మార్చి నాటికి 36 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల ఋణాన్ని మాఫీ చేశారు. మొత్తం 86 లక్షలమందికి రూ. 36 వేల కోట్ల ఋణాన్ని మాఫీ చేయడం మా లక్ష్యం అంటోంది యోగి సర్కారు. అంటే తలకు రూ.42,000 కంటె తక్కువన్నమాట. మొదట్లో రైతులందరినీ లోన్‌ మేళా పేరుతో ఒక చోటకి రప్పించి ఋణమాఫీ పత్రాలను అందించారు. కొందరికి రూ.5, 10, 100 కూడా చేసినట్లు పత్రాల్లో ఉంది. ఇక్కడకు రావడానికే వందలాది రూపాయలు ఖర్చయ్యాయి. వచ్చాక యీ ముష్టి ఏమిటి? అని వాళ్లు ఆందోళన చేశారు. అప్పుడు యోగి కనీసం రూ.10 వేల రూ.ల మాఫీ ఉంటేనే వాళ్లను రప్పించి పత్రాలివ్వండి అని ఆదేశాలు జారీ చేశాడు.

యోగికి ఆవేశం ఎక్కువ. దానికి 'ఠాకూర్‌వాద్‌' అనే పేరు పెట్టారు. జనాభాలో 8% ఉన్న ఠాకూర్లు యోగి వచ్చాక చెలరేగిపోతున్నారనీ, వారికే రాష్ట్రంలో, ముఖ్యంగా గోరఖ్‌పూర్‌లో ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయని ఆరోపణలున్నాయి. యోగికి అనవసర విషయాలపై ఆసక్తి ఎక్కువ. తన భావాల వ్యాప్తికి రాకరాక వచ్చిన యీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉబలాటం జాస్తి. ముఖ్యమంత్రి అవుతూనే అయోధ్యకు వెళ్లి బాబ్రీ మసీదు కూలగొట్టిన చోట ఉన్న రామలాలాను దర్శించి వచ్చాడు. సరయూ నది ఒడ్డుపై 100 అడుగుల రామవిగ్రహాన్ని కడతానన్నాడు. తమ గోరఖ్‌నాథ్‌ మఠానికి చెందిన స్వాముల జీవితచరిత్రలను పాఠ్యాంశంగా చేర్చాడు. ముఖ్యమంత్రి అవుతూనే '15 ఏళ్ల తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చిన విషయాన్ని చాటిచెప్పడానికి బస్సులకు, కొన్ని ప్రభుత్వాఫీసులకు కాషాయరంగు వేయించాల'ని ఆదేశాలు జారీ చేశాడు. అయోధ్యలో మందిరం కడతానంటూ గత దీపావళి నాడు అక్కడ పెద్ద ఉత్సవం నిర్వహించాడు.

గోహత్య విషయంలో, లవ్‌ జిహాద్‌ విషయంలో, యాంటీ-రోమియో స్క్వాడ్‌ విషయంలో మొదట్లో చాలా చురుగ్గా వ్యవహరించాడు. పోనుపోను తగ్గాడు. గోరక్షణ శ్రుతి మించి రాష్ట్ర ఆర్థికప్రయోజనాలను దెబ్బ తీస్తోందని, అనేకమంది ఉపాధి కోల్పోయారని అర్థమయ్యాక చల్లబడ్డాడు. ఇవన్నీ ముందే ఊహించి వుంటే యింత అనర్థం జరిగేది కాదు. పేర్లు మార్చడంలో యోగి దిట్ట. ఎంపీగా ఉన్నపుడే గోరఖ్‌పూర్‌లోని మియా బజార్‌ను మాయాబజార్‌గా, ఉర్దూ బజార్‌ను హిందీ బజార్‌గా, ఆలీ నగర్‌ను ఆర్యానగర్‌గా మార్చాడు. ఇప్పుడు కూడా అలాహాబాద్‌ పేరు ప్రయాగగా మార్చబోతున్నాడు. లఖ్‌నవ్‌ పేరు లక్ష్మణపూర్‌గా మారుస్తామంటున్నాడు. ఈలోగా లఖ్‌నవ్‌ మసీదు ఎదురుగా లక్ష్మణుడి భారీ విగ్రహం కార్పోరేషన్‌ వాళ్ల చేత నెలకొల్పబోతున్నాడు. వేరే చోట పెట్టుకోవచ్చు కదాని ముస్లింలు అంటూంటే వినటం లేదు. కావాలని గొడవలు తెచ్చిపెట్టుకోవడం కాకపోతే వీటివలన ప్రజానీకం స్థితిగతులు మెరుగుపడబోయేది ఏమీ లేదు.

'ఇవన్నీ టుమ్రీ విషయాలు, హిందువులకు కావలసినది రామమందిరం, యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌. అవి నెరవేర్చడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైంది' అంటాడు ప్రవీణ్‌ తొగాడియా. అతను వృత్తి రీత్యా కాన్సర్‌ సర్జన్‌. ఆరెస్సెస్‌లో చేరి గత 32 సంవత్సరాలుగా విఎచ్‌పి (విశ్వ హిందూ పరిషత్‌)లో ఉన్నత పదవుల్లో ఉన్నాడు. 52 సం.ల తర్వాత ఆ సంస్థలో ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి ఇతని అభ్యర్థి యైన రాఘవరెడ్డి (స్వీట్‌షాపుల పుల్లారెడ్డిగారి అబ్బాయి) ఓడిపోయాడు. మోదీ తరఫు అభ్యర్థి యైన విఎస్‌ కోక్‌జే నెగ్గాడు. దాంతో తొగాడియా రాజీనామా చేసి ఏప్రిల్‌లో బయటకు వచ్చేశాడు. అతనికి పన్నెండేళ్లగా మోదీతో మాటలు లేవు.

తన ఓటమిని పగగా మలుచుకుని బిజెపి హిందువులకు తగినంతగా చేయడం లేదనే నినాదంతో అతను యుపిలో ప్రచారం చేయబోతున్నాడు. అయోధ్యలో రామాలయం కట్టకపోవడానికి కోర్టు తీర్పే కారణం అని బిజెపివారు జవాబు చెపితే 'గతంలో యుపిఏ కూడా యిదే చెప్పింది, మీరు వచ్చి ఉద్ధరించిందేముంది?' అని అతని ప్రశ్న. ఆలయం కట్టి తీరాలనే పట్టుదల ఉన్న హిందూత్వవాదులు అసంతృప్తిగా ఉన్నారనేది ఒప్పుకోవాలి. దాన్ని తిప్పికొట్టడానికి బిజెపి ఎన్నికల లోగా అయోధ్య గురించి మళ్లీ ఏదో సందడి చేయాలి.

ఎస్పీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందిన బిజెపి తన పాలన రాగానే రాష్ట్రంలో రౌడీయిజానికి చోటు లేకుండా చేస్తానని ప్రకటించింది. అయితే యోగి పాలన ప్రారంభం కాగానే రాష్ట్రంలో హింస పెరిగింది. దాంతో యోగి తనకు తెలిసిన మొరటు పద్ధతుల్లో నేరస్తులను అణచివేయాలనుకున్నాడు. కనబడిన రౌడీలను కాల్చిపారేయమని పోలీసులకు అధికారాలిచ్చేశాడు. దాంతో ఏడాదిలో 1322 ఎన్‌కౌంటర్లు అయ్యాయి. 44 మంది రౌడీలను చంపేశారు. ఇదంతా సినిమాల్లో చూడడానికి బాగుంటుంది కానీ వాస్తవ పరిస్థితుల్లో రౌడీ అని అనుమానం ఉన్నవాణ్ని, తమకు పడనివాణ్ని పోలీసులు మట్టుపెట్టేశారు. పెద్ద క్రిమినల్స్‌ జోలికి వెళ్లకుండా చిన్న వాళ్లనే యీ పేరుతో వేధించారు. బిజెపిలో చేరితే నిన్ను వదిలేస్తా, లేకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తా అని పోలీసు అధికారి రౌడీని బెదిరించిన సంభాషణ కూడా లీకయింది.

ఈ ఫిబ్రవరిలో నోయిడాలో వెలుగులోకి వచ్చిన సంఘటన తెలుసుకుంటే ఏం జరుగుతోందో ఒక ఐడియా వస్తుంది. పాతికేళ్ల జితేంద్ర యాదవ్‌ అనే జిమ్‌ సొంతదారు రాత్రి 10 గంటలకు పెళ్లి రిసెప్షన్‌ నుంచి తిరిగి వస్తూ ఓ పీజా షాపు వద్ద ఆగాడు. అతని కారులోంచి మ్యూజిక్‌ బిగ్గరగా వస్తోంది. అటుగా వెళుతున్న పోలీసు జీపులోంచి సబిన్స్‌పెక్టర్‌ విజయ్‌ దర్శన్‌ జితేంద్రను పిలిచి కారులో మ్యూజిక్‌ సిస్టమ్‌ సౌండు తగ్గించమని చెప్పాడు. 'దానితో మీకేం పని?' అని పొగరుగా మాట్లాడాడు జితేంద్ర. మాటామాటా పెరిగింది. కోపం పట్టలేని విజయ్‌ దర్శన్‌ తుపాకీ తీసి జితేంద్రను కాల్చిపారేశాడు.  వెళ్లి పైఅధికారులతో నేనో క్రిమినల్‌ను ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశాను అని చెప్పుకున్నాడు. పక్కనున్న పోలీసులు ఔనౌనన్నారు. అయితే జితేంద్ర కుటుంబీకులు డబ్బున్న వాళ్లు కావడంతో విడిచి పెట్టలేదు. కేసు పెట్టారు. విచారణ జరిగి, దర్శన్‌ను జైలుకి పంపారు, అతనితో వున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్‌ చేశారు. వెలుగులోకి తేలేని యిలాటి సంఘటనలు ఎన్ని ఉన్నాయో తెలియదు. యోగి పాలనలో పోలీసులు ట్రిగ్గర్‌ హ్యేపీ అయిపోయారనే మాటలు మాత్రం వినిపిస్తున్నాయి.

రౌడీల విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించమని చెప్తున్న యోగి తన పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ఎంత ఉదారంగా ఉన్నాడో కులదీప్‌ సెంగార్‌ (17 ఏళ్ల మైనరు బాలిక రేప్‌, పోలీసు కస్టడీలో ఆమె తండ్రి మరణం) ఉదంతం చాటిచెప్పింది. ఇటీవలి కాలంలో ముస్లిం ప్రాంతాల్లో హిందూత్వ కార్యకర్తలు కావాలని 'తిరంగా యాత్ర' పేరు మీదో, దేవుడి ఊరేగింపు పేరు మీదో ఊరేగింపులు నిర్వహిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఈ ధోరణిని బరేలీ జిల్లా మేజిస్ట్రేటు తన ఫేస్‌బుక్‌లో విమర్శిస్తే, తక్షణం అతన్ని బదిలీ చేసేశారు. 2013లో ముజఫర్‌ నగర్‌ అల్లర్లలో, షామ్లీలో అలర్లలో నిందితులుగా వున్నవారిలో కొందరిపై మాత్రమే యోగి ప్రభుత్వం కేసులు విత్‌డ్రా చేయడం ముస్లిం జనాభాలో అవిశ్వాసం పెంచింది.

2017 ఆగస్టులో యోగి సొంత నియోజకవర్గంలోని బిఆర్‌డి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 34 మంది పిల్లలు 18 మంది పెద్దలు మరణించిన ఘటనపై యోగి ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత గర్హనీయంగా వుంది. చేపాచేపా ఎందుకు ఎండలేదు అనే కథలోలాగ యిది వ్యవస్థలో లోపం. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్లు లేవు. ఎందుకు అంటే సప్లయి చేసేవాడు చేయలేదు. ఎందుకు అంటే గతంలో యిచ్చినవాటికి 63 లక్షల రూ.ల చెల్లింపులు బకాయి పెట్టారు కాబట్టి. బకాయి ఎందుకు అంటే ప్రభుత్వం నిధులు యివ్వలేదు కాబట్టి! సరఫరా జరగటం లేదని ఆసుపత్రి అధికారులు, బిల్లులు చెల్లించకపోతే సప్లయి చేయమని గ్యాసు కంపెనీవారు అందరూ ప్రభుత్వానికి లేఖలు రాశారు. ప్రభుత్వం ఏమీ చేయకుండా ఆ లేఖలను ఆసుపత్రికే తిప్పి పంపి చేతులు దులుపుకుంది తప్ప నిధులు విదల్చలేదు. బజెట్‌ తగ్గించేసి, దానిలోనే ఎంత వస్తే అంత కొనుక్కోండి అంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?