Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: వైయస్సూ – శాంతి అక్షింతలూ

ఎమ్బీయస్: వైయస్సూ – శాంతి అక్షింతలూ

షర్మిల రాజకీయప్రవేశం గురించి నేను రాసిన వ్యాసంలో ఆమెపై గల క్రైస్తవముద్ర గురించి, గుళ్లకు వెళ్లకపోవడం గురించి ప్రస్తావించాను. రాజకీయ నాయకులంటేనే రాజీనాయకులు. సొంత నమ్మకాలను పక్కన పెట్టి, అనుచరుల కోసం సర్దుకోవాలి. ఈ విషయంలో వైయస్ విధానమేమిటో ఉండవల్లి రాసిన ‘‘వైయస్సార్‌తో...’’ అనే పుస్తకం నుంచి ఒక సంఘటనను ఉటంకిస్తున్నాను. షర్మిల గురించి మూడు వ్యాసాలు అవసరమా అంటూ కొన్ని వ్యాఖ్యలు చూశాను. నిజానికి అది ఒక్కటే. టాబ్లాయిడ్ కవర్ స్టోరీకై రాశాను. వెబ్‌సైట్‌కి వచ్చేసరికి యింత దీర్ఘవ్యాసమా అంటారని, మూడు ముక్కలుగా చేశాను. ఆమె ఎదురుగా వున్నది ఎంతటి ముళ్లబాటో వివరించడానికి ఆ మాత్రం స్పేస్ కావలసి వచ్చింది.

చివర్లో ఎలా నెగ్గుకు వస్తుందో చూడాలి అంటే యీ మాత్రానికి యిదంతా రాయడమెందుకు అని వ్యాఖ్యలు చేశారు కొందరు. ఇదేమీ పిట్టకథ కాదు. పేజీ తిప్పేలోపున ముగింపు వచ్చేయడానికి. ఇదో పెద్ద నవల. కథానాయకి ముందున్న అడ్డంకులు యివి, ఆమె వద్ద వున్న సైన్యం యిది అని వివరంగా చెప్పకపోతే ఎలా? నేనేమీ జ్యోతిష్కుణ్ని కాను, ఆమె పార్టీ పెట్టకముందే కనీసం 3 జిల్లాల్లో 15 సీట్లు గెలుచుకుంటుంది అని చెప్పడానికి. ముఖ్యపాత్ర పరిచయమే కాలేదింకా. పాదయాత్ర చేసిందన్న విషయం ఒక్కటి తప్ప ఆవిడ లక్షణాల గురించి నాకు యింకా ఏమీ తెలియదు. రాజకీయ నాయకులు జనాల్లోకి వెళ్లినపుడు అక్కడున్న గిరిజనులతో కలిసి నృత్యం చేయమంటారు, కొమ్ము బూరా వూదమంటారు, జాలర్ల టోపీలు పెట్టుకోమంటారు, వాళ్లు కొలిచే గ్రామదేవతకు కొబ్బరికాయ కొట్టమంటారు. వద్దంటున్నా నుదుట కుంకం పులుముతారు. గురుద్వారాకి వెళితే పేద్ద కత్తి యిచ్చి పట్టుకోమంటారు, ముస్లిములైతే టోపీ పెట్టి ఆకుపచ్చ శాలువా కప్పుతారు, వీళ్లు ఒంగి ప్రార్థనలు చేస్తారు (అప్పటికప్పుడు నమాజ్ ఏం వస్తుంది? ఆంజనేయ దండకం చదువుకుని వచ్చేస్తారేమో)

నాయకుడు ఏ మతస్తుడైనా, ఆయన నమ్మకాలు ఎటువంటివైనా కార్యకర్తలకు పట్టదు. మా వాడు ఒద్దంటూంటే అమావాస్య నాడు నామినేషన్ వేశాడు, నెగ్గుతాడో లేదో, ఇతని అంటిపెట్టుకుని వుండాలో లేదో అని తర్జనభర్జన పడతాడు. ఊరేగింపు బయలుదేరుతూంటే పిల్లి ఎదురైంది. కాస్సేపు ఆగి వెళ్లవయ్యా అంటే విన్నాడు కాదు. సభలో మాట్లాడుతూంటే కరంటు పోయి మైకు ఆగిపోయింది. ఏం మాట్లాడాడో ఎవడికీ వినబడలేదు. మనం పెట్టిన ఖర్చంతా దండగైంది- అని బాధపడతాడు. వీళ్లలా డీమోరలైజ్ అయితే నాయకుడికి దెబ్బ. గతంలో మన రాజులకి హిందూ, ముస్లిము సైనికులు యిద్దరూ వుండేవారు. ఏదైనా యుద్ధానికి దిగినపుడు యిరు మతాల పురోహితులను సంప్రదించి, ముహూర్తాలు మాచ్ అయినప్పుడే ముందుకు కదిలేవారట. ఇంగ్లీషు వాళ్లకు యిలాటి ముహూర్తాల గోల లేకపోవడంతో ఏ అర్ధరాత్రో నది దాటి వచ్చేసి ఓడించేసేవారు. ఏ మెదకో వెళ్లినపుడు చర్చికి వెళ్లి దణ్ణం పెట్టుకుని ఊళ్లోనే వున్న అమ్మవారి గుడికి వెళ్లకపోతే హిందూ అనుచరులు నొచ్చుకుంటారు. షర్మిలకు అలాటి పట్టువిడుపులు వున్నాయా లేదా మనకు తెలియదు. ఆమె యిప్పుడు బాణం కాదు, బాణధారి.

వైయస్ గురించి చెప్పాలంటే – ఆయన పక్కా క్రైస్తవుడు. రోజూ బైబిల్ చదువుతాడు. ఈస్టర్ రోజుల్లో నెల రోజులూ దీక్షలో వుంటాడు. అనేక సందర్భాల్లో బైబిల్‌ను కోట్ చేస్తాడు. అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతుల్లోనే జరిగాయి. బ్రతికి వుండగా గుళ్లకి వెళ్లాడు, పూజలు చేశాడు. ఉండవల్లే ఓ సారి చెప్పారు. అన్నవరం గుళ్లో కూర్చుని సత్యనారాయణ వ్రతం ఆసాంతం చేశాడని. అనుచరుల గురించే చేశాడని అనుకోవడానికి లేదు. డబ్బు వస్తున్నకొద్దీ, అధికారం పెరుగుతున్నకొద్దీ పూజాపునస్కారాలు పెరుగుతాయి, కొత్త దేవుళ్లు, బాబాలు, స్వామీజీలు పూజామందిరంలో వెలుస్తారు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, మంచి చేయకపోయినా విస్మరిస్తే చెడు చేయవచ్చేమో అని ఓ దణ్ణం పెట్టేస్తారు. పక్కవాళ్లు కూడా మీకు దిష్టి తగులుతోంది. నరఘోష వుంది. ప్రత్యర్థులు చేతబడి చేయించారు కాబట్టే మీరెక్కిన వేదిక కూలిపోయింది. (సరిగ్గా కట్టించలేదు, పైగా బోల్డు మంది పొలోమని ఎక్కేశారు అనుకోరు) యాగాలు, హోమాలు చేయించండి అంటూ మొత్తుకుంటూ వుంటారు.

మాగజైన్‌లలో ఫలానా తారల, ఫలానా నాయకుల జాతకం ప్రకారం వచ్చే ఏడాది యిలా వుండబోతోంది అనే జోస్యాలు వేస్తూంటారు. నిజానికి అవేమీ నమ్మడానికి లేదు. ప్రసిద్ధులెవరూ తమ పూర్తి జాతకాన్ని, స్థలం, టైములతో సహా పబ్లిక్‌గా చెప్పరు. తేదీ విషయంలో కూడా యిటీవలి కాలంలో జాగ్రత్తగా నోట్ చేస్తున్నారు కానీ 30, 40 ఏళ్ల క్రితం చాలామంది యిళ్లల్లో నోట్ చేసేవారు కాదు. స్కూలులో చేర్పించినపుడు ఎకడమిక్ ఇయర్ వేస్టు కాకుండా వుండడానికి అయ్యవారు ఏ తేదీ సూచిస్తే, అదే రికార్డుల్లో రాసేసేవారు. అనేకమంది ప్రముఖులు పూరిళ్లలో లేదా మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టినవారే కాబట్టి చనిపోయిన తేదీ కరక్టవుతుంది కానీ పుట్టినతేదీని ఖరారుగా చెప్పలేం. పైకి వచ్చిన తర్వాత నిజమైన తేదీ, సమయం కష్టపడి కనుక్కున్నా బయటకు చెప్పరు. ఎందుకంటే జాతకం ప్రకారం వచ్చే ఏడాది గడ్డుకాలం అని తెలిస్తే ఆ స్టార్‌ను ఏ నిర్మాతా బుక్ చేయడు, ఆ లీడర్‌కు పార్టీ టిక్కెట్టివ్వదు. అందువలన రహస్యంగానే, ఆంతరంగికుల మధ్యే వుంచుతారు.

వైయస్ క్రైస్తవుడే కానీ, ఆయన అనుచరుల్లో, బంధువుల్లో అధికాంశం మంది హిందువులే కాబట్టి ప్రతీదానికీ ముహూర్తాలూ అవీ పెట్టి పంపించేవారు. ఒక్కోళ్లూ ఒక్కోటి పంపిస్తారు కాబట్టి ఏది కరక్టో తేల్చుకోవడం కష్టమయ్యేది. అమలాపురంలో రామజోగేశ్వరరావు అనే కాలేజీ లెక్చరరు జ్యోతిష్యపండితుడు కూడా. ఆయన్ను వైయస్‌కు ఎవరో పరిచయం చేస్తే వైయస్‌కు గురి కుదిరింది. ఈ ముహూర్తాలన్నీ ఆయనకు పంపితే, ఆయన వాటిల్లో ఏది సెలక్టు చేసి పంపితే దాని ప్రకారమే వైయస్ చేసేవారు. పాదయాత్రకి, ఎన్నికల ప్రచారం ప్రారంభానికి, పదవీ స్వీకారానికి.. తనకు వచ్చిన ముహూర్తాల లిస్టు రాజమండ్రిలో వున్న ఉండవల్లికి పంపి, మేస్టారికి చూపించి ఏదో ఒకటి ఫిక్స్ చేయమను అనేవారు వైయస్.

వైయస్ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఓ రోజు మేస్టారు ఉండవల్లికి ఫోన్ చేసి ‘వైయస్ జాతకం కొంచెం ఒడిదుడుకుల్లో వుంది. శాంతి జరిపిద్దాం. ఆయనకు చెప్పకుండానే చేయవచ్చు కానీ దీనికి ఆయన నుంచి అక్షింతలు రావాలి. పొద్దుటే స్నానం చేసి, యిష్టదైవాన్ని స్మరించుకుంటూ (జీసస్‌ను తలచుకోవచ్చా అని ఉండవల్లి చమత్కరిస్తే ఆయనిష్టం అన్నారు మేస్టారు) బియ్యం, పసుపూ కలిపి అక్షింతలు తయారుచేసి కొత్త గుడ్డలో కట్టి మీకు యిస్తే మీరు ఆయన తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లన్నమాట. అది తీసుకుని మీరు నా దగ్గరకి వస్తే యిక్కడ అమలాపురంలో శాంతి చేయించాలి.’ అన్నారు. సరే యీ విషయం వైయస్‌కి చెప్పాలని హైదరాబాదు వెళ్లి ముందుగా కెవిపికి చెప్పారు. ఆయన సెమీ నాస్తికుడు. పూజలూ, జోస్యాలూ నమ్మడు. ‘సరే, వైయస్‌కి లంచ్ టైములో ఒంటరిగా వుంటాడు కాబట్టి చెప్పు. నేను ఓ పది నిమిషాలు లేటుగా వస్తాను.’ అన్నారాయన.

ఉండవల్లి చెప్పినదంతా విని వైయస్ ‘నువ్విదంతా నమ్ముతావా?’ అని అడిగారు. ‘నా నమ్మకంతో పనేముందిక్కడ? ఆయన మీతో చెప్పకుండానే చాలా హోమాలు అవీ చేయించాడు. దీనికి మీ ప్రమేయం అవసరం వుంది కాబట్టి చెప్పాడు. జాతకాలు పంపుతున్నారు, ముహూర్తాలు పెట్టిస్తున్నారు కాబట్టి నమ్మకం వుందనుకుని చెప్పాడు. తర్వాత మీ యిష్టం. మనమేమీ చెప్పనక్కరలేదు. రేపు నేను అక్షింతలతో అమలాపురం వెళ్లకపోతే ఆయనకు అర్థమై పోతుంది. ’ అని ఉండవల్లి తెగేసి చెప్పారు. ‘ఏం అర్థమైపోతుంది?’ అంటూ వైయస్ సరదాగా అడిగారు. ఇదేదో జోక్‌గా తీసుకుంటున్నాడీయన అనుకుని ఉండవల్లి ఆ రోజు సాయంత్రం గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి వెళ్లటానికి సామాన్లు సర్దుకుంటూంటే, సిఎం ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. ‘ఇవాళ కాదు, రేపు వెళ్లండి.’ అని.

కాస్సేపటికి యింకో ఫోన్. ‘మేస్టారు చెప్పిన అక్షింతల తయారీ విధానం కాస్త విపులంగా చెప్పండి’ అంటూ. ఆ మర్నాడుదయం కొత్త తెల్ల జేబురుమాల్లో మూటకట్టిన అక్షింతలు ఒక ప్యాకెట్లో ఉండవల్లి రూమ్‌కి వచ్చి చేరాయి. చాలా రోజుల తర్వాత దిల్లీకి విమానంలో వెళుతూ వైయస్ పక్క సీట్లో కూర్చునే అవకాశం ఉండవల్లికి వచ్చింది. ఏకాంతంగా దొరికారు కదాని ‘అవేళ మీరు అవేళ అక్షింతలు నమ్మకంతో పంపించారా? లేక నేను ఫీలవుతానని మనస్సు మార్చుకున్నారా?’ అని అడిగారు. వైయస్ ‘మీ మేస్టారు బాగా చదువుకున్న కాలేజీ లెక్చరరు. నువ్వు సరే మేధావివని పేరు తెచ్చుకున్నావు. కెవిపి నాస్తికుడు. మీ ముగ్గురూ యీ హోమమో, యజ్ఞమో ఎందుకు చేద్దామనుకున్నారు? నా వెల్‌ఫేర్ కోసం. ఇంకా నా నమ్మకాల గొడవెందుకయ్యా.. మీరు నమ్మితే నేను నమ్మినట్లే!’ అన్నారు.

ఈ విషయాన్ని ఉండవల్లి తన పుస్తకంలో రాస్తూ ‘నేను క్లుప్తంగా రాశాను కానీ, ఆయన చాలా వివరంగా చెప్పారు. ఆయన అతి దగ్గర బంధువుల్లో ఎంతమంది హిందువులో ఎంతమంది క్రైస్తవులో ఎవరెవరు ఎలాంటెలాంటి ఆచారవ్యవహారాలు పాటిస్తారో విపులీకరించారు. నాకు అర్థమైనదేమిటంటే ఆయన నమ్మిన నాలాంటివాడు గట్టిగా అడిగితే, ఆయనే స్వయంగా ఎన్ని గంటలైనా కూర్చుని ఏ హోమం అయినా చెయ్యడానికి ఏ మాత్రం సంకోచించడని..!’ అన్నారు. చూడబోతే జగన్ వైయస్ విధానాన్నే అనుసరిస్తూన్నట్లుంది. మరి షర్మిల ఏం చేస్తారో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?