cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అర్హత లేనివాడికి పదవి...అభాసు పాలైన జగన్‌...!

అర్హత లేనివాడికి పదవి...అభాసు పాలైన జగన్‌...!

శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానెల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌ పదవికి సినిమా నటుడు పృథ్వీ రాజీనామా చేయడం గొప్ప విషయం కాదు.  విశేషమూ కాదు. ఇక్కడ అసలు విషయమేమిటంటే ముఖ్యమంత్రి జగన్‌ పరువు పోవడం. ఆయన అభాసు పాలయ్యాడనేది స్పష్టంగా తెలిసిపోతోంది. 'అలవి కాని చోట అధికులమనరాదు' అన్నట్లుగానే అర్హత లేనవారిని అందలం ఎక్కించకూడదని ముఖ్యమంత్రి జగన్‌ ఇకనైనా తెలుసుకోవాలి. సినిమాల్లో కామెడీ వేషాలు వేసే పృథ్వీని ప్రతిష్టాత్మకమైన ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఎలా నియమించాడో జగన్‌కే అర్థం కావాలి. కమెడియన్లందరూ పదవులు ఇస్తే వెర్రి వేషాలు వేస్తారని, హుందాగా వ్యవహరించరని అర్థం కాదు. 

ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి తెలుగు ప్రజలు ఎంతో భక్తితో, ఇష్టంతో కొలిచే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సంస్థ. అది ఆధ్యాత్మిక టెలివిజన్‌ ఛానెల్‌. అందులోనూ ఏదో ప్రైవేటు మీడియా సంస్థ నడుపుతున్నది కాదు. ఎన్‌టీవీ సంస్థకు భక్తి టీవీ అనే ఛానెల్‌ ఉంది. అది భక్తి ఛానెల్‌ అయినప్పటికీ దానికి ఎస్వీబీసీకి ఎంతో తేడా ఉంది. ఇది టీటీడీకి సంబంధించిన ఛానెల్‌. జనం టీటీడీకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో, ఎంత పవిత్రంగా చూస్తారో ఎస్వీబీసీని అలాగే చూస్తారు. అంతటి సంస్థ ఛైర్మన్‌గా పనిచేసే వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి? ఎంత నిజాయితీగా ఉండాలి? ఎంతగా నోటిని అదుపులో పెట్టుకోవాలి? కాని పృథ్వీ ఆ పని చేయలేదు. 

ఆయన సహజంగా హాస్య నటుడు కాబట్టి ఛానెల్‌ ఛైర్మన్‌గా కూడా హాస్యాస్పదంగానే వ్యవహరించాడు. చివరకు ఛానెల్‌ను, ముఖ్యమంత్రిని నవ్వులపాలు చేశాడు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పదవి స్వీకరించిన తరువాత తాను ఎంతో భక్తిపరుడినని, స్వామివారి సేవ చేసుకోవడం తన అదృష్టమని చెప్పుకున్నాడు. ఆయన భక్తి ఎంతవరకో తెలియదుగాని ఛైర్మన్‌ పదవి లభించడం మాత్రం ఆయన అదృష్టమే. కాని తన వెకిలి చేష్టలతో, అదుపులేని మాటలతో, రాసలీలలతో చేజేతులారా అదృష్టాన్ని కాలదన్నుకున్నాడు. ఎస్వీబీసీ ఛానెల్‌ ఛైర్మన్‌గా పృథ్వీ చేసేది శ్రీవారి సేవ. దాన్ని సక్రమంగా చేయకుండా ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులను నోటికొచ్చినట్లు తిట్టాడు. 

నటుడు పోసానితో వాదన పెట్టుకున్నాడు. చివరకు ఛానెల్లో పనిచేస్తున్న ఉద్యోగినితోనే రొమాన్స్‌ నడిపాడు. ఇవే కాకుండా ఇంతకు ముందే కొన్ని ఆరోపణలున్నాయి. వాటి గురించి తనకు తెలుసునని టీటీడీ ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి చెప్పాడు. ఆ ఆరోపణలను ఆయన సీరియస్‌గా పట్టించుకోలేదు. కాని రాజకీయాల్లో తలదూర్చడం, రొమాన్స్‌ సాగించడంతో కథ కంచికి చేరింది. అసలు అమరావతి రైతుల ఉద్యమంతో పృథ్వికి ఏం పని? ఆ వ్యవహారం చూసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నారు. మంత్రులు ఉన్నారు. కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలంటారు. కాని ఈయన రెండు పనులూ తానే చేసి దెబ్బ తిన్నాడు. 

రాజకీయాల్లో తలదూర్చినప్పుడే, పోసానితో గొడవ అయినప్పుడే జగన్‌ క్లాసు పీకారు. 'నీ పని నువ్వు చేసుకో' అని వార్నింగ్‌ ఇచ్చారు. అలా వార్నింగ్‌ ఇవ్వగానే రొమాన్స్‌ విషయం బయటపడి గగ్గోలు పుట్టింది. ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో వైరల్‌ కావడంతో జగన్‌కు కోపం నషాళానికి అంటింది. వైవి సుబ్బారెడ్డికి కూడా మండుకొచ్చింది. ఆయనే జగన్‌కు చెప్పి రాజీనామా చేయాలని ఆదేశాలిప్పించాడు.  తానే రాజీనామా చేశానని పృథ్వీ చెప్పినంతమాత్రాన నమ్మేవారెవ్వరూ లేరు. ఆడియోలో గొంతు తనది కాదని, పడనివారు మిమిక్రీ చేయించారని అంటున్నాడు. 

ఆడియో వ్యవహారంలో ఎవరైనా ఇలాగే చెబుతారు. నోటుకు ఓటు కేసులో ఆడియో చంద్రబాబుదని తేలిపోయింది కదా. కాని ఆయన ఒప్పుకున్నాడా? ఈమధ్య తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆడియో ఒకటి బయటపడి వివాదాస్పదమైంది. గట్టు రామచంద్రరావుతో మాట్లాడిన ఆ ఆడియోలో తుమ్మల బూతులతో మాట్లాడాడు. మామూలుగానే తుమ్మల బూతులు అలవోకగా మాట్లాడతాడు. 

ఆయన కూడా ఆ ఆడియోలో గొంతు తనది కాదన్నాడు. ఇక పృథ్వీ బిల్డప్‌ బాగానే ఇస్తున్నాడు. ఆడియో వ్యవహారంలో తాను నిర్దోషిగా బయటపడతానని, మళ్లీ ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి చేపడతానని చెప్పాడు. తాను అత్యంత మంచివాడినని తనకు తానే కితాబిచ్చుకున్నాడు. అతను జగన్‌కు తన మొహం చూపించలేక రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా పంపాడు. ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడటం?