Advertisement

Advertisement


Home > Articles - Special Articles

అపూర్వం.. అద్భుతం.. సింధుకి ఘనస్వాగతం

అపూర్వం.. అద్భుతం.. సింధుకి ఘనస్వాగతం

మన తెలుగమ్మాయి సింధు, బ్యాడ్మింటన్‌ క్రీడకే వన్నెతెచ్చింది. ఒలింపిక్స్‌లో తృటిలో బంగారు పతకాన్ని మిస్సయ్యిందిగానీ, లేదంటే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించేదే. అయితేనేం, రజత పతకంతో సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. ఇప్పటిదాకా ఈ విభాగంలో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క మహిళ సింధు కావడం, తెలుగు జాతికే కాదు.. భారతావనికే గర్వకారణం. 

అందుకే, సింధుకి తెలంగాణ రాష్ట్రం ఘన స్వాగతం పలికింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన సింధు, ఈ రోజు హైద్రాబాద్‌ చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లోనే ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ర్యాలీగా సింధుని, గచ్చిబౌలి స్టేడియం వరకు అధికారిక స్వాగత కార్యక్రమాల నడుమ తీసుకెళ్ళారు. కాస్సేపట్లో సింధుకి ఘన సన్మానం జరగనుంది. 

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సింధు కోసం ఐదు కోట్ల రూపాయల నగదు, వెయ్యి గజాల ఇంటి స్థలం, ఆమె కోరుకుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని నజరానాగా ప్రకటించిన విషయం విదితమే. 

ఇంకోపక్క, రేపు సింధు, ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కరాలకు హాజరయ్యే అవకాశముంది. పుష్కరాల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం నిర్వహిస్తోన్న కృష్ణా హారతికి సింధుని ఆహ్వానించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్‌లో సింధుని ఆహ్వానించారు. పలువురు మంత్రులు ఈ రోజు అధికారికంగా సింధుని, కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించనున్నారు. ఆమె కృష్ణా పుష్కరాలకు హాజరవడం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. 

సింధు గనుక కృష్ణా పుష్కరాలకు హాజరైతే గన్నవరం నుంచి భారీ ర్యాలీగా ఆమెను తీసుకెళ్ళనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. కృష్ణా పుష్కరాల హారతి కార్యక్రమంలోనే ఆమెకు ఘనంగా సత్కరించనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు కోట్ల నగదు, వెయ్యి గజాల ఇంటి స్థలం, గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం సింధు కోసం ప్రకటించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?