Advertisement


Home > Articles - Special Articles
బడా అవినీతిపరులు...అయినా దేవతలే...!

ఒకానొక కాలంలో దేశభక్తులు, దేశం కోసం సమస్తం త్యాగం చేసినవారు, నీతినిజాయితీలే ఊపిరిగా బతికినవారు ప్రజలకు ఆరాధ్య దేవతలుగా ఉండేవారు. కొందరు వారి నుంచి స్ఫూర్తి పొంది వారి బాటలోనే నడిచేవారు. ఇదంతా గత కాలపు చరిత్రగా మిగిలిపోయింది. ఇప్పుడు అవినీతిపరులే ప్రజలకు ఆరాధ్య దేవతలు. తాము పిచ్చిగా అభిమానించే, ప్రేమించే నాయకులు, నాయకురాళ్లు అడ్డంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నా,  ప్రజాధనాన్ని కొల్లగొట్టినా, కోర్టులో దోషులని తేలి జైలుకెళ్లినా వారినే దేవుళ్లుగా కొలుచుకుంటున్నారు. కీర్తిస్తున్నారు. వారి అవినీతిని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. అసలేమీ జరగనట్లే వ్యవహరిస్తున్నారు. ఇందుకు తమిళనాడును మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అక్రమాస్తుల కేసులో దివంగత జయలలితను, అన్నాడీఎంకే ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శశికళను సుప్రీం కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారిపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును పూర్తిగా సమర్ధించింది. ఫలితంగా శశికళ జైలుకు వెళ్లింది. 

జయలలిత జీవించివుంటే ఆమెకూ అదే గతి పట్టేది. అయినప్పటికీ అన్నాడీఎంకే నాయకులకు, ఆ పార్టీ అభిమానులకు ఇప్పటికీ జయలలిత ఆరాధ్య దేవతే. ఆమె వారికి 'అమ్మ'. ఇప్పుడు శశికళ కూడా ఆరాధ్య దేవతగా మారింది. సాధారణ జనం చాలామంది చిన్నమ్మను వ్యతిరేకిస్తున్నారు. జయలలిత మరణానికి ఆమె కారణమంటున్నారు. అసలు జయతో అవినీతి పనులు చేయించింది, అక్రమంగా ఆస్తులు కూడబెట్టించి ఆమె దోషిగా మారడానికి కారణమైందని భావిస్తున్నారు. అయితే అన్నాడీఎంకే పార్టీకి మాత్రం (శశికళ వర్గం) చిన్నమ్మ దేవతే. ఆమె జైల్లో ఉన్నా మహానాయకురాలే. ఈ కాలంలో అవినీతిపరులను ఎవ్వరూ అసహ్యించుకోవడంలేదు. వారిని పార్టీ అధినేతలుగా అంగీకరిస్తూనే ఉన్నారు. అవినీతిపరుడు లేదా అవినీతిపరురాలు అధినేతగా ఉన్న పార్టీలో తాముంటే పరువు తక్కువని ఏ నాయకుడూ అనుకోవడంలేదు. అధినేతపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిరూపితమై జైలుకెళ్లాక కూడా ఏమాత్రం సిగ్గుపడటంలేదు. బాధ వ్యక్తం చేయడంలేదు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడగానే శశికళ కంటనీరు పెట్టుకొని విలపించింది. ఆమాత్రం బాధపడటం సహజమే. తాను అవినీతికి పాల్పడిందని, అక్రమంగా ఆస్తులు కూడబెట్టానని ఆమె మనస్సాక్షికి తెలియదా? తెలిసినా రాజకీయ నాయకులు దాని నోరు నొక్కేస్తారు. చిన్నమ్మ అదే పని చేసింది.

తీర్పు రాగానే కోర్టులో లొంగిపోకుండా ఆరోగ్యం బాగాలేదని, నాలుగు వారాల గడువు కావాలని అడిగింది. శిక్షలు పడినప్పుడు నాయకులకు ఎక్కడలేని అనారోగ్యాలు ముంచుకొస్తాయి. ఆ విషయం న్యాయస్థానానికి తెలుసు కాబట్టే గడువు ఇవ్వడానికి నిరాకరించి వెంటనే జైలుకెళ్లి కూర్చోవాలని ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఆరు నెలల శిక్ష అనుభవించిన చిన్నమ్మ ఇంకో మూడున్నరేళ్లు శిక్ష అనుభవించాలి. ప్రత్యేక కోర్టు  తీర్పులో అక్షరం కూడా మార్చేది లేదని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ రివ్యూ పిటిషన్‌ వేస్తానని, ఏదో విధంగా బయటకు వస్తానని శశికళ ధీమా వ్యక్తం చేస్తోంది. తాను అవినీతిపరురాలైనా ఆ విషయం అంగీకరించడలేదు. ఏదోవిధంగా శిక్షలు తప్పించుకోవచ్చని భావన అవినీతిపరుల్లో బలపడింది. ప్రస్తుతానికి చిన్నమ్మ అన్నాడీఎంకే అధినేత్రి అయినప్పటికీ ఆ పదవి ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. ఆమె తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమే. ఆమె ఎన్నిక చెల్లదని పన్నీరుశెల్వం వర్గం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం పన్నీరు వర్గానికి అనుకూలంగా తీర్పు ఇస్తే శశికళకు పెద్ద దెబ్బ తగిలినట్లే.

ఆమె పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది కాబట్టి చిన్నమ్మ ప్రజాప్రతినిధి కాలేదు. ఆ గడువు తీరేనాటికి ఆమె వయసు 70 దాటుతుంది. జయలలిత పెద్ద అవినీతిపరురాలిగా చరిత్రలో నమోదైపోయినా ప్రజల్లో దేవతగా మిగిలిపోయింది. ఆమెను గొప్ప నాయకురాలిగా గుర్తుపెట్టుకుంటారేగాని దోషిగా భావించరు. అన్నాడీఎంకే నాయకులు కూడా అమ్మ పాలనే కొనసాగుతుందని చెబుతున్నారు. కాని ఆమె పాలనలో అవినీతి కూడా భాగంగానే ఉందనే విషయం పట్టించుకోవడంలేదు. అమ్మ పాలనంటే సంక్షేమ కార్యక్రమాలని, అంతా 'ఉచితం' అని చెబుతున్నారన్నమాట. తమిళనాడులో 'అయ్య'ల పాలన మొదలైనా 'అమ్మ'ల ప్రభావం ఇప్పట్లో అంతరించదు.