Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జనం ఛీ కొడతారు జాగ్రత్త!

జనం ఛీ కొడతారు జాగ్రత్త!

‘‘నిత్యావసరాల ధరలు ఎలా పెరుగుతున్నాయి.. ఈ అధికధరలతో బతకడం ఎలాగ? వేతనాలు పెంచి తీరాల్సిందే’’ అనేది ప్రభుత్వోద్యోగుల డిమాండ్. అందుకోసమే పీఆర్సీలు వస్తుంటాయి. వారి జీతాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతుంటాయి. ఇప్పుడు కూడా జీతాలు పెరిగాయి. అయితే.. వారికి అవి చాలడం లేదు! ఐఆర్ కంటె వేతనం తక్కువ అవుతుందని ఆవేశపడుతున్న వారు.. ఇప్పుడు పెరగవలసిన జీతాలను కొన్నేళ్ల కిందటినుంచి తాము ముందే అదనంగా తీసుకుంటూ వస్తున్నాం అనే సంగతి మరచిపోతున్నారు. 

తాము ఆడమన్నట్లు ఆడకపోతే.. ప్రభుత్వం అంతు చూస్తామని అన్నట్టుగా ఉద్యమాలకు దిగుతున్నారు. ఉద్యోగుల పోరాటాలలో ఔచిత్యం ఎంత? వారి డిమాండ్లు సహేతుకమైనవేనా? వారు గొంతెమ్మ కోరికలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? తమ స్వార్థం తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టని దుర్మార్గమైన ఆలోచనలతో దూసుకుపోతున్నారా? జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికి ప్రతిపక్షాలు చేసిన వ్యూహరచనలో పావులుగా మారి.. వ్యవహరిస్తున్నారా? వారి మాటలు నిజాయితీతో కూడినవేనా? ఇలాంటి అనేకానేక అంశాలపై గ్రేటాంధ్ర విశ్లేషణాత్మక కథనం..

ఒక చిన్న మునిసిపాలిటీ పట్టణం. రమేష్ చదువుకునే రోజుల్లో చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్! అద్భుతంగా చదువుతాడు.. మార్కులు వస్తాయి. డిగ్రీ తర్వాత.. ఉత్సాహం కొద్దీ పీజీ చేశాడు. ఒక ప్రెవేటు స్కూల్లో టీచరుగా చేరాడు. విపరీతమైన సబ్జెక్టు నాలెడ్జి ఉంది. అతను పాఠం చెబితే ఇక చదవాల్సిన అవసరమే లేదని.. డైరక్టుగా పరీక్షకు వెళ్లిపోవచ్చునని పిల్లలందరూ అంటారు. పిల్లల్లో అతనికి గొప్ప క్రేజ్ ఉంది. అతనికి నెలకు రూ.30 వేల జీతం వచ్చేది. కొవిడ్ తదనంతర పరిణామాల్లో ఆ జీతం 20వేలకు తగ్గింది. ఎటూ చిన్న పట్టణంలో ఉద్యోగమే గనుక.. చిన్నకుటుంబంతో పొదుపు ఖర్చులతో సర్దుకుపోతున్నాడు. 

నరేష్- రమేష్ కు క్లాస్‌మేట్. అత్తెసరు మార్కులతో పాసయ్యేవాడు. ఎలాగోలా డిగ్రీ అయిందనిపించాడు. పీజీ ఎంట్రెన్సులు రాస్తే.. సీటు రాలేదు. గత్యంతరంలేక బీఈడీలో చేరాడు. ఆ తర్వాత టీచరుద్యోగం వచ్చేసింది. పాఠం చెప్పాల్సి వచ్చిన రోజున... చెప్పవలసని దానిని బట్టీ పెట్టుకుని వెళుతుంటాడు. అర్థం కావడం అనేది.. పిల్లల తలరాత మీద ఆధారపడి ఉంటుంది. నెలపెడితే ఒక లక్షా పదివేల రూపాయల జీతం వస్తుంది. 

కుమార్- కూడా వీళ్ల క్లాస్‌మేటే! పది ఫెయిలయ్యాడు. నిదానంగా దాన్ని పూర్తి చేసి పాలిటెక్నిక్ చేశాడు. ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో కాంట్రాక్ట్ లేబర్ గా కుదురుకున్నాడు. నెమ్మదిగా లైన్ మెన్ అయ్యాడు. తర్వాతి ప్రమోషన్లూ వచ్చాయి. పెద్దగా పని ఒత్తిడి లేదు. ప్రతిభలతో నిమిత్తం లేదు. జీతం మాత్రం డెబ్భయి వేల దాకా వస్తోంది!

రాజేష్ కూడా వీళ్లతో కలిసే చదువుకున్నాడు. చదువూ రాలేదు. ఉద్యోగమూ రాలేదు. చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు. జీఎస్టీలు నానా పన్నులూ కట్టేసి.. వచ్చినదాంతో కుదురుగా వెళ్లదీస్తున్నాడు. ఓ ఇరవై ముప్పయి వేలు మిగులుతాయి. మహాప్రసాదం అనుకుంటాడు. 

ఇలాంటి ఉదాహరణలు వందలు వేలు చెప్పవచ్చు. ఇది నేపథ్యం మాత్రమే..!

ఇప్పుడు నరేష్, కుమార్ ఇద్దరూ రోడ్డెక్కారు! ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. తూలనాడుతున్నారు. కూలగొట్టాలంటున్నారు. ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నారు! లక్షల్లో వస్తున్న జీతాలు చాలడం లేదు పెంచమంటే.. పెంచరా? పెంచడంలో రూల్సు పెడతారా? అంటూ ఆగ్రహిస్తున్నారు. రంకెలు వేస్తున్నారు. ఎటూ అందరూ.. పుష్కలమైన సంపాదన, సంపదలతో తులతూగుతున్న వారే గనుక.. విధులు ఎగ్గొట్టి.. జిల్లా కేంద్రాలకు చేరుకుని.. ప్రభుత్వాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. నరేష్, కుమార్ లను చూస్తోంటే.. రమేష్, రాజేష్ ల మనఃస్థితి ఎలా ఉంటుంది?

తార్కికజ్ఞానం.. విచక్షణ.. వివేచన ఉన్నవారు ఎవరైనా సరే.. ఆలోచించి తీరాల్సిన అంశం ఇది. 

జీతాలకోసం పోరాడుతున్న వారి గురించి సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు? మాకు మా జీతం తప్ప.. రాష్ట్రం- దాని ప్రగతి, అభ్యుదయం, ఇతర ప్రజలు ఇవేమీ అవసరం లేదన్నట్టుగా చెలరేగిపోతున్న ఉద్యోగవర్గాలకు ప్రజల మద్దతు ఉందా? జనాన్ని తోలవలసిన అవసరం లేకుండా.. పోరాడుతున్న వారందరూ తమ తమ స్వార్థం కోసం పరితపిస్తున్న వారే గనుక.. పెద్దసంఖ్యలో వారు జమకూడి.. పోరాటం చేస్తుండగా.. ఆ ఫోటోలు చూపించి.. రాష్ట్రమంతా యావత్తు ప్రజానీకంలో జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ద్వేష భావం పెరిగిపోతోందని ప్రచారం చేయడానికి పూనుకుంటే.. అందులో అర్థముందా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

సహేతుకత లేని పీఆర్సీలు!

ప్రభుత్వానికి సేవ చేస్తూ ఉద్యోగాలు చేస్తుండే వారికి వేతనాలు- సామాజిక పరిస్థితులను బట్టి అప్పుడప్పుడూ పెంచాలి. అందుకు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రమాణాలు అన్నీ కూడా గణాంకాల గారడీలతో కూడుకున్నవే తప్ప.. సహేతుకంగా.. సామాజిక స్థితిగతులను బేరీజు వేసి జరుగుతున్నవి కాదు. పెరుగుతున్న ధరల ఇండెక్స్ ను మాత్రమే కాదు.. అదే తరహా పనికి.. ఇతర/ ప్రెవేటు సంస్థల్లో దక్కుతున్న జీతాలు ఎంత అనే విషయాన్న కూడా బేరీజు వేసి.. వీరికి పీఆర్సీలు నిర్ణయిస్తే గనుక గుల్లయిపోతారు. 

కేవలం గవర్నమెంటు అనే గొడుగు కింద కొలువు చేస్తున్నందుకు లక్షల్లో జీతాలు తీసుకుంటూ.. అసంతృప్తిని వెళ్లగక్కుతూ.. రూల్సు మాట్లాడుతూ రచ్చ చేసే వారికి.. వారి జీతాల్లో నాలుగో వంతు వేతనం కూడా లేకుండా.. వారితో సమానమైన పనిని కిక్కురుమనకుండా చేస్తున్న ప్రెవేటు సంస్థల ఉద్యోగులు కనిపించడం లేదా? అనేది పెద్ద ప్రశ్న! 

ఉద్యోగులకు భయపడి తీరాలా?

‘ఉద్యోగులు తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి..’ అనేది ఒక నానుడిలాగా సమాజంలో వ్యాపించింది. అలాంటి మాటలను బూచిలాగా చూపించి.. ప్రభుత్వంలో ఎవరున్నా సరే.. తమకు భయపడి తీరాల్సిందేనని ప్రభుత్వోద్యోగులు చెలరేగుతుంటారు. అయితే ప్రభుత్వాలు వారికి భయపడి తీరాలా? వారు నిజంగానే కూల్చేస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చిన వారే ఏలుబడిలోకి రాగలిగే వెసులుబాటు ఉన్నప్పుడు.. వీరు ఎలా కూలుస్తారు?

ఒక సామాజిక వర్గం, ఒక ఉద్యోగ వర్గం తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోయేంత బలహీనంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నదా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి సర్కారు సిసలైన ప్రజాసంక్షేమ ప్రభుత్వంగా నేరుగా ప్రజలకు చేరువై కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉద్యోగులు ‘ఒపినియన్ మేకర్స్’ అనే భ్రమలు తొలగిపోయాయి. 

ఇదివరకటి రోజుల్లో.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉద్యోగులను దళారుల్లాగా వాడుకున్న పార్టీలు రాజ్యం చేశాయి. ఉద్యోగులను ప్రసన్నం చేసుకుంటూ.. ప్రజలను భ్రమల్లోకి నెట్టాయి. ఇప్పుడు జగన్ పాలన మొదలయ్యాక సీన్ మారింది. ప్రభుత్వం మంచిదా చెడ్డదా ప్రజలకు చెప్పడానికి మరొకరు అక్కర్లేదు. ఉద్యోగులు.. తమ స్వార్థం చేసుకుంటూ.. తమ లక్ష జీతాలు లక్షన్నర కావడం లేదని.. రోడ్డెక్కి ధర్నాలు చేస్తే.. రోజుకు అయిదొందలు కూలీతో పొట్ట పోసుకునే సాధారణ ప్రజలు ఛీత్కరించుకుంటారు తప్ప.. ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అనుకోరు. ఆ సంగతి ఉద్యోగులు తెలుసోవాలి. 

హెచ్ఆర్ఏ ఎలా పెంచుతారు?

హెచ్ఆర్ఏ తగ్గించారనేది ఉద్యోగుల నుంచి మరొక నిరసన! బేసిక్ పేలు పెరిగినప్పుడు.. అందులో శాతాన్ని బట్టి గణించే హెచ్ఆర్ఏ పెంచడం ఎలా సాధ్యం? అనేది ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఉదాహరణకు డెబ్భయి వేల జీతం తీసుకుంటున్న ఉద్యోగికి ఇప్పుడు లక్ష జీతం అయితే.. దానితో పాటు హెచ్ఆర్ఏ పెంచితే.. గతంలో ఇరవై వేలు ఉన్నది కాస్తా.. ఇప్పుడు ముప్ఫయి వేలు అవుతుంది. 

ఒక చిన్న పట్టణానికి ప్రభుత్వం నిర్ణయించిన ఇంటి అద్దె ముప్ఫయి వేలు అని నిర్ధరణ అయితే.. ప్రభుత్వోద్యోగుల సంగతి తర్వాత.. మిగిలిన సామాన్యులకు దొరికే అద్దెఇళ్లు కూడా అద్దెలు పెరుగుతాయి కదా! అందరూ సగటు ఇంటి అద్దె ముప్ఫయి వేలు చేసి కూర్చుంటే.. గవర్నమెంటు ఉద్యోగం లేని వారు ఎలా బతకాలి? అసలు సాధ్యమేనా? అనేది పెద్ద ప్రశ్న. హెచ్ఆర్ఏ గురించి ఉద్యోగులు పట్టుబట్టడం అంత అనైతికం మరొకటి లేదని అందరూ అంటున్నారు. 

రికవరీ చేయకుంటే అదే పదివేలు!

గతంలో ఉద్యోగులకు ఎక్కువ ఐఆర్ ఇచ్చేయడం వల్లనే ఇప్పుడు ఈ తలనొప్పి అంతా వచ్చింది. అప్పట్లో ఏ 10 శాతం ఐఆర్ ఇచ్చి ఉంటే.. ఇప్పుడు 14 శాతం పెంచి, అరియర్స్ చెల్లించి ఉంటే అంతా సర్దుకునే వారు. కొద్దిగా రాద్ధాంతం తర్వాత అయినా సర్దుకునే వారు. కానీ.. గతంలో 27 శాతం గా ఉన్న ఐఆర్.. 23 దగ్గర ఫిట్మెంట్ ఆగిపోవడంతో ఖంగు తిన్నారు. పైపెచ్చు.. ఐఆర్ రూపేణా గతంలో ఇచ్చిన మొత్తం అదనపు సొమ్ములను, హెచ్ఆర్ఏ రూపంలో అదనంగా చెల్లించిన సొమ్ములను తిరిగి రాబడతామని ప్రభుత్వం చెప్పడం ఉద్యోగులకు షాక్.

ఎలా రికవరీ చేస్తారంటూ.. వాళ్లు ఆగ్రహిస్తున్నారు! ప్రభుత్వం కూడా.. అసలు ఉద్యోగుల నిరసనల గురించి తమకు తెలియనే తెలియదన్నట్టుగా స్పందిస్తోంది. పీఆర్సీ గురించి, హెచ్ఆర్ఏ ల గురించి రాద్ధాంతం చేసి ఉపయోగం లేదు. కనీసం.. గతంలో చెల్లించిన మొత్తాలను రికవరీ చేయకపోతే చాలు అని ఉద్యోగులు బతిమాలితే కొంత ప్రయోజనం ఉండొచ్చు. 

వేతనాలు పెరిగే కొద్దీ ఉద్యోగుల్లో బాధ్యత పెరగాలి. భయం పెరగాలి. మనం తీసుకుంటున్న ప్రతి రూపాయికీ న్యాయం చేస్తున్నామా అనే ఆత్మావలోకనం జరగాలి. అలా కాకుండా.. జీతాలు పెరుగుతూ ఉండే కొద్దీ.. ఇంకా పెరుగుతూ ఉండడం కోసమే పోరాడతాం తప్ప పనిని విస్మరిస్తాం అని వ్యవహరిస్తే ప్రజలు వారిని ఛీకొడతారు. జగన్ సర్కారుకు ప్రజల అండ పుష్కలంగా ఉంది. ప్రజా సంక్షేమం అంటే ఏమిటో జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబమూ రుచిచూస్తోంది. ఇలాంటి నేపథ్యంలో.. ఈ ప్రజల్లో విద్వేష బీజాలను నాటి.. జగన్ కు, ప్రభుత్వానికి కీడు చేయడం ఉద్యోగులకు సాధ్యం కాని పని. 

ఈ స్పష్టత వారు ఎంత త్వరగా తెచ్చుకుంటే.. అంత త్వరగా వారి సమస్య పరిష్కారం అవుతుంది. అలా కాకుండా.. భేషజాలకు పోయి.. రాజకీయ కుట్రల్లో పావులుగా మారి.. మరొకరి లబ్ధికోసం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలని చూస్తే.. వారే భ్రష్టుపట్టిపోతారు. 

.. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?