Advertisement

Advertisement


Home > Articles - Special Articles

బీజేపీ - టీడీపీ.. మధ్యలో పవన్‌కళ్యాణ్‌

బీజేపీ - టీడీపీ.. మధ్యలో పవన్‌కళ్యాణ్‌

అటు భారతీయ జనతా పార్టీ.. ఇటు తెలుగుదేశం పార్టీ.. మధ్యలో జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌.. 2019 ఎన్నికల నాటికి ఈ ఈక్వేషన్‌ రసవత్తరంగా మారనుందా.? ప్రస్తుతానికైతే బీజేపీ, టీడీపీల్లో మాత్రం ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌ అయ్యింది. కానీ, 2019 ఎన్నికల నాటికి పవన్‌కళ్యాణ్‌ 'మూడ్‌' ఎలా వుంటుందో ఊహించడం కష్టం. ఎందుకంటే, పవన్‌కళ్యాణ్‌ ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. 'ఛత్‌.. ఇవేం రాజకీయాలు.?' అంటూ ఆయన లైట్‌ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 

ఎప్పుడైతే పశ్చిమగోదావరి జిల్లాలో ఓటు హక్కు కోసం పవన్‌కళ్యాణ్‌ ప్రయత్నాలు ప్రారంభించారో, అప్పుడే టీడీపీలో కలకలం బయల్దేరింది. బీజేపీలో మాత్రం ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అయ్యింది. టీడీపీకి కంచుకోటగా 2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నిలిచింది. అదే జిల్లా నుంచి పవన్‌కళ్యాణ్‌ ఓటు హక్కు కోరుకుంటుండడం, పోటీ చేసే ఆలోచనతో వుండడం.. ఇవన్నీ టీడీపీకి మింగుడుపడ్డంలేదు. పవన్‌కళ్యాణ్‌ని, 2019 ఎన్నికల్లోనూ మిత్రపక్షంగా వుంచుకోగలమా.? అన్న సందేహాలు టీడీపీని వెంటాడుతుండడమే అందుక్కారణం. 

టీడీపీకి సంబంధించినంతవరకు ఏ మిత్రపక్షాన్నైనాసరే ఇంకోసారి కొనసాగించడం కష్టం. వామపక్షాలు అయినా, టీఆర్‌ఎస్‌ అయినా, బీజేపీ అయినా.. ఒకసారి స్నేహంతో మంగళం పాడేయడమే.. ఆ తర్వాత కాస్త గ్యాప్‌ ఇచ్చి, తిరిగి స్నేహ హస్తం అందించడం అనేది అప్పటి అవసరాల్ని బట్టి వుంటుందనుకోండి.. అది వేరే విషయం. ఆ లెక్కన టీడీపీ - జనసేన స్నేహం 2019 ఎన్నికల్లో కొనసాగడం దాదాపు అసాధ్యం. 

బీజేపీ మాత్రం, పవన్‌కళ్యాణ్‌ విషయంలో రెండు కోణాల్లో ఆలోచిస్తోంది. పవన్‌ తన పార్టీని బలోపేతం చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఓటు బ్యాంకు చీలిపోతుందనీ తద్వారా తమకు మేలు జరుగుతుందన్నది బీజేపీ అంచనాలట. ఒకవేళ తిరిగి పవన్‌, బీజేపీతో స్నేహం కొనసాగిస్తే అది ఎలాగూ తమకు ప్లస్‌పాయింటేనన్నది బీజేపీ ఇంకో విశ్లేషణ. 

అయితే ఇక్కడ బీజేపీ, టీడీపీ ఓ సింపుల్‌ లాజిక్‌ని మర్చిపోతున్నాయి. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తాయి. రాజధాని నిర్మాణం ఆలస్యమవడం, కేంద్రం సాయం చేయకపోవడం.. ఇలా చాలా అంశాలే వున్నాయి. మరీ ముఖ్యమైనది ప్రత్యేక హోదా. ఆ లెక్కన ప్రతిపక్షం వైఎస్సార్సీపీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిసొచ్చే అవకాశముంది. దాన్ని చీల్చాలని పవన్‌ అనుకోకపోతే (2014 ఎన్నికల తరహాలో) వైఎస్సార్సీపీ గెలుపుకి తిరుగే వుండకపోవచ్చు. 

2019 ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ సమయం వున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ మాత్రం ఇప్పుడిప్పుడే పెరుగుతూ వస్తోంది. ఇంతవరకు పొలిటికల్‌గా సరైన కార్యక్రమాలు చేయకపోయినప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడప్పుడూ పవన్‌కళ్యాణ్‌ తీవ్రమైన కుదుపులకు కారణమవుతుండడం విశేషమే మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?