cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

మంత్రి పదవి పట్టేయాలి

మంత్రి పదవి పట్టేయాలి

మంత్రి పదవి అంటే మోజే. అసలు రాజకీయ నాయకుడికి అంతిమ లక్ష్యం కూడా అదే. పదవుల కోసం కాదు అంటారు కానీ, కుర్చీ మీద కులాసాగా కూర్చోవాలని ఎవరికి ఉండదు. ఇకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలలో 28 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. గత ఎన్నికలలో కేవలం తొమ్మిది మంది మాత్రమే గెలిస్తే ఇపుడు మూడింతలు అయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడానికి ఈ మూడు జిల్లాల పాత్ర కూడా ఎక్కువగా ఉందని అంటారు.

ఇక్కడ సీనియర్లు కూడా చాలామంది ఉన్నారు. వారితో పాటు, జూనియర్లు కూడా ఇపుడు మంత్రి పదవిని పట్టేయాలని ఉబలాటపడడమే విశేషం. ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడిచింది కాబట్టి తాము కూడా సీనియర్లమేనని ముందుకువస్తున్నారు. నిజానికి గత ఏడాది వారూ వీరూ తేడా లేకుండా అంతా మంత్రులమేనని మురిసిపోయారు. తీరా జగన్ ఎంచుకున్న కొలమానాలను చూసి నిరాశపడ్డారు. 

అంతలోనే రెండున్నరేళ్ల తరువాత మంత్రిపదవులు వస్తాయి అన్న ముఖ్యమంత్రిమాటలతో కాస్తా ఊరట చెందారు. ఇపుడు మధ్యలోనే ఇద్దరు మంత్రులు డ్రాప్ కావడంతో మళ్లీ మంత్రి పదవుల మీద ఉత్తరాంధ్ర నేతల కన్ను పడింది. ఇద్దరితో సరిపెట్టరని, భారీగా మార్పులు చేర్పులు ఉంటాయని వైసీపీ పెద్దలు ఊహించేసుకుంటున్నారు. అదే జరిగితే తమ కోరిక తీరిపోవడం ఖాయమని కూడా ఊహల పల్లకిలో ఊరేగుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు రేసులో ఉంది. ఈ మధ్యనే సొంత అన్నయ్య, మంత్రి అయిన ధర్మాన కృష్ణదాస్ తమ్ముడికి ఉన్నత పదవి దక్కుతుందని దీవించారు. దాంతో, అన్న గారి పదవికి ఎసరు పెడితే తమ్ముడుంగారు మంత్రి అని ధర్మాన ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయింది. ఏ విధంగా చూసినా మంత్రిపదవి మన గుమ్మం దాటకూడదు అన్న తీరున ధర్మాన కుటుంబ రాజకీయం పనిచేస్తోంది.

అయితే, ధర్మాన కుటుంబానికి ఈసారి చెక్ పెడతారని ప్రచారం సాగుతోంది. దానితో పాటు, మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణకు మంత్రి పదవి పోయింది కాబట్టి అదే సామాజికవర్గానికి చెందిన తనకు తప్పకుండా ఛాన్స్ దక్కుతుందని పలాసాకు చెందిన ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు చాలాధీమాగా ఉన్నారు. డాక్టర్ కూడా అయిన అప్పలరాజు మొదటి దఫాలోనే మంత్రి పదవి కోసం చాలా ఆశలు పెట్టుకున్నారు. తనకు కచ్చితంగా ఈసారి ఇచ్చి తీరుతారని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో పాతపట్నానికి చెందిన రెడ్డి శాంతి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారని చెబుతున్నారు. కాపు సామాజికవర్గానికి పెద్ద పీట వేస్తే మహిళగా తనకు ఛాన్స్ దక్కుతుందని ఆమె భావిస్తున్నారు.

ఇక,గిరిజన కోటాలో కనుక అవకాశం ఇస్తే తనకు మంత్రి పదవి ఇస్తారని పాలకొండకు చెందిన ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన కళావతి గట్టి ఆశలే పెట్టుకున్నారని టాక్. ఆమె రెండు సార్లు గెలిచారు. గతంలో టీడీపీ నుంచి ఎన్ని రాయబేరాలు జరిగినా వైసీపీలోనే ఉండి జగన్ మెప్పుపొందారు. దాంతో ఆమె మంత్రి పదవి తనదేనని ధీమాగా ఉన్నారట. ఇక, రాజాంకు చెందిన కంబా జోగులుదీ ఇదే కధ. ఆయన కూడా టీడీపీ తాయిలాలకు లొంగకుండా జగన్‌కు వీర విధేయుడిగా ఉన్నానని, పైగా ఎస్‌సి వర్గానికి చెందిన తనకు సామాజిక సమీకరణలు అనుకూలిస్తే మంత్రి పదవి ఖాయమని అనుకుంటున్నారట. విజయనగరం జిల్లా నుంచి చూసుకుంటే పుష్పశ్రీవాణి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

మంత్రివర్గ మార్పులు చేర్పులు జరిగితే ఆమె పదవి ముందు ఊడిపోవడం ఖాయమని ప్రచారమైతే గట్టిగా సాగుతోంది. ఆమె ఏడాది పనితీరు పట్ల జగన్ పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. దాంతో, ఆమెకు కనుక చోటు లేకపోతే ఆ సీట్లో కూర్చోవడానికి వైఎస్సార్ ఆరాధకుడు, జగన్ మెచ్చిన సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. రాజన్నదొర మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా వైఎస్సార్ కుటుంబానికి విశ్వాసపాత్రుడుగా ఉన్నారు.

ఇదే జిల్లాలో మంత్రి పదవి కోసం చాలా ఆశలు పెట్టుకున్న వారిలో ఆర్యవైశ్య కులానికి చెందిన విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి. ఆయన తాను మళ్లీ ఎన్నికలలో పోటీ చేయనని అంటున్నారు. తనకు ఇదే చివరి అవకాశమని, అందువల్ల మంత్రిగా రిటైర్ అయిపోతానని చెబుతున్నారు. ఇదే సామాజికవర్గానికి చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పట్ల జగన్ అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం రావడంతో కోలగట్లకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. జగన్ గుడ్ లుక్స్‌లో కూడా కోలగట్ల ఉన్నారు.. జగన్ పాదయాత్ర సందర్బంగా జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఏకైక పేరు కూడా ఆయనదే. గతంలోనే సమీకరణలు కుదరక ఇవ్వలేదు కానీ తనకు మంత్రిపదవి గ్యారంటీ అని కోలగట్ల గాఢంగా నమ్ముతున్నారు. ఇక, విశాఖ జిల్లా విషయానికి వేస్తే యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ మంత్రి పదవి తనదేనని చెప్పుకుంటున్నారు.

ఆయన సైతం జగన్ ఇష్టపడే వారిలో ముందువరుసలో ఉన్నారు. ఇక్క అవంతి శ్రీనివాస్ పనితీరు పట్ల జగన్‌కు పెద్దగా అభ్యంతరాలు లేకపోయినప్పటికీ, రూరల్ జిల్లాకు మరో పదవి ఇవ్వాలనుకుంటే గుడివాడ పేరు ముందుంటుందని అంటున్నారు. అదే విధంగా రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కాపుకార్డుతో పదవి కొట్టేయాలనుకుంటున్నారు. అలాగే, ధర్మాన కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వకపోతే వెలమ కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని ప్రభుత్వ విప్‌గా ఉన్న మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కూడా ఆశపడుతున్నారు. ఇక, రాజుల కోటాలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు పేరు వినిపిస్తోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఢీ కొట్టిన నేతగా ఉన్న నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేరు కూడా మంత్రిపదవి రేసులో ఉందని అంటున్నారు. ఇలా ఉత్తరాంధ్ర నుంచి చాలామంది కోటి ఆశలు పెంచుకున్నారు. ఇంతకీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, లేక ఇద్దరితో సరిపెడతారా. మార్పులు చేర్పులూ భారీగా ఉంటే ఉత్తరాంధ్రలో జాక్‌పాట్ కొట్టే వీరులెవరో చూడాల్సిందేనని అంటున్నారు.

పివిఎస్‌ఎస్ ప్రసాద్

పీకే ఓడిపోయింది మాఊరి నుంచే