Advertisement

Advertisement


Home > Articles - Special Articles

చంద్రబాబుకు ప్రతిదీ ఉత్సవమే....!

చంద్రబాబుకు ప్రతిదీ ఉత్సవమే....!

ఇప్పటి రాజకీయ నాయకులకు హడావుడి ఎక్కువ....చేసే పని తక్కువ అనిపిస్తోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు అంటే పాలకులు చక్కగా పరిపాలన చేయడం అటుంచి చేసే కొద్ది పనికే కొండంత ప్రచారం చేసుకుంటున్నారు. మీడియా బాగా పెరిగిపోవడం, రాజకీయ నాయకులకే సొంత మీడియా సంస్థలు ఉండటం లేదా ఇతర మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టి వాటిని తమ గుప్పిట్లో పెట్టుకోవడంతో భారీ ప్రచారానికి కొదువ లేకుండా పోయింది. చేసే కొద్ది పనికి, అరకొర పనులకు, అసలు చేయని పనులకు కూడా గొప్పలు చెప్పుకోవడం పాలకులకు బాగా అలవాటైంది. అంటే మసి పూసి మారేడుకాయ చేయడం ఇప్పటి రాజకీయ నాయకులకు, పాలకులకు బ్రహ్మాండంగా తెలిసిన విద్య. ఏ రాష్ట్రంలోని రాజకీయ నాయకులైనా ఈ విద్యలో ఘటికులే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండుమూడాకులు ఎక్కువే చదువుకున్నారు.

ప్రధానంగా అవశేష ఆంధ్రకు ముఖ్యమంత్రి అయినప్పటినుంచి ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించడం, అయిన పనినే కాదు, కాని పనిని కూడా అద్భుతమని జనాలను నమ్మించడం, ప్రచారం చేయడం, గొప్పలు చెప్పుకోవడం ఎక్కువైపోయాయి. మరోమాటలో చెప్పాలంటే ప్రతి పని లేదా కార్యక్రమం ఓ ఉత్సవంలా చేయడం బాబుకు అలవాటైపోయింది. 'బ్రహ్మూెత్సవం ఇది బ్రహ్మూెత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మూెత్సవం'...అంటూ తిరుమల వెంకన్న ఉత్సవం చేసినట్లుగా బాబు తానొక బ్రహ్మాండ నాయకునిలా ఫీలవుతూ ఉత్సవాలు చేస్తున్నారు. పరిపాలనలో రొటీన్‌గా జరిగే కార్యక్రమాలకు కూడా గొప్పగా కలర్‌ ఇస్తున్నారు. పక్కన దీనికంతటికీ వంత పాట పాడేది కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కోట్లు ఖర్చు చేసి, ప్రధాని మోదీని పిలిపించి వైభవంగా చేశారు. ఆహ్వానపత్రికలు పంచారు. ప్రతి ఊరి నుంచి మట్టి, నీరు, నదీ జలాలు తీసుకువచ్చారు. మోదీ కూడా మట్టి, నీరు ఇచ్చి వెళ్లిపోయారు. 

ఇంత ఘనంగా శంకుస్థాపన చేశాక అమరావతి నిర్మాణం ఎంతమాత్రం ముందుకు కదిలింది? వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవం పెద్ద పండుగలా చేశారు. కాని ఏం ప్రయోజనం? అదింకా అసంపూర్తిగానే ఉంది. నిర్మాణాలు, వాస్తు ప్రకారం మార్పులు,చేర్పులు ఇంకా కొనసాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మౌలిక వసతులు, కనీస సౌకర్యాలు లేక ఉద్యోగులు, జనం ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీతో మళ్లీ (మొత్తం అమరావతి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు) శంకుస్థాపన చేయించారు. అయినా ఇప్పటివరకు ఏమీ కాలేదు. ఇక పుష్కరాలకు చేసిన హడావుడి, ప్రచారం సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి ఉదాహరణలు అనేకమున్నాయి బాబు పరిపాలనలో. ఇక చంద్రబాబు తాను చేస్తున్న ప్రతి పనిని, ప్రతి నిర్ణయాన్ని అద్భుతమని చెప్పుకుటారు. అపూర్వమని వర్ణిస్తారు.

తన పరిపాలనను ఒక స్వర్ణ యుగంగా భావించుకుంటారు. ప్రజల్లో ఒకవిధమైన హైప్‌ క్రియేట్‌ చేస్తారు. తన వైఫల్యాలను ఇలా ప్రచారం ద్వారా, పండుగ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా కవర్‌ చేసుకుంటారు. తాజాగా బాబు మరో ఉత్సవానికి తెర లేపారు. అదే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం. ఈ నిధులు కేంద్రం నేరుగా ఇచ్చినవి కాదు. నాబార్డు రుణమన్నమాట. ఈ రుణం 1,981 కోట్లు. దీనికి సంబంధించిన చెక్కును (పెద్ద సైజులో) ఢిల్లీలో చంద్రబాబుకు కేంద్ర మంత్రులు వెంకయ్య, ఉమాభారతి, అరుణ్‌ జైట్లీ వగైరాలు అత్యంత ఘనంగా అందచేశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు పరస్పరం శక్తిమేరకు ప్రశంసించుకున్నారు. మిఠాయిలు తినిపించుకున్నారు. ఇదొక చరిత్రాత్మక ఘటనగా వర్ణించారు. వాస్తవానికి ఇది పరిపాలనపరమైన ఒక చర్య మాత్రమే. దీనికి ఇంత హడావుడి చేయాల్సిన పనిలేదు. కాని ప్రధాని మోదీకి, చంద్రబాబుకు ప్రచారం కావాలి. అందుకే ఈ బ్రహ్మూెత్సవం. 

ఇంత ఉత్సవం చేశాక ఈ చెక్కు చరిత్ర ఏమిటంటే...గతంలో చేసిన పనులకు సంబంధించిన రీఇంబర్స్‌మెంట్‌ మాత్రమే. కొత్తగా ఇచ్చిన డబ్బు కాదు. ఈ పనిని 70 ఎంఎం సినిమాలా చూపించారు. ఇక 2018 నాటికి ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెబుతున్నారు. ఆ పని చేయలేరనేది ఎక్కువమంది వెలిబుచ్చుతున్న అభిప్రాయం. గట్టిగా అడిగితే టీడీపీ, బీజేపీ నాయకులు కూడా నీళ్లు నములుతున్నారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తిచేయలేకపోతే అందుకు చంద్రబాబు దగ్గర రెడీమేడ్‌ సమాధానం ఉంది. ఏమిటది? పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండా వైఎస్‌ జగన్‌ అడ్డుపడ్డాడు. ఆయనకు ప్రాజెక్టు పూర్తి కావడం ఇష్టంలేదు. పూర్తయితే టీడీపీకి ఆదరణ పెరుగుతుందని భయం. ఇదీ సంగతి....!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?