cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఎన్‌కౌంటర్‌ కేసీఆర్‌కు తెలిసే జరిగిందా?

ఎన్‌కౌంటర్‌ కేసీఆర్‌కు తెలిసే జరిగిందా?

వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్య కేసులో నిందితులైన నలుగురిని పోలీసుల ఎన్‌కౌంటర్‌ చేయగానే ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దిశ కుటుంబం మాత్రమే కాదు, ఏపీలోనూ జనం సంబరాలు చేసుకున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తెలంగాణ పోలీసులను అభినందించారు. పార్లమెంటు సభ్యులు, సినిమా ప్రముఖులు, పలు పార్టీల నాయకులు ప్రశంసలు కురిపించారు. ఎన్‌కౌంటర్‌ను సమర్థించినవారు ఎక్కువమందికాగా వ్యతిరేకించినవారు తక్కువ.

దిశ కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని ఎక్కువమంది కోరుకున్నారు. దాన్ని పోలీసులు అమలు చేయడంతో ఆనందం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఎన్‌కౌంటర్‌ అనేది చట్టవిరుద్ధం. అంటే పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ అంటే ఎదురుకాల్పులు. కాని ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అనే విషయం పోలీసులను ప్రశంసించినవారికీ తెలుసు. ఇదే కాదు, ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా పోలీసులు ఒకేవిధమైన కథ వినిపిస్తారు. వాళ్లు కాల్పులు జరిపితే మేం ఆత్మరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితిలో కాల్పులు జరపాల్సి వచ్చింది' అని చెబుతారు. 

నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని సీపీ సజ్జనార్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారా? సంచలనం కలిగించిన ఈ కేసులో తనకు తానే నిర్ణయం తీసుకొని అమలు చేయగలరా? పోలీసుల ఎన్‌కౌంటర్లు ఎలా ఉంటాయో రిపోర్టర్లకు బాగా తెలుసు. కాబట్టి సజ్జనార్‌ కథను ఎవరూ నమ్మరు. ఇది ప్లాన్‌ ప్రకారం జరిగిన ఎన్‌కౌంటర్‌ అనేది వాస్తవం. 

దిశ కేసులో దోషులను కోర్టులో విచారించి ఉరిశిక్ష వేయాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీలవరకు, పల్లె ప్రజల నుంచి ప్రముఖుల వరకు కోరుకున్నారు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడినా ఏళ్ల తరబడి అమలుకాని వైనాన్ని చూసిన తరువాత దిశ కేసుకు సంబంధించి జనం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు మరణశిక్షే సరైందని, అప్పుడే దిశ కుటుంబానికి న్యాయం జరుగుతుందని భావించారు. దోషుల కుటుంబ సభ్యులు కూడా తమ కొడుకులు తప్పు చేశారని, వారిని సరైన రీతిలో దండించాల్సిందేనని అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరడం, అందుకు వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. కాని పోలీసులు వెంటనే ఎన్‌కౌంటర్‌ చేశారు. ఉమ్మడి ఏపీలో వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సజ్జనార్‌ వరంగల్‌ ఎస్పీగా ఉన్నాడు. అప్పుడు ఇద్దరు ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థినులపై యాసిడ్‌ పోసిన ముగ్గురు యువకులను ఎన్‌కౌంటర్‌ పేరుతో పోలీసులు చంపేశారు. అప్పట్లో ఈ ప్లాన్‌ సజ్జనార్‌దే.

యాసిడ్‌  ఘటనపై తీవ్రంగా ఆగ్రహించిన జనం దోషులకు మరణశిక్ష విధించాలని కోరుకున్నారు. పోలీసులు ఆ పనిచేసేసరికి చాలా సంతోషించారు. ఇప్పుడూ అదే రిపీట్‌ అయింది. ఈ ఎన్‌కౌంటర్‌ కూడా చేయించింది సజ్జనారే కావడం విశేషం. అప్పట్లో సీఎంగా ఉన్న వైఎస్సార్‌ అనుమతితోనే యువకుల ఎన్‌కౌంటర్‌ జరిగిందని చెప్పుకున్నారు. 

ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్‌ అనుమతి లేనిదే ఈ ఘటన జరిగివుండదని అనుకుంటున్నారు. కొందరు మంత్రుల ప్రకటనలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి.

'దిశ ఘటనపై కేసీఆర్‌ మౌనంగా ఉన్నారంటూ పనిగట్టుకొని విమర్శించినవాళ్ల నోళ్లకు తాళం పడింది. సీఎం శాంతంగా, మౌనంగా ఉన్నారంటే ఉగ్రరూపం దాల్చుతారు. అది ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. అందుకే యావద్దేశం తెలంగాణ ప్రభుత్వాన్ని పొగుడుతోంది. దిశ కేసును బ్రహ్మాండంగా డీల్‌ చేశారని ప్రశంసల వర్షం కురుస్తోంది.'...అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నాడు. అంటే కేసీఆర్‌ ఆగ్రహం ఫలితమే ఈ ఎన్‌కౌంటర్‌ అనుకోవాలా? 

'ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే కేసీఆర్‌ ఊరుకోరు. తెలంగాణ ఆడబిడ్డలను కేసీఆర్‌ కాపాడుకుంటారు. వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోరు' అన్నాడు మరో మంత్రి గంగుల కమలాకర్‌. దీన్నిబట్టి ఎన్‌కౌంటర్‌ సంగతి కేసీఆర్‌కు ముందే తెలుసని అనుకోవాలా?

దిశ ఘటన తరువాత కేసీఆర్‌ స్పందించలేదు. ఆయన మూడు పెళ్లిళ్లకు హాజరయ్యారుగాని దిశ ఇంటకి వెళ్లి పరామర్శించలేదు. పైగా ఓ పెళ్లికి హాజరవడానికి ఢిల్లీ వెళ్లారు.  ఢిల్లీలో జాతీయ మీడియా ఆయన్ని ప్రశ్నించినప్పుడు మౌనమే సమాధానమైంది. ఇది ఆయనకు అప్రదిష్ట కలిగించింది. ఈ మచ్చను మాపుకోవడానికి ఎన్‌కౌంటర్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి ఉంటారా? 

ఇందులో నిజానిజాలు తెలియవుగాని జనం కేసీఆర్‌పై కూడా ప్రశంసలు వర్షం కురిపించారు. ఇక పీఎస్‌పీ సురేష్‌కుమార్‌ అనే హైకోర్టు న్యాయవాది మరో విషయం చెప్పాడు. దిశ కేసులో పోలీసులకు సరైన ఆధారాలు దొరకలేదని, దీంతో కఠిన శిక్ష పడే అవకాశం లేదని, వారికి శిక్ష పడకపోతే ప్రభుత్వానికి (పోలీసు వ్యవస్థకు) చెడ్డపేరు వస్తుంది కాబట్టి ఎన్‌కౌంటర్‌ చేశారని చెప్పాడు. దోషులు తామే నేరం చేశామని అంగీకరించినా భౌతిక సాక్ష్యాలు లేకపోతే కేసు నిలబడదు కాబట్టి జనం కోరుకున్న శిక్షను పోలీసులు అమలు చేశారని అన్నాడు.