Advertisement

Advertisement


Home > Articles - Special Articles

సలహా కేసీఆర్‌ది...సారథ్యం చంద్రబాబుది...!

సలహా కేసీఆర్‌ది...సారథ్యం చంద్రబాబుది...!

'వినదగునెవ్వరు చెప్పిన'..అన్నారు పెద్దలు. శత్రువు మంచి చెప్పినా వినాలంటారు. నిజమే...మొండిగా వ్యవహరించకుండా ఎవరు మంచి చెప్పినా విజ్ఞతతో ఆలోచించడం పాలకులు చేయాల్సిన పని. ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి పనే చేశారనిపిస్తోంది.

పెద్ద నోట్ల రద్దు చేయాలని నిర్ణయించినప్పుడు ఆయన అనుకున్నది ఒకటైతే జరుగుతోంది మరొకటి. 'ముడి విప్పబోతే పీటముడి పడింది' అనే సామెతలా తయారైంది. మోదీ, ఆయన ఎంపిక చేసుకున్న బృందం నోట్ల రద్దుపై అనాలోచితంగా, అజాగ్రత్తగా, ఏమాత్రం కామన్‌సెన్స్‌ లేకుండా వ్యవహరించారనేది వాస్తవం. దీనిపై కొందరు రాజకీయ నాయకులు మండిపడుతుంటే, కొందరు ప్రధానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. దేశంలో ఇలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఆయన మోదీకి శత్రువు కాకపోయినా రాజకీయంగా ప్రత్యర్థే కదా. విమర్శించడమే ప్రతిపక్షం ధర్మమనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవారు. కాని కేసీఆర్‌ అలా చేయకుండా మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు. అంతటితో ఊరుకోకుండా ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి మోదీతో ముఖాముఖి మాట్లాడి తలెత్తిన ఆర్థిక సంక్షోభం నివారణకు సలహాలు, సూచనలు ఇచ్చారు.

కొన్ని రోజుల క్రితం  కేసీఆర్‌ ఢిల్లీలో ప్రధానిని కలిశారు. డీమానిటైజేషన్‌పై దేశంలోని ముఖ్యమంత్రులందరిని  పిలిచి సమావేశం పెట్టి వారికి అన్ని విషయాలు వివరించాలని, వారి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించాలని చెప్పారు. తమతో మాట్లాడలేదని ముఖ్యమంత్రులు కోపంగా ఉన్నారని, కాబట్టి మాట్లాడితే మంచిదన్నారు. ముఖ్యమంత్రులతో మాట్లాడితే రాజకీయంగా మనస్పర్ధలు ఉండవన్నారు. ఆర్థిక సంక్షోభంతో ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. సమాజంలోని అన్ని వర్గాల ఇబ్బందులు తీర్చేందుకు అవసరమైన మంచి సలహాలిచ్చారు. '

'ఇప్పటికైనా మించిపోయిందిలేదు. నా సలహాలను పరిశీలించండి. వీటిని అమలుచేస్తే ప్రజలకు, ప్రభుత్వాలకు ఉపశమనం కలుగుతుంది'' అని కేసీఆర్‌ ప్రధానికి వివరించారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశం మోదీకి స్ఫూర్తినిచ్చింది. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి తనకు ఇలాంటి సలహాలు ఇవ్వలేదని మోదీ సంతోషించారు. ''శభాష్‌ కేసీఆర్‌...మీ సలహాలు బాగున్నాయి'' అని మెచ్చుకున్నారు. అధికారులతో చర్చించి మీరు చెప్పింది చేస్తానన్నారు.

వాస్తవానికి ఇలాంటి సలహాలు బీజేపీ ముఖ్యమంత్రులు, మిత్ర పక్షాల సీఎంలు ఇవ్వాలి. కాని ఆ పని ఎందుకు చేయలేదో తెలియదు. నోట్ల రద్దు వెనక తన హస్తం కూడా ఉందని చెప్పుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మోదీకి సలహాలివ్వలేదు. పైగా పరోక్ష విమర్శలు చేశారు కూడా.

నోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిణామాలపై చర్చించి, పరిష్కార మార్గాలు చెప్పేందుకు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించిన కేంద్రం ఆ కమిటీకి సారథ్యం వహించాల్సిందిగా చంద్రబాబు నాయుడును కోరింది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బాబుకు ఫోన్‌ చేసి 'మీరు దేశంలోనే సీనియర్‌ ముఖ్యమంత్రి. కాబట్టి మీరు ఈ కమిటీకి సారథ్యం వహించండి' అని ఆహ్వానించారు.  బాబు ఓకే అన్నారు. సో...ఆయన ఛైర్మన్‌గా ఏర్పడిన ఈ కమిటీలో  బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌, త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌, పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సభ్యులుగా ఉన్నారు.

నిజాయితీ, మంచి పరిపాలన విషయంలో నితీష్‌కు, మాణిక్‌ సర్కారుకు మంచి పేరుంది.  ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి కేసీఆర్‌ సలహాలే కారణమని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. 

కేసీఆర్‌ ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. మోదీ ఆ పని చేయకుండా సీఎంల కమిటీ వేశారు. ముఖ్యమంత్రుల సమావేశం పెట్టొచ్చు. కాని మమతా బెనర్జీ, ఇంకొందరు సీఎంలు గొడవ చేసే ప్రమాదం ఉందని మోదీ భావించారేమో...!   మోదీతో కేసీఆర్‌ చెప్పిన విషయాలన్నీ ఈ కమిటీ చర్చించే అవకాశముంటుంది. మంచి సలహాలిచ్చి ఈ కమిటీ వేయడానికి కారకుడైన కేసీఆర్‌కు ఈ కమిటీలో చోటు కల్పించకపోవడం టీఆర్‌ఎస్‌ నేతలకు బాధగా ఉంటుందేమో...!  కమిటీ అధ్యక్షుడు తెలుగు ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ సీఎంను వద్దనుకొని ఉండొచ్చు. లేదా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య అంతంతమాత్రమే కాబట్టి ఎందుకులే గొడవ అనుకొని ఉండొచ్చు. ఏది ఏమైనా కేసీఆర్‌ చొరవను మెచ్చుకోవల్సిందేనని కొందరు బీజేపీ నాయకులూ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కమిటీకి ఎంత గడువు ఇస్తారో, ఈ కమిటీ ఏం సిఫార్సులు చేస్తుందో చూడాలి.

ఇక చంద్రబాబు నేతృత్వంలో కమిటీ ఏర్పాటైందనే వార్తకు నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికలు అస్సలు ప్రాధాన్యం ఇవ్వలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?