cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జగన్.. ఎవ్వరి మాటా వినడు!

జగన్.. ఎవ్వరి మాటా వినడు!

సంక్షేమం చేయడం మాత్రమే కాదు- చేసినట్టుగా కనిపించడం ముఖ్యం. చేసినట్టుగా కనిపించడం మాత్రమే కాదు- లబ్ధి పొందిన వారి అభిప్రాయం తెలుసుకోవడం ముఖ్యం! లబ్ధి పొందిన వారు మాత్రమే కాదు- ఆ సంక్షేమం గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవడం ఇంకా ముఖ్యమైన విధి!

మంచి పరిపాలన అంటే.. ప్రజలకు మంచి చేయడం మాత్రమే కాదు! తాను ‘మంచి’ అనుకుంటున్న దానిని, ప్రజలందరూ కూడా ‘మంచి’ గానే పరిగణిస్తున్నారా? లేదా? అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. జనాభిప్రాయాలను బట్టి పాలన తీరును మార్చుకుంటూ వెళ్లడం తప్పనిసరి బాధ్యత!

విధులను బాధ్యతలను విస్మరించి.. తాను ఎరిగినదే వేదంగా, తలచినదే శాసనంగా సాగిపోవడం ఎప్పటికీ పాడి కాదు. మన వ్యవస్థ ప్రజాస్వామ్యం. ప్రజలే సర్వాధికారులు. వారి మాటకు విలువ ఇవ్వడం ఎలాగో తెలుసుకోగలిగిన వాళ్లే మంచి పాలకులు! ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్  రెడ్డి.. తాను అనుకుంటున్న సంక్షేమం చేపట్టడంలో మేటి కావచ్చు. తన ముఖప్రీతికి మాట్లాడే వాళ్లు కాదు, సహేతుకమైన విమర్శలు చేసేవాళ్లని కూడా చేరదీసి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటేనే పాలనకు మెరుగులు దిద్దగలరు.

భక్త కబీర్ ఇలా చెబుతాడు.. ‘‘నిందక్ నియరే రాఖియే, ఆంగన్ కుటీ ఛవాయ్ బిన్ పానీ సాబున్ బినా నిర్మల్ కరే సుభాయ్’’

దీని అర్థం ఏంటంటే.. నిన్ను విమర్శించే వాడికి (సహేతుకమైన, తర్కబద్ధమైన విమర్శ) నీ వాకిట్లో ఓ ఇల్లు కట్టించి సమీపంలోనే ఉంచుకో. ఎందుకంటే, నీళ్లు సబ్బు అవసరం లేకుండానే నీ స్వభావాన్ని వాడు పరిశుభ్ర పరుస్తూ ఉంటాడు. 

కబీర్ చెప్పినది పరమసత్యం. కానీ.. వందిమాగధుల కీర్తనలు, ప్రభువు మనోప్రీత్యర్థం అసత్య, అర్థ సత్యాల సమాచారంతో తప్పుదోవ పట్టించేవాళ్లమీద ఆధారపడుతూ.. హితం కోరి సలహా చెప్పే ఎవ్వరి మాట వినకుండా పరిపాలన సాగిస్తే ఎలా? జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి- ఒక్క చాన్స్ అడిగి.. ప్రజల ఆశీర్వాదాలు పొందారు. అధికారంలోకి వచ్చారు. తాను చెప్పిన ప్రతి హామీని నెరవేర్చానని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు చెప్పనివి కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించామని అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు! 

మరి ప్రభుత్వం పట్ల యావత్ రాష్ట్రంలో ప్రజాస్పందన ఒకే తీరుగా ఉందా? సర్వజనామోదం ఉన్నదా? సర్వత్రా హర్షం మాత్రమే వ్యక్తమవుతున్నదా? ప్రభుత్వం పట్ల కినుక వహిస్తున్న వారు, అసంతృప్తి చెందుతున్న వర్గాలు రాష్ట్రంలో లేనే లేవా? అలాంటి వ్యవహారాల పట్ల ప్రభుత్వం ఎలాంటి పోకడల్ని అనుసరిస్తోంది? కనీసం ప్రభుత్వం సమీక్షించుకుంటున్నదా?

జగన్ మోహన్ రెడ్డి.. తన తండ్రికి ఉన్న అతులితమైన ప్రజాదరణ, తనకున్న అపరిమితమైన చరిష్మా తో అధికారంలోకి వచ్చిన నాయకుడు. ఆయన అధికారంలోకి రావడానికి- ఆ ప్రభుత్వంలో ఉన్న మరెవ్వరి ప్రాపకమూ, దయా, మేథోబల సంపదలూ అవసరం పడలేదు. ‘ఆ పార్టీకి, ప్రభుత్వానికి ఆయనను మించిన దిక్కులేదు. ఆయనంతటివారు మరొకరు లేనేలేరు.’ ఈ స్టేట్‌మెంట్ వాస్తవమే అయినప్పటికీ.. ఆ భావనను తలకెక్కించుకుంటే.. ఆయన ప్రభుత్వం, పరిపాలనకు సంబంధించి మరొక్కరి మాటను, సలహాను, సూచనను చెవికెక్కించుకోలేరు. 

ప్రస్తుతం జరుగుతున్నది అదే. జగన్.. ఎవ్వరి మాటా వినే పరిస్థితి లేదు. ఆయన తీరు తెలిసిన వారు.. చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఆయన ముఖస్తుతికి కీర్తించడం, పరిణామాలు ఎలా ఉన్నా..  బాధ్యత ఆయనదే అని గాలికొదిలేయడం జరుగుతోంది. ఇలాంటి వ్యవహారం పార్టీని ఎక్కడకు తీసుకువెళుతుంది. మరో ముప్ఫయ్యేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు సేవ చేస్తానని ధీమాగా ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి.. అందుకు తగిన పటిష్ఠ భూమికను ఏర్పాటు చేసుకుంటున్నారా? లేదా, ‘నా అంతటి వాడు లేనే లేడు’ అనే పరిపూర్ణమైన అహంకారంతోనే ముందు ముందు కూడా అడుగులు వేయబోతున్నారా? ఆత్మవిశ్వసానికీ- అహంకారానికీ మధ్య ఉండగల సున్నితమైన విభజన రేఖను ఆయన పట్టుకోగలరా? తప్పటడుగులు పడకుండా.. జాగ్రత్తపడగలరా?

ఇంటెలిజెన్స్ అంటూ వ్యవస్థ అసలున్నదా?

ఏ ప్రభుత్వానికి అయినా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చాలా కీలకం. ప్రభుత్వం తమ గురించి తాము ఏమైనా అనుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రజలు నిజంగా ఏం అనుకుంటున్నారో.. ప్రభుత్వానికి నిజాయితీగా నివేదించే వ్యవస్థ ఉండాలి. ఏదైనా పథకాల గురించి గానీ, ప్రభుత్వ నిర్ణయాల గురించి గనీ.. ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతోంటే.. ప్రభుత్వం వాటిని దిద్దుకోవడం సాధ్యమవుతుంది. 

కేంద్రప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా తమ సొంత నిఘా వ్యవస్థను కలిగి ఉంటుంది. వ్యవస్థ రూపంలో అది రాష్ట్రప్రభుత్వానికి కూడా ఉంది. కానీ క్రియాశీలంగా ఉన్నదా? రాష్ట్రంలో పరిణామాల్ని ఇంటెలిజెన్స్/ నిఘావిభాగం ద్వారా ప్రభుత్వాధినేతకు తెలుస్తున్నదా? లేదా? అనే సందేహాలు ఎవ్వరికైనా కలుగుతాయి. 

వాల్మీకి రామాయణంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది. యస్మాత్ పశ్యన్తి దూరస్థాన్ సర్వాన్ అర్థాన్ నరాధిపాః చారేణ తస్మదుచ్యంతే రాజానో దీర్ఘ చక్షుషః 

సమర్థులైన గూఢచారుల ద్వారా భవిష్యత్ పరిణామాలను, ప్రయోజనాలను గ్రహిస్తూ రాజ్యాన్ని చక్కగా పరిపాలించే వారే దూరదృష్టిగల ప్రభువులుగా పేరు తెచ్చుకొంటారు. (అరణ్యకాండం 33-10). ఈ విషయాన్ని శూర్పణఖ, లంకేశుడు అయిన రావణుడికి చెబుతుంది. మంచి పాలకుడికి ఉండవలసిన అనేక లక్షణాలను వివరిస్తూ ఈ మాట కూడా చెబుతుంది. ఇంకా కఠినమైన పదాలతో తన అన్న పాలనలోని చాలా లోపాలను కూడా ఆమె ఎత్తిచూపుతుంది. రావణుడు కూడా ఆమె మాటల్ని పరిగణనలోకి తీసుకుంటాడు. 

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విషయానికి వస్తే.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఆయనకు నిజాలను నివేదిస్తున్నది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా తెలిసే ప్రెవేటు సమాచారమూ, ఐఅండ్‌పీఆర్ ద్వారా తెలిసే అధికారిక సమాచారమూ సరిపోతుందా? వ్యవస్థకు పాలకుడు.. వ్యక్తుల మీద ఆధారపడి, వారే తన కళ్లూ చెవులుగా వ్యవహరించడం మంచిదేనా? 

కొత్త శత్రువుల తయారీ..

‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి’ అనేది శతాబ్దాలుగా మనం వింటున్న సూక్తి. జగన్ కు ఆ సిద్ధాంతం మీద నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎటూ ఆయనకు రాజకీయంగా శాశ్వతమైన శత్రువులు ఉండనే ఉన్నారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి.. ఏమాత్రం తనకు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా తలదూర్చి కొత్త శత్రువులను తయారు చేసుకుంటూ ఉంటారు. 

ఆయన టార్గెట్ రేంజ్ లో ఒక శత్రువు ఉంటారు. ఆ శత్రువు మూలాల మీద దాడి చేయడం లక్ష్యం అయి ఉంటుంది. సూటిగా ఆ పని చేయరు! రాజకీయంలో అది సర్వసాధారణం అని కూడా అనుకోరు. తాను టార్గెట్ చేసిన వ్యక్తి చుట్టూ ఉండే వ్యవస్థనే దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తారు. దీనికి మంచి ఉదాహరణ.. సినిమా టికెట్ల పెంపు వ్యవహారం. 

జగన్మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్ టార్గెట్ అయి ఉండొచ్చు. కానీ పవన్ సినిమాలను దెబ్బకొట్టడానికి మొత్తం సినిమా ఇండస్ట్రీమీదనే ప్రభావం చూపేలా టికెట్ ధరల తగ్గింపు విషయంలో గానీ, థియేటర్ల మూసివేత/ సీజ్ విషయంలో గానీ నిర్ణయాలు తీసుకుంటే, దూకుడు ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ఒక వ్యాపారం. వ్యాపారం చేసుకునే వాడు.. రాజకీయంగా ఎప్పటికీ, ఎవ్వరితోనూ విభేదాలు కోరుకోరు. 

క్రియాశీలంగా రాజకీయాల్లోనే ఉన్న సినిమా వారు తప్ప.. తతిమ్మా పరిశ్రమ యావత్తూ అధికారంలో ఎవరున్నా సరే.. వారితో సత్సంబంధాలు కొనసాగించడానికే మొగ్గు చూపుతుంది. ఇది చాలా సాధారణమైన సంగతి. అయితే.. జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ సినిమా ఇండస్ట్రీని మొత్తం శత్రువులుగా తయారు చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. సినిమారంగంలోనే ఉంటూ.. జగన్ ను అభిమానించే వారు.. ఆయనను సదా కీర్తించే వారు కూడా ఇవాళ వ్యతిరేక భావనతో ఉన్నారు. 

ఇలా కొత్త శత్రువులను తయారుచేసుకోవడం ద్వారా.. జగన్ ఏం సాధించారు? ఏం సాధిస్తారు? అది ఎవరూ తేల్చి చెప్పలేని సంగతి. రాజకీయం మన ప్రధాన వ్యాపకం అయినప్పుడు.. రాజకీయ శత్రుశేషం లేకుండా చేసుకోవాలే తప్ప.. రాజకీయేతర నవీన శత్రువులను తయారు చేసుకోవడం ఎలాంటి విజ్ఞత అనిపించుకుంటుంది.

ఇలాంటి కొత్త శత్రుత్వాన్ని తయారు చేసుకున్నందువలన.. ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రజలేమైనా హర్షిస్తున్నారా? అంటే అదీ లేదు. ప్రజలు ఎప్పటికీ కోరే అవకాశం కూడా లేని విషయాల్లో తలదూర్చి.. వైరం తెచ్చుకోవడమే ఇది. కొవిడ్ పేరు చెప్పి రాత్రి కర్ఫ్యూలను ఇంకా కొనసాగిస్తుండడం మీద కూడా ఇలాంటి అభిప్రాయాలే ఉన్నాయి. కొవిడ్ కేసులు వస్తున్నప్పటికీ ఆ తీవ్రత మునుపటిలా లేదు. పొరుగు రాష్ట్రాలు అన్నీ కూడా సాధారణ పౌరజీవన స్థితిగతులనే కొనసాగిస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాత్రి కర్ఫ్యూ కొనసాగిస్తుండడం అనేది సినిమా పరిశ్రమను కుదేలు చేసే నిర్ణయంగానే కొందరు చూస్తున్నారు. 

కొత్త శత్రువులను తయారుచేసే ఇలాంటి నిర్ణయాలు అనేకం ఉన్నాయి. సినిమా టికెట్ల విషయంలో ఇంకా చరమాంకానికి చేరుకోలేదు గానీ.. ఇతర విషయాల్లో ఎదురుదెబ్బలు తిన్నా సరే.. ఆయన తన తీరు మార్చుకోవడం లేదు. ఎయిడెడ్ విద్యాసంస్థల్ని ఆస్తులతో సహా ప్రభుత్వంపరం చేసేసుకోవడానికి చేసిన ప్రయత్నం ఇలాంటి వాటిలో ఒకటి. ప్రభుత్వం పనికి ఇబ్బంది కలిగించకుండా, ప్రజాద్రోహమేమీ లేకుండా సాగిపోతున్న రంగాల్లో అది కూడా ఒకటి. ఆ విషయాన్ని జగన్ ఎందుకు కెలికారో ఎవ్వరికీ తెలియదు. తీరా సాధించేదేమీ లేకుండా.. కోర్టు వేసిన మొట్టికాయలతో వెనక్కు తగ్గారు. 

సలహాలు ఎవరివి?

ఆయనకు ఎవ్వరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారో అర్థం కాదు. చెప్పుకోడానికి ఉద్ధండపిండాలు అనదగిన ప్రముఖుల సలహామండలి చాలా పెద్దదే ఉన్నది. సలహాదారు అనే ‘డిజిగ్నేషన్’తో ఏ ప్రభుత్వంలోనూ లేనంత పెద్ద సంఖ్యలో జగన్ ప్రభుత్వానికి సలహాదారులు ఉన్నారు. ఈ మేధావుల కూటమి ఏం చేస్తున్నట్టు? ఏం ఉద్ధరిస్తోంది. సలహాదారులు అనే హోదాను మెడలో తగిలించుకుని.. లక్షల్లో వేతనాలూ, వైభోగాలూ అనుభవించడం మాత్రమేనా.. అసలు జగన్ కు, ప్రభుత్వానికి ఉపయోగపడే సలహా ఒక్కటైనా ఇస్తున్నారా? లేదా అనేది కీలకమైన చర్చ. 

సలహాదారులందరూ.. జగన్మోహన్ రెడ్డి ప్రాపకం, దయ కలిగి ఉన్న వారు గనుక ఎక్కడా ఠికానా లేనప్పుడు ఆ హోదాల్లోకి వచ్చారే తప్ప.. వాస్తవంలో ఆయనకు సలహా చెప్పగల వారు ఒకరిద్దరు కూడా లేరనే వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. అయితే.. సలహాదారులు మేధావులే గానీ.. వారు చెప్పే సలహాలను జగన్ కనీసం ఆలకించరు  కదా అనే వాదన కూడా ఉంది. ఇంకా లోతుగా చూసినప్పుడు.. ఎవరైనా జగన్ ను కలిసి ‘ఇలాంటి పనుల వల్ల ప్రజల్లో నెగటివ్ వస్తోంది..’ అనే మాట చెప్పేంత సాహసం చేస్తే.. ‘మీకు తెలియదు’ అనే ఒకే ఒక మాటతో కొట్టి పారేస్తారని కూడా అంటుంటారు.

‘సలహాదారు’ అనే పదవి హోదాతో సంబంధం లేకుండా జగన్ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న వారే ఎక్కువ. ప్రజల అభిప్రాయాలు, వారిలో రాగల వ్యతిరేకత లాంటి విషయాలగురించి ఏమాత్రం పట్టింపు కూడా ఉండని కొందరు అధికారులే ఎక్కువగా ఆయనను పెడదారి పట్టిస్తున్నారనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. లిక్కర్ ధరల పెంపు.. దిక్కూ మొక్కూ లేని బ్రాండ్ల తయారీ లాంటివన్నీ ఇలాంటి కొందరి సలహాల వల్ల ఆచరణలోకి వచ్చినవే అని అంటుంటారు. ప్రభుత్వానికి ఆర్జన పెరుగుతున్న మాట నిజమే ఏమో గానీ.. ప్రజల్లో ఎంతగా అపకీర్తి దక్కుతోంది. జగన్ ను దారుణంగా తిడుతున్నవారు పెరుగుతున్నారు కదా.. ప్రభుత్వం పేరు భ్రష్టు పట్టిపోతున్నది కదా..? అనే ప్రశ్నలకు మాత్రం జవాబు ఉండదు!

‘మాట తప్పడు.. మడమ తిప్పడు..’ ఇంకానా?

‘మాట తప్పడు.. మడమ తిప్పడు..’ అనే పదబంధాన్ని జగన్ తన పేరుకు ట్రేడ్ మార్క్ గా మార్చుకున్నారు. అదే మాట పదేపదే చెప్పుకుంటూ ఎన్నికల సమయంలో ఓట్లు అడిగారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా.. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చినప్పుడు.. పదేపదే అదే మాట చెప్పుకున్నారు. కానీ.. ఇంకా ఆ వెలుగులు అలాగే ఉన్నాయి. ఇప్పటికి కూడా జగన్ అభిమానులు.. కనీసం తమ ఫ్రెండ్స్‌తో మాటల సందర్భంలో అయినా.. ‘మా నాయకుడు మాట తప్పడు, మడమ తిప్పడు’ అని దిటవుగా చెప్పుకోగల స్థితిలో ఉన్నారా? తన ట్రేడ్ మార్క్ వ్యక్తిత్వ లక్షణాన్ని జగన్ చేజేతులా పలుచన చేసేసుకున్నారు. 

మారిన ఆలోచనలా, చేసిన పొరబాటును సరిదిద్దుకునే ప్రయత్నమా, గత్యంతరంలేని స్థితిలో తీసుకున్న నిర్ణయమా.. ఏదైనా కావొచ్చు గానీ అనేక నిర్ణయాల విషయంలో జగన్ మడమ తిప్పారు. మాట తప్పారు. 

శాసనమండలిని అసలు ఎందుకు రద్దు చేశారు? అప్పటికప్పుడు రద్దు నిర్ణయంతో మూడు రాజధానుల బిల్లు  ఆచరణలోకి వచ్చేయగలదని ఆయనకు సలహా చెప్పిన వారు ఎవరు? తెలియదు. కానీ.. మండలిలో తమ పార్టీకి మెజారిటీ రాగానే రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇది రాజకీయ చవకబారుతనం అనిపించుకోదా? రాష్ట్రానికి శాసనసభలో ఉన్నవారంతా మేధావులే గనుక.. ప్రత్యేకంగా మేధావులకోసం ఉండే మండలి అవసరం లేదని ఆనాడు అన్న ప్రభుత్వం.. మెరమెచ్చు మాటలతో వెనక్కు తగ్గింది. మూడు రాజధానుల బిల్లు విషయంలో మడమ తిప్పడం కూడా చాలా అవమానకరమైన రీతిలో జరిగింది. శాసనవ్యవస్థలో జరగవలసిన పద్ధతిని హైజాక్ చేసి మండలి ఆమోదం లేకుండా గవర్నరు సంతకం చేయించుకున్నందుకు.. ఫలితం అది. ఆరోజున జగన్ కు అలాంటి సలహా ఇచ్చిన వారెవ్వరో ఆయన చెక్ చేసుకోవాలి. 

మాట తప్పిన వ్యవహారాలు కూడా ఉన్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేయి పట్టుకుని.. ‘అన్నను గెలిపించండి. నేను మంత్రిని చేస్తాను’ అని జగన్ ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చారు. అదేదో రాజకీయంగా ఆళ్లకు ఇచ్చిన మాట కాదు. ‘మీ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తా’నని ప్రజలకు ఇచ్చిన మాట. శశిధర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి, ఆ తర్వాత కేబినెట్ లోకి తీసుకుంటానని కూడా ఆయన బహిరంగ వేదికనుంచే ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాటలు ఏమయ్యాయి? 

మాట తప్పకపోవడం అంటే.. సింగిల్ పేజీలో విడుదల చేసిన మేనిఫెస్టో అంశాలను ఆచరణలోకి తేవడం తప్ప ఇంకేమీ లేదా? పార్టీ నాయకులకు, పార్టీకోసం ఎంతో కష్టపడిన వారికి ఇలాంటి హామీలు ఇచ్చి.. ఆచరణలో నిలబెట్టుకోకపోతే.. ప్రజలు మాత్రం ప్రభుత్వాధినేతను ఎలా నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు?

కేడర్ ఏమైపోతోందో ఏమో?

జగన్మోహన్ రెడ్డికి దక్కిన తిరుగులేని ప్రజాదరణ మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించుకున్న ప్రజాభిమానం పునాదుల మీద వచ్చినదే. వైఎస్సార్ మరణం, ఆయన కొడుకు సొంత పార్టీ ఆవిర్భావం తర్వాత.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కేడర్ మొత్తం వైసీపీ వశం అయింది. ఆ కేడర్ ను కాపాడుకోవడానికి అధినేత ఏం చేస్తున్నాడు? కేడర్ కు ఏం దక్కుతోంది? ఇవన్నీ ప్రశ్నలే.

అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. స్థానికంగా ముఠా రాజకీయాలను సర్దుబాటు చేయలేక ఇప్పటికీ భర్తీ చేయకుండా ఉన్న నామినేటెడ్ పోస్టులు, ఆలయ పాలక వర్గాలు ఉన్నాయి. ఎందుకింత అలసత్వం. తన నిర్ణయానికి తిరుగుండదని, పార్టీలో తన మాటకు ఎదురు చెప్పగల వారు లేరని బలంగా నమ్మే ఈ నాయకుడు కూడా.. కనీసం ఒక ఆలయ ట్రస్టుబోర్డును మూడేళ్లుగా నియమించలేని దుస్థితిలో నాన్చుతూ ముందుకు సాగుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి?

కేడర్ కు కాంట్రాక్టులు దక్కాయి. ఎమ్మెల్యేల ప్రాపకంలో ఉన్నవారు ఒకటో రెండో పనులు చేసుకున్నారు. పనులు చేసుకున్న సొంత పార్టీ వారికి కూడా ఇప్పటిదాకా బిల్లులు రాకపోతే.. వారు ఏమైపోవాలి? తెలుగుదేశం హయాంలో పనులు చేసిన వారికి ఇప్పటికీ బిల్లులు రాకుండా వారు కుయ్యో మొర్రో అంటున్నారు. చివరికి సొంత పార్టీ  వారు కూడా బిల్లులు రాక ప్రభుత్వాన్ని నిందించే పరిస్థితి ఎందుకు తయారవుతోంది.

నాయకులపై ఉపేక్షా? నిర్లక్ష్యమా?

ఎంపీలుగా అవకాశం వచ్చినప్పుడు చట్టసభలకు ఎవరిని పంపుతున్నారనేది ఒక కీలక అంశం. శాసనమండలిని రద్దు చేసిన సమయంలో తప్పు మీద తప్పు అన్నట్టుగా.. అప్పటికప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ను, మోపిదేవిని ఎంపీలు చేసేసి రాజ్యసభకు పంపేశారు. తిరుపతిలో ఉప ఎన్నిక అవకాశం రాగానే.. తన వ్యక్తిగత సహాయకుడిగా సేవలందించినందుకు గురుమూర్తిని ఎంపీ చేశారు. వీరిద్వారా పార్టీకి కలిగే లబ్ధి ఎంత?

పిల్లి సుభాష్ చంద్రబోస్ పల్లెత్తు మాట మాట్లాడడు. ఏ రూపంలో అయినా ఆయన పార్టీకి ఉపయోగపడుతున్నట్టుగా కనిపించరు. గురుమూర్తి లాంటి నోట్లో నాలుకలేని, నికరంగా పదిమందిని పోగు చేయగల ప్రజాబలం లేని వ్యక్తిని ఎంపీగా చట్టసభలకు పంపడంలో జగన్ కు కనిపించిన ఔచిత్యం ఏమిటో అర్థం కాదు. దేశంలో అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థ అయిన పార్లమెంటు అంటే ఆయనకు చులకన భావం ఉన్నదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. 

ఎంపీ పదవులను పార్టీకి గరిష్టంగా ఉయోగపడే వారికి.. అత్యున్నత చట్టసభల్లో పార్టీ విధానాలకు అనుకూలంగా బలంగా గళం వినిపించగల వారికి కట్టబెట్టాలి. చాలా మంది రాజకీయ నాయకులలాగానే.. ఆ పదవులను కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా జగన్ మార్చేశారు. అంబానీ సిఫారసు చేశాడని.. పరిమళ్ నత్వానీకి ఎంపీ పదవి కట్టబెట్టారు. ఆ పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ కు రిలయన్స్ పెట్టుబడుల వెల్లువ వచ్చేస్తుందని ఊదరగొట్టారు. ఏమీ జరగలేదు. ఆయన వైసీపీ ఎంపీ అనే ట్యాగ్‌లైన్ తో ఏపీ వ్యవహారాలు కూడా పట్టించుకోకుండా తన ఎంపీ హోదాను అనుభవిస్తున్నారు. 

‘పిరికి ముద్ర’ పడకుండా జాగ్రత్తపడాలి

తనకు ప్రజలు అందించిన ముఖ్యమంత్రి పదవి గురించి జగన్ ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారోర తెలియదు. ఆ పదవి ఆయనకు ఎవ్వరి దయతోనో లభించినది కాదు. నిజం చెప్పాలంటే వారసత్వంగా వచ్చినది కూడా కాదు. జనాదరణ మాత్రమే వైఎస్ వారసత్వంగా జగన్ కు వచ్చింది. ఆయన కష్టం, వ్యూహాలు తోడై ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి స్వయం నిర్మిత నాయకులు నిజానికి ఎంతో ఆత్మవిశ్వాసంతో ధీమాగా వ్యవహరించాలి. కానీ.. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి ఇష్టపడని నాయకుడిగా ముద్ర పడ్డారు. 

ముఖ్యమంత్రి అయిన మూడేళ్లలో ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఆ ప్రెస్ మీట్లు కూడా చాలా తమాషాగా ఉంటాయి. జగన్ తాను చెప్పదలచుకున్నది చెప్తారు. మీడియా మిత్రులు ప్రశ్నలకు పూనుకునేలోగా.. థాంక్యూ చెప్పేసి లేచివెళ్లిపోతారు. ఆ మాత్రం దానికి మీడియా మీట్ ఎందుకు..? ఎంచక్కా ఒక వీడియో విడుదల చేస్తే సరిపోతుంది కదా.. అనేది ఆయన తీరు మీద వినిపించే ఒక సెటైర్. 

ఇలాంటి తీరు మొత్తానికి.. మీడియాను ఫేస్ చేయాలంటే జగన్ కు భయం అనే అభిప్రాయం వ్యాప్తిలోకి రావడానికి కారణమౌతోంది. పొరుగురాష్ట్రాలతో పోలిస్తే కేసీఆర్, స్టాలిన్ వంటి వారు మీడియా సమావేశాలను అలవోకగా డీల్ చేయగలుగుతుంటారు. కేసీఆర్ శరపరంపరంగా ప్రశ్నలు వచ్చిపడుతున్నా సరే.. ఎంతో చాకచక్యంగా సమాధానాలు చెబుతుంటారు. అలాంటి ప్రెస్ మీట్ ఒక్కటైనా జగన్ చెబుతుండగా చూడాలని అభిమానులు ఆశపడితే ఎప్పటికీ జరిగేది కాదు. 

ప్రెస్ మీట్ లో విలేకరులు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కూడా వేస్తారు గనుక.. వాటిని ఎదుర్కోవడానికి ఆయనకు ఇష్టం ఉండదు అనే అనుకుందాం. కనీసం.. వివిధ అంశాలకు సంబంధించి ఆయా వర్గాలతో సమావేశమై చర్చించడానికి కూడా రాష్ట్రాధినేత సుముఖంగా లేకపోతే ఎలా? సినీ పరిశ్రమ వివాదాన్నే తీసుకున్నా, పీఆర్సీ గొడవను తీసుకున్నా.. ఉద్యోగ నాయకులతో మాట్లాడి అటో ఇటో తేల్చకుండా జగన్ చాలా కాలం నానుస్తూ వచ్చారు. మంత్రులతో చర్చలు అంటూ సాగదీస్తూ వచ్చారు. 

మంత్రులు వారితో మాట్లాడడం, సజ్జల వెళ్లి జగన్ కు బ్రీఫ్ చేయడం.. జగన్ అభిప్రాయం మళ్లీ వీరికి చెప్పడం.. ఈ హాస్యాస్పద డ్రామా అంతా ఎందుకు? ఉద్యోగ నాయకులతో మాట్లాడడానికి జగన్ కు వెరపు ఎందుకు? అలాగే సినీ పరిశ్రమ వారితో ఆయన మాట్లాడి విషయం అటో ఇటో ఎందుకు తేల్చరు. పేర్ని నాని లాంటి కీలుబొమ్మ నాయకుడితో ఎన్ని వందల సమావేశాలు జరిగినా సరే.. ఇండస్ట్రీ సమస్య ఒక కొలిక్కి వస్తుందనే నమ్మకం లేదు. అలాంటప్పుడు ఆ కామెడీ ఎపిసోడ్లు నడిపించడం ఎందుకు? ఒక్క చిరంజీవిని భోజనానికి పిలిచి చర్చించడం అంటే.. అది యావత్ సినీ పరిశ్రమను జగన్ తనంతగా అవమానించినట్టు కాదా? చిరంజీవి ఎన్నడైనా పరిశ్రమ కష్టాల గురించి మాట్లాడిన వ్యక్తేనా? ఇవన్నీ కూడా జగన్ తనలో తాను తర్కించుకోవాల్సిన అంశాలు. 

ఆయన ప్రజల మనిషి..

జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి. ఎవ్వరి ప్రాపకం వల్లనో సీఎం కుర్చీలోకి వచ్చిన వ్యక్తి కాదు. ఎవ్వరి ముఖప్రీతికోసమూ పనిచేయాల్సిన అగత్యం ఆయనకు లేదు. కానీ.. ఆయన వ్యవహార సరళి అంత ఆత్మవిశ్వాసపు ధోరణిలో సాగడం లేదు. అలాగే.. ఎవ్వరు వచ్చిన తన ముఖప్రీతికి తీయటి మాటలు వినిపించినా.. ఆయన వాటిని పట్టించుకోకూడదు. ఈ విషయంలో కూడా ఆయన తీరు ఇలా కనిపించడం లేదు. తియ్యటి మాటలు వినడానికి మాత్రమే అలవాటు పడితే, అది వ్యసనంగా మారుతుంది. పార్టీకి అది ఎప్పటికీ మానని రాచవ్రణంగా తయారవుతుంది.

ప్రభువుకు ఉండవలసిన లక్షణాల గురించి వాల్మీకి రామాయణం ఇంకో వాక్యం చెబుతుంది.. నయనాభ్యాం ప్రసుప్తో అపి జాగర్తి నయ చక్షుషా- వ్యక్త క్రోధ ప్రసాదశ్చ స రాజా పూజ్యతే జనైః

రాజు- నిద్రించే సమయంలో కళ్లు మూసుకున్నా కూడా.. పరిపాలనకు సంబంధించిన విషయాల్లో నిత్యం కళ్లు తెరుచుకునే, జాగృతంగా ఉండాలి. రాజ్యపాలనలో అలసత్వం పనికిరాదు. సందర్భాన్ని బట్టి కోపాన్ని, దయను చూపిస్తుండాలి. అలాంటి రాజునే ప్రజలు ఇష్టపడతారు.. అని చెబుతుంది ఈ శ్లోకం. 

అలా నిత్యజాగ్రదావస్థలో ఉండేలా జగన్మోహన్ రెడ్డి.. తన తీరును మలచుకోవాలి. తన భావ స్పందనలు నాలుగుగోడల మధ్య వ్యవహారాలు కాదు.. వాటిని ప్రకటించాలి. తనను సీఎం చేసిన ప్రజాదరణ పూర్తిగా ఆయనది. దానికి కాపాడుకోవడం పూర్తిగా ఆయన బాధ్యత. ఆ మేరకు తన ప్రవర్తనతో ఆయన ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. 

.. విజయలక్ష్మి

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి