cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జ‌గ‌న్ సంక్షేమ ప‌థంలో అసంతృప్తి వాళ్ల‌దే!

జ‌గ‌న్ సంక్షేమ ప‌థంలో అసంతృప్తి వాళ్ల‌దే!

ఏపీలో సంక్షేమ పాల‌న సాగుతూ ఉంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇబ్బ‌డిముబ్బ‌డిగా సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తూ ఉన్నారు. కొత్త కొత్త ప‌థ‌కాల‌ను తెస్తూ ఉన్నారు. మంచినీళ్ల ప్రాయంగా కొన్ని వంద‌ల కోట్ల రూపాయ‌ల మొత్తాల‌ను పంచి పెడుతూ ఉన్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఉమ్మ‌డి ఏపీ చ‌రిత్ర‌లో ఏ ప్ర‌భుత్వ‌మూ చేప‌ట్ట‌నన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌డుతూ ఉంది. ఈ విష‌యంలో ప‌క్క రాష్ట్రాలు కూడా పోటీకి రాలేని ప‌రిస్థితి ఉంది. ఈ సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాల‌ను అందుకుంటున్న ప్ర‌జ‌లు చాలా ఆనందంగా ఉన్నారు. ఊహించ‌ని రీతిలో డైరెక్టుగా ప‌థ‌కాల సొమ్ములు చేతికి అందుతుండే స‌రికి క‌రోనా వంటి ఉత్పాతం వ‌చ్చిన స‌మ‌యంలో కూడా ఏపీ ప్ర‌జ‌ల చేతుల్లో డ‌బ్బులు ఆడుతున్నాయి.

రైతులు, అమ్మ ఒడి ల‌బ్ధిదారులు, చేతి వృత్తుల వాళ్లు, కుల వృత్తుల వాళ్లు, ఆటోలు న‌డుపుకునే వాళ్లు, పూజారులు, పాస్ట‌ర్లు, ఇమామ్ లు.. ఇలా వాళ్లూ వీళ్లూ అనే తేడాలు లేవు. కులాల వారీగా కూడా సంక్షేమ ప‌థ‌కాలు వేరే! అప్ప‌టికే అమ‌ల్లో ఉన్న ఫీజురీయింబ‌ర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ వంటి తండ్రి కాలం నాటి ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తూ కూడా జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు డైరెక్టుగా డ‌బ్బులు చేతికి అందే ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ ఉన్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో ఏపీలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి! వీటికి నిధులు ఎలా తెస్తున్నారు అనేది వేరే ప్ర‌శ్న‌! ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. న‌భూతో అనే స్థాయిలో జ‌గ‌న్ హ‌యాంలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నా.. ఇంకా అసంతృప్తి ఉండ‌నే ఉండ‌టం! అనేక వర్గాల వారీగా బోలెడ‌న్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నా.. ఇంకా త‌మ‌కు ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేద‌నే వాళ్లు తెర మీద‌కు వ‌స్తున్నారు. అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు! ఇదో చిత్ర‌మైన ప‌రిస్థితి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం గ‌మ‌నించాల్సిన విష‌యం ఇది.

వాళ్ల‌కు ఇస్తున్నారుగా, మాకెందుకు లేదు?

ప్ర‌జ‌ల‌కు అన్నింటి మీదా అవ‌గాహ‌న ఉంటున్న రోజులివి. త‌మ ఎదురింటి వారి గురించి, ప‌క్కింటి వారి గురించి ప‌క్కా అవ‌గాహ‌న ఉంటుంది స‌హ‌జంగానే. త‌మ ఊర్లో ఫ‌లానా వాళ్ల‌కు ఫ‌లానా సంక్షేమ ప‌థ‌కం ద్వారా డ‌బ్బులొచ్చాయ‌నే విష‌యం గురించి ఊరంద‌రికీ తెలిసి పోతుంది. కామ్ గా త‌హ‌శీల్దార్ కార్యాల‌యానికి వెళ్లి ప‌నులు జ‌రిపించేసుకునే రోజులు కావివి! కాబ‌ట్టి.. ఎవ‌రెవ‌రు ఏ  ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధి పొందుతున్నార‌నేది అంద‌రికీ అవ‌గాహ‌న ఉండ‌నే ఉంటుంది. ఇలాంటి క్ర‌మంలో.. జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌ను చూసి, అలాంటి ల‌బ్ధి పొంద‌ని వాళ్ల‌లో అసంతృప్తి క‌లుగుతూ ఉంది. వీళ్ల‌కూ ఎంతో కొంత ల‌బ్ధి క‌లిగి ఉండొచ్చు గాక‌, త‌మ ఎదుటి వాడికో, ప‌క్క వాడికో త‌మ కంటే ఎక్కువ ల‌బ్ధి క‌లుగుతుంటే మిగ‌తా వాళ్లు ఊరికే ఉండ‌రు క‌దా! మ‌నిషి స‌హ‌జ ల‌క్ష‌ణం ఇది. ఇదే ఇప్పుడు జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల విష‌యంలోనూ అంత‌ర్లీనంగా ఒక అసంతృప్తికి కార‌ణం అవుతూ ఉంది.

అన్నీ వాళ్ల‌కేనా..?

ఉదాహ‌ర‌ణ‌కు చేతి వృత్తుల వారికి ఈ మ‌ధ్య‌నే జ‌గ‌న్ ప్ర‌భుత్వం రికార్డు స్థాయిలో ఒక్కోరికి 24 వేల రూపాయ‌ల చొప్పున డ‌బ్బులిచ్చారు. ఇది డైరెక్టు క్యాష్ ట్రాన్స్ఫ‌ర్ స్కీమ్. ఈ వృత్తుల వాళ్లు ఆల్రెడీ బీసీ జాబితాలోనే ఎక్కువ‌మంది ఉంటారు. కొద్దో గొప్పో భూములున్న‌వారూ ఉంటారు. రైతు భ‌రోసా ప‌థ‌కంలో ఏడాదికి 12 వేల రూపాయ‌ల‌ డ‌బ్బు అందుకున్న వారూ ఉంటారు, వారే మ‌ళ్లీ చేతి వృత్తుల కోటాలో 24 వేల రూపాయ‌ల డ‌బ్బూ అందుకుంటున్నారు. వీళ్ల ఇళ్ల‌కే మ‌ళ్లీ అమ్మ ఒడి ప‌థ‌కం డ‌బ్బులూ అందుతుంది! ఒక్కో రేష‌న్ కార్డులో ఒక‌రికి పెన్ష‌న్ కామ‌న్! అది నెల‌కు రెండు వేల ఐదు వంద‌ల రూపాయ‌ల వ‌ర‌కూ! అవి గాక‌.. ఇళ్ల స్థ‌లాలు, ఫీజు రీయింబ‌ర్స్ మెంట్లు వేరే క‌థ‌! ఇలా జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న అన్ని ప‌థ‌కాల ల‌బ్ధినీ ఆసాంతం వాడుకుంటున్న కుటుంబాలు ఏపీలో కొన్ని ల‌క్షల్లో ఉంటాయి!

బీసీ వ‌ర్గాల్లో.. రేష‌న్ కార్డు క‌లిగి ఉండ‌టం ఒక్క‌టే చాలు వాళ్ల‌కు ఏ చేతివృత్తుల కిందో 24 వేలు, ఇంట్లో క‌నీసం ఒక పెన్ష‌న్ -30 వేలు, ఐదెక‌రాల లోపు భూమి ఉంటే ఉంటే ఇంకో 12 వేలు, అమ్మ ఒడి.. ఇలా లెక్క‌బెడితే క‌నీసం 70 నుంచి 80 వేల రూపాయ‌ల ల‌బ్ధి  పొందుతున్న కుటుంబాల సంఖ్య గ‌ణ‌నీయంగా ఉంది! ఇంట్లో ఏ డిగ్రీనో, బీటెక్కో చ‌దువుతుండే పిల్ల‌లు ఉంటే అది అద‌నం, ఆరోగ్య శ్రీ, రేష‌న్ బియ్యం ఇవ‌న్నీ వేరే! ఇండియా వంటి దేశంలో ఈ స్థాయిలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లుతున్నాయంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే!

క‌ట్ చేస్తే.. అసంతృప్త వ‌ర్గాల ప‌రిస్థితి ఏమిటంటే... వీళ్ల‌లో ఓసీలే ఎక్కువ‌మంది. వీళ్ల‌లో ఐదు-ప‌ది ఎక‌రాల పై స్థాయి భూములున్న వారికి సంక్షేమ ప‌థ‌కాలూ అందవు! ముందుగా వాళ్ల‌కు రేష‌న్ కార్డు తీసేస్తున్నారు. దీంతో అన్నీ ఆటోమెటిక్ గా క‌ట్ అవుతున్నాయి. ఆఖ‌రికి రైతు భ‌రోసా ప‌థ‌కం  డ‌బ్బులు కూడా వాళ్ల‌లో కొంత‌మందికి అంద‌క‌పోవ‌చ్చు. పెన్ష‌న్ రాదు, పంట న‌ష్ట‌ప‌రిహారాలు అంద‌వు, రేష‌న్ కార్డే లేకుండా పోవ‌డంతో.. ఏ అమ్మ ఒడి సాయ‌మో, పిల్ల‌ల‌కు ఫీజు రీయింబ‌ర్స్ మెంటో ఉండ‌దు! ఇదీ ప‌రిస్థితి!

ఇంత‌క‌న్నా దారుణం ఏమిటంటే.. ఇంట్లో ఎవ‌రైనా ఒక్క‌రి పేరుతో ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు అయి ఉంటే.. రేష‌న్ కార్డును పూర్తిగా ర‌ద్దు చేస్తున్నారు! ఇంట్లో ఒక్క‌రు సంపాదిస్తున్నా, రేష‌న్ కార్డును ర‌ద్దు చేయ‌డం ద్వారా వాళ్ల‌ను అన్ని సంక్షేమ ప‌థ‌కాల‌కూ దూరం చేస్తున్నారు. ఒక్క‌రు ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసిన పాపానికి ఇంట్లో వృద్ధులు ఉన్నా వాళ్ల‌కు పెన్ష‌న్ ఉండ‌దు, ఏ చ‌దువుకునే పిల్ల‌లుంటే వాళ్ల‌కూ ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ కొశ్చ‌న్ మార్కే, చాలా సంక్షేమ ప‌థ‌కాల‌కు రేష‌న్ కార్డే అర్హ‌త‌, అలాంటి రేష‌న్ కార్డునే  ఐటీ రిట‌ర్న్స్ కార‌ణంగా చూపి ర‌ద్దు చేసేస్తే.. అన్నీ క‌ట్ అయిపోతున్నాయి!

ఇదీ ప‌రిస్థితి. ఈ రోజుల్లో ఏ న‌గ‌రంలోనే ఉండి 30 నుంచి 40 వేల రూపాయ‌ల జీతం పొందే వాళ్లు ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఆ జీతాలు న‌గ‌ర జీవ‌నంలో ఏ పాటివో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ డ‌బ్బులో న‌గ‌రంలో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో బ‌తుకీడ్చ‌డం ఎంత క‌ష్ట‌మో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ కార‌ణం చూపి.. రిట‌ర్న్స్ దాఖ‌లు చేస్తున్నార‌ని, ప‌ల్లెలోనో, సొంతూర్లోనో వారు పేరు ఉంద‌ని రేష‌న్ కార్డును ర‌ద్దు చేయ‌డం అంటే.. ఎంత వ‌ర‌కూ న్యాయం?

కొంద‌రు తెలివైన వాళ్లు అలా రిట‌ర్న్స్ దాఖ‌లు చేసే పేరును కార్డు నుంచి తొల‌గించుకుని ల‌బ్ధి పొందుతున్నారు. మ‌రి కొంద‌రు పొంద‌లేక‌పోతున్నారు. అంద‌రికీ ల‌బ్ధి క‌లిగితే ఏ ఇబ్బందీ లేదు, కొంద‌రికి ల‌బ్ధి క‌లిగి, మ‌రి కొంద‌రికి క‌ల‌గ‌క‌పోవ‌డం అస‌హ‌నాన్ని పుట్టిస్తుంది. నియ‌మాల‌ను అమ‌లు చేసేట్టు అయితే గ‌ట్టిగా అమ‌లు చేయాలి, లూప్ హోల్స్ లో కొంత‌మంది త‌ప్పించుకుంటే.. మిగ‌తా వాళ్ల‌లో అస‌హ‌నం క‌లుగుతుంది.

పల్లెల్లోనే ఈ ర‌చ్చ‌లు ఎక్కువ‌!

కొడుకు త‌న కుటుంబంతో న‌గ‌రంలో బ‌తుకుతుంటాడు. ఊర్లో త‌ల్లిదండ్రులు వ్య‌వ‌సాయం చేసుకుంటూ ఉంటారు. కొడుకు రిట‌ర్న్స్ దాఖ‌లు చేశాడ‌ని, అత‌డి త‌ల్లిదండ్రుల‌కు రైతు భ‌రోసా, పెన్ష‌న్ వంటి ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేస్తే.. ఆ వృద్ధుల్లో అస‌హ‌నం క‌ల‌గ‌వ‌చ్చు. ఇందులో మ‌రో విష‌యం ఏమిటంటే..ఇలాంటి వాళ్ల‌లో కొంత‌మంది ఇది వ‌ర‌కూ పెన్ష‌న్ పొందుతూ వ‌చ్చారు. ఇప్పుడు ఉన్న‌ట్టుండి క‌ట్ చేయ‌డంతో వాళ్లు అస‌హ‌నానికి లోన‌వుతూ ఉన్నారు.

నిజంగా వాళ్లు అర్హులా..?

అటు ప్ర‌భుత్వ కోణం నుంచి కాకుండా, ఇటు ప్ర‌జ‌ల కోరిక‌ల ప్ర‌కారం కాకుండా.. చూస్తే, అర్హులు ఎవ‌రికీ అన్యాయం జ‌ర‌గ‌డం లేదు. ఈ రోజుల్లో కూడా ప‌దెక‌రాల‌కు మించి భూమి ఉన్న వాళ్ల‌కు పెన్ష‌న్ అవ‌స‌రం లేదు. ఆ స్థాయిలో భూమి ఉన్న వారికి పెట్టుబ‌డి సాయాలు కూడా అవ‌స‌రం లేదు. వాళ్ల‌కు రేష‌న్ కార్డులు ర‌ద్దు చేసినా త‌ప్పేం లేదు. ఎందుకంటే భూమి అంటేనే సంప‌ద‌. వాళ్లను ప్ర‌భుత్వం ఇలా పోషించాల్సిన అవ‌స‌రం లేదు. ఏ పంట న‌ష్ట ప‌రిహారాల వ‌ర‌కూ ఓకే కానీ, అంత‌కు మించి వాళ్ల‌ను పోషించాల్సిన అవ‌స‌రాన్ని ప్ర‌భుత్వం కూడా వ‌దిలించుకోవ‌చ్చు. రైతులు కూడా ఆ మేర‌కు ఆశించేవారు కాదేమో! అయితే ఎవ‌రెవ‌రో ఎలాగెలాగో ప్ర‌భుత్వాల నుంచి డ‌బ్బులు తెచ్చుకుంటుండే స‌రికి.. వాళ్ల‌లోనూ ఆశ‌లు  పుడుతున్నాయి. 'వాళ్ల‌కేనా.. మాకు వ‌ద్దా?' అనే ప్ర‌శ్న  వాళ్ల‌లో ఉత్ప‌న్నం అవుతోంది. 'ఇచ్చేవాడుంటే, స‌చ్చేవాడు కూడా లేచొస్తాడు..' అని ఒక సామెత‌. అలా మారుతోంది ప‌రిస్థితి.

చేనేత వ‌ర్గాల‌కు ఇటీవ‌లే జ‌గ‌న్ ప్ర‌భుత్వం భారీగా డ‌బ్బులు ఇచ్చింది. అయితే వారిలో చాలా మంది అన‌ర్హులు కూడా డ‌బ్బులు పొందారు. చేనేత ప‌ని చేసే వాళ్లంతా చిరిగిన బ‌ట్ట‌ల‌తో ఏమీ ఉండ‌రు. ప‌ట్టు చీర‌ల వ్యాపారంతో చ‌క్క‌గా సెటిలైన వారూ ఉంటారు. అలాంటి వారికి అలా అయాచితంగా ప్ర‌భుత్వం డ‌బ్బులిచ్చే స‌రికి మిగ‌తా వాళ్లలో అస‌హ‌నం క‌లుగదా? వాళ్లకు ఇస్తే ఇచ్చారు, మాకెందుకు ఇవ్వ‌రు? అనే ప్ర‌శ్న వ‌స్తోంది!

చంద్ర‌బాబు నాయుడు ఏం చేశారు?

చంద్ర‌బాబు నాయుడు హ‌యాం విష‌యానికి వ‌స్తే.. మాట‌లెక్కువ‌, చేత‌లు త‌క్కువ‌. జ‌నాల‌కు చంద్ర‌బాబు నాయుడు ప‌థ‌కాల డ‌బ్బులు ఇలా ఇచ్చిన చరిత్ర లేదు! డ‌బ్బులు ఏవైనా వాటి కోసం ప్ర‌జ‌లు ఎదురుచూడాల్సిందే! వ‌స్తే వ‌స్తాయ్.. లేక‌పోతే లేదు. ఇలా క‌చ్చితంగా ఏడాదికి ఒక మారు అని, ఆరు నెల‌ల‌కు ఒక‌సారని మాట‌కు క‌ట్టుబ‌డి చేసిన పాల‌న కాద‌ది. ఎన్నిక‌లు వ‌చ్చినప్పుడు ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు ఇచ్చి వాళ్ల చేత ఓట్లు వేయించుకునే పాల‌న చేశారు చంద్ర‌బాబు నాయుడు. దీంతో అప్పుడు ప్ర‌జ‌లు కూడా ఆశించేది ఏమీ లేక‌పోయింది. వ‌స్తే వ‌చ్చిన‌ట్టు, లేక‌పోతే లేన‌ట్టు! అదీ చంద్ర‌బాబు పాల‌న‌. కాబ‌ట్టి.. ప్ర‌జ‌లు ప‌ట్టుబ‌డి మాకు రాలేదు అని అడిగే ప‌రిస్థితి లేక‌పోయింది. వైఎస్ తెచ్చిన సంక్షేమ ప‌థ‌కాల‌ను త‌ప్ప‌క చంద్ర‌బాబునాయుడు అమ‌లు చేశారు కానీ లేక‌పోతే ఆ మాత్రం కూడా లేదు. రుణ‌మాఫీ అని రైతుల‌ను, డ్వాక్రా మ‌హిళ‌ల‌ను చంద్ర‌బాబు నాయుడు ఓపెన్ గా మోసం చేశారు. దీంతో చంద్ర‌బాబు మాటల మీద జ‌నాల‌కు న‌మ్మ‌క‌మూ పోయింది. టీడీపీ చిత్తూ అయ్యింది. అదే జ‌గ‌న్ పాల‌న‌కు వ‌చ్చే స‌రికి, వాళ్ల‌కు ఇస్తున్నాడే, మాకు ఇవ్వ‌లేదే.. అనే భావ‌న ల‌బ్ధి క‌ల‌గ‌ని వారిలోకి ప్ర‌వేశిస్తోంది. 12 వేల రైతు భ‌రోసా పొందిన రైతు కూడా, అరే.. ఆటోలు న‌డిపే వాళ్ల‌కే 10 వేలు అంట‌, నేను రైతును నాకు 12 వేలేనా అంటే దానికి స‌మాధానం ఏముంది? 12 వ‌చ్చినా వీళ్ల‌కు ఆనందం లేకుండా పోతే ఏ ప్ర‌భుత్వం అయినా ఏం చేస్తుంది. చంద్ర‌బాబులా మోసం చేస్తే ఏ స‌మ‌స్యా లేదు, హెచ్చు త‌గ్గులను మాత్రం కొంత‌మంది స‌హించ‌లేక‌పోతున్న‌ట్టుగా ఉన్నారు.

అర్హుల‌ను నిర్ణ‌యించ‌డంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న నియ‌మాలు మ‌రీ అన్యాయంగా ఏమీ లేవు. కానీ జ‌నాలు ఆలోచించే తీరు ఒక‌లా ఉండ‌దు క‌దా. 'నాకేం ప‌దెక‌రాల ఆసామిని, ప్ర‌భుత్వం మీద ఆధార‌ప‌డాల్సిన ఖ‌ర్మ నాకేంటి.. నా పిల్ల‌లు చ‌క్క‌గా సెటిల‌య్యారు,  నేను హ్యాపీ..' అని ప్ర‌భుత్వం నుంచి ఆశించ‌కుండా ఆలోచించ‌గ‌లిగే వాళ్లు ఎంత‌మంది? ఎంత ఉన్నా..  ఇంకా వ‌స్తుందేమో అని ఆశించే వాళ్లే ఎక్కువ‌! వీళ్ల‌లోనే అసంతృప్తి.

ఓసీలు చూడ‌టం లేదా..?

కులం చూడం, మ‌తం చూడం.. అంటూ జ‌గ‌న్ త‌మ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు గురించి చెప్పిన మాట‌ల‌ను కొంద‌రు ఓసీలు సెటైరిక్ గా వాడుతున్నారు. కులం చూడం, మ‌తం చూడం, ఓసీల‌ను అస‌లే చూడం.. అన్న‌ట్టుగా జ‌గ‌న్ వ్యాఖ్య‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే జ‌గ‌న్ పాల‌న‌లో ఓసీలు ల‌బ్ధి పొంద‌లేదు అనేది ఉత్తిమాటే. రేష‌న్ కార్డు క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రూ ల‌బ్ధి పొందుతున్నారు. ప‌ల్లెల్లో 90 శాతం మందికి రేష‌న్ కార్డు ఉండ‌నే ఉంది. వాళ్ల‌కు ఏ సంక్షేమ ప‌థ‌కం ల‌బ్ధీ అంద‌కుండా పోలేదు. చేనేత ప‌ని చేసే కొంద‌రు ఓసీ వ‌ర్గాల వారు కూడా అందుకు సంబంధించిన డ‌బ్బుల‌ను పొందారు. ఇంట్లో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు క‌లిసే ఉన్నా, వాళ్లు వేర్వేరు రేష‌న్ కార్డులు, త‌ల్లిదండ్రులు మ‌రో కార్డు పెట్టుకుని.. అన్ని ప‌థ‌కాల ల‌బ్ధీ పొందుతున్న ఓసీలు కూడా ఉన్నారు. ఎటొచ్చీ రేష‌న్ కార్డు ను క‌లిగి ఉండ‌ట‌మా, లేదా.. అనేదే కీల‌క‌మైన అంశంగా మారింది. ఈ విష‌యంలోనే కొంద‌రు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌జ‌ల‌కు గాక‌.. కార్పొరేట్ల‌కు దోచి పెట్టాలా?

స్థూలంగా జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో అన్ని ప‌థ‌కాల‌నూ పొందేయాల‌న్న వారిలో అసంతృప్తి కొంత ఉంది. వ‌చ్చిన దాంతో తృప్తి ప‌డ‌టం మ‌నిషి ల‌క్ష‌ణం కాదు కాబ‌ట్టి, అది ఎప్ప‌టికీ ఉండ‌నే ఉంటుంది. ఇలా ర‌క‌ర‌కాల వ‌ర్గాల‌ను సంతృప్తి ప‌రుస్తూ పోతున్నా.. ఇంకా ఎవ‌రో ఒక‌రు అసంతృప్తితో ఉండ‌నే ఉంటారు. అది తెగేది కాదు.

ఇక‌ కొంద‌రు మేధావులు ఈ సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో విమ‌ర్శ‌లు చేసేస్తూ ఉన్నారు. ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ పంచేస్తూ ఉన్నార‌ని, ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నార‌ని,  అడ్డ‌గోలుగా పంచుతున్నార‌ని.. అంటూ లోతు లేని విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ల‌కు సూటి ప్ర‌శ్న ఏమిటంటే.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు చేస్తే ఇంత అస‌హ‌నం అయితే, ప్ర‌భుత్వం మ‌రేం చేయాలి?  కార్పొరేట్ల‌కు దోచి పెట్టాలా?

కార్పొరేట్ వ‌ర్గాలు ప్ర‌భుత్వాల నుంచి బోలెడంత ల‌బ్ధి పొందుతున్నాయి. వాళ్ల‌కు భూములు ఫ్రీ, వాళ్ల‌కు రాయితీలు, క‌రెంటు బిల్లుల నుంచి మిన‌హాయింపులు, ఆపై బ్యాంకుల నుంచి అప్పులు. ఆ అప్పుల ఎగ‌వేత‌లు, మాఫీలు! ఇవ‌న్నీ రోజూ వార్త‌ల్లోని అంశాలే! నిజానికి దేశంలో ప్ర‌జా సంక్షేమం మీద ప్ర‌భుత్వాలు పెడుతున్న ఖ‌ర్చుతో పోలిస్తే.. కార్పొరేట్లు పొందుతున్న రాయితీల మొత్త‌మే చాలా చాలా ఎక్కువ ఉంటుంది.

కార్పొరేట్ల‌కు ఇచ్చే రాయితీలు, వాళ్ల‌కు ప‌ది కోట్ల రూపాయ‌ల విలువైన భూమిని ల‌క్ష రూపాయల‌కే ఇవ్వ‌డం.. ఇవ‌న్నీ వార్త‌ల్లో అలా వ‌చ్చి వెళ్లిపోయే అంశాలు. అదే ప్ర‌జా సంక్షేమం మాత్రం దండ‌గ‌మారి ప‌ని అని కొంత‌మంది బ‌లిసిన వాళ్ల‌కు అనిపిస్తూ ఉంటుంది.

సంక్షేమ ప‌థ‌కాలు అనేవి ప్ర‌జ‌ల‌కే కాదు, అంతిమంగా దేశానికి మంచి చేస్తాయి. రైతుల‌కు, బ‌డుగు-బ‌ల‌హీన వ‌ర్గాల కోసం వెచ్చించే ప్ర‌తి రూపాయి కూడా దేశ సంక్షేమం కోసం వినియోగిస్తున్న‌దే అని గుర్తించాలి. దేశ‌మంటే మ‌ట్టికాదు, దేశ‌మంటే మ‌నుషుల‌ని గుర‌జాడ చెప్పిన విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌దు. ప్ర‌జ‌లు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఆర్థికంగా ప్ర‌జ‌ల‌కు డైరెక్టుగా అండ‌గా నిలిచినా అదేమీ వ్య‌ర్థం కాదు. వాళ్ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌డ‌తాయి. సామాన్యుల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌డితే దేశమే మెరుగుప‌డుతుంది. భార‌తీయుల్లో డ‌బ్బును వ్య‌ర్థం చేసే అల‌వాట్లు త‌క్కువ‌నే విష‌యాన్నీ గుర్తించాలి. సంక్షేమ ప‌థ‌కాల ద్వారా త‌మ‌కు అందే డ‌బ్బును ఆర్థికంగా తాము మ‌రో మెట్టు పైకి ఎద‌గ‌డానికి ఉప‌యోగించే ప్ర‌జ‌లే 90 శాతం మంది ఉంటారు. అంతిమంగా ప్ర‌జ‌ల జీవ‌న స్థితి గ‌తులు బాగు ప‌ర‌చ‌డ‌మే ఏ ప్ర‌భుత్వం అయినా చేయాల్సింది. ఏ కార్పొరేట్ కంపెనీకో, విదేశీ ఇన్వెస్ట‌ర్ కో భూములు ఇవ్వ‌డ‌మే అభివృద్ది అనుకునే భ్ర‌మ‌లోకి వెళ్లిపోయారు కొంత‌మంది. ఆ భ్ర‌మ‌ల నుంచి బ‌య‌ట‌కు రావాలి. ప్ర‌జ‌ల జీవ‌న స్థితి గ‌తులు మంచి స్థాయికి చేర‌డ‌మే నిజ‌మైన‌ అభివృద్ధి. కాబ‌ట్టి.. మేధావులు సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో అతిగా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.

-జీవ‌న్ రెడ్డి.బి