Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జనసేనాధిపతి.. ఆ ఒక్కటి తప్ప.!

జనసేనాధిపతి.. ఆ ఒక్కటి తప్ప.!

జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌.. ఏంటో, ఇలా అనాల్సి వస్తోంది జనానికి. ఎంతైనా అడ్రస్‌ లేని జనసేన పార్టీకి ఆయన అధిపతి కదా. అందుకే, జనసేనాధిపతి అనక తప్పడంలేదు. రాజకీయాలంటే మరీ వెటకారం అయిపోయింది మెగా బ్రదర్స్‌కి. అన్నయ్య పోస్ట్‌ పెయిడ్‌, తమ్ముడు ప్రీపెయిడ్‌.. అనే విమర్శల్ని మెగా బ్రదర్స్‌ ఎప్పుడూ లెక్కచేయరాయె. చట్టం తన పని తాను చేసుకోవడమేమోగానీ, మెగా బ్రదర్స్‌ మాత్రం 'తమ పని' తాము చేసుకుపోతారంతే. 

రాజకీయాల్లోకి వచ్చాం.. పార్టీ పెట్టాం, ఆ పార్టీని ఎత్తేశాం.. మళ్ళీ ఇంకో పార్టీ పెడతాం.. జనాన్ని వీలైనన్నిసార్లు మభ్యపెడతాం.. మాకు సినీ గ్లామరుంది.. అన్నట్లు వ్యవహరిస్తే ఎలా.? అంతా మా ఇష్టం.! చిరంజీవి సంగతి పక్కన పెడితే, పవన్‌కళ్యాణ్‌ మరీ ఎగ్రెసివ్‌గా హడావిడి చేసేశారు 2014 ఎన్నికల్లో. 'నేను ప్రశ్నిస్తా..' అంటూ వీరలెవెల్లో పోజులిచ్చిన పవన్‌కళ్యాణ్‌కి, ఇప్పుడు ప్రశ్నించడానికి బలం లేదట. ఆర్థికంగానూ, రాజకీయంగానూ ఇప్పుడు కొత్తగా పవన్‌కళ్యాణ్‌కి బలం వుండడం, వుండకపోవడం అన్న ప్రస్తావన ఎందుకట.! ఆయనకే తెలియాలి. 

ప్రశ్నించడానికి డబ్బులు కావాలా.? ప్రశ్నించడానికి ముహూర్తం కావాలా.? నాన్సెన్స్‌.. అని ఎవరైనా అనుకోవచ్చుగాక. పవన్‌కళ్యాణ్‌ రూటే సెపరేటు. వైవాహిక జీవితం, ఇంకోటీ పవన్‌కళ్యాణ్‌ వ్యక్తిగతం. కానీ, రాజకీయాల్లోకి వచ్చాక, 'వ్యక్తిగతం' అంటే ఎలా కుదురుతుంది.? ఖాళీ లేదు, బిజీగా వున్నాను.. గుర్తుకొచ్చినప్పుడు స్పందిస్తాను.? అంటే, నమ్మి ఓట్లేసిన జనం ఏమైపోవాలి.! 

మామూలుగా పవన్‌కళ్యాణ్‌ మీడియాకి దొరకరుగాక దొరకరు. ప్రత్యేక హోదా గురించి రచ్చ రచ్చ అవుతోంటే, ఎంచక్కా సినిమాలతోనూ, ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం, ఇతర పనులతోనూ ఎంజాయ్‌ చేస్తున్న పవన్‌, ఎట్టకేలకు మీడియా ముందుకు రాక తప్పలేదు. వచ్చినా ఉపయోగమేముంది.? ప్రత్యేక హోదా గురించి తర్వాత స్పందిస్తా.. అంటూ చేతులు దులిపేసుకున్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, హైద్రాబాద్‌లో పవన్‌కళ్యాణ్‌ని కలిశారు. ఈ సందర్భంలో ఏదో, మీడియా ఓ ప్రశ్న వేయడానికి అవకాశమొస్తే, పవన్‌కళ్యాణ్‌ని ప్రశ్నించింది ప్రత్యేక హోదాపై. 

ప్చ్‌.. పవన్‌కళ్యాణ్‌ స్పందిస్తే కదా.! ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అన్నయ్య వెనకాల తిరిగారు.. జనసేన పార్టీ పెట్టాక నరేంద్రమోడీ, చంద్రబాబు వెనకాల తిరిగారు.. ఎప్పుడూ వెనకాల తిరగడం, రాజకీయంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయడం, సినీ గ్లామర్‌ని రాజకీయాల్లో వాడుకోవడం, 'నీతి నిజాయితీ' అంటూ లెక్చర్లు దంచడం, పనైపోయాక 'నాన్సెన్స్‌.. నేను బిజీ.. రాజకీయాలతో నాకేం సంబంధం.?' అన్నట్లు వ్యవహరించడం.. ఇదంతా పవన్‌కళ్యాణ్‌కే చెల్లింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?