Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జగన్ చేయకూడని కేసిఆర్ తప్పులు

జగన్ చేయకూడని కేసిఆర్ తప్పులు

ప్రతి మనిషి దగ్గర ఎన్ని నెగిటివ్ పాయింట్లు వున్నా, ఒక్కటైనా ప్లస్ పాయింట్ వుంటుంది. అయితే పక్కోడి ప్లస్ పాయింట్లు చూసి మాత్రమే నేర్చుకోవడం కాదు. అవతలి వాడి తప్పులు చూసి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు.

ఆంధ్ర సిఎమ్ జగన్ కచ్చితంగా ఇలాంటి పాఠాలు తెలంగాణ సిఎం కేసిఆర్ నుంచి నేర్చుకోవాల్సి వుంది. ఆ మాటకు వస్తే కేసిఆర్ నుంచే కాదు వైఎస్ఆర్, చంద్రబాబు చేసిన అదే తప్పుల నుంచి కూడా నేర్చుకోవాల్సిందే. ఇంతకీ ఈ ముగ్గురు కామన్ గా చేసిన తప్పంటీ?

రాజకీయాల్లో పోటీ అనేది వుంటుంది. వుండాల్సిందే. పోటీ లేకుండా చేసుకోవడం అన్నది అసాధ్యం మాత్రమే కాదు అవివేకం కూడా. రాజకీయ నాయకులు గమనించాల్సిన కీలక అంశం ఏమిటంటే, ప్రజాస్యామ్యంలో అసలు సిసలు పోటీ ఇచ్చేది రాజకీయ నాయకులు కాదు. ప్రజలు. అవును..ప్రజల అండతో రాజకీయ నాయకులు పోటీ ఇవ్వగలుగుతారు తప్ప, వారి మద్దతు లేకుండా కాదు. 

రాజకీయ నాయకులు వస్తూనే వుంటారు. పోతూనే వుంటారు. కానీ ప్రజలు శాశ్వతం. ఎన్టీఆర్ వస్తాడని కాంగ్రెస్ వాళ్లు కలగన్నారా? చంద్రబాము పక్కలో పొడస్తాడని ఎన్టీఆర్ అనుకున్నారా? జగన్ అనేవాడు వచ్చి తనను మూలన కూర్చోపెడతాడని, తన అనుభవానికి చెక్ చెబుతాడని చంద్రబాబు ఊహించారా? జనం తమ అసంతృప్తిని వెల్లగక్కడానికి ఏదో మార్గం ఎన్నుకుంటూనే వుంటారు. ఎవరో ఒకర్ని ముందుకు తోస్తూనే వుంటారు. ప్రజల అవసరం, అసంతృప్తి ఈ రెండూ కలిసి ఓ నాయకుడిని తయారుచేస్తూనే వుంటాయి.

వైఎస్ఆర్ తో ఆరంభం

వైఎస్ఆర్ రెండో పర్యాయం ఎన్నిక కాగానే తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దాం అనుకున్నారు. వచ్చిన వాడిని వచ్చినట్లు లోపలకు లాగేసారు. కానీ ఏమయింది ఆంధ్ర అవసరాలు, అనుభవం కలిసి మళ్లీ చంద్రబాబుకు ఊపిరిపోసాయి.

అయినా చంద్రబాబు ఏం చేసారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేద్దాం అనుకున్నారు. నయనో, భయానో, ఆశ చూపో ఆ పార్టీ నాయకులను లాక్కు వచ్చి తమ పార్టీ పెరట్లో కట్టేసారు. కానీ మళ్లీ ఏమయింది? జనాలకు బాబు మీద వున్న అసంతృప్తి జగన్ ను నాయకుడిని చేసి, ఏకంగా అఖండ ఆధిక్యతతో అధికారం కట్టబెట్టింది.

తెలంగాణలో...

తెలంగాణలో కూడా కేసిఆర్ తక్కువ తినలేదు. రెండో పర్యాయం అధికారంలోకి రావడంతోనే ఆయనా అదే పని మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తే ఇక తనకు, తన పార్టీకి తిరుగులేదనుకున్నారు. ఆ విదంగా ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీని కకావికలు చేసారు. పైగా కాంగ్రెస్ ఫార్టీతో తెలుగుదేశం లోపాయకారీ ఒప్పందాలు పెట్టుకోవడం అన్నది ఆయనకు కలిసి వచ్చింది. జనం కూడా ఆ పార్టీని దాదాపు పక్కన పెట్టారు. దీంతో కేసిఆర్ పని మరింత సులువు అయింది. 

కానీ పదేళ్లు వరస పాలన ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి అనేది అనివార్యం అయింది. దానిని ఎలా ప్రొజెక్ట్ చేయాలా? అన్న సమయంలో భాజపా పార్టీ అనువుగా కనిపించింది. దాంతో దానిని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా తమ ఘనతే, తమ బలమే అని భాజపా నాయకులు అనుకుంటే అది వేరే సంగతి. మొత్తం మీద ఏమయింది. ఉన్న శతృవును పక్కకు తప్పేస్తే, కొత్త బలంతో, సరికొత్త శతృవు వచ్చి ఎదురుగా నిల్చున్నట్లు అయింది.

అయితే ఆంధ్రకు సంబంధం ఏమిటి?

అంతా బాగానే వుంది. ఈ పార్టీల నిర్వీర్యం కార్యక్రమంతో ఆంధ్రకు సంబంధం ఏమిటి? జగన్ కు అంతకన్నా సంబంధం ఏమిటి? అన్న అనుమానం రావొచ్చు. నిజమే జగన్ ఏమీ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించడం లేదు. ఆయనేమీ వలసలను విచ్చలవిడిగా ప్రోత్సహించడం లేదు. 

అలా చేసి వుంటే గత ఏడాదికాలంలోనే తెలుగుదేశం నుంచి చాలా మంది వైకాపాలోకి వచ్చేసి వుండేవారు. పైగా తెలుగుదేశంలోకి వైకాపాలో చేరేవారి కన్నా భాజపాలోకి వెళ్లేవారి సంఖ్య చెప్పుకోదగ్గది గా వుంది. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదు లేదా వుండదు అని నమ్ముతున్నవారు భాజపాను తమ కొత్త ఆశ్రయంగా నమ్ముతున్నారు. అందుకే అటు వెళ్తున్నారు.

ఇలా జరగడం వెనుక జగన్ తప్పిదం కొంతయినా వుంది. జగన్ తెలుగుదేశం పార్టీని డైరెక్ట్ గా టార్గెట్ చేయడం లేదు. ఆ పార్టీ నాయకుల ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తున్నారు. తద్వారా నాయకులు బలహీనపడతారని, వారు బలహీనపడితే, పార్టీ కూడా దానంతట అదే బలహీనమవుతుందని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

కానీ అక్కడే సమస్య వస్తోంది. తమ తమ ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం భాజపా వైపు మళ్లుతున్నారు. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ బలహీనపడినట్లు కాదు, నక్సలైట్లు ఓ దగ్గర నుంచి మరో దగ్గరకు వెళ్లి షెల్టర్ తీసుకున్న మాదిరిగా నాయకలు ఓ పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్లి షెల్టర్ తీసుకున్నట్లు అవుతోంది.

దీనివల్ల ఏమవుతుంది? అని అనుకోవడానికి లేదు. ఎప్పటి నుంచో భాజపాకు ఆంధ్ర మీద కన్ను వుంది. కానీ దాన్ని బతికీ బతకనివ్వకుండా కొందరు భాజపా నాయకులే అలా అలా నొక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో వస్తున్న ఊపు చూసి, ఆంధ్ర నాయకులకు కూడా ఆశ పుట్టడం సహజం. ఉత్సాహం కలగడం అంతకన్నా సహజం. అదే జరిగితే ఆంధ్రలో కూడా భాజపా బలోపేతం అవుతుంది.

అయితే ఏమవుతుంది? పైగా ముక్కోణపు పోటీ వైకాపాకే మేలుకదా? అని లాజిక్ లు తీసేవారు వుండొచ్చు. కానీ జనం అలా ఆలోచించకుండా వేరే విధంగా ఆలోచిస్తే..? తెలుగుదేశాన్ని చూసాం. వైకాపానూ చూసాం...భాజపాను చూద్దాం అనే దిశగా వారు ఆలోచించడం మొదలుపెడితే, మొదలుకే మోసం వస్తుంది.

జగన్ వెనుక...

ఇదిలావుంటే జగన్ కు తెలిసో..తెలియకో జరుగుతున్న కొన్ని విషయాలు ఆయన పార్టీకి ఏమంత మేలు చేసేవిగా లేవు. పార్టీ నాయకుల గొడవలు గోరంతలు కొండంతలుగా చూపించే ప్రయత్నం 'దేశం' అను'కుల'మీడియా చేస్తోంది.పైగా ఇటీవల మళ్లీ నేరుగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలను టార్గెట్ చేయడం అన్నది ప్రారంభమైంది. 

అందువల్ల ఆ మీడియా మరింత రెచ్చిపోతుంది తప్ప జరిగేది ఏమీ వుండదు. ఇలా బలమైన మీడియా పచ్చి వ్యతిరేకంగా వున్నపుడు జగన్, ఆయన ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వుండాల్సి వుంది. కానీ ఆ జాగ్రత్త మాత్రం అస్సలు కనిపించడం లేదు.

అదే సమయంలో తెలంగాణలో కేసిఆర్, కేటిఆర్, సంతోష్, ల పేర్లు తప్ప మరో పేరు వినిపించని వైనం మాదిరిగానే ఆంధ్రలో జగన్, విజయసాయి ల పేర్లు తప్ప మరోటి వినిపించని పరిస్థితి కనిపిస్తోంది. మంత్రులు ఎవరో? ఎక్కడున్నారో? ఏం మాట్లాడారో అన్నది తెలంగాణలో ఎవరికీ తెలియని పరిస్థితి. 

మొదటి ఏడాది సంగతేమో కానీ, రాను రాను ఆంధ్రలో కూడా అదే పరిస్థితి తయారవుతోంది. సీనియర్లు అయిన బొత్స లాంటి వాళ్లు కూడా పెదవి విప్పి మాట్లాడి తమ శాఖల విశేషాలు ఛెప్పి ఎన్నాళ్లయింది. సీనియర్ లేదా కీలక శాఖ మంత్రులు కూడా పెదవి విప్పడం లేదు. జగన్ అప్రతిహతంగా తన పాలన సాగించుకుంటూ పోతున్నారు కాబట్టి ఇప్పుడు వీరెవరు మౌనంగా వున్నారు. కానీ తేడా వచ్చిన నాడు వీరి నోట వెంట మాటలు తూటాల మాదిరిగా వస్తాయి.

స్వామీజీ చుట్టూ

ఉత్తరాంధ్రలోని ఓ స్వామీజీకి జగన్ అలవిమాలిన ప్రాధాన్యత ఇచ్చేసినట్లు కనిపిస్తోంది. జగన్ పట్టించుకోవడం లేదు. దాంతో ఆయన తన ఇష్టారాజ్యాన్ని సాగించేస్తున్నారు. రాజకీయ ఆశ్రితులు అంతా ఆ పీఠం చుట్టూ, ఆ పీఠాధిపతి చుట్టూ ప్రదక్షిణలు సాగిస్తున్నారు. దేవాదాయ శాఖ ఏకంగా తమ శాఖకు ఆయనే మంత్రి,సర్వధిపతి అనుకుంటోంది. దాంతో దేవాదాయ శాఖ నియామకాలు ఆయన ఇష్టారాజ్యంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

విశాఖ జిల్లాలో మంత్రి అవంతి స్వంత నియోజక వర్గంలో ఆయనకు మాట మాత్రం చెప్పకుండా, ఆయనకు తెలియకుండానే ఓ ఆలయ కమిటీ నియామకం జరిగిపోయింది. సింహాచలం ఆలయానికి సంచయిత ను వంశపారంపర్వ పదవిలోకి తీసుకురావడం వెనుక ఈ స్వామిజీ వున్నారని ఉత్తరాంధ్ర జనం బలంగా నమ్ముతున్నారు. 

ఉత్తరాంధ్ర జనానికి ఈ స్వామీజీ కన్నా సింహాచలం దేవుడు అప్పన్న అంటే ఎక్కువ అభిమానం..నమ్మకం.. భక్తి..విశ్వాసం. అలాంటి దేవస్థానం విషయంలొ అవకతవకలు జరుగుతున్నాయి. ఎప్పుడో తండ్రిని వదిలేసి తల్లితో వెళ్లిపొయి, తండ్రి రెండో భర్తను తన తండ్రిగా పబ్లిక్ గా ప్రకటించిన వారిని తీసుకువచ్చి కీలకమైన ఆలయ బాధ్యతలు అప్పగించడం అన్నది ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసులను కలచివేస్తోంది. ఇది ప్రకటితం కాకపోవచ్చు. కానీ అవసరం అయినవుడు, అవకాశం వచ్చినపుడు కచ్చితంగా దాని ప్రభావం అయితే అది కనబరుస్తుంది.

సింహాచరం దేవస్థానానికి ప్రభుత్వం పాత బకాయిలు ఇస్తే, ఆ చెక్ ను స్వామీజీ చేతుల మీదుగా పాలకమండలి అందుకోవడమా? ఇదంతా జనం చూస్తూనే వున్నారు. పోనీ అలా అన ఆ స్వామీజీకి జనాల్లో అద్భుతమైన ఆదరణ వుంది అనుకుంటే అదీ లేదు. 

వ్యాపారాలు, రాజకీయ నాయకులు తప్ప వేరు జనాలకు ఆ స్వామీజీ మీద దృష్టి అంతంత మాత్రం. దీంతో ఇప్పుడు ఏమయింది. ప్రభుత్వం తో పనులు చేయించుకోవడానికి ఇదో ఛానెల్ గా మారుతోంది. ఇదంతా ఉత్తరాంధ్ర ప్రజల్ని కాస్త అసహనానికి గురి చేస్తోంది. భాజపా, తేదేపా దీనిని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది.

అందరూ అంతే

ఫీజుల రీఎంబర్స్ మెంట్, బిల్లుల మంజూరు లాంటి వ్యవహారాల్లో కూడా లోపాయకారీ వ్యవహారాలు సాగుతున్నాయి అని వినిపిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన వారికి మాత్రమే ఫీజుల రీఎంబర్స్ మెంట్ వ్యవహారాలు సాగుతున్నాయని అందరూ ఆ బాట పడుతున్నారు. బిల్లుల మంజూరు అంటే మంత్రి బుగ్గన కరుణా కటాక్షాలు అవసరం అన్న గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

ఇలా అతి కొద్ది మంది నాయకుల చేతుల్లోనే వ్యవహారాలు బందీ అయిపోతున్నాయి అన్న వార్తలు మెల్లగా వ్యాపించడం మొదలయింది. ఒక్కపక్క నాయకుల మధ్య అసమ్మతి. మరోపక్క చాపకింద నీరులా సాగుతున్న స్వామీజీ వ్యవహారాలు కలిసి తూర్పు, ఉత్తరాంధ్ర జనాలను ప్రభావితం చేస్తున్నాయి. నాలుగు జిల్లాల పరిస్థితి ఇలా వుంటే, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అమరావతి కల్లోలం చిచ్చు పెడుతోంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలే ప్రస్తుతానికి వైకాపాకు ఫ్రశాతంగా వున్నాయి.

జగన్ అక్కడ బిజీ

జగన్ పరిస్థితి ఎలా వుందీ అంటే నెల నెలా డబ్బులు సర్దుబాటు చేయాల్సిన కీలక కర్తవ్యం, కోర్టు కేసులను ఎదుర్కోవడానికి వ్యూహాలు రచించుకోవడం. దీనివల్ల ఆయనకు కిందన ఏం జరుగుతోందీ అన్నది అంతగా పట్టినట్లు కనిపించడం లేదు. తిరుపతిని వైవి కి, కొన్ని వ్యవహారాలను సజ్జలకు, ఉత్తరాంధ్రను విజయసాయికి వదిలేసినట్లు కనిపిస్తోంది. దీని మీద పార్టీలో అసంతృప్తి బలంగా వుంది. ఇది ప్రస్తుతానికి కనిపించకపోవచ్చు. కానీ పార్టీకి ఇది ఎంత మాత్రం మంచిది కాదు.

తెలంగాణలో కేసిఆర్ గమనించనిది ఇదే. తను, తన కుటుంబం పాలించుకుంటూ, నిర్ణయాలు తీసుకుంటూ, పాపులారిటీ పెంచుకుంటూ వెళ్లిపోయారు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నవారు, కేసిఆర్ తో భుజం కలిపి నడిచిన వారు పక్కన వుండిపోవాల్సి వచ్చింది. వారిలో అలా అలా రాజుకుంటూ వచ్చిన అసంతృప్తి ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికల్లో కేసిఆర్ ను పరుగులుపెట్టిస్తోంది.

ఇలాంటి పరిస్థితి రాకుండా జగన్ ఇప్పటి నుంచీ జాగ్రత్త పడాల్సిన అవసరం వుంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికో పోలేదు. దాని కేడర్ దానికి అలాగే వుంది. దాని నాయకులు దానికి అలాగే వున్నారు. ప్రజల నుంచి ఏ మాత్రం మద్దతు లభించినా వీరు చటుక్కున లేచి ముందుకు ఉరుకుతారు. నిమ్మగడ్డ వుండగా స్థానిక ఎన్నికలు చేయకపోయినా, ఆ తరువాత అయినా చేయక తప్పదు. ఆ నాటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనరేట్ అయింది అంటే మరీ ప్రమాదం. అంటే గట్టిగా రెండేళ్లు కాకుండా ఇది సాధ్యమైంది అంటే లోపం ఎక్కడ వుంటుందో చూడాలి.

జగన్ వరకు తప్పులు చేయడం లేదు. రాజధాని వికేంద్రీకరణ మీద దృష్టి పెట్టిన ఆయన అధికార వికేంద్రీకరణ మీద పెట్టడం లేదు. దాంతో కేవలం ముగ్గురు నాయకులు ఇద్దరు ముగ్గురు మంత్రులదే హవా అవుతోంది. మిగిలిన వారు మౌనమునులుగా వుండిపోతున్నారు. జనం ఇదంతా గమనించడం లేదనుకుంటే భ్రమే.

మాట్లాడనివ్వాలి

జగన్ ఇప్పటికైనా పార్టీ మహాసభలు ఏడాదికి ఓసారి నిర్వహించాలి. కార్యక్తరలు, నాయకులు, ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వాలి. వారి అభిప్రాయాలు క్లోజ్డ్ డోర్స్ లో అయినా తెలుసుకుని, సర్దుబాటు చేసకోవాలి.

అలా కాకుడా కేసిఆర్ మాదిరిగానే నియంతృత్వ పోకడలతో పాలించుకుంటూ, జనాలకు డబ్బులు ఇచ్చేస్తున్నాం, అంతా అదే చూసుకుంటుంది అనుకుంటే, ఒక్కసారిగా వెలికి వచ్చే అసంతృప్తితో చాలా కష్టపడి పోరాడాల్సి వుంటుంది. కేసిఆర్ పాలన జగన్ కు చెప్పే పాఠం ఇదే.

చాణక్య

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?