Advertisement

Advertisement


Home > Articles - Special Articles

కోడీ 'నై'.. కత్తీ 'నై'.. నమ్మొచ్చా బాబూ.?

కోడీ 'నై'.. కత్తీ 'నై'.. నమ్మొచ్చా బాబూ.?

కోడి పందెం.. ఉభయ గోదావరి జిల్లాలకు పేటెంట్‌ హక్కుంది దీనిపైన. ఏమో, వుందో లేదోగానీ ఆ స్థాయిలో ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జరుగుతుంటాయి. సంక్రాంతి వచ్చిందంటే, అక్కడ పండగ కోడి పందెమే. ఎవరూ ఊహించని విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జరగడం అక్కడి ప్రత్యేకత. గతంలో హెలిప్యాడ్లు నిర్మించి మరీ కోడి పందేల్లో పాల్గొనేందుకు వచ్చేవారికి ఆహ్వానం పలికేవారు. 

హైద్రాబాద్‌, ముంబై, చెన్నయ్‌, బెంగళూరు.. ఇలా దేశంలోని ప్రధాన నగరాలకి మాత్రమే పరిమితమయ్యే అతి ఖరీదైన కార్లు, సంక్రాంతికి పండుగ సమయంలో ఉభయ గోదావరి జిల్లాలకు పరుగులు పెడ్తాయి. వందలు, వేలు కాదు.. లక్షలు, కోట్లల్లో కోడి పందేలు నడవడం ఉభయ గోదావరి జిల్లాల ప్రత్యేకతగా భావించాలేమో. ప్రతి యేటా వందల కోట్లు చేతులు మారుతుంటాయిక్కడ. కోట్లు అంటే మాటలేమీ కాదు, కానీ ఇక్కడ మాత్రం చాలా చిన్న విషయం. వందల కోట్లో, వేలకోట్లో.. చేతులు మారిపోవడం అయితే కామన్‌. 

క్రమక్రమంగా ఈ కోడి పందేలు ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకూ, అటు ఉత్తరాంధ్రకూ, ఇటు రాయలసీమకీ పాకేశాయి. తెలంగాణలోనూ అక్కడక్కడా కోడి పందేల నిర్వహణ జరుగుతోంది. అయితే, అంతా అనధికారికమే. అధికారికంగా ఎలాంటి అనుమతులూ లేవు. కానీ, కోడి పందాలు ప్రజా ప్రతినిథుల కనుసన్నల్లో జరుగుతుంటాయి. కోడి పందేల్ని అడ్డుకోవాల్సిన పోలీసులు, చోద్యం చూస్తుంటారంతే. కొన్ని సందర్భాల్లో అక్కడ గలాటా జరగకుండా కాపలా కాస్తూ పోలీసులు వివాదాలెదుర్కొన్న సందర్భాలున్నాయి. 

'అబ్బే, నేను కోడి పందాల్ని ప్రోత్సహించను. ఎక్కడా కోడి పందాలు జరగకుండా చూడాలి. పార్టీ నేతలెవరూ అటు వైపుకు వెళ్ళొద్దు..' అని మొన్నీమధ్యనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తెగేసి చెప్పారు. ఇంతలోనే హైకోర్టు, కోడి పందేలాపై నిషేధం విధించింది. అవి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక్కడిదాకా బాగానే వుందిగానీ, ఈ సంక్రాంతికి ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జరగకుండా వుంటాయా.? ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో, భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ల మీద ప్రత్యక్ష ప్రసారాలతో వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది రూపాయల బెట్టింగ్‌ జరిగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సారి పండగ ఉస్సూరు మన్పిస్తుందా.? ఛాన్సే లేదు. 

'మా నియోజకవర్గంలో కోడి పందాలు జరగడంలేదంటే, అది మనకెంత అవమానం.?' అనుకునే ప్రజా ప్రతినిథులు ఉభయ గోదావరి జిల్లాల్లో కోకొల్లలు. రాజులు పోయాయి, రాజ్యాలూ పోయాయి.. కానీ, 'రాజుగారు' మాత్రం, ఇంకా 'కోడి పందాల నిర్వహణ కోసమే వున్నదంతా ఊడ్చేస్తున్న జాడలు' కన్పిస్తాయి. అదీ కోడి పందేలకున్న క్రేజ్‌. 

గత ఏడాదీ కోడి పందాలు జరిగాయి.. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వాటిని తిలకించారు, పాల్గొన్నాగానీ.. జస్ట్‌ అలా వెళ్ళామంతేనని బుకాయించేశారు. అలాంటోళ్ళపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారా.? లేదే.! 

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, రాజకీయ ఐక్యత కోడి పందేల నిర్వహణలో స్పష్టంగా కన్పిస్తుంటుంది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలూ కలిసికట్టుగా ఈ కోడి పందేల్ని నిర్వహిస్తుంటారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవిక్కడ. ఈ ఐక్యత, జనాన్ని ఉద్ధరించడంలో మాత్రం వుండదనుకోండి.. అది వేరే విషయం. ఏదిఏమైనా, ఇప్పటికే పందెం కోళ్ళ మీద వేలు, లక్షలు పెట్టుబడులు పెట్టేసిన సోకాల్డ్‌ నిర్వాహకులు కోర్టు తీర్పుతో కాస్త షాక్‌కి గురయ్యారు. అయినాసరే, రాజకీయ అండదండలుంటాయనే భరోసా వారిలో వుందనుకోండి.. అది వేరే విషయం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?