Advertisement

Advertisement


Home > Articles - Special Articles

కెవిః మనం పెట్టవలసిన షరతులు

కెవిః మనం పెట్టవలసిన షరతులు

పెట్టుబడులు రావాలంటే పరిశోధనపై మనం దృష్టి పెట్టాలనే విషయంపై చర్చించుకుంటున్నాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) యిటీవల కాలంలో పుంజుకున్నాయని సంతోషిస్తున్నాం. కానీ పరిశోధనా రంగానికి మాత్రం వచ్చేవైతే తగ్గిపోతున్నాయి. 2015౼ 16లో 23.50 కోట్ల డాలర్లు వస్తే, 2016-17 నాటికి అది 8.40 కోట్ల డాలర్లయింది. 2017-18 నాటికి 10.70 కోట్లకు పెరిగి, మళ్లీ 2018-19 నాటికి 8.10 కోట్లకు పడిపోయింది. అంటే ఆ పెట్టుబడులన్నీ స్టాక్ మార్కెట్లకు, కన్స్యూమర్ గూడ్స్ వంటి రంగాలకి పోతున్నాయన్నమాట.

పరిశోధనల ప్రామాణితకు గీటురాయి పేటెంట్లు. మనం ఎన్ని పేటెంట్లకు అప్లయి చేశామన్నదానిపై మన కొత్తగా ఏం కనుక్కున్నామన్నది తెలుస్తుంది. 2018లో ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల పేటెంట్లు ఫైల్ అయ్యాయి. వీటిలో సగానికి పైగా చైనా చేసింది. అదీ వారు పరిశోధనకు యిచ్చే ప్రాధాన్యం! 2019లో భారతదేశం నుంచి ఫైల్ అయినవి 25,715 మాత్రమే. కానీ శాంక్షన్ అయినవి 15వేల దరిదాపుల్లోనే ఉన్నాయి.  వీటిలో కళలకు సంబంధించిన వాటితో సహా అన్ని రకాలూ వుంటాయి. ఎక్కువమంది ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు ఫైల్ చేసినవే. ప్రభుత్వ సంస్థలైన సిఎస్‌ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్), ఐఐఎస్‌సి (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్), ఐఐటి వంటివన్నీ కలిసి ఫైల్ చేసినవి 128 మాత్రమే. ఇక యూనివర్శిటీల నుంచి ఫైల్ అయినవి 1227.

సంఖ్యరీత్యా రిసెర్చి సంస్థల నిర్వహణ చూడబోతే 2018లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో 9% ఉంటే, స్టేట్ సెక్టార్‌లో 15%, యూనివర్శిటీలలో 10%, పబ్లిక్ సెక్టార్‌లో 3%, ప్రయివేటు సెక్టార్‌లో 63% ఉన్నాయి. పరిశోధనల సందర్భంగా యూనివర్శిటీల గురించి మాట్లాడుకోవలసినది ఎంతో వుంది. ఇతర దేశాలలో ప్రయోగాలన్నీ యూనివర్శిటీ లాబ్స్‌లో జరిగి ఆ పరిశోధనా ఫలితాలను పరిశ్రమలకు అందిస్తాయి. పరిశ్రమలు వాటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి, వాటిని వాణిజ్యపరంగా సామాన్యుడికి అందించగలమో లేదో పరీక్షిస్తాయి.

అందుకే యుకె, ఇటలీలలో 24% పరిశోధనలు యూనివర్శిటీలలోనే జరుగుతాయి. ఫ్రాన్స్‌లో యిది 21%, జర్మనీలో 17% కాగా యుఎస్‌ఏలో 13%. మన దేశానికి వస్తే అది కేవలం 7 శాతం. ఒఇసిడి (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్)లో 35 దేశాలున్నాయి. వాటిలో దేశంలో జరిగే పరిశోధనల్లో 15-35% యూనివర్శిటీల నుంచే వస్తోంది. బేసిక్ రిసెర్చి విషయంలో యిది 60 శాతం దాకా వుంటోంది.

ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం యూనివర్శిటీలపై శీతకన్ను వేయడం మానాలి. 1950, 60లలో పరిశోధనల విషయంలో భారతదేశంలో యూనివర్శిటీలకు చాలా ప్రాముఖ్యత వుండేది. కానీ పోనుపోను తగ్గుతూ వచ్చింది. అసలు యూనివర్శిటీల నిర్వహణే సరిగ్గా వుండటం లేదు. చాలా యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్‌లే లేరు, నిధులు లేవు, వసతులు లేవు, బోధనాసిబ్బంది లేరు, మౌలిక వసతులూ లేవు. కానీ విదేశాల పరిస్థితి వేరు.

మన దేశానికి వస్తే యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ 2005 నాటి నివేదిక ప్రకారం 120 యూనివర్శిటీల్లో కేవలం 20 మాత్రమే జాతీయ స్థాయిలో మూడు ప్రతిష్ఠాత్మక సైన్స్ ఎకాడమీలకు (ఇండియన్ సైన్స్ ఎకాడమీ, ఇండియన్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్, నేషనల్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్) తమ ‘ఫెలో’లను పంపగలిగాయి. తమ యూనివర్శిటీలలో పరిశోధనలు పూర్తి చేశాక, మరింత ఉన్నత స్థాయి పరిశోధనకై ఎకాడమీలకు వెళ్లేవారిని ‘ఫెలో’ అంటారు. ఒక అంచనా ప్రకారం భారతదేశంలో 10 లక్షల జనాభాకు 150 మంది పరిశోధకులు ఉన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే యిది చాలా తక్కువ.

ఈ పరిస్థితుల్లో ఆర్ అండ్ డిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఎంతో చేయాలి. గతంలో దానిపై పెట్టిన ఖర్చుకి ఇన్‌కమ్‌టాక్స్‌ రాయితీలు భారీగా యిచ్చేవారు. వాటిని క్రమేపీ తగ్గిస్తూ వచ్చి, యిప్పుడు సాంతం తీసేశారు. అవి మళ్లీ పునరుద్ధరించాలి. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్) వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు గ్రాంట్లు యిప్పించాలి.

ఇక్కడొక మాట చెప్పాలి – ఇలాటి కౌన్సిళ్లకు ఐఎంఎఫ్ కూడా నిధులిస్తుంది. కానీ వాటిలో చాలా భాగం ప్రభుత్వ రిసెర్చి సంస్థలకు మళ్లించడం జరుగుతోంది. అవి ఆ నిధులను తమ సిబ్బంది జీతభత్యాలకు వెచ్చిస్తున్నాయి. పరిశ్రమ పెట్టినపుడు బ్యాంకులు రెండు, మూడేళ్లు మాత్రమే మారటోరియం యిస్తాయి. ఆ లోపున అవి తమ కాళ్ల మీద తాము నిలబడి అప్పు తీర్చే సామర్థ్యం సంతరించుకుంటాయని బ్యాంకుల అంచనా. ఈ పరిశోధనా సంస్థలు కూడా ఏర్పరచిన ఐదేళ్లలోగా పరిశోధనలు పూర్తి చేసి, పేటెంట్లు అమ్మి, స్వయంపోషక స్థితికి రావాలి. స్థాపించి 30 ఏళ్లయినా ప్రభుత్వం నిధుల కోసం ఎదురు చూడడం సమర్థనీయం కాదు.

కొత్తగా పరిశోధనలు మొదలుపెట్టిన ప్రభుత్వ రిసెర్చి సంస్థలకు, యూనివర్శిటీలకు ప్రభుత్వం ప్రత్యేకనిధులు సమకూర్చి అనేక నూతన రంగాల్లో పరిశోధనలు చేయించాలి. వాటికి, పరిశ్రమలకు అనుసంధానం కుదిర్చే వ్యవస్థ ఏర్పరచాలి. లేకపోతే ఆ శ్రమంతా వ్యర్థమౌతుంది.

ఈ విధంగా పరిశోధనల బలంతో మన పరిశ్రమలు పుంజుకుంటే మనం ఎగుమతి చేసే స్థాయికి వస్తాం. అప్పుడే మన దేశపు బాలన్స్ ఆఫ్ ట్రేడ్ (ఎగుమతులు-దిగుమతుల మధ్య తూకం) సరిగా వుంటుంది. ఎగుమతులు వుంటేనే మన పరిశ్రమలు నిలదొక్కుకుంటాయి. ఉత్పాదనలను అందుబాటు ధరల్లో సామాన్యులకు అందించాలంటే దేశీయ మార్కెట్ చాలదు. చౌకగా లభించే దిగుమతి సరుకులతో పోటీ పడలేవు. ఇవన్నీ జరగనిదే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో మనం చైనాతో పోటీ పడతామని ఆశించడం పగటికలలతో సమానం. ఉదాహరణకి ఫార్మా రంగమే తీసుకుందాం.

దేశంలో 4 కోట్లమంది ఫార్మా రంగంలో పనిచేస్తున్నారు. పరిమాణ (వాల్యూమ్) పరంగా ఔషధాల ఉత్పత్తిలో మనం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాం. 200 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ప్రపంచానికి కావలసిన వాక్సిన్లలో 50% మనమే సరఫరా చేస్తున్నాం. అమెరికాలో లభ్యమయ్యే జనరిక్ డ్రగ్స్‌లో 40%, యుకెలో లభ్యమయ్యే జనరిక్ డ్రగ్స్‌లో 25% మన దేశమే అందిస్తోంది. 2019లో 1914 కోట్ల డాలర్ల విలువైన ఆరోగ్య సంబంధిత (బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియేట్స్, డ్రగ్ ఫార్ములేషన్స్, బయోలాజికల్స్, మూలికా ఔషధాలు, సర్జికల్స్) ఎగుమతులు చేశాం. తెలంగాణలో 800 ఫార్మా, బయోటెక్, ఆరోగ్య సంబంధిత పరిశ్రమలున్నాయి. అంటే మన దేశానికి, రాష్ట్రానికి ఫార్మా రంగం ఎంత ముఖ్యమైనదో అర్థమౌతోందిగా.

మరి అలాటి రంగం ఫార్ములేషన్స్‌కై ఎపిఐ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్) దిగుమతులపై విపరీతంగా ఆధారపడుతోంది. వాటి విలువ 350 కోట్ల డాలర్లు. దీనిలో 70% దిగుమతులు చైనా నుంచే వస్తున్నాయి. మనం పోటీదారుగా ఎదుగుతామంటే చైనా ఏం చేస్తుందో చూడాలి. హైదరాబాదులోని ఒక సంస్థ సల్ఫా మైథాక్సోజాల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రథమస్థానం పొందింది. కానీ దాని ముడిసరుకంతా చైనా నుంచే వస్తుంది. ఒక నెల పాటు సరఫరా ఆగిపోయేసరికి కంపెనీ విలవిల లాడిపోయింది.

దీపావళి బాణసంచాయే కాదు, మనం హెవీ మిషనరీ కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన దిగుమతుల్లో 18% చైనా నుంచే. వాటికి విఘాతం కలిగితే మనం చాలా యిబ్బంది పడతాం. అందువలన మనం దిగుమతులపై ఆధారపడనక్కరలేని స్వయంసమృద్ధి సమకూర్చుకోవాలి. దాని విషయంలో నినాదాల కంటె స్పష్టత ముఖ్యం.

బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దినెలలకే 2014 సెప్టెంబరులోనే ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్యక్రమమైతే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ జరిగి వుండేది. మన సంస్థలకు పెట్టుబడిలో, లాభాల్లో, పేటెంటులో వాటా వుండి వుండేది. మనవాళ్లకు అన్ని రకాల అనుభవమూ వచ్చి వుండేది. చైనా అలాటి షరతులపైనే విదేశీ పెట్టుబడులు స్వీకరించింది.

అయితే మేకిన్.. లో యిబ్బంది ఏమిటంటే అంతా విదేశీయే. పనివాళ్లు, స్థానిక వసతులు మాత్రం మనవి. భూమి, నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడం వలన మనకు వచ్చే లాభం ఏమిటిరా అంటే కొన్ని ఉద్యోగాలు. ఆటోమేషన్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన యీ రోజుల్లో ఉద్యోగుల సంఖ్య బహుతక్కువగా వుంటోంది. వాళ్లకు కూడా స్క్రూ డ్రైవర్ ఉపయోగించి అసెంబుల్ చేయడం తప్ప మరేమీ రావటం లేదు. కొన్ని సందర్భాల్లో స్క్రూ డ్రైవర్ అవసరం కూడా లేకుండా రెండు డిప్పలు గట్టిగా ఒత్తితే సరిపోతోంది. ఆ విధంగా ఆ పథకం విఫలమైందనే చెప్పాలి.

ఇప్పుడు కరోనానంతర పరిస్థితిలో వెయ్యి విదేశీ కంపెనీల దాకా భారత్ వైపు చూస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంతో, అతిశయోక్తి ఎంతో తెలియదు. ఎన్ని వచ్చినా మనం గుర్తు పెట్టుకోవలసినది– వాటిల్లో 100% ఎఫ్‌డిఐలు అనుమతించకూడదు. 50%కి లోపే అనుమతించి, యాజమాన్యం భారతీయుల చేతుల్లోనే వుండేట్లు చూడాలి. టెక్నాలజీని మనకు అప్పగించాలని, శాస్త్ర, సాంకేతిక విభాగాల్లో కీలకమైన పదవులలో మనవారిని నియమించాలని, ఆర్ అండ్ డి చేసి తీరాలని, దానిపై మనకు పేటెంటులో భాగం యిచ్చి తీరాలని, ఉత్పాదనలో సగాన్ని పెట్టుబడి పెట్టిన కంపెనీ స్వదేశానికి ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాలని.. యిలాటి షరతులు విధించాలి.

ఇవేమీ అన్యాయమైన షరతులు కావు. అమెరికా, యూరోప్ యిప్పుడు స్వీయరక్షణకై తమ చట్టాలు మార్చేసి, చైనా పెట్టుబడులకు అడ్డంకులు కల్పిస్తున్నాయి. పైన వివరించినట్లు మన దేశంలో పరిశోధనా విభాగంలో చాలా వెనకబడి వుంది. ఇప్పటికిప్పుడు మనం భారీ పెట్టుబడులు పెట్టలేము, నిపుణులను తయారుచేసుకోలేము. అందువలన విదేశీ పెట్టుబడిదారులకు మన అవసరం వున్నపుడే యిక్కడా ఆర్ అండ్ డి చేసి తీరాలని, మేధోహక్కులు (ఐపిఆర్- ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) లో వాటా యివ్వాలని, మనం పట్టుబట్టి సాధించగలం. అవేమీ లేకుండా తలుపులు బార్లా తెరిచి, చీప్ లేబరు యిస్తాం, గుప్పెడు ఉద్యోగాలు మా మొహాన పడేసి మీ యిష్టమొచ్చినట్లు చేసుకోండి అంటే మాత్రం మన దేశ వనరులను దోపిడీ చేసే దొంగలను పిలిచి నెత్తి కెక్కించుకున్నట్లే.

ఇంకొక్క మాట – కేంద్రం ఎన్ని పథకాలు రూపొందించినా అమలు చేయవలసినది రాష్ట్రాలు మాత్రమే. పరిశ్రమలు నెలకొల్పితే తమ రాష్ట్రప్రజలకు ఉద్యోగాలు వచ్చేస్తాయన్న ఆశ వారికి పెద్దగా వుండటం లేదు. ఎందుకంటే నైపుణ్యతతో కూడిన ఉద్యోగాలలో యిలాటి నిబంధనలు పెడితే ఎవరూ ముందుకు రారు. రాష్ట్రాలకు కావలసినది ఆదాయం కూడా. గతంలో ఉత్పత్తి జరిగిన రాష్ట్రాలకు పన్ను వచ్చేది. జిఎస్‌టి వచ్చాక వస్తు వినియోగం అయిన రాష్ట్రాలకు పన్ను ఆదాయం వస్తోంది. పారిశ్రామిక ఉత్పాదనను ప్రోత్సహించిన రాష్ట్రాలకు ప్రత్యేక లాభమేమీ వుండటం లేదు. అదీ మారాలి. (సమాప్తం)

కె.ఐ. వరప్రసాద్ రెడ్డి
వ్యవస్థాపక చైర్మన్, శాంతా బయోటెక్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?