cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

మాకిదేం ఖర్మరా బాబూ!

మాకిదేం ఖర్మరా బాబూ!

ఇది ఓ కమ్మ జాతీయుడి ఆవేదన

కోణంలో చూసినా తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో కమ్మ సామాజిక వర్గం ప్రశాంతంగా ఉన్నది. కానీ చంద్రబాబు విద్వేష రాజకీయాలే మావారిని ఇబ్బంది పెడుతున్నాయి. పోయాడనుకున్నవాడు పూర్తిగా హైదరాబాద్‌ వదిలిపోతే పీడా పోయేది. కానీ మళ్ళీ లేచి చిచ్చు పెట్టడమేమిటో అర్థం కావడం లేదు. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రలో చంద్రబాబు నాయుడిని ఇప్పటికే బట్టలు విప్పి నిలబెట్టినట్టయింది. రెండు రాష్ర్టాలలో టీడీపీ దుకాణం బంద్‌ అయిన తరువాత బాబుకు ఊపిరి ఆడటం లేదు.  

విభజన రాజకీయాలు చేసే చంద్రబాబుకు విద్వేష రాజకీయాలు నడిపే బీజేపీ తోడుగా మారింది. బాబు తనకు అత్యంత ఆప్తుడయిన సీఎం రమేశ్‌ను ఇప్పటికే బీజేపీలోకి పంపించాడు. చంద్రబాబు ఆత్మగా చెప్పుకునే గరికపాటి మోహన్‌రావుతో సహా అనేక మందికి బీజేపీ తీర్థం ఇప్పించారు. పైకి జెండాలు వేరే కనిపిస్తున్నా, లోపలి రాజకీయం ఒక్కటే. పరిస్థితులు ప్రశాంతంగా ఉంటే పాపం బాబుగారికి నిద్రపట్టదు. 

ఎప్పుడూ కులాల పేర అగ్నిగుండం రాజేస్తూ ఉండాలి. అందుకని జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ముసుగులో మళ్ళీ కుల రాజకీయాలు నడపడానికి తెగించారు. బీజేపీతో లాలూచీ పడి అస్తిత్వం నిలుపుకోవచ్చుననేది ఆయన ఆశ. కమ్మ కులస్థుల ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడవద్దని, బీజేపీకి వేయాలని ఆయన సూచిస్తున్నాడు. అమరావతిలో ఉద్ధరించింది చాలక ఇప్పుడు హైదరాబాద్‌లో వేలు పెడుతున్నారు. 

చంద్రబాబు ఖర్మ ఆయనే అనుభవిస్తారనుకుంటే ఏ బాధా లేదు. కానీ  గతంలో ఆయన మూలంగా మొత్తం కమ్మ సామాజిక వర్గం శిక్ష అనుభవించింది. అనుభవిస్తోంది. ఏ కులస్థులైనా ప్రశాంత పరిస్థితుల్లో వ్యాపారం చేసుకోవాలనుకుంటారు. సామాజిక సామరస్యాన్ని కోరుకుంటారు. 
ఒకప్పుడు వ్యవసాయవర్గంగా ఉండి, ఇప్పుడు వ్యాపారకౌశలం పెంచుకున్న మేము సామాజిక శాంతి కోరుకోవడం సహజం. కానీ టీడీపీలో చొరబడి బ్యాక్‌సీట్‌ డ్రైవింగ్‌ చేసినప్పుడైనా, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తరువాత కాలంలోనైనా, చంద్రబాబు నడిపిన కులగజ్జి రాజకీయం మూలంగా మాకు, మా కులానికి ఎదురైన ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. 

తెలంగాణలోనూ కులాల మధ్య, ఉపకులాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి చంద్రబాబు చేసిన నీచ రాజకీయాలకు చరిత్రే సాక్షి. తెలంగాణ ఉద్యమం నడిచినన్ని రోజులు రెండు ప్రాంతాల ప్రజల మధ్య ద్వేష భావనను సృష్టించడానికి చంద్రబాబు వేయని ఎత్తుగడలు లేవు. కానీ ఇరు ప్రాంతాల ప్రజలు ఈ దుష్టపన్నాగాలకు చిక్కలేదు. ఉద్యమం ఎంత ఉధృతంగా సాగుతున్నా మేం ఏనాడూ భద్రతారాహిత్యానికి గురికాలేదు. 

వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ఊపందుకున్నది. వ్యాపారాభివృద్ధి క్రమంలో మేం ఎప్పుడూ కుల రాజకీయాలను ఆసరాగా చేసుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మా వ్యాపారం మాది. ఎన్టీఆర్‌ వంటి మహానాయకుడు కులాలకు అతీతంగా అభివృద్ధిని వాంఛిస్తే, చంద్రబాబు మాత్రం స్వార్థంతో అంతా నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఆంధ్రావారికి ఇబ్బంది లేదని ఉద్యమకాలంలోనే కేసీఆర్‌ ఇచ్చిన ప్రకటన మాకెంతో ధైర్యాన్నిచ్చింది. ఆంధ్రావారు పరిశ్రమలు పెడతామంటే రెడ్‌ కార్పెట్‌ వేసి ఆహ్వానిస్తామని కూడా కేసీఆర్‌ ఆనాడు చేసిన వ్యాఖ్యను ఎవరూ మరిచిపోలేరు. ఇప్పుడు తెలంగాణలో సీమాంధ్రులకు ఏ ఇబ్బందీ లేదు. 

అందరి సమ్మతి లేకుండా, ఒంటెత్తు పోకడలతో, అస్మదీయుల ప్రయోజనాల కోసం ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించడం ద్వారా చంద్రబాబు ఆంధ్రా భవిష్యత్తు మొత్తాన్నీ అంధకార బంధురం చేశారు. ఆయన మాటలు నమ్మి, ఎదో బావుకుందామని అక్కడ భూములుకొన్న నాలాంటి సామాన్యులు అనేకమంది తమ కష్టార్జితం మొత్తాన్నీ కోల్పోయారు. ఐదేళ్ల పరిపాలనలో పచ్చపత్రికల్లో గ్రాఫిక్‌లు తప్ప నేలమీద నిర్మాణమేదీ జరగని అమరావతి చంద్రబాబు పనితనానికి ప్రతీక.  అందుకే గత ఎన్నికల్లో సీమాంధ్ర ప్రజలు చంద్రబాబుకు కర్రుగాల్చి వాతపెట్టారు. 

లాభానికో నష్టానికో ఉన్నదమ్ముకొని, హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేటో.. మరో వ్యాపారమో పెట్టుకొని బతుకొచ్చని అనేక మంది హైదరాబాద్‌ తరలివచ్చారు. ఈ తరుణంలో అక్కడ బిచాణా ఎత్తేసిన చంద్రబాబు మళ్లీ హైదరాబాద్‌కొచ్చి కుల రాజకీయం మొదలు పెట్టాడు. తెలంగాణలో మేం ఎంతో గౌరవంగా బతుకుతున్నాం. 

బీజేపీ మద్దతుతోనే కదా అమరావతి ఎటూకాకుండా పోయింది! మళ్ళీ హైదరాబాద్‌లో ఏమి ఊడబొడుస్తుందని చంద్రబాబు ఆ పార్టీతో చేతులు కలుపుతున్నట్టు? ఎందుకు లోపాయకారీగా బీజేపీకి మద్దతు పలుకుతున్నట్టు? బీజేపీతో అపవిత్ర పొత్తు వల్ల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశానికి పదో పరకో ఓట్లు రావచ్చేమోగానీ, సీట్లు మాత్రం రావు. ఇది గ్యారెంటీ! ఈ మాత్రం దానికి ఆయన పోటీ చేయడం ఎందుకూ? మమ్మల్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టడమెందుకు? 

చంద్రబాబు కుళ్ళు రాజకీయం మూలంగానే ఆంధ్రాలో కులాల మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. అది మాకు పెనుశాపమైంది. ఆ దుర్భర పరిస్థితులను ఎదుర్కొని, మళ్ళీ సామరస్యం సాధించడానికి మేము ఎంతో ఓర్పుతో, నేర్పుతో వ్యవహరించవలసి వస్తోంది. ఇప్పుడు తెలంగాణలోనూ కమ్మకులస్థులను కాస్త ప్రశాంతంగా బతకనివ్వరా? ఆర్కేలాంటి తప్పుడు సలహాదారుల చెప్పుడుమాటలు విని చంద్రబాబు రాజకీయం చేస్తే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే! కమ్మ కులాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తెలంగాణ అనే మాటే వినిపించొద్దని ఆదేశించి.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ‘బెర్లిన్‌ గోడ’ కూల్చివేత గురించి మాట్లాడిన  చంద్రబాబు పేరు వింటేనే తెలంగాణ వాసులకు కంపరం. నా తెలంగాణ మిత్రులతో మాట్లాడినప్పుడు చంద్రబాబు అంటే వారికి ఎంత ఏహ్యభావమో నాకు అర్థమవుతుంది. కేవలం ఆయన మా కులంలో పుట్టిన పాపానికి మేమూ ఆ భారాన్ని మోయాల్సి వస్తోంది. 

ఆరేండ్లపాటు కేసీఆర్‌ పాలనను చూసిన తరువాత మా కమ్మ సామాజికవర్గానికి పూర్తి భరోసా ఏర్పడింది. కేసీఆర్‌ వ్యక్తిత్వం తెలుసు కనుక ఆయన మాటలు మాకు నమ్మకం కలిగించాయి. కానీ ఇంత మనదైన భావన ఉంటుందని అనుకోలేదు. తెలంగాణలో కమ్మవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అయిదుగురు ఉన్నారు. ఒక విప్‌, ఒక మంత్రి ఉన్నారు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు కూడా మా కులానికి చెందినవారే. హైదరాబాద్‌ నగరంలో మా సామాజిక వర్గానికి చెందిన ఎందరో కార్పొరేటర్లు ఉన్నారు. టీఆర్‌ఎస్‌లోనూ కీలక పదవులు నిర్వహిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్ర వాంఛ నెరవేరింది. ప్రజలు కోరుకుంటున్నట్టు స్వపరిపాలన సాగుతున్నది. ఇక ఆంధ్రా తెలంగాణ అనే ప్రాంతీయ భావనకు తావెక్కడిది? తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ, రాష్ర్టావతరణ తరువాత కానీ- తెలంగాణకు సంబంధించి చంద్రబాబుకు, కమ్మ సామాజికవర్గానికి ఉమ్మడి ప్రయోజనాలు లేవు, ఆలోచనలలో ఏకాభిప్రాయం లేదు. రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా ఏ గొడవా లేకుండా సామరస్యంగా ఉండాలనేది కమ్మ సామాజికవర్గం ఆలోచన. కానీ చంద్రబాబు విధానం వేరు.  

మోదీతో కలిసి ఏడు మండలాలను తీసేసుకున్నప్పుడే తెలంగాణలో మాకు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందో అని భయపడ్డాం. కానీ కేసీఆర్‌ మంచితనం వల్ల అలాంటిదేమీ జరగలేదు. పోలవరం ప్రాజెక్టులో ఎలాగూ మునిగిపోయే మండలాలను లాగేసుకోవడం ఎందుకో అర్థం కాదు.

అందులో భాగంగా సీలేరు ప్రాజెక్టును కూడా తెలంగాణకు లేకుండా చేశాడు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయాలి. కానీ తెలంగాణలో పొలాలు ఎండిపోతున్నా సరే, నీళ్ళందకుండా (మిగులు విద్యుత్‌ ఉన్నప్పటికీ) కరెంటు సరఫరా నిలిపివేశారు. 

తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలు పన్నారు. ఏపీ అభివృద్ధికి పాటుపడితే ఎంతో సంతోషించేవారం. కానీ తెలంగాణను ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. చంద్రబాబు విధానాలను కమ్మ సామాజికవర్గం వారు ఆమోదించలేదు. తెలంగాణ వచ్చి ఆరేండ్లయిన తరువాత కూడా, రెండు రాష్ర్టాల ప్రజలు తగిన శాస్తి చేసిన తరువాత కూడా, బాబులో మార్పు రాలేదు.  

చంద్రబాబు విశ్వసించదగిన నాయకుడు కాదనేది ఇరు రాష్ర్టాల వారికి ఇప్పటికే అర్థమైపోయింది. బాబు రాజకీయ జీవితం ముగింపునకు వచ్చింది. వయసు డెబ్బయి ఏండ్లు దాటింది. జ్ఞాపకశక్తి సరిగా లేదని ఆయన  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు అనేవారు. 

కొందరు అధికారులను పిలిపించి, వచ్చిన తరువాత ఎందుకొచ్చావని అడిగేవారట! ఇప్పుడు ఆ అధికారమూ ఊడింది. ఏబాదర బందీ లేదు. ఇంకా దుష్ట రాజకీయాలు నడిపి బావుకునేదేముంది? ఈ వయసులో కూడా చంద్రబాబు బుద్ధి మారకపోవడమే ఆశ్చర్యకరం. ఎప్పుడు ఎక్కడ కెలుకుదామా అనే వికృతబుద్ధులే తప్ప సవ్యమైన ఆలోచనలు ఆయనకు రావడం లేదు. 

చంద్రబాబు కోరుకుంటున్నట్టు హైదరాబాద్‌లో విభజన రాజకీయాలు రేగితే లాభపడేది ఎవరు? ప్రశాంతంగా ఉంటేనే పరిశ్రమలు పెట్టుకోగలం, నడుపుకోగలం. ఇప్పుడు దేశంలో వ్యాపారులకు, పారిశ్రామికులకు, రియల్‌ ఎస్టేట్‌ వారికి అంతో ఇంతో అనుకూలంగా ఉన్న నగరం, ప్రభుత్వ సహకారం లభిస్తున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్‌ మాత్రమే. హైదరాబాద్‌ నగరం ఉత్తర దక్షిణ ప్రాంతాలకు కూడలి. ఇక్కడ అన్ని భాషల వారు ఉంటారు. ఆంధ్రావారూ ఇప్పుడిప్పుడే  హైదరాబాదీలుగా మారుతున్నారు. ఇతర ప్రజలతో కలిసిమెలిసి ఉంటున్నారు. 

సీమాంధ్ర వ్యాపారులు, ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంతో  సత్సంబంధాలు కొనసాగిస్తూ తమ పనితాము చేసుకుంటున్నారు. ఈ తరుణంలో మళ్లీ ఆంధ్రా ఓటు పేరుతో, కమ్మ కులం ముసుగుతో వచ్చి ప్రజలను వేరు పరిచేందుకు, గీతలు గీసేందుకు చంద్రబాబు ప్రయత్నించడం విభజన రాజకీయం కాదా! ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, మనుగడ కోసం  తమ మానాన తాముగా బతుకుతున్న ఆంధ్రుల భవిష్యత్తును పణంగా పెడతారా? వారి జీవితాలను సుడిగుండంలోకి నెడతారా? 

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, పదేండ్ల ఉమ్మడి రాజధానిని పణంగా పెట్టి, హైదరాబాద్‌లోని సీమాంధ్రులను, తన కులస్థులను గాలికొదిలేసి విజయవాడకు పారిపోయిన చంద్రబాబు మళ్లీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తున్నారు? ఆయనో.. ఆయన పరివారమో గతంలో  చేసిన ఏ భూదందానో రేపు బయటపడి, తెలంగాణ ప్రభుత్వానికి దొరికిపోయి, మరోసారి పలాయనం చిత్తగించాల్సివస్తే మన పరిస్థితి ఏమిటి? మనం ఎదుర్కొనే అవమానాల సంగతి ఏమిటి? .

ఇది ప్రతి సీమాంధ్రుడూ, కమ్మ కులస్థుడూ మనసు పెట్టి ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎన్నికలు, సొంత ప్రయోజనాల కోసం మాత్రమే వచ్చే చంద్రబాబు లాంటి నాయకులు తమ అవసరం తీరగానే వెళ్లిపోతారు. ఇది గతంలో అనేకమార్లు నిరూపితమైన సత్యం. ఈ హైదరాబాద్‌ మనదనుకొని ఇక్కడే మన భవిష్యత్తు ఉందనుకుని, ఇక్కడే ఉండిపోయిన మనం మన గురించి ఆలోచించుకోవాల్సిన తరుణమిది.!! ,

-సూరపనేని ఉపేంద్ర బాబు

నిమ్మ‌గ‌డ్డ అఖ‌రి ఆశ...ఇక గ‌వ‌ర్న‌ర్ పైనే భారం

 


×