Advertisement

Advertisement


Home > Articles - Special Articles

వాళ్లను ఉరితీయడానికి ఉత్సాహం...!

వాళ్లను ఉరితీయడానికి ఉత్సాహం...!

హైదరాబాదుకు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశ అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారణ మొదలుపెట్టకముందే సీపీ సజ్జనార్‌ నేతృత్వంలో పోలీసులు నలుగురు నిందితులనూ (వారు ఇంకా దోషులుగా తేలలేదు) ఎన్‌కౌంటర్‌ చేసిపారేశారు. ఇది న్యాయవిరుద్ధం, చట్ట విరుద్ధం. ఈ ఎన్‌కౌంటర్‌కు రాజకీయ కారణాలూ ఉన్నాయనుకోండి. అది వేరే విషయం.

ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి కాబట్టి తరువాత కథ త్వరలోనే మొదలు కావొచ్చు. ఇక ఉరిశిక్ష పడాల్సినవారు ఢిల్లీ నిర్భయ కేసులో దోషులు. వాస్తవానికి వీరు ఆరుగురు. కాని ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు నేరం జరిగిన సమయానికి మైనర్‌ కావడంతో జువైనల్‌ హోంలో మూడేళ్లు ఉండి వెళ్లిపోయాడు.

ఇక మిగిలింది నలుగురు. వీరిలో వినయ్‌ శర్మ అనేవాడు క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోగా (తాను పెట్టలేదని చెప్పినట్లు వార్త వచ్చింది) రాష్ట్రపతి తిరస్కరించారు. త్వరలోనే శిక్ష అమలు జరుగుతుందని అనుకుంటున్నారు. నిర్భయ దోషులను ఉరి తీస్తామంటూ ఇద్దరు ముందుకు వచ్చారు. వారిలో ఒకాయన హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు చెందిన రవి కుమార్‌.

మరొకాయన తమిళనాడుకు చెందిన సుభాష్‌ శ్రీనివాసన్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌. హైదరాబాదులో జరిగిన దిశ ఘటన నేపథ్యంలో శిక్షను త్వరగా అమలు చేయడానికి కేంద్ర ప్రభత్వం చర్యలు తీసుకుంది.  దిశ ఘటనపై ప్రజల్లో ఎంతటి ఆగ్రహావేశాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయో చూశాం. 

పార్లమెంటు దద్దరిల్లిపోయింది. దిశను హత్య చేసినవారికి ఉరిశిక్షే విధించాలని సామాన్యులతోపాటు పార్లమెంటు సభ్యులు, పాలకులు, ప్రముఖులు కోరారు. ఈలోగా నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. 2012 నాటి నిర్భయ కేసులో దోషులకు ఇప్పటివరకు మరణశిక్ష అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. న్యాయ వ్యవస్థ మీదనే నమ్మకం పోతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వేగంగా కదులుతోంది. 

ఈ నేపథ్యంలో నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం తనకు ఇవ్వాలని హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు చెందిన రవి కుమార్‌ అనే తలారి ప్రభుత్వాన్ని కోరాడు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌కు ఈమధ్య లేఖ రాశాడు. మన దేశంలో అత్యంత అరుదైన కేసుల్లో, తీవ్రాతి తీవ్రమైన కేసుల్లో మాత్రమే దోషులకు మరణశిక్ష అమలు చేస్తారు.

ఎప్పుడో కొన్నేళ్లకు ఓసారి మరణశిక్ష అమలు జరుగుతుంది. కాబట్టి పర్మినెంటు తలారులు (ఉరి తీసేవారు) ఉండరు. అధికారులు వీరిని వెతికి పట్టుకురావల్సి ఉంటుంది. పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్‌గురును తీహార్‌ జైల్లో ఉరితీశారు. అక్కడ అమలు జరిగిన చివరి మరణ శిక్ష ఇదే. ఆ తరువాత నిర్భయ కేసు దోషుల మరణ శిక్షను అమలు చేయాల్సివుంది. కాబట్టి జైలు అధికారులు తలారిని వెతకాల్సివుంది. 

ఈ నేపథ్యంలో 'నేను ఉరితీస్తా' అంటూ రవి కుమార్‌ మందుకు వచ్చాడు. ఇదిలా ఉండగా, తమిళనాడుకు చెందిన సుభాష్‌ శ్రీనివాసన్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌ కూడా నిర్భయ దోషులను తాను ఉరి తీస్తానని తీహార్‌ జైలు అధికారులకు లేఖ రాశాడు. ఇతను రామనాథపురం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్నాడు.

'దోషులను త్వరగా శిక్షించడానికి వీలుగా నేను ఈ పని చేయడానికి సుముఖంగా ఉన్నాను' అని అతను లేఖలో పేర్కొన్నాడు. సుభాష్‌ శ్రీనివాసన్‌ పోలీసుగా పనిచేస్తూనే సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం, మానసిక రోగులకు సేవలు చేయడం ఇతని ప్రవృత్తి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన పలు అవార్డులు రివార్డులు అందుకున్నాడు. మరి వీరిద్దరిలో ఎవరికైనా అవకాశం ఇస్తారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?