Advertisement

Advertisement


Home > Articles - Special Articles

పవన్‌కళ్యాణ్‌ కేరాఫ్‌ ఏలూరు.!

పవన్‌కళ్యాణ్‌ కేరాఫ్‌ ఏలూరు.!

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ ఇకపై తన అడ్రస్‌ని మార్చేసుకోనున్నారు. హైద్రాబాద్‌ నుంచి తన అడ్రస్‌ని ఏలూరుకి మార్చేందుకు పవన్‌కళ్యాణ్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కారణమేంటో తెలుసా.? ఎన్నికలు. అవును, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి పోటీ చేసేందుకు పవన్‌కళ్యాణ్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన, తన ఓటు హక్కుని హైద్రాబాద్‌ నుంచి ఏలూరుకి మార్చుకోబోతున్నారట. 

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకి చెందిన జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్‌కళ్యాణ్‌ని కలిశారు. ఏలూరుకి ఓటు హక్కును మార్చుకోవాల్సిందిగా వారు పవన్‌కళ్యాణ్‌కి సూచించడంతో, ఏలూరులోనే తనకు అనుకూలమైన నివాసాన్ని వెతికి పెట్టాల్సిందిగా అభిమానులకు పవన్‌కళ్యాణ్‌ కోరాట. దాంతో, అభిమానులు ఫుల్‌ ఖుషీ అయిపోయారట. 

జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే క్రమంలో ముందుగా తన ఐడియాలజీని పవన్‌కళ్యాణ్‌, జనంలోకి తీసుకెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకున్న విషయం విదితమే. సోషల్‌ మీడియా ద్వారా జనసేన తరఫున కొంత హడావిడి జరుగుతోంది. అయితే, అది రాజకీయాల్లో జనసేన పార్టీకి ఎంతవరకు ఉపయోగపడ్తుంది.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

నవంబర్‌ రెండో వారంలో పవన్‌కళ్యాణ్‌, అనంతపురం జిల్లాలో ప్రత్యేక హోదా కోసం గళం విప్పనున్నారు. ఇప్పటికే తిరుపతి, కాకినాడల్లో ఈ మేరకు బహిరంగ సభలు నిర్వహించిన పవన్‌, అనంతపురం బహిరంగ సభలో, మరింతగా ప్రత్యేక హోదాపై తన స్వరాన్ని బలంగా విన్పిస్తారట. ఏం బలంగా విన్పిస్తారో ఏమో, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ని చదవడానికే టైమ్‌ సరిపోవడంలేదాయె.! 

మొన్నటికి మొన్న పశ్చిమగోదావరి జిల్లాలోని మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ బాధితులు పవన్‌కళ్యాణ్‌ని కలిస్తే, అప్పుడేదో చెప్పారు.. ఆ తర్వాత విషయం మర్చిపోయారు. ప్రత్యేక హోదా విషయంలోనూ పదే పదే అదే రిపీట్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో జనసేన.. అంటూ ఆ మధ్య చేసిన హంగామా కూడా ఆశించిన స్థాయిలో వేడిని కొనసాగించలేకపోతున్న విషయం విదితమే. 

మొత్తమ్మీద, ఏలూరుకి పవన్‌కళ్యాణ్‌ ఓటు హక్కు ఫిక్సవడం ద్వారా, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అందుబాటులో వుంటాననే సంకేతాలు పంపించగలుగుతారా.? ఈ చర్యలతోనే పవన్‌ తమకు దగ్గరవుతున్నాడని ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం నమ్ముతారా.? వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?