Advertisement

Advertisement


Home > Articles - Special Articles

పవన్‌కళ్యాణ్‌ నాలెడ్జ్‌ అంతే.!

పవన్‌కళ్యాణ్‌ నాలెడ్జ్‌ అంతే.!

మొన్నేమో దేశభక్తి గురించి, నేడేమో పెద్ద పాత నోట్ల రద్దు గురించి.. సినీ నటుడు, జనసేన అధినేత 'పవర్‌ స్టార్‌' పవన్‌కళ్యాణ్‌ సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. ఔట్‌ డేటెడ్‌ అంశాలైన 'రోహిత్‌ వేముల ఆత్మహత్య', 'గోవధ' వంటివాటిని లేవనెత్తడంలో, పవన్‌కళ్యాణ్‌కి రాజకీయాలపై వున్న ఆసక్తి, అవగాహన వంటివాటిపై స్పష్టత వచ్చేశాయి. 

ఇక, సినిమా థియేటర్లలో జాతీయ గీతం గురించీ పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలైతే, అస్సలేమాత్రం అవగాహన లేకుండా పవన్‌కళ్యాణ్‌ చేశారనే విషయం స్పష్టమవుతోంది. అది ప్రభుత్వ నిర్ణయం కాదు, సుప్రీంకోర్టు తీర్పు అన్న విషయాన్నీ పవన్‌కళ్యాణ్‌ గుర్తించలేని అపరిపక్వతను ప్రదర్శించారాయన. అదేదో, అలా అయిపోయిందనుకుంటే, ఇంకోసారి పవన్‌, రాజకీయాలపై తన అవగాహనాలేమిని చాటుకున్నారు పెద్ద పాత నోట్ల రద్దుపై కామెంట్‌ చేసి. 

నిజానికి పెద్ద పాత నోట్ల రద్దు నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏకపక్షంగా తీసుకున్నది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. సహచర మంత్రులకుగానీ, ఆఖరికి రిజర్వు బ్యాంకుకుగానీ మాటమాత్రమైనా చెప్పకుండా నరేంద్రమోడీ నిర్ణయం తీసుకుని వుండాలి. ఎందుకంటే, అటు రిజర్వు బ్యాంకుగానీ, ఇటు కేంద్ర ప్రభుత్వంగానీ పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత తలెత్తే పరిస్థితులపై ఏమాత్రం అవగాహన వున్నట్లు కన్పించలేదు. 

మార్కెట్‌లో వున్న 86 శాతం కరెన్సీని రద్దు చేయడం ద్వారా దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేయాలని నరేంద్రమోడీ భావించడం నిజం. అది జరిగింది కూడా. నేను నిర్ణయం తీసుకున్నాను, మీ ఛావు మీరు ఛావండి.. అన్నట్లుగా అటు రిజర్వు బ్యాంకునీ, ఇటు బ్యాంకుల్నీ గాలికొదిలేశారాయన. అంతే, రిజర్వు బ్యాంకు అవసరానికి తగ్గట్టు కరెన్సీని సరఫరా చేయలేక నానా తంటాలూ పడింది. బ్యాంకుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? బ్యాంకు సిబ్బంది సైతం మోడీ నిర్ణయంతో ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 

'ఇది మా ప్రభుత్వ ఘనత.. ఇది సర్జికల్‌ స్ట్రైక్‌..' అని ప్రధాని నరేంద్రమోడీ ఘనంగా చాటుకున్నారు. ఈ ఎపిసోడ్‌లో రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ఉర్జీత్‌ పటేల్‌ పాత్ర నామమాత్రం. నరేంద్రమోడీని ఉద్దేశించి 'జీ హుజూర్‌' అనడం మినహా, ఆయన చేయగలిగిందేమీ లేదు. ఇది జగమెరిగిన సత్యం. కానీ, పవన్‌కళ్యాణ్‌ చాలా సింపుల్‌గా ఉర్జీత్‌ పటేల్‌పై విమర్శలు చేసేసి ఊరుకున్నారు. చూస్తోంటే, ఇక్కడ మోడీ అంటే పవన్‌కళ్యాణ్‌కి ఎంత భయం.? అన్నది స్పష్టమవుతోంది. 

'నేనెవరికీ భయపడను.. ఎందుకు భయపడాలి.?' అంటూనే పవన్‌కళ్యాణ్‌, మోడీ పట్ల తనకున్న భయాన్ని ఇదిగో ఇలా బయటపెట్టేశారు. ఏదిఏమైనా, అనంతపురం బహిరంగ సభలో మెచ్యూర్డ్‌ పొలిటీషియన్‌గా కన్పించిన పవన్‌కళ్యాణ్‌, ట్విట్టర్‌ వేదికగా, తనకు రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేదనే విషయాన్ని చాటేసుకున్నారు. ఐదు అంశాలు.. వాటిపై ట్వీట్లు.. వెరసి, పవన్‌కళ్యాణ్‌కి రాజకీయాలపై వున్న అవగాహనని తేటతెల్లం చేసేసింది. ఇక, 'కంక్లూడ్‌' చేయాల్సింది వుందని ఈ రోజు ట్విట్టర్‌లో చివరగా పవన్‌ చెప్పారుగానీ, అదింకెంత ఘోరంగా వుంటుందో ఏమో.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?