Advertisement

Advertisement


Home > Articles - Special Articles

పవన్‌కళ్యాణ్‌ని మార్చిన 2016

పవన్‌కళ్యాణ్‌ని మార్చిన 2016

అవును, 2016 పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ని మార్చేసింది. అలా ఇలా కాదు, జనసేనానికి రాజకీయమంటే ఏంటో అర్థమయ్యేలా చేసింది. రాజకీయ నాయకుడంటే జనంలో వుండాలని నేర్పింది. 2016 సంవత్సరం పవన్‌కళ్యాణ్‌ని మార్చిందనడం ఎంత నిజమో, ఓ అభిమాని మరణం ఆయన్ను జనంలోకి లాక్కొచ్చిందన్నదీ అంతే నిజం. రాజకీయంగా పవన్‌ కాస్తో కూస్తో యాక్టివ్‌ అవడానికి ఓ అభిమాని మరణం అలా దోహదపడిందని చెప్పక తప్పదు. 

తిరుపతికి చెందిన పవన్‌ అభిమాని, మరో సినీ హీరో అభిమాని చేతుల్లో హత్యకు గురవడంతో, తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్‌ వెళ్ళక తప్పలేదు. అలా వెళ్ళిన పవన్‌, పనిలో పనిగా ఓ పొలిటికల్‌ మీటింగ్‌ పెట్టారు. అక్కడి నుంచి, పవన్‌ రాజకీయ కార్యాచరణను కొనసాగించక తప్పలేదు. కాకినాడ బహిరంగ సభ, అనంతపురం బహిరంగ సభ.. ఇలా రెండు బహిరంగ సభల్ని జనసేనాని నిర్వహించారు. ఏం సాధించారు.? అనడక్కండి.. అదంతే.! 

ఏడాది చివర్లో పవన్‌కళ్యాణ్‌, సోషల్‌ మీడియా వేదికగా కూడా సందడి చేశారండోయ్‌. దేశభక్తి, పెద్ద పాత నోట్ల రద్దు తదితర అంశాలపై పవన్‌కళ్యాణ్‌ తన భావాల్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.. కేంద్రాన్ని ప్రశ్నించారు కూడా. అఫ్‌కోర్స్‌, ఆ ప్రశ్నల్లో పస లేదనే విషయం తేలిపోయిందనుకోండి.. అది వేరే విషయం. 

సినిమా పరంగా చూస్తే పవన్‌కళ్యాణ్‌, ఈ ఏడాది 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాతో అటు హీరోగా, ఇటు నిర్మాతగా పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే.

ఏదిఏమైనా, పవన్‌కళ్యాణ్‌లో 2016 సంవత్సరం చాలా మార్పులు తీసుకొచ్చింది. అయితే, జనసేనాధిపతిగా బహిరంగ సభలు నిర్వహించడం తప్ప, పార్టీని బలోపేతం చేసే చర్యలైతే చేపట్టలేకపోయారు. మీడియా కోసం ఓ వ్యక్తిని నియమించడం, తెలంగాణ వ్యవహారాలు చూసుకోడానికి ఓ వ్యక్తిని నియమించడం.. ఇవే రాజకీయంగా పవన్‌కళ్యాణ్‌ ఈ ఏడాది తీసుకున్న నిర్ణయాలు. 

రాజకీయ విమర్శల పరంగా చూసుకుంటే టీడీపీ సుతిమెత్తగా, బీజేపీ ఇంకాస్త ఘాటుగా పవన్‌కళ్యాణ్‌ని విమర్శించాయి. అలా 2016 సంవత్సరం పవన్‌కళ్యాణ్‌ నుంచి టీడీపీ, బీజేపీలను దూరం చేసిందనీ చెప్పుకోవచ్చు. 2017లో పవన్‌కళ్యాణ్‌ రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు ఎలా వుండబోతున్నాయి.? 2019 ఎన్నికల కోసం పవన్‌కళ్యాణ్‌ 2017లోనే బీజం వేయగలుగుతారా.? వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?