Advertisement

Advertisement


Home > Articles - Special Articles

గౌరవ ఉద్యోగం....విధి నిర్వహణ శూన్యం...!

గౌరవ ఉద్యోగం....విధి నిర్వహణ శూన్యం...!

పీవీ సింధు ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించగానే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు చెదిరే నజరానాలు కురిపించాయి. భారీగా ఇళ్ల స్థలాలు ఇచ్చాయి. పోటీలు పడి ఉద్యోగాలు ఆఫర్‌ చేశాయి. ఆమె రజత పతకం సాధించినందుకే మహారాణిని చేసిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సింధు బంగారు పతకం సాధించివుంటే ఇంకెలా చేసేవో...! ఆమె ఒలింపిక్స్‌లో విజయం సాధించినప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గ్రూపు-1 ఉద్యోగం ఇచ్చారు. బాబు కంటే ముందు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా గ్రూపు-1 ఉద్యోగం ఆఫర్‌ చేశారు. కాని ఆమె బాబు ఆఫర్‌ను అంగీకరించడంతో డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఇది ఉన్నతోద్యోగమనే విషయం తెలిసిందే. 

ఈ ఉద్యోగం ఇచ్చాక సింధు ఏపీ రెవిన్యూ శాఖలోని సిసిఎల్‌ఏ విభాగంలో డిప్యూటీ కలెక్టరుగా శిక్షణ పూర్తి చేసుకుంది. ఆ తరువాత పోస్టింగ్‌ కోసం వెయిటింగులో ఉంది. తాజాగా ఆమెకు జగన్‌ సర్కారు హైదరాబాదులోని లేక్‌వ్యూ అతిథి గృహం (ఇది ఇంకా ఏపీ ప్రభుత్వం కిందనే ఉంది) ఓఎస్డీగా పోస్టింగు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రోటోకాల్‌ విభాగంలోని సహాయ డైరెక్టరుగా హోదాను పెంచి ఓఎస్డీగా పోస్టింగు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆనాడు సింధుకు ఉద్యోగం ఇచ్చాక ఆమెకు ఇదే తొలి పోస్టింగ్‌. మామూలు వాళ్లయితే పోస్టింగ్‌ ఇవ్వగానే తెల్లారి నుంచే ఆఫీసుకు వెళ్లి విధుల్లో చేరిపోయి గొడ్డు చాకిరీ చేస్తుంటారు. కాని సింధు సాధారణ వ్యక్తి కాదు. ప్రముఖ క్రీడాకారిణి. ఒలింపిక్స్‌లో రజత పతక విజేత. 

ఆమె ప్రభుత్వం దగ్గరకు వెళ్లి 'సార్‌...నేను పెద్ద క్రీడాకారిణిని. మీరు నాకు ఉద్యోగం ఇవ్వండి' అని అడగలేదు. ఒలింపిక్స్‌ విజేత తమ ప్రభుత్వంలో పనిచేస్తే తమకే గౌరవంగా ఉంటుందని భావించి రెండు ప్రభుత్వాలు ఉద్యోగం ఆఫర్‌ చేశాయి. సరే...ఆమె ఏపీ వైపు మొగ్గు చూపింది. జగన్‌ ప్రభుత్వం సింధుకు పోస్టింగ్‌ ఇవ్వగానే ఆమె వెళ్లి విధుల్లో చేరిందా? తాడేపల్లిలోని సీఎం ఇంటికి వెళ్లి 'సార్‌...నేను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాను. దానికి సిద్ధమయ్యేందుకు సెలవు కావాలి'...అని అడిగింది. వెంటనే సీఎం జగన్‌ సింధుకు ఆన్‌డ్యూటీ సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రేపటి నుంచి సింధు సెలవులో వెళ్లిపోతుంది. ఎప్పటివరకు? వచ్చే ఏడాది (2020) ఆగస్టు వరకు ఆమె సెలవులో ఉంటుంది. నిజానికి ఇది సెలవు కాదు. డ్యూటీలో ఉన్నట్లే లెక్క. ప్రభుత్వం ఆమెకు ఇచ్చింది ఆన్‌ డ్యూటీ సెలవు. 

సో...ఆమె జీతభత్యాలకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు. ఆగస్టులో సెలవు ముగిశాక మరేదో పోటీ వస్తుంది. మళ్లీ దానికి తయారు కావల్సివస్తుంది. మళ్లీ సెలవు. క్రీడాకారుల ఉద్యోగ జీవితం ఇలాగే ఉంటుంది. ఇది సింధుకు గౌరవ ఉద్యోగం. అంతే...! ఆనాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింధుకు ఉద్యోగం ఇచ్చి తన వాగ్దానం నెరవేర్చుకున్నారు. హామీ ఇచ్చిన ప్రకారం ఒలింపిక్స్‌ విజేత పివి సింధుకు డిప్యూటీ కలెక్టర్‌గా (గ్రూప్‌-1 ఆఫీసర్‌) ఉద్యోగం ఇచ్చారు. ఆమెకు ఉద్యోగం ఇవ్వడం కోసం అసెంబ్లీలో ఏపీపీఎస్సీ చట్టానికి సవరణలు చేసి ఆ బిల్లును ఆమోదింపచేశారు. ఇది స్పెషల్‌ కేసు కాబట్టి ప్రత్యేక బిల్లు అవసరమైంది. అంతర్జాతీయ క్రీడాకారిణిని ఆంధ్రప్రదేశ్‌కు సొంతం చేసుకొని ఎట్టకేలకు ఆమె ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.  

సింధు ఒలింపిక్స్‌లో విజయం సాధించగానే ఆ క్రెడిట్‌ను దక్కించుకోవడానికి, ఆమెను తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయంటే తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయని చెప్పకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు పిచ్చిగా తాపత్రయపడ్డారు. ఒక దశలో ఈ తాపత్రయం వెగటు కలిగించింది కూడా.  సింధును తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ బిడ్డ' అంటే, ఏపీ ప్రభుత్వం 'ఆంధ్రా అమ్మాయి' అని క్లెయిమ్‌ చేసుకుంది. పోటీలు పడి కోట్ల రూపాయల నజరానాలు ప్రకటించారు. పెద్ద ఉద్యోగాలు ఆఫర్‌ చేశారు. రాజధానుల్లో వెయ్యి గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 

ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఉదాసీనంగా ఉండే పాలకులు సింధును ఆకాశానికి ఎత్తడంలో, కానుకలు సమర్పించడంలో మాత్రం పరుగులు తీశారు. ఇక సన్మానాలు సత్కారాల సంగతి చెప్పక్కర్లేదు. చంద్రబాబు ప్రోటోకాల్‌ కూడా పక్కకు పెట్టి ఆమెకు ఎదురేగి స్వాగతం పలికారు. సింధుకు ఇద్దరు ముఖ్యమంత్రులు పెద్ద ఉద్యోగాలు ఆఫర్‌ చేసినప్పటికీ ఆమె చాలాకాలం అవునని కాదని చెప్పకుండా మౌనంగా ఉంది. కేసీఆర్‌, చంద్రబాబు ఆమెకు ఉద్యోగాలు ఆఫర్‌ చేసే సమయానికి ఆమె భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్లో డిప్యూటీ మేనేజర్‌ (స్పోర్ట్స్‌)గా పనిచేస్తోంది.చివరకు చంద్రబాబును ఆఫర్‌కు ఓకే చెప్పింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?