Advertisement

Advertisement


Home > Articles - Special Articles

శ్రీవిళంబినామ సంవత్సర రాశిఫలాలు

శ్రీవిళంబినామ సంవత్సర రాశిఫలాలు

మేషం

ఆదాయం–2, వ్యయం–14, రాజపూజ్యం–5, అవమానం–7

వీరికి అక్టోబర్‌వరకు గురుబలం విశేషం. అలాగే, శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఇక అర్ధాష్టమ రాహువు వచ్చే మార్చి వరకు దోషకారి.ఈ రీత్యా పరిశీలించగా, వీరికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో విశేషంగా పేరుప్రతిష్ఠలు సాధిస్తారు.కార్యక్రమాలు పూర్తి చేసి విజేతలుగా నిలుస్తారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న వివాదాలు క్రమేపీ పరిష్కారమవుతాయి.

కొన్ని కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. బంధువర్గం నుంచి ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి.  ఇతరులకు సైతం సహాయపడి మీ దాతృత్వాన్ని చాటుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఇంటి నిర్మాణాలను చేపడతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు.  విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రావచ్చు. రాజకీయనేతలకు మధ్యమధ్యలో అవాంతరాలు, ఇబ్బందులు నెలకొన్నా మొత్తం మీద అనుకూలమైన కాలమే.  కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఊహించని అవకాశాలు.  వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందుతాయి.

వ్యాపారులకు అధిక లాభాలు అందుతాయి.  ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, ప్రమోషన్లు ఉంటాయి. క్రీడాకారులకు మొదట్లో గడ్డుగా ఉన్నా మధ్యకాలంలో ఎదురుండదు. ఎవరెన్ని సలహాలు ఇచ్చినా సొంత ఆలోచనలతో ముందడుగు వేయడం మంచిది. ఇక అక్టోబర్‌11 నుంచి అష్టమ గురుడు, మార్చి వరకు అర్థాష్టమ రాహువుల ప్రభావం వల్ల  ధనవ్యయం. మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.  అలాగే, వాహనాలు నడిపే వారు కూడా అప్రమత్తంగా మెలగాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఏడాది ప్రారంభం, చివరిలోనూ అనుకూలత ఉంటుంది.  వీరు గురు, రాహువులకు పరిహారాలు చేయించుకోవాలి.  అదృష్టసంఖ్య–9, పగడం ధరించాలి.

వృషభం

ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–1, అవమానం–3

వీరికి అక్టోబర్‌వరకు గురుబలం లేదు. అలాగే, అష్టమశని ప్రభావం అధికం. మార్చి వరకు రాహువు అనుకూలుడు.  ఈరీత్యా చూస్తే వీరు ప్రతి విషయంలోనూ  అప్రమత్తంగా ఉండడం మంచిది. మంచికి వెళ్లినా చెడుగా మారవచ్చు. సమస్యలు చుట్టుముట్టి సతమతం చేస్తాయి. వీటిని అధిగమించేందుకు మరింత కష్టించాలి. కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగుతో అకార ణంగా విభేదాలు. స్థిరాస్తి విషయంలో జ్ఞాతులతో వివాదాలు నెలకొంటాయి.

మీరు తీసుకునే నిర్ణయాలపై వ్యతిరేకత రావడంతో మనస్తాపం చెందుతారు. ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి, ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.  అయితే రాహువు అనుకూల సంచారంతో మధ్యమధ్యలో కొంత అనుకూలత ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. రాబడి ఎంతగా లభించినా ఖర్చులు కూడా మీదపడతాయి. ఇతరులకు సలహాలు ఇచ్చే సందర్భంలో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు కనిపించవు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ఒత్తిడులు.

విద్యార్థులు కోరుకున్న ఫలితాలు రాక నిరాశ చెందుతారు. చలనచిత్ర, నాటకరంగాల వారికి అవకాశాలు అంతగా కనిపించవు. క్రీడాకారులకు నిరుత్సాహం. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. కాగా, అక్టోబర్‌11నుంచి గురుబలం వల్ల కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.  ఆర్థిక ప్రగతి. కార్యజయం. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. స్థిరాస్తిలాభం. అన్ని రంగాల వారికి శుభదాయకంగా ఉంటుంది. వీరు శని, గురులకు పరిహారాలు చేయించుకోవాలి.

అదృష్టసంఖ్య–6, వజ్రం ధరించాలి.

మిథునం

ఆదాయం–14, వ్యయం–2, రాజపూజ్యం–4, అవమానం–3

వీరికి గురుడు, శని బలం విశేషం. ఇక రాహు, కేతువులు దోషకారులు. ఈరీత్యా పరిశీలించగా అక్టోబర్‌వరకు గురుబలం వల్ల డబ్బుకు లోటు ఉండదు. రావలసిన సొమ్ము అందుతుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తి కాగలవు.  కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.  సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింతగా పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. అనుకున్నది సాధించేందుకు తగిన సమయం.  వ్యూహాత్మకంగా సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. అనుకూల బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, న్యాయవాదులు,  కళాకారులకు సన్మానాలు, అవార్డులు లభిస్తాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలతో ముందడుగు వేస్తారు. వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభిస్తాయి.  అయితే కుటుంబక్షేత్రంలో రాహువు, అష్టమంలో కేతుసంచారం వల్ల తరచూ ఆరోగ్యసమస్యలు. మానసిక అశాంతి.  ఇతరులతో మాటపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే, అక్టోబర్‌11నుంచి షష్ఠమంలో గురు సంచారం వల్ల ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. సంతానరీత్యా సమస్యలు ఎదురుకావచ్చు.  ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

అదృష్టసంఖ్య–5, పచ్చ ధరించాలి. వీరు రాహుకేతువులకు, అక్టోబర్‌లో గురునికి పరిహారాలు చేయించుకోవాలి.

కర్కాటకం

ఆదాయం–8, వ్యయం–2, రాజపూజ్యం–7, అవమానం–3.

వీరికి గురుడు, శనిబలం కలదు. రాహుకేతువులు దోషకారులు. మొత్తం మీద వీరికి ఇతరుల నుంచి అందాల్సిన సొమ్ము అందుతుంది.  ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.  కార్యజయం. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే, ఆస్తులæ క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. చాకచక్యం, నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

బంధువులు, మిత్రులు చేదోడుగా నిలుస్తారు. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. ఒక కోర్టు వ్యవహారం పరిష్కారమవుతుంది. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు తొలగుతాయి. నూతన గృహప్రవేశయోగం. విద్యార్థులకు కోరుకున్న ర్యాంకులు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి.  ఉద్యోగస్తులు ఆశించిన బదిలీలు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, పరిశోధకులకు విశేషయోగదాయకమైన కాలం. రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది.

కొత్త పదవులు దక్కించుకుంటారు. కళాకారులు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి.  రాహుకేతువుల సంచారం అనుకూలం కానందున ఆరోగ్యం, కుటుంబసమస్యలు కొంత వేధిస్తాయి. వ్యయప్రయాసలు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య కలహాలు. మొత్తంమీద శుభఫలితాలే ఎక్కువగా కనిపిస్తాయి. 

అదృష్టసంఖ్య–2, వీరు ముత్యం ధరించాలి. వీరు రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.

సింహం

ఆదాయం –11, వ్యయం–11, రాజపూజ్యం–3, అవమానం–6.

ఈరాశి వారికి అక్టోబర్‌వరకు గురుబలంలేదు. అలాగే, శని, రాహువులు దోషకారులు. ఆదాయానికి సరిసమానంగా ఖర్చులు కూడా ఉంటాయి. పొదుపు చేసినది కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. సోదరులు, సోదరీలతో కలహాలు. సంతానరీత్యా చిక్కులు ఎదురవుతాయి.  కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి.  ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మితాహారం, మితసంభాషణ మంచిది. ఎదుటవారి విషయాలలో జోక్యం వల్ల మాటపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబసభ్యులను మెప్పించలేవు. శత్రువులు మీపై ఒత్తిడులు పెంచుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగానే లాభిస్తాయి.

పెట్టుబడుల విషయంలో చికాకులు.  ఉద్యోగులకు ఊహించని బదిలీలు తథ్యం. అలాగే, పదోన్నతులు ఊరిస్తాయి.  విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు అక్టోబర్‌నుంచి శుభదాయకంగా ఉంటుంది. లక్ష్యాలు నిర్దేశించుకుని నెమ్మదిగా ముందుకు సాగడం మంచిది. అక్టోబర్‌ నుంచి గురుడు కొంత అనుకూలం. గృహ నిర్మాణాలు చేపడతారు. వాహనాలు, భూములు కొంటారు. ప్రత్యర్థుల సహాయం సైతం అందుతుంది. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. అపవాదులు తొలగుతాయి. 

అదృష్టసంఖ్య–1, కెంపు ధరించాలి. గురు,రాహువులకు పరిహారాలు చేయించుకోవాలి.

కన్య

ఆదాయం–4, వ్యయం–2, రాజపూజ్యం–6, అవమానం–6.

వీరికి గురు, రాహువుల బలం విశేషం. శని, కేతువులు దోషకారులు. ఈరీత్యా చూస్తే గురుబలం వీరికి ఎంతో ఉపకరిస్తుంది. రాబడికి లోటు ఉండదు. ఎంతోకాలంగా పెండింగ్‌లో పడిన బాకీలు కూడా వసూలవుతాయి. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ఇతరులను ఆకట్టుకుని చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు.

నిరుద్యోగులు ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు.  వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఇతోధిక లాభాలు. ఉద్యోగస్తులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులు, లాయర్లు, సాంకేతికరంగాల వారికి మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి.

విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండుపంటలూ అనుకూలిస్తాయి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. స్థానచలన సూచనలు ఆప్తులు, మాతృవర్గీయులతో కలహాలు.  మొత్తం మీద అక్టోబర్‌వరకు అన్నింటా విజయమే. తదుపరి ఇబ్బందులు, సమస్యలు తప్పకపోవచ్చు.

అదృష్టసంఖ్య–5, పచ్చ ధరించాలి.  వీరు గురు,శనులకు పరిహారాలు చేయించుకోవాలి.

తుల

ఆదాయం–11, వ్యయం –5, రాజపూజ్యం–1, అవమానం–2.

వీరి శనిబలం విశేషం. గురుబలం అక్టోబర్‌వరకు లేదు. ఇక దశమంలో రాహువు,  అర్థాష్టమంలో కేతువు దోషకారులు. ఈ రీత్యా చూస్తే వీరికి ఆదాయం కనిపించినా ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యయప్రయాసలు అధికం. బంధువర్గంతో తరచూ వివాదాలు.  శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు.  కష్టంమీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది.  వివాహాది శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో కొన్ని వ్యవహారాలు మీ చొరవతో పూర్తి కాగలవు.

ఆస్తుల విషయంలో నెలకొన్న సమస్యలు తీరతాయి.  తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపార, వాణిజ్యవర్గాలకు లాభాలు దక్కినా సంతృప్తి ఉండదు.  వ్యవసాయదారులకు రెండుపంటలు సామాన్యంగా ఉంటాయి.  ఉద్యోగులకు పైస్థాయి అధికారుల నుంచి ఒత్తిడులు. ఉన్నా కొంత అనుకూలత ఉంటుంది. రాజకీయనాయకులకు విశేషంగా కలసివస్తుంది. కళాకారులు, శాస్త్రసాంకేతికరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు.

క్రీడాకారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంతవరకూ బయటపడతారు. మీపై విమర్శలకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉంటారు, అప్రమత్తంగా మెలగాలి. ఇక అక్టోబర్‌11నుంచి గురుబలం పెరుగుతుంది. అప్పటి నుంచి మరింత ధనాదాయం లభిస్తుంది. విశేష గౌరవమర్యాదలు పొందుతారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు తగిన సమయం. శుభకార్యాల నిర్వహణ. తీర్థయాత్రలు చేస్తారు. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.

అదృష్టసంఖ్య–6. వజ్రం ధరించాలి. వీరు గురునికి పరిహారాలు చేయించుకోవాలి.

వృశ్చికం

ఆదాయం–2, వ్యయం–14, రాజపూజ్యం–5, అవమానం–2.

వీరికి గురుబలం లేదు. అలాగే, ఏల్నాటిశని ప్రభావం వల్ల శని దోషకారి.  సంవత్సరాంతంలో అతిచారం వల్ల గురుడు ద్వితీయరాశి (ధనుస్సు) సంచారం కొంత ఉపకరిస్తుంది. ఈరీత్యా చూస్తే వీరికి సామాన్యంగానే ఉంటుంది. రావలసిన సొమ్ము అందక రుణదాతలను ఆశ్రయిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలను కాపాడుకుంటూ జీవనం సాగిస్తారు. ఆప్తులు, కావలసిన వారే మిమ్మల్ని ద్వేషిస్తారు.  ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా నరాలు, చర్మ, నేత్ర సంబంధిత వ్యాధులు బా«ధిస్తాయి.

బంధువులతో తరచూ విభేదాలు ఏర్పడవచ్చు.  ప్రతి వ్యవహారంలోనూ అత్యంత జాగరూకతతో మెలగాలి. ప్రయాణాలలో విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపార, వాణిజ్యవర్గాలు సామాన్యమైన లాభాలు పొందుతారు.  ఉద్యోగులకు అనుకోని విధంగా బదిలీలు ఉండవచ్చు. వీటి వల్ల శ్రమాధిక్యం.  పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాల వారు ఎంతగా కష్టపడ్డా ఫలితం దక్కదు.

కళాకారులు అనుకున్న అవకాశాలు  దూరం చేసుకుంటారు. ప్రయత్నాలు విఫలమవుతాయి. రాజకీయవర్గాలకు అపవాదులు, ఆరోపణలు తప్పకపోవచ్చు.  న్యాయవాదులు, క్రీడాకారుల అంచనాలు తప్పుతాయి. వ్యవసాయదారులకు రెండవపంట అనుకూలిస్తుంది.  ఏడాది చివరిలో కాస్త ఊరట లభిస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి. శుభవార్తలు. ఆకస్మిక ధనప్రాప్తి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మొత్తం మీద వీరికి మిశ్రమంగా ఉంటుంది. 

అదృష్టసంఖ్య–9, పగడం ధరించాలి.  శని, గురుడు, రాహు,కేతువులకు పరిహారాలు చేసుకుంటే మంచిది.

ధనుస్సు

ఆదాయం–5 వ్యయం – 5, రాజపూజ్యం–1, అవమానం–5.

వీరికి గురుబలం విశేషం. జన్మరాశిలో శనిసంచారం, అష్టమ రాహువు దోషకారకం.

అనుకున్న ఆదాయం సమకూరినా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. శుభమూలక ఖర్చులు అధికంగా ఉంటాయి.  అక్టోబర్‌వరకు గురుబలం ఉన్నందున కార్యజయం.  ఆకస్మిక ధనలాభాలు. పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో అవరోధాలు, ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు.  తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండదు.  మనోవ్యాకులత. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపండి.  వ్యాపారస్తులు, వాణిజ్యవర్గాలకు ఒడిదుడుకులు. అనుకున్న పెట్టుబడులు సమకూరక సతమతమవుతారు. ఉద్యోగులు ఆకస్మిక బదిలీలకు సిద్ధపడాలి.

పైస్థాయి అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. పారిశ్రామికవేత్తలు, శాస్త్రసాంకేతిక రంగాల వారికి నిరాశానిస్పృహలు. శ్రమ వృథా కాగలదు. వ్యవసాయదారులకు రెండవ పంట కొంత అనుకూలిస్తుంది.  క్రీడాకారులకు ప్రోత్సాహం అంతగా ఉండదు. రాజకీయనేతలకు ఒత్తిడులు పెరుగుతాయి. న్యాయవాదులు, కళాకారులకు ప్రారంభంలో శుభదాయకంగా ఉంటుంది. తదుపరి చిక్కులు ఎదురుకావచ్చు.

మొత్తం మీద ఈరాశి వారికి సామాన్యంగానే ఉంటుంది. అదృష్టసంఖ్య–3. వీరు పుష్యరాగం ధరించాలి. శని,రాహువులకు పరిహారాలు చేయించుకోవాలి.

మకరం

ఆదాయం–8, వ్యయం–14, రాజపూజ్యం–4, అవమానం–5.

ఈరాశి వారికి గురుబలం విశేషం. ఏల్నాటిశని, సప్తమంలో రాహువు, జన్మరాశిలో కేతు సంచారం దోషం. ఈ రీత్యా చూస్తే వీరికి ఆర్థికంగా బలం చేకూరినా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి.  మిత్రులు, బంధువులతో వివాదాలు కొంత మనస్థాపం కలిగించవచ్చు.  గురుబలం కారణంగా ఆర్థిక లాభాలు, ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. మీ అభిరుచులు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి.  సంఘంలో గౌరవం పెరుగుతుంది.  చిరకాలంగా ఎదురవుతున్న ఇక్కట్లు తొలగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటాబయటా ఎదురులేని పరిస్థితి.  వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు విశేషంగా కలసివస్తుంది.

అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగవర్గాలకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉండవచ్చు.  పారిశ్రామికవేత్తలు, శాస్త్రసాంకేతిక రంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు.  విద్యార్థులు ఏల్నాటి శని ఉన్నా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు.  న్యాయవాదులు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విశేష సన్మానాలు, సత్కారాలు అందుకుంటారు.  క్రీడాకారులకు విజయాలు చేకూరతాయి. వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభిస్తాయి. కాగా, శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు ఉండవచ్చు. మొత్తం మీద వీరికి ఏడాది చివరిలో సమస్యలు తప్పకపోవచ్చు.

అదృష్టసంఖ్య–8, వీరు నీలం ధరించాలి. శని,రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.

కుంభం

ఆదాయం–8, వ్యయం–14, రాజపూజ్యం –7, అవమానం–5.

వీరికి గ్రహబలం విశేషంగా ఉంది. రాహుకేతువుల స్వల్పదోషకారులైనా శని, గురుబలం విశేషం. ఈరీత్యా వీరికి పట్టింది బంగారమే.  ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. అయితే శుభమూలక ధనవ్యయం అధికంగా ఉంటుంది. అలాగే, సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. పట్టుదల, నేర్పుతో ఎంతటి వ్యవహారమైనా పూర్తి చేస్తారు.  మీసత్తా, నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. బంధువులు, మిత్రులు ఊహించని రీతిలో సహకారం అందిస్తారు.  పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు.

కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వివాహాది శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. గృహ నిర్మాణాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.  జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు.  తీర్థయాత్రలు సాగిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రసాంకేతిక వర్గాలకు శ్రమ ఫలిస్తుంది.

కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. సన్మాన, సత్కారాలు పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు తథ్యం. క్రీడాకారులకు విజయాలు వరిస్తాయి. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి.  వైద్యులు, న్యాయవాదులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  వీరికి ఏడాదంతా స్వల్ప దోషాలు ఉన్నా శుభసూచకాలే అధికంగా ఉంటాయి. 

అదృష్టసంఖ్య–8, నీలం ధరించాలి.  వీరు రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.

మీనం

ఆదాయం–5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–1.

వీరికి అక్టోబర్‌11 వరకు అష్టమ గురుదోషం అధికం. తదుపరి శు«భదాయకం.  ఇక శని, రాహుకేతువుల సంచారం దోషకారకం.  మొత్తంమీద అక్టోబర్‌వరకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు.  మిక్కిలి ఆప్తులతోనే మాటపడాల్సిన పరిస్థితి. అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. స్థిరాస్తి విషయంలో బంధువర్గంతో తగాదాలు నెలకొనవచ్చు.  కోర్టు వ్యవహారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.

చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. చాకచక్యం, నేర్పుగా వ్యవహరించడం మంచిది.  తరచూ దూరప్రయాణాలు, తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. విలువైన వస్తుసామగ్రి జాగ్రత్తగా చూసుకోండి. సంతానమూలక సమస్యలు. మనోక్లేశాలు. వృథా ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు.  ఉద్యోగులకు మార్పులు అనివార్యం.

పైస్థాయి అధికారులరీత్యా ఒత్తిడులు. రాజకీయనేతలకు పదవులు ఊరిస్తాయి. శాస్త్రసాంకేతికరంగాలు, పారిశ్రామికవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం ఆలస్యమవుతుంది. విద్యార్థులు శ్రమానంతరం మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది.  కళాకారులకు గుర్తింపుతో పాటు, వ్యయప్రయాసలు కూడా తప్పవు. అక్టోబర్‌నుంచి గురుని శుభసంచారం వల్ల ధనప్రాప్తి. వాహన, గృహయోగాలు. మాటకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది.

అదృష్టసంఖ్య–3, పుష్యరాగం ధరించాలి. వీరు గురు, శనులకు పరిహారాలు చేయించుకోవాలి.

Vakkantham Chandramouli
Phone: (91) 98852 99400, (91) 99634 70077
Email:[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?