cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

సింధు విజయంలో 'క్రెడిట్‌' ఎవరిది?

సింధు విజయంలో 'క్రెడిట్‌' ఎవరిది?

ఓ వ్యక్తి ఓడిపోతే ఎవ్వరూ పట్టించుకోరు. విజయం సాధిస్తే అందులో తమకూ భాగం ఉందని క్లెయమ్‌ చేసుకుంటారు. ఆ విజయం వెనక తమ కృషి కూడా ఉందని చెప్పుకుంటారు. అసలు ఆ విజయం తాలూకు క్రెడిట్‌ తమకే దక్కాలని వాదిస్తారు. ఈ వాదోపవాదాలు, పోటీ మధ్య విజయం సాధించిన వ్యక్తి తన గొప్పతనం చాటుకునే, తన కృషి గురించి చెప్పుకునే అవకాశం రాదు. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన తెలుగు తేజం సింధు విజయం నుంచి క్రెడిట్‌ కొట్టేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. మన దేశానికి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధిస్తేనే ఎవరెస్టు ఎక్కినంత సంతోషపడతాం. దానికంటే పైమెట్టునున్న రజత పతకం సాధించడంతో రెండు ఎవరెస్టులు ఎక్కినంత ఆనందపడుతున్నాం. 

ఇది సంబరపడాల్సిన సమయమే. విశ్వ క్రీడా వేదికపై తెలుగమ్మాయి సాధించిన విజయం ఆషామాషీ కాదు. అందుకే క్రెడిట్‌ కొట్టేయాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి.  సింధు విజయాన్ని సామాజిక మాధ్యమాల్లో సెలబ్రేట్‌ చేసుకుంటున్న నెటిజన్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఆమెను తమ అమ్మాయిగా చెప్పుకుంటూ ప్రశంసలు కురిస్తుండగా, తెలంగాణకు చెందినవారు 'మన హైదరాబాదీ' అంటూ పొగిడేస్తున్నారు. రెండు తెలుగు ప్రభుత్వాలు సింధును తమ క్రీడాకారిణిగా చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. 

నిజానికి సింధు విజయం పూర్తిగా ఆమె సొంతం. ఈ విజయం వెనక ఉన్న వ్యక్తి ఆమె శిక్షకుడు (కోచ్‌) పుల్లెల గోపీచంద్‌. రజత పతక విజయం క్రెడిట్‌ వారిద్దరిది. కాని ఈ విజయాన్ని ముందుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) క్లెయిమ్‌ చేసుకుంది. జీహెచ్‌ఎంసీ క్లెయిమ్‌ చేసుకోవడమంటే తెలంగాణ ప్రభుత్వం క్లెయిమ్‌ చేసుకున్నట్లే లెక్క. దీని వెనక మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పాత్ర ఉండొచ్చు...! అసలు జీహెచ్‌ఎంసీ ఎందుకు క్లెయిమ్‌ చేసుకోవాలి? అనే సందేహం ఎవ్వరికైనా కలుగుతుంది.  

అందుకు నగర పాలక సంస్థ అధికారులు చెబుతున్నదేమిటంటే...సింధు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా ప్రాక్టీసు ప్రారంభించింది జీహెచ్‌ఎంసీ నిర్వహించిన సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులోనట...! ''సింధు జీహెచ్‌ఎంసీ ప్రోడక్ట్‌'' అంటూ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె చిన్నతనంలో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులో ప్రాక్టీసు చేస్తున్నప్పటి ఫోటోలను అధికారులు విడుదల చేశారు. సింధు ఒలింపిక్‌ వరకు వెళ్లేందుకు అడుగులు సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపు నుంచే పడ్డాయి అని అధికారులు చెప్పారు. ఆమెకు పదేళ్ల వయసున్నప్పుడు (2005లో) అమీర్‌పేటలోని గురు గోవింద్‌ సింగ్‌ స్టేడియంలో నిర్వహించిన క్యాంపులో పాల్గొంది. అక్కడి నుంచి క్రమంగా ఎదుగుతూ అండర్‌-12, అండర్‌-15 తదితర టోర్నమెంట్లలో పాల్గొంది. 

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మూడేళ్లు శిక్షణ తీసుకున్న తరువాతనే ఆమె గోపీచంద్‌ అకాడమీలో చేరినట్లు అధికారులు చెబుతున్నారు. కాని అది నిజం కాదట...! 2006 నుంచి ఆమె గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ తీసుకుందని, తొలి బ్యాచ్‌ స్టూడెంటని, అకాడమీతో పదకొండేళ్ల అనుబంధం ఉందని ఓ ఆంగ్ల పత్రిక రాసింది. నిజానిజాలేమిటో సింధుకు, ఆమె కుటుంబానికి తెలుసు. జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ వింగ్‌ ద్వారా శిక్షణ పొంది జాతీయ స్థాయికెదిగి, అర్జున అవార్డు సైతం సొంతం చేసుకున్న క్రీడాకారులెందరో ఉన్నారు. కాని సింధు విషయంలో తేడాగా ఉంది. 

ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింధు విజయంలో తనకూ భాగముందని పరోక్షంగా చెప్పారు. తాను ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాదులో క్రీడారంగానికి అద్భుతమైన అవకాశాలు కల్పించానన్నారు. తానే గోపీచంద్‌ చేత అకాడమీ ఏర్పాటు చేయించానని, ఆయన అద్భుతమైన క్రీడాకారులను తయారుచేస్తున్నారని చెప్పారు. అంటే తాను ఆ అకాడమీ ఏర్పాటు చేయించకపోతే  సింధు శిక్షణ పొందే అవకాశం ఉండకపోయేదని, కాబట్టి ఆమె గెలుపునకు తానూ కారకుడిననని ఆయన ఉద్దేశం. 

ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణం సాధించకపోయినా రజతం సాధించినా కోటి రూపాయల నజరానా ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అంటే ఆంధ్రా కంటే ముందు గుర్తింపును, గౌరవాన్ని ఇచ్చిందన్నమాట. మరి బాబు ఎంత ఇస్తారో....! ఇక సింధు ఏ ప్రాంతం అమ్మాయి అనే విషయానికొస్తే సరైన జవాబు 'తెలుగమ్మాయి'. ఆమె తండ్రి పూర్వీకులది ఆంధ్రాలోని ఏలూరు. తరాల కిందటే (ముత్తాతలు) తెలంగాణకు వచ్చేశారు. సింధు తండ్రి సహా అంతా తెలంగాణలోనే పుట్టి పెరిగారు. ఈ లెక్కన చూసుకుంటే ఆమె అచ్చమైన హైదరాబాదీ అవుతుంది. కాని ఈ ఒలింపిక్‌ విజేతను భారతీయురాలిగా చూడాలి తప్ప ప్రాంతీయతత్వంతో చూడకూడదు.