Advertisement

Advertisement


Home > Articles - Special Articles

వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల్లో ఎందుకీ అస‌హ‌నం?

వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల్లో ఎందుకీ అస‌హ‌నం?

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 175 సీట్ల‌కు గాను 151 అసెంబ్లీ సీట్ల‌లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏడాది కాలం కూడా పూర్త‌యింది. 23 సీట్ల‌కే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌డిపోయింది. ఇందులో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికారు. జ‌న‌సేన ఒక్క ఎమ్మెల్యే కూడా జ‌గ‌న్ స‌ర్కార్‌కు మ‌ద్ద‌తు ప‌లికాడు. దీంతో జ‌గ‌న్ స‌ర్కార్ అత్యంత ప‌టిష్టంగా ఉంది. ప్ర‌తిప‌క్షం నామ‌మాత్ర‌మే.

అయితే ఇటీవ‌ల అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులే ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్నారు. దీంతో అధికార వైసీపీ ఇర‌కాటంలో ప‌డుతోంది. రోజుకొక‌రు చొప్పున సొంత పార్టీ ఎమ్మెల్యేనో, ఎంపీనో ప‌రిపాల‌న‌లోని డొల్ల‌త‌నాన్ని ఎత్తి చూపుతూ ఎల్లో మీడియాలో ప‌తాక శీర్షిక‌వుతున్నారు. అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల్లో అస‌హ‌నం పెరుగుతోంది. అయితే కార‌ణాలేంటో అంతుచిక్క‌డం లేదు. తాజాగా ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చిర్ల జ‌గ్గిరెడ్డి పోషించారు.

వీళ్లంద‌రూ కూడా ఇసుక‌ను సాకుగా, ఆయుధంగా తీసుకుని ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్నార‌నే చ‌ర్చ రాష్ట్రంలో న‌డుస్తోంది. దీనికి కార‌ణం పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యినా ఏ ఒక్క పని జ‌ర‌గ‌లేద‌నే అసంతృప్తి అంత‌కంత‌కూ పెరగ‌డ‌మే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జ‌గ్గిరెడ్డి ఏమ‌న్నారో ఒకసారి ప‌రిశీలిద్దాం.

"అధికార పార్టీ ఎమ్మెల్యేనైన నేనే చెబుతున్నా. ఇసుక ఇవ్వ‌డంలో ఏపీఎండీసీ పూర్తిగా విఫల‌మైంది. కోన సీమ‌లోని నా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో 10 ఇసుక ర్యాంపులున్నా ఒక్క‌టీ ప్రారంభించ‌లేదు. వ‌శిష్ట‌, గౌత‌మి గోదావ‌రి చుట్టూ ఇసుక ఉన్నా ఎక్క‌డికో వెళ్లాల్సిన ప‌రిస్థితి ఉంది. పొడ‌గ‌ట్ల‌ప‌ల్లిలో రేవు నిర్మాణానికి రెండు ట్రాక్ట‌ర్ల ఇసుక కావాల‌ని క‌లెక్ట‌ర్‌, డీఎస్పీ , రెవెన్యూ అధికారుల‌కు లేఖ రాశా. అయినా దొర‌క‌లేదు. పొలాల్లో మెరిక మ‌ట్టిని త‌ర‌లిస్తున్న రైతుల‌పైనా అనుమ‌తుల్లేవ‌ని కేసులు పెడుతున్నారు.  ముందు నాపై కేసు పెట్టండి" అని జ‌గ్గిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే రెండు ట్రాక్ట‌ర్ల ఇసుక కోసం క‌లెక్ట‌ర్‌, డీఎస్పీ, రెవెన్యూ అధికారుల‌కు లేఖ రాసినా ఫ‌లితం లేదంటే ఇంత‌కంటే అవ‌మానం ఇంకేమైనా ఉందా? అధికార పార్టీ ఎమ్మెల్యే ప‌రిస్థితి అదైతే...ఇక సామాన్యుల సంగ‌తేంటి? ప‌ది ఇసుక ర్యాంపులున్నా ఒక్క‌టీ ప్రారంభించ‌లేద‌ని, క‌ళ్లెదుటే ఇసుక ఉన్నా ఎక్క‌డికో వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి వ‌స్తోంద‌ని ఏ ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేనో విమ‌ర్శిస్తే....పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌దు. కానీ ఏపీలో ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

జ‌గ‌న్ పాల‌న‌లో తమ మాట చెల్లుబాటు కావ‌డం లేద‌ని, అధికారులు పెత్తనం చెలాయిస్తున్నార‌ని, సీఎం అండ చూసుకుని త‌మ‌ను ఖాత‌రు చేయ‌డం లేద‌నే భావ‌న‌, ఆవేద‌న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో బ‌లంగా ఉంది. దీన్ని బ‌య‌టికి వెళ్ల‌డించే మార్గం లేక‌, ఇసుక‌ను సాకుగా తీసుకుని అధికారుల‌పై మండిప‌డుతూ...తద్వారా స‌ర్కార్‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేస్తూ, సీఎంపై ఒత్తిడి పెంచుతున్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇటీవ‌ల మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, శ్రీ‌కాకుళం జిల్లా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తీవ్ర స్వ‌రంలో నిర‌స‌న గ‌ళాలు వినిపించ‌డం వెనుక జ‌గ‌న్‌పై అసంతృప్తే కార‌ణ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌మ సీనియారిటీకి పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ విలువ లేద‌ని, ప‌ట్టించుకునే దిక్కు లేద‌నే ఆవేద‌న‌, ఆక్రోశం వాళ్ల మాట‌ల్లో అర్థం చేసుకోవ‌చ్చంటున్నారు.

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు మొద‌టి నుంచి కూడా ఇసుక పాల‌సీలోని డొల్ల‌త‌నాన్ని ఎత్తి చూపుతూ, ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. "రూ.15 వేలు ఉండే ఐదు యూనిట్ల ఇసుక లారీని ద‌ళారులు రూ.40 వేల‌కు విక్ర‌యిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ప‌ది నిమిషాల్లో నిల్వ‌లు  అయిపోతున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ మాయాజాలం. నిల్వ కేంద్రాల్లో నాసిర‌క‌మైన ఇసుక ఉంటే...నాణ్య‌మైన‌ది ఎక్క‌డికో పోతోంది" అని ర‌ఘురామ‌కృష్ణంరాజు చాలా విలువైన ప్ర‌శ్న‌లు జ‌గ‌న్ స‌ర్కార్‌కు సంధించారు.  

"తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారానికి సీఎం జ‌గ‌న్ రూ.100 కోట్లు ఇస్తే ఒక రూపాయి అయినా అధికారులు ఖ‌ర్చు చేశారా?   జూన్ వ‌చ్చినా తాగునీటి స‌మ‌స్య‌పై స‌మీక్షా స‌మావేశం పెట్ట‌లేదు. జిల్లా అధికారుల‌కు ఇదేమి నిర్ల‌క్ష్యం?" అని ప్ర‌కాశం జిల్లా కందు కూరు ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. మానుగుంట ఆరోప‌ణ‌లు, ఆగ్ర‌హం కేవ‌లం అధికారుల‌పై మాత్రం అని స‌రిపెట్ట‌లేం. ఎందుకంటే రాజును బ‌ట్టి కిందిస్థాయి అధికారులు న‌డుచుకుంటారు. సీఎం నుంచి వ‌చ్చే ఆదేశాల‌కు అనుగుణంగా జిల్లా ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకుంటారు.

వైసీపీలో నిర‌స‌న గ‌ళాలు పార్టీకి, ప్ర‌భుత్వానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇటీవ‌ల మ‌నం ఉద‌హ‌రించిన నిర‌స‌న గ‌ళాలు పైకి వినిపించిన‌వి, క‌నిపించిన‌వి మాత్రమే. ఆఫ్ ది రికార్డుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు త‌మ‌కు స‌న్నిహితులైన జ‌ర్న లిస్టులు, రాజ‌కీయ విశ్లేష‌కుల వ‌ద్ద మాట్లాడుతూ జ‌గ‌న్ ప్ర‌భుత్వ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వంలో రాజ‌కీ యాల‌కు సంబంధం లేని వాళ్లంతా అధికారాన్ని చెలాయిస్తూ పార్టీని, ప్ర‌భుత్వాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. అందుకే త‌మ‌కెందుకులే అని మౌనంతో నిర‌స‌న ప్ర‌క‌టించే వాళ్ల సంఖ్య కూడా త‌క్కువేం కాదు.

ఉదాహ‌ర‌ణ‌కు కుక్క‌ర్‌ను తీసుకుందాం. ఆవిరి బ‌య‌టికి పోయేందుకు స‌న్న‌ని బొర‌క ఉంటుంది. అదే ఆవిరి కుక్కర్ నుంచి బ‌య‌టికి వెళ్లే మార్గం లేక‌పోతే...ఒక ద‌శ‌కు వ‌చ్చే స‌రికి పేలిపోతుంది. ఈ చిన్న లాజిక్‌ను ప్ర‌స్తుత అధికార పార్టీ వైసీపీ అర్థం చేసుకుంటే అంతా మంచే జ‌రుగుతుంది. లేదంటే ఏం జ‌రుగుతుందో కాల‌మే జ‌వాబు చెబుతుంది.

-సొదుం

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

గృహ‌మే లేకుండా ప్ర‌జ‌ల‌తో గృహ ప్ర‌వేశం చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?