cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

కెవిః అవకాశాలు కురుస్తాయా?

కెవిః అవకాశాలు కురుస్తాయా?

కోవిడ్ వచ్చిన కొత్తల్లో భారతీయులం గజగజ వణికాం. అసలే ఆర్థికపరిస్థితి బాగా లేదు, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు యిదొకటా, దేశం ఓ పదేళ్లు.. కాదు, కాదు.. యిరవై ఏళ్లు వెనకబడిపోతుంది అని తల్లడిల్లాం. కానీ ఇటీవల మనకు ఆశాభావం పుట్టుకుని వచ్చి, దీనివలన మనకు మంచే జరుగుతుంది అనుకుంటున్నాం. దేనివలన? ప్రపంచమంతా కరోనా విషయంలో చైనాపై ఆగ్రహంగా వుంది కాబట్టి, విదేశీ సంస్థలన్నీ తమ యూనిట్లను చైనా నుంచి  తరలించి భారత్‌లో నెలకొల్పుతాయని, కొత్తగా యూనిట్లు కూడా మనకే వస్తాయని అనుకుంటున్నాం. ప్రతి ప్రమాదాన్ని అవకాశంగా మలచుకుంటాం అని మన నాయకులు చెప్పినదాన్ని విశ్వసిస్తున్నాం. దీని కారణంగా మన దేశం ఆర్థికంగా ఎక్కడికో వెళ్లిపోతుందని అంచనాలు వేస్తున్నాం.

ఆశావాహ దృక్పథం వుండడం మంచిదే, కానీ క్షేత్రస్థాయి వాస్తవాలను కూడా లెక్కలోకి తీసుకోవాలి కదా! మన దేశంలో ఉత్పత్తి రంగం ఎలా వుంది? దానికి చోదకశక్తి ఐన పరిశోధనా రంగం ఎలా వుంది అనేది గమనించాలి. 1991లో గ్లోబలైజేషన్ తర్వాత నుంచి మనం మాన్యుఫేక్చరింగ్ రంగాన్ని అశ్రద్ధ చేస్తూ వచ్చాం. ఏదైనా వస్తువును కష్టపడి తయారు చేసుకునే బదులు దిగుమతి చేసేసుకుంటేపోయె కదా అనే ఆలోచనా ధోరణి ప్రబలింది. దేశీయ పరిశ్రమలను పాడుపెట్టి, దిగుమతులు ప్రోత్సహిస్తూ పోయాం. అలా దిగుమతి అయిన వాటిలో కొన్ని నాణ్యత విషయంలో మిన్నగా వుండడం, కొన్ని ధర విషయంలో చౌకగా వుండడం వలన స్వదేశీ వస్తువులపై ఆదరణ తగ్గింది. మన సమాజంలో విదేశీ బ్రాండ్ల లేబుల్‌పై మోజు పెరిగి నాణ్యత, ధర విషయం పట్టించుకోకుండా కొనే ధోరణి పెరిగడంతో కూడా స్థానికంగా తయారయ్యేవి అమ్ముడుపోని దుస్థితి దాపురించింది.

మన జిడిపిలో మ్యాన్యుఫేక్చరింగ్ రంగం వాటాలో మార్పులను దశాబ్దకాలంలో చూసుకుంటే 2008లో 32% ఉండగా, అది 2011 నాటికి 30%, 2014 నాటికి 27% తగ్గుతూ వచ్చింది. 2018-19 నాటికి అది 29.6% కి చేరింది. (pl see the note below) దేశప్రజల్లో అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించే వ్యవసాయరంగం వాటా కూడా 17% నుంచి 14%కు పడిపోయింది. మరి సర్వీసు రంగం చూడబోతే 2008లో 45% ఉన్నది 2018 వచ్చేసరికి 52% అయింది. అంటే మన విద్యావంతులు విదేశీ సంస్థలకు రకరకాల సేవలందిస్తూ జిడిపిని పెంచుతున్నారు తప్ప, స్వయం ఉపాధి కల్పించుకోలేక పోతున్నారన్నమాట. ఐటీ రంగంలో అయితే ఓ రకంగా బాడీషాపింగ్ స్థాయికి దిగజారిపోయామన్నది అనటానికి, వినటానికి కష్టంగానే వున్నా వాస్తవమైతే అదే.

ఇక చైనా 1990లో ప్రపంచ ఉత్పత్తిలో 3% వాటా నుంచి ప్రస్తుతానికి దాదాపు 50% వాటాకు చేరింది. మన దేశంలో యీ పతనానికి కారణాలు అనేకం ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించి చేసిన చట్టం 1941 నాటిది. దానిలో బాయిలర్ హౌస్ గురించి కూడా ప్రస్తావన వుంటుంది. ఈనాడు అత్యాధునికమైన సాంకేతికతో నడుస్తున్న పరిశ్రమలు కూడా సంబంధిత శాఖ నుంచి సర్టిఫికెట్టు తెచ్చుకోవాలి. ఓ పట్టాన ఫైళ్లు కదలవు. రోజుకి యిన్ని ఫైళ్లు కదల్చాలని, యిన్ని నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వోద్యోగులకు టార్గెట్లు ఉండవు. ఏ నిర్ణయం తీసుకుంటే తనకు రిటైర్‌మెంటు వేళ ముప్పు వస్తుందోనన్న భయంతో ఉద్యోగులు వాయిదాలు వేస్తూ గడిపేస్తారు.

ప్రతి శాఖలో యిలాటి అడ్డంకులు బోల్డు. అనేక శాఖల సమన్వయం కుదిరితే తప్ప పరిశ్రమలు ప్రారంభించలేం. కంట్రోళ్లు తీసేశాం, లైసెన్సింగ్ విధానం సరళీకృతం చేశాం, సింగిల్ విండో పెట్టాం అంటారు కానీ గోదాలోకి దిగినపుడే తెలుస్తుంది – అవన్నీ ఒట్టి నినాదాలే అని. చట్టాల్ని ఆధునీకరించి, ప్రభుత్వ కార్యాలయాలలో రెడ్‌టేప్‌ అనేది లేకుండా చేసినపుడే ఔత్సాహికులు యీ రంగంవైపు చూపు సారిస్తారు. ప్రస్తుత పరిస్థితిని అత్యయిక పరిస్థితిగా చూపి ప్రభుత్వం అనేక అధికారాలను చేజిక్కించుకుంటోంది. ఈ ‘అత్యయిక పరిస్థితి’లోనే యీ మార్పులన్నీ రోజుల వ్యవధిలో చేయాలి.

ఇక సమాజం కూడా పారిశ్రామికవేత్తను దోపిడీదారుగా చూస్తుంది. ఇతర దేశాల్లో పరిశ్రమలకు ప్రభుత్వం భూమి యివ్వడం సర్వసాధారణం. ఇక్కడ ప్రభుత్వం చౌకధరకు యిచ్చినా, వెంటనే మీడియా, ప్రజలు ఏకేస్తారు. అది నిరుపయోగకరమైన భూమి ఐనా, మార్కెట్ రేటు కంటె ఎక్కువ పెట్టి కొన్నా ప్రభుత్వాధినేతకు లంచాలిచ్చి సాధించుకున్నాడని ఆరోపిస్తారు. ఆ స్థలానికి రోడ్డు వేసినా, కరంటు, నీళ్లు యిచ్చినా గగ్గోలు పెట్టేస్తారు.

స్థానికులకు నైపుణ్యం లేకపోయినా ఉద్యోగాలు యిచ్చి తీరాలని పట్టుబడతారు. స్థానికి ప్రజాప్రతినిథులు వచ్చి బెదిరిస్తారు. ఎన్నికలకు నిధులివ్వమంటారు. ఇంతా చేసి పర్యావరణాన్ని పాడు చేస్తున్నాయని ఆరోపిస్తారు. పాడు చేసిన సందర్భాల్లో తప్పకుండా నిలదీయాలి. కానీ కాలుష్యం కలిగే అవకాశమే లేని పరిస్థితుల్లో కూడా యిలాటి ఆరోపణలు గుప్పిస్తారు.

ఊరవతల ఫ్యాక్టరీ వెలిసినప్పుడు అక్కడ జనావాసమే ఉండదు. తర్వాత చుట్టూ కాలనీలు వెలుస్తాయి. పారిశ్రామికవాడలో వసతి గృహాలు అనుమతించము అని ప్రభుత్వం అనదు. చిత్తమొచ్చినట్లు యిళ్లు కట్టనిస్తుంది. ఓ 20, 30 ఏళ్లకు ఇళ్ల మధ్య ఫ్యాక్టరీ ఏమిటి, తీసేయాలి అని సామాజిక కార్యకర్తలు ఆందోళన మొదలుపెడతారు. భారీ యంత్రసామగ్రిని తరలించడం, రవాణా సౌకర్యాలను వదులుకోవడం, కొత్త ప్రదేశంలో విద్యుత్, నీరు ఏర్పాటు చేసుకోవడం ఎంత కష్టం? ఇలాటి పరిస్థితులు కూడా మారాలి.

ఇల్లలకగానే పండగ కానట్లు, వస్తువులు తయారుచేయగానే సిరులు కురవవు. వాటిలో నవ్యత, నాణ్యత ఉండాలి. అప్పుడే స్థానికంగా కానీ, విదేశాలలో కానీ మార్కెట్ వుంటుంది. పరిశ్రమ నిలదొక్కుకుంటుంది. ఆర్ అండ్ డి (పరిశోధన, అభివృద్ధి) ఉన్నపుడే మన ఉత్పాదనకు ఎడ్జ్ (యితరుల కంటె మెరుగనిపించుకోవడం) ఉంటుంది. అయితే దేశంలో ఆర్ అండ్ డి పరిస్థితి ఏమిటి? దాని గురించి కాస్త విపులంగా చర్చించుకోవాలి.

2017లో ఆర్ అండ్ డి పై ఖర్చయినది 1.7 ట్రిలియన్ (అంటే లక్ష కోట్ల) డాలర్లు. దానిలో అగ్రస్థానం అమెరికా, చైనా, జపాన్‌లది. భారత్ వాటా 2.8%. దీనిలో ప్రభుత్వపు వాటా, ప్రయివేటు వాటా కూడా కలిసి వుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాలు పరిశోధనపై ఎంతెంత ఖర్చు పెడుతున్నాయో పోల్చి చూడాలంటే జిడిపిలో జిఇఆర్‌డి (గ్రాస్ ఎక్స్పెండిచర్ ఆన్ ఆర్ అండ్ డి)  శాతం తెలుసుకోవాలి. అప్పుడే ఎంత చెట్టుకు ఎంత గాలి వీస్తోందో తెలుస్తుంది. అమెరికాలో 2.8%, చైనాలో 2.1% ఇజ్రాయేలులో 4.3%, కొరియాలో 4.2% ఉంటే ఇండియాలో కేవలం 0.6% - 0.7% మధ్య ఉంటోంది. 1990లోనూ అంతే, యిప్పుడూ అంతే.

2004-05లో పరిశోధనలలో ప్రభుత్వ పెట్టుబడి 18 వేల కోట్లు అంటే నామినల్ జిడిపిలో 0.5%, ప్రయివేటు పెట్టుబడులు 6 వేల కోట్లు అంటే 0.2%. 2008-09లో ప్రభుత్వంది 33 వేల కోట్లు (0.5%), ప్రయివేటుది 14 వేల కోట్లు (0.2%). 2012-13లో ప్రభుత్వంది 47 వేల కోట్లు (0.4%), ప్రయివేటుది 27 వేల కోట్లు (0.2%). 2016-17లో ప్రభుత్వంది 61 వేల కోట్లు (0.4%), ప్రయివేటుది 44 వేల కోట్లు (0.3%). ఎలా చూసినా మొత్తం 7% దాటటం లేదు.

ప్రభుత్వం తన శాఖల ద్వారా చేయించే పరిశోధనలలో ఎ) డిఫెన్స్, ఎటామిక్, స్పేస్‌లపై దాదాపు మూడింట రెండు వంతులు ఖర్చవుతోంది. బి) సైన్స్, టెక్నాలజీకి సంబంధించినవాటిపై 22%, సి) మెజారిటీ జనాభా ఉపాధికి ఆధారభూతమైన వ్యవసాయంపై 12% ఖర్చు చేస్తూ డి) ఆరోగ్యపరిశోధనలపై 3% ఖర్చు చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం ఎంత పొరపాటో కరోనా మనకు బుద్ధి చెప్పింది. వీటి వివరాలలోకి వెళితే ఎ) గ్రూపులో డిఆర్‌డిఓ (డిఫెన్స్ రిసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్), డిఏఇ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎటామిక్ ఎనర్జీ), డిఓఎస్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్) ఉన్నాయి. 2010-11లో పరిశోధనలపై ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు 63% దీనికే పోయింది. అంటే 2012-13లో 63%, 2014-15లో 67%, 2017-18లో 62%. మొదటిదానిపై 32-38%, రెండవదానిపై 10-12%, మూడోదానిపై 16-19% ఖర్చవుతున్నాయి.

బి) గ్రూపు కింద ఉన్న సిఎస్‌ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్), డిబిటి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ), డిఎస్‌టి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)ల వాటా 2010-11లో 22%, 2012-13లో 22%, 2014-15లో 21%, 2017-18లో 21%   మొదటిదానిపై 10-11%, రెండవదానిపై 3-4%, మూడవదానిపై 7-8% ఖర్చవుతున్నాయి.

సి) గ్రూపులో ఉన్న ఐసిఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్రికల్చరల్ రిసెర్చ్)పై 2010-11లో 12%, 2012-13లో 12%, 2014-15లో 11%, 2017-18లో 11% ఖర్చయింది., డి)లో ఉన్న ఐసిఎమ్‌ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్)పై 2010-11లో 3%, 2012-13లో 3% 2014-15లో 2.4%, 2017-18లో 3% ఖర్చయింది.

పరిశోధనలలో ఖర్చు రీత్యా ప్రభుత్వ వాటా ఎంతో, ప్రయివేటు సంస్థల వాటా ఎంతో చూదాం. 2017-18లో మొత్తం ఖర్చులో కేంద్రప్రభుత్వ వాటా 45%, ప్రయివేటు సెక్టార్ ఇండస్ట్రీ వాటా 37%, స్టేట్ సెక్టార్ వాటా 6%, పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ వాటా 5%, యూనివర్శిటీలు, యితర విద్యా సంస్థల వాటా 7%. పబ్లిక్ సెక్టార్ సంస్థలు తమ సేల్స్‌లో 0.3% పరిశోధనలపై ఖర్చు పెడితే, ప్రయివేటు సెక్టార్ సేల్స్‌పై 1.5% ఖర్చుపెడుతోంది. లాభదాయకమైన 257 పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో 25% మాత్రమే పరిశోధనపై వెచ్చించాయి.

ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్‌ ఆర్ అండ్ డికి, మరోదానికి లింకు లేదు. ఒకరు కొంతవరకు చేస్తే తక్కినది మరొకరు అందిపుచ్చుకునేట్లా చేసే సంస్థాగతమైన సమన్వయ శాఖ లేదు. దానివలన ఒకే దానిపై రెండు సంస్థలు పరిశోధించే ప్రమాదం వుంది. పబ్లిక్ సెక్టార్‌ సంస్థల్లో ఆ మాత్రమైనా ఖర్చుపెట్టినది డిఫెన్స్, ఫ్యూయల్, ఇండస్ట్రియల్ మెషినరీపై కాగా, ప్రయివేటు సెక్టార్ సంస్థలు ఖర్చు పెట్టినది డ్రగ్స్, ఫార్మా, ట్రాన్స్‌పోర్టేషన్, ఐటీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రీస్ వగైరా. (సశేషం)

కె.ఐ. వరప్రసాద్ రెడ్డి
వ్యవస్థాపక చైర్మన్, శాంతా బయోటెక్

 


×