Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఆకాశవాణిలో యద్దనపూడి

ఆకాశవాణిలో యద్దనపూడి

ఈమధ్యనే అమెరికాలో కన్నుమూసిన  ఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి యద్దనపూడి సులోచనారాణిపై మీడియాలో ఇంకా కథనాలు వస్తూనే ఉన్నాయి. అనేకమంది రచయితలు, రచయిత్రులు, టీవీ, సినిమా రంగాలకు చెందినవారు ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆమె ప్రతిభాపాటవాలను, నవలలలోని సౌరభాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. సినిమా సెలబ్రిటీల గురించి ఎక్కువగా మాట్లాడే తెలుగు మీడియా ఒక తరం తెలుగు పాఠకులను ఉర్రూతలూపిన, ఆ తరువాత వచ్చిన రచయితలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన యద్దనపూడి గురించి ఇన్ని రోజులు మాట్లాడుకోవడం అరుదైన ఘటనగానే చెప్పుకోవాలి.

కేవలం దూరదర్శన్‌ మాత్రమే ఉన్న రోజుల్లోను, అంతకుముందు కూడా ఆకాశవాణి (ఆలిండియా రేడియో) రాజ్యమేలింది. రేడియో లేదా ట్రాన్సిస్టర్‌ లేని ఇల్లంటూ ఉండేది కాదు. అందులో ప్రసారమయ్యే కార్యక్రమాలకు ఎందరో అభిమానులు. ఆ రోజుల్లో ఆకాశవాణి శ్రోతలను యద్దనపూడి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆమె నవలలు నాటక రూపంలో ప్రసారమయ్యాయి. నవలా పఠనం కార్యక్రమంలో అలరించాయి. ఆకాశవాణితో యద్దనపూడి అనుబంధం గురించి ఒకప్పటి టాప్‌ రేడియో అనౌన్సర్‌, కళాకారిణి శారదా శ్రీనివాసన్‌ తన రేడియో జ్ఞాపకాల్లో రాశారు.

అదేంటో చూద్దాం....''నేను నాటకాల గురించి చెప్పుకుంటున్నప్పుడు యద్దనపూడి సులోచనారాణి పేరు ముందస్తుగా చెప్పుకోవల్సిన పేరు. నేను ప్రొడక్షన్‌ కూడా చెయ్యడం మొదలుపెట్టిన కొత్తలో ఆవిడ నవలలను నాటకాలుగా చేశాను. తను నేను రేడియోలో చేరిన కొత్తలో రేడియోకి వస్తుండేది. నాటకాల్లో పాల్గొనేది. ఏఐఆర్‌ పక్కనే ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌. అందులోనే తన ఉద్యోగం. తన నవలలంటే నాకు చాలా ఇష్టం. అక్కయ్యగారి స్త్రీల కార్యక్రమంలోనే 'సెక్రటరీ' నవలను గొల్లపూడి మారతీరావు, డి.వెంకట్రామయ్యగారు నాటకీకరించగా వేశాము.

అసలే అది సులోచనారాణి పేరొందిన నవల. అందులో హీరోయిన్‌గా నేను వేశాను. విఠల్‌ హీరో. నేనే ప్రొడ్యూస్‌ చేశాను. జనాలు విరగబడి చూశారు. కాదు విన్నారు. పండా శమంతకమణి కూడా మా రేడియో అనౌన్సరే. మంచి డ్రామా ఆర్టిస్టు కూడాను. తను కూడా సులోచనారాణి ఒకటి రెండు రేడియోకి చేసింది. 'విజేత' కూడా నేనే చేశాను. ఇంకా ఒకటి రెండు చేసినట్లు గుర్తు. పేర్లు జ్ఞాపకం లేవు. ఫలాన నవల రేడియోకి చెయ్యాలనుంది, ఇవ్వమని అడిగితే నువ్వేస్తానంటే ఇస్తాననేది. అసలు నేనెయ్యాలనే కదా నేనడిగేది కూడా.

తన కథలన్నా నాకు చాలా ఇష్టం. సులోచనారాణి నవల చదువుతుంటే ఆపడం కష్టం. కూర మాడిపోయినా, పప్పు అడుగంటినా, ఆ కంపు మన ముక్కులకు సోకకుండా చేయగల శక్తి ఉంది ఆ నవలలకు. సులోచన నిగర్వి. స్నేహశీలి. మేము మంచి స్నేహితులం ఆ రోజుల్లో''....యద్దనపూడి ఇటు పుస్తకాల రూపంలోనూ, అటు ఆకాశవాణి ద్వారాను అభిమానుల హృదయాలను దోచుకున్నారు.

('శారదా శ్రీనివాసన్‌ 'నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు' నుంచి)

-మేనా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?