cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

వైసీపీలో నో సౌండ్

వైసీపీలో నో సౌండ్

రాజకీయం అంటేనే హడావుడి ఉండాలి, సందడి చేయాలి, అలికిడితో హడెలెత్తించాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నపుడు ఇదే కనిపించేది. సాధారణ కార్యకర్త సైతం సైకిలెక్కి మరీ గర్జించేవాడు. 

నాటి మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా  ఉండేవారు. ఇక ఎమ్మెల్యేలు సామంతరాజులే.  సీనియర్ నాయకులు కూడా దూసుకుపోయేవారు. అలా ఆర్భాటానికి మారుపేరుగా టీడీపీ అయిదేళ్ల పాటు రాజ్యమేలింది. 

వైసీపీ అదికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడచినా ఆ దర్పం, దర్జా ఎక్కడా కనిపించడంలేదు. 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది, విశాఖ సిటీలో తప్ప అంతటా ఫ్యాన్ గిర్రున తిరిగేసింది. ఇక, విశాఖ సిటీకే చెందిన భీమిలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు మంత్రి పదవిని జగన్ కట్టబెట్టారు. సిటీ చుట్టుపక్కలా వైసీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. మరి ఇంతటి అధికార వైభోగం చెంత  ఉన్నా వైసీపీ ఎందుకో సౌండ్ చేయలేకపోతోంది. 

వైసీపీలో సీనియర్లు ఉన్నారు, కొత్తవారు ఉన్నారు కానీ ఎవరూ తమేకం పట్టనట్లుగా ఉంటున్నారు. ఏ ప్రాంతానికీ లేని గౌరవాన్ని ముఖ్యమంత్రి జగన్ విశాఖకు ఇచ్చారు. విశాఖను పాలనారాజధానిగా చేస్తూ చట్టమే చేశారు. ఇపుడు అది న్యాయ స్ధానంలో ఉంది, తీర్పు ఎపుడు వచ్చినా విశాఖకు రాజధాని తరలిరావడం ఖాయం. అంతటి అతి ముఖ్యమైన నగరంలో వైసీపీ రాజకీయం దూకుడుగా సాగకపోతే ఎలా అన్నదే ఇపుడు  పార్టీలో జరుగుతున్న చర్చ. 

మంత్రి అవంతి శ్రీనివాసరావు మంత్రిగా ఇంకా కొత్తగానే వ్యవహరిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మీద ఇప్పటికీ పట్టు సాధించలేకపోతున్నారు. విశాఖ జిల్లాలోని సింహాచలం ఆలయం తరచూ వివాదాలలోకి వస్తూంటే మంత్రిగా సమీక్ష చేసి సరిదిద్దలేకపోతున్నారు. అయిదేళ్ల కాలంలో అయిన కాడికి భూములను కాజేసి అప్ప్నేక శఠగోపం పెట్టేసిన తెలుగుదేశం నేతలు తెల్లారిలేస్తే వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్నా ఏకైక మంత్రి అవంతి కనీసం ఖండించడంలేదు, కస్సుమని ప్రత్యర్ధి పార్టీ మీద దూసుకురావడంలేదు. 

ఇక, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నుంచి టీడీపీ నేతల వరకూ అంతా వైసీపీ సింహగిరి భూములను అప్పన్నంగా దోచుకుంటోందని అదే పనిగా ప్రచారం చేస్తున్నా కనీసం ఆ బురద తుడుచుకోవడానికి కూడా ప్రయత్నం చేయకపోవడం వైసీపీ రాజకీయ వైఫల్యంగానే చూడాలి. 

ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో టీడీపీకి కౌంటర్లు ఇస్తున్నా స్ధానికంగా ఉన్న వారు బాధ్యత వహిస్తే వైసీపీకి మరింత రాజకీయ మైలేజి రావడమే కాదు, పార్టీ పట్ల జనంలో ఉన్న కూడా ఆదరణ పెరుగుతుంది. 

ప్రత్యర్ధి టీడీపీ తెలివిగా చేస్తున్న ఆరోపణలు కూడా మబ్బుల్లా గాలిలోకి కొట్టుకుపోతాయి. కానీ అవంతి శ్రీనివాసరావు ఎందుకో పెద్దగా ముందుకు రావడంలేదు. దాంతో, టీడీపీ చేస్తున్న ఆరోపణలే నిజమని జనం గుడ్డిగా నమ్మే పరిస్థితి ఉంది. 

విశాఖలో రాజధాని నగరం ఏర్పాటుచేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, విశాఖకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుఞదని వివరించే బాధ్యత కలిగిన మంత్రి ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. ప్రభుత్వ పక్షాన ప్రజలకు భరోసా ఇవ్వడమే కాదు, విశాఖ జనాల భయాలను పోగొట్టలేకపోతున్నారని విమర్శలు ఉన్నాయి. 

ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ఓ ఎంపీ విశాఖ రాజకీయం గురించి మాట్లాడుతూంటే స్ధానికంగా ఉన్న వైసీపీ నేతలు ఇది తప్పు అని చెప్పలేని నిస్సహాయతతో ఉండడమే సిటీలో వైసీపీ పరిస్థితి ఏంటో చెప్పకనే చెబుతోంది.

ఆ ఎంపీ కూడా విశాఖలో భూ దందా జరుగుతోందని, అప్పన్న భూములన్నీ అమ్మేసుకుంటున్నారని విమర్శలు చేస్తూంటే అందులో నిజానిజాలు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మంత్రితో పాటు, స్ధానిక వైసీపీ ఎమ్మెల్యేకు లేకపోవడమే బాధాకరమని పార్టీలో వినిపిస్తున్న మాట. చివరికి తాము ఏరి కోరి నియమించిన సింహాచలం దేవస్ధానం చైర్‌పర్సన్ సంచయితగజపతిరాజు వివాదాలలో ఇరుక్కుంటే అంతా కూర్చుని సమస్యలను పరిష్కరించుకునే రాజకీయ తెలివిడి లేకుండా వైసీపీ జిల్లా నాయకత్వం వ్యవహరించడంతో తెలుగుదేశానికి అడ్డంగా దొరికిపోతున్నారు.. 

సంచయితకు రాజకీయాలు కొత్త, ఆమెతో కలసి సింహాచం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడంతో పాటు, ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మంత్రిగా అవంతికి ఉంది. ఆయన తెలుగుదేశం తమ పార్టీపైన చేస్తున్న ఆరోపణలను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. 

విశాఖను పాలనారాజధానిగా ప్రకటించిన తరువాత అక్కడ చీమ చిటుక్కుమన్నా కూడా ప్రపంచానికి చేరిపోతోంది. అందులో ఎక్కువగా వ్యతిరేక ప్రచారమే సాగుతోంది. విశాఖలో భద్రత లేదని, ప్రమాదకర రసాయన పరిశ్రమలు ఉన్నాయని టీడీపీ అధినాయకత్వమే ఆరోపణలు గుప్పిస్తోంది. 

మరి, కేవలం పదిహేను నెలల వ్యవధిలో తాము ఏం చేశామో  చెప్పడమే కాదు, ఆ పరిశ్రమలు పుట్టు పూర్వోత్తరాలను జనం ముందు పెడితే వైసీపీకి విలువ పెరిగేది, ఆరోపణలు కూడా జనం నమ్మే  పరిస్థితి ఉండేది కాదు. 

లెబనాన్ రాజధాని బీరూట్‌లో జరిగిన అమ్మోనియం నైట్రేట్ నిల్వల ప్రమాదం తరువాత విశాఖలో ఉన్న అమ్మోనియం నైట్రేట్ మీద అందరి కన్నూ పడింది. జనం కూడా సహజంగానే భయపడుతున్నారు. ఈ విషయంలో కూడా అధికారుల స్ధాయిలోనే  సమీక్షలు జరుగుతున్నాయి, తప్ప రాజకీయ నిర్వాహకులు ప్రజలకు తాము ఏం చేస్తున్నది చెప్పలేకపోవడం కూడా ఓ విఫల పాలనగానే చూడాలని అంటున్నారు.  

విశాఖలో టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పలువురు జగన్ సమక్షంలో జెండా కప్పుకుని పార్టీలో చేరారు. వారంతా తమ అనుభవాన్ని ఉపయోగించి విశాఖపైన జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సి ఉంది, అలాగే, పార్టీపైన, ప్రభుత్వం పైన జల్లుతున్న బురదను ఎప్పటికపుడు కడిగేస్తూ గత పాలన వైఫల్యాలను జనం ముందుంచాల్సి ఉంది. కానీ పార్టీలో చేరికతోనే మౌన వ్రతం పాటిస్తున్నారు. 

మరి, వారి సేవలను పార్టీ తీసుకోవడం లేదో, వారే చొరవచూపడంలేదో తెలియదు కానీ అన్నీ ఉండి అయిదవతనం కరవు అన్నట్లుగా వైసీపీ పరిస్థితి తయారవుతోందన్న ఆందోళన అయితే కార్యకర్తలతో ఉంది. మరి ఆ జోష్ వైసీపీకి ఇప్పట్లో వస్తుందా..

రైతుల్ని భ్రమల్లోనే ఉంచుతున్న బాబు

కేసిఆర్ అడ్డాపై కన్ను

 


×