cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఎటు పోతోందీ మన మీడియా స్వామ్యం?

ఎటు పోతోందీ మన మీడియా స్వామ్యం?

గడచిన మూడు రోజులుగా ఆంద్రప్రదేశ్ శాసన సభ సాక్షిగా జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎటు పయనిస్తోందో అనిపిస్తోంది. ప్రతిపక్షం ప్రస్తావనలు, అధికార పక్షం ఎదురుదాడులు, మీడియా దానికి వంత పాడడాలు చూస్తుంటే మీడియా బలం వున్నవాడిదే రాజ్యం అని స్పష్టంమవుతోంది. ప్రతి పక్షం నిలదీయడం తప్పు కాదు..అధికార పక్షం ఎదురుదాడికి దిగడం అంతకన్నా తప్పు కాదు. కానీ మధ్యలో మీడియాకు ఏమొచ్చే మాయరోగం? ప్రతి మీడియాకు విస్తృతమైన నెట్ వర్క్ వుంది కదా? మరి గడచిన మూడు నెలల్లో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ హత్యలు జరిగాయి? వాటిలో వైకాపా వారు ఎంత మంది? తేదేపా వారు ఎంత మంది? ఈ హత్యల వెనుక కారణాలేమిటి? ఆ కేసుల పరిస్థితి ఏమిటి అన్నది ఒక్క వార్త ప్రచురించాయా? వైఎస్ హయాంలో జరిగిన సవాలక్ష అవకతవకలపై వండి వార్చిన కథనాలను అదే పనిగా మళ్లీ మళ్లీ ప్రచురించడంలో వున్న శ్రద్ధలో పదో వంతు వీటిపై ఎందుకు పెట్టడం లేదు? 

అసల సమస్య వడ్ల గింజలో బియ్యపు గింజ అంత. 11 లేదా 12 లేదా 18 హత్యలు జరిగాయని వైకాపా అంటోంది. దానికి ప్రభుత్వం ఏం చెప్పాలి. అన్ని జరగలేదు..లేదా జరిగినవి ఇవీ..వీటికి కారణాలు ఇవీ..వీటిలో అరెస్టులు ఇవీ అని. అంతే కదా?

కానీ ఏం చెబుతోంది? తప్పుడు లెక్కల చెబుతున్నారు? మరి మీరు కరెక్ట్ లెక్కలు చెప్పచ్చు కదా?, జగన్ పెద్ద దొంగ చిన్నప్పుడు అలా చేసారు..పెద్దయ్యాక అలా చేసారు..వీటికి ఇప్పటి హత్యల ప్రస్తావనకు సంబంధం వుందా? ఉదాహరణకు ఓ రౌడీ వంద తప్పులు చేసాడు. వాడిని ఎవరో మర్డరు చేసారు. వాడి తమ్ముడు నా అన్నను చంపేసారయ్యా అంటే..మీ అన్న పెద్ద రౌడీ..వాడో వెధవ అంటూ ఎదురుదాడికి దిగుతారా?లేక హత్య కేసు పరిశోధించి అసలు నేరస్థుడిని అరెస్టు చేస్తారా? 

జగన్ తేదేపా ఎమ్మెల్యేలను బపూన్లు అన్నాడు. తప్పే. మరి వారు అతగాడని ఎన్ని మాటలు అన్నారు అసెంబ్లీ సాక్షిగా. గంటకో నోట్, పూటకో సమాచారం చకచగా తెలుగుదేశం పార్టీ మీడియా విభాగం నుంచి చకచకా తయారుచేస్తూ, వాటిని పార్టీ సభ్యులకు చకచకా ఈ మెయిళ్ల ద్వారా పంపిస్తూ, వారిని ఏ విధంగా దాడికి దిగాలో పార్టీ తరపును దిశానిర్ధేశం చేస్తున్నారు. చిత్రంగా అవే మర్నాడు మీడియాలో వార్తలవుతున్నాయి. 

చంద్రబాబు నిన్న ఏమన్నారు?శాంతి భద్రతలు ప్రశాంతంగా వన్నాయి. టెర్రరిస్టు ఏక్టివిటీలు లేవు. నక్సలిజం సమస్య లేదు అన్నారు. మరి పనిలో పనిగా ఈ హత్యలు, వాటి వైనాలపై కూడా ఓ మాట చెప్పేయచ్చు కదా? సమస్య తీరిపోతుంది. ఎన్నో శ్వేత పత్రాలు ఇస్తున్నారు. గడచిన మూడు నెలల వ్యవహారంపై కూడా శ్వేత పత్రం ఇచ్చి, జగన్ ఆరోపణలు తప్పు అని నిరూపించవచ్చు కదా. 

కానీ ఇలా గోటితో పోయే దానిని గొడ్డలి దాకా ఎందుకు తెస్తున్నారు? జగన్ కానీ అతగాడి పార్టీ కాని చంద్రబాబుపై లేదా తెలుగు దేశం నాయకులపై వ్యక్తిగత ఆరొపణలు కానీ, వ్యక్తిగత శీల హననం కానీ చేయడం లేదు. కానీ తెలుగుదేశం కేవలం జగన్ వ్యక్తిగత శీల హననానికి తప్ప మరి దేనికీ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదు. వాళ్ల మంగళికృష్ణ, పరిటాల రవి వ్యవహారాలు, వీరు వంగవీటి రంగా, అనడం చూస్తుంటే నువ్వు హంతకుడివి అంటే, నువ్వు పెద్ద హంతకుడివి అని అనుకున్నట్లుగా వుంది తప్ప. శాసన సభ చర్చలకు దిగాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తున్నట్లు లేదు.

ఈ విషయమై నిలదీయాల్సిన బాధ్యత మీడియాకు వుంది కదా?

80 వేల కోట్ల ఆదాయం అన్నీ కలిపి వుంటే, లక్షా పదివేల కోట్ల పైగా బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారు? 85వేల కోట్ల ప్రణాళికేతర వ్యయానికే కొరత వుంటే, మరి ఆలకేషన్లకు నిధులు ఎక్కడకు ఎలా తెస్తారు?

రుణమాఫీ సంగతేమటి? ఆర్బీఐ సహకరించడం లేదు? మనమే ఏదో చేయాలి అన్నారు. ఆ ఏదో ఏమిటో, శాసనసభలో చెప్పాలి కదా?

డ్వాక్వా రుణాల మాటేమిటి?

20 వ తెదీ నాటికి వస్తుందనుకున్న రాజధాని కమిటీ నివేదిక రాలేదేమి?

అది రాకుండా తాత్కాలిక రాజధాని నిర్ణయం అసెంబ్లీ బయట ఎందుకు తీసుకున్నారు?

పదేళ్ల ఉమ్మడి వుండగా ఎందుకు ఈ తొందర? మిగిలిన విభజన షరతులు అన్నీ యధావిధిగా అమలు జరగాలంటున్నవారు, ఈ పదేళ్లను ఎందుకు వదిలేస్తున్నారు?

ఇలా శాసనసభలో చర్చించాల్సినవి సవాలక్ష వున్నాయి.

చంద్రబాబు ఈ మూడు నెలల శాంతి భద్రతలపై చిన్న ప్రకటన చేస్తే పోయేదానికి పార్టీ కార్యాలయం నుంచి రీసెర్చి నోట్లు సర్క్యులేట్ చేసి మరీ శాసనసభ్యులతో జగన్ పై దాడి ఎందుకు చేయిస్తున్నారు? 

వీటి వెనుక వైనమేమిటి? ఇవన్నీవెలికి తీయాల్సిన బాధ్యత తెలుగుజాతి వెలుగు మేమే అని చాటుకునే మీడియాకు లేదా?

జగన్ తిట్టండి..ఎన్నయినా చేయండి..కానీ ఇటు పక్క తప్పులు కూడా సమంగా తూచి, తమది ధర్మకాటా అని అనిపించుకోవద్దా?

తాము ఏం రాసినా, చేసినా నడిచిపోతుంది..తొంభై శాతం మీడియా ఒకే వైపు వుంది కాబట్టి, తామే రైటు అని జనం అనుకుంటారనకుంటే పొరపాటు. మిగిలిన ఊళ్ల జనం మాట అలా వుంచితే, హత్యలు జరిగిన ఊళ్ల జనానికైనా నిజం తెలియదా? తమ 'పచ్చ'పాత వైఖరితో నిజాన్ని నిలువునా దాచేస్తున్న ఈ వ్యవహారాన్ని చూసిన నిలువునా నవ్వుకోరా?

చాణక్య

writerchanakya@gmail.com

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?