Advertisement

Advertisement


Home > Articles - Special Articles

వైఎస్ కోటరీ vs వైఎస్ జగన్

వైఎస్ కోటరీ vs వైఎస్ జగన్

భరత్ అనే నేను, లీడర్ అనే సినిమాల్లో యాధృచ్ఛికంగా కావచ్చు, జనాల మదిపై వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన చెరగని ముద్రవలన కావచ్చు, కొన్ని పాత్రలు కనెక్ట్ అవుతాయి. లీడర్ లో కోటా శ్రీనివాసరావు పాత్ర, భరత్ అనే నేను సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రలతో వైఎస్ సన్నిహితుడు కేవిపి రామచంద్రరావు ని జనం పోల్చి చూసుకుంటారు. వైఎస్ జమానాలో చక్రం తిప్పిన అత్యంత సమర్థుడు, కీలకవ్యక్తి కేవిపి. వర్తమాన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు అరుదుగా వుంటారు.

మీడియాలో కనిపించరు. ఏడాదికో, ఆర్నెల్లకో తప్ప మాట్లాడరు. పబ్లిక్ లో కనిపించరు. కానీ రాజకీయాల్లో చక్రం తిప్పడం లో మాత్రం ఆయన తరువాతే అని పేరు. వైఎస్ వుండగా, పార్టీ రాజకీయాలు అన్నీ కేవిపి చుట్టూనే తిరిగేవి. పదవులు, టికెట్ లు, ఇలా వ్యవహారాలు అన్నీ వైఎస్ చేతుల మీదగా నడిచినా, దాని వెనుక రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అంతా కేవిపి ఆధ్వర్యంలోనే అని టాక్ వుండేది.

జగన్ పార్టీ పెట్టిన తరువాత ఎన్నికల టైమ్ లో చాలా మంది భావించిన విషయం ఒకటి వుంది. తండ్రికి అత్యంత సన్నిహితుడు, నమ్మస్తుడు, సమర్థుడు అయిన కేవిపిని జగన్ ఎందుకు చేరదీయలేదు? లేదా కేవిపి ఎందుకు జగన్ కు దగ్గరగా రాలేదు. ఆల్ మోస్ట్ మునిగిపోయిన నావ లాంటి కాంగ్రెస్ తోనే కేవిపి ఎందుకు వుండిపోయారు?అన్న ప్రశ్నలు చాలా మంది మదిలో మెదిలాయి. అయినా కాలం అలాగే ముందుకు సాగింది. కేవిపి కనీసం ఆంధ్ర రాష్ట్రం వంక కన్నెత్తి అయినా చూడలేదు. పోనీ తెరవెనుక జగన్ కు సలహాలు సూచనలు ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు.

కేవిపి మీద వున్న కేసులు, వాటి వ్యవహారాలు కూడా ఇప్పుడు వినిపించడం మానేసాయి. ఇదిగో ఇవ్వాళో, రేపో, విదేశీ పోలీసులు కేవిపి ఇంటి తలుపు తడతారు అన్నంతగా వార్తలు రాసిన మీడియా కూడా సైలంట్ అయిపోయింది. దాదాపుగా కేవిపిని మరిచిపోయింది.

ఇప్పుడు ఇన్నాళ్లకు

ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ ఆంధ్ర రాజకీయాల్లో కేవిపి పేరు వినిపిస్తోంది. అది కూడా బహిరంగంగా, బాహాటంగా కాదు. తెరవెనుక గుసగుసల్లో. ఆంధ్రలో ప్రతిపక్షాలను తోసిరాజని, తను అనుకున్నది అనుకున్నట్లు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మొండివాడు అందరికన్నా బలవంతుడు అన్న చందంగా వుంది వ్యవహారం. ఒక పక్క జగన్ రావడం, ఓ వర్గానికి కాళ్లు చేతులు ఆడని పరిస్థితి, ఆ వర్గం తాలూకావేల కోట్ల వ్యాపారాలు కుదేలైపోతున్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా దారుణమైన దెబ్బలు తగులుతున్నాయి. అదే టైమ్ లో కరోనా వచ్చి మరింత కల్లోలం సృష్టిస్తోంది. అప్పుడు కూడా ఆంధ్రలో వ్యాపార రంగంలో బలంగా వున్న ఆ వర్గానికి గట్టి దెబ్బ తగులుతోంది.

ఇదే టైమ్ లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ అగమ్యగోచరం అయింది. దాన్ని నమ్ముకున్న వారి ఆర్థిక మూలాలు కదలిపోతున్నాయి. జగన్ ను ఇలాగే వదిలేస్తే నాలుగేళ్ల తరువాత పరిస్థితి ఎలా వుంటుందో? ఇప్పుడు కదిపేయాలి. కుదిపేయాలి. ఇందుకు అన్ని శక్తులు కూడపెట్టుకోవాలి. ఒకరి సాయం చాలదు. ముఖ్యంగా జగన్ ను విపరీతంగా ద్వేషిస్తున్న సామాజిక వర్గ బలం అస్సలు చాలదు. వారి గొంతు వినిపించినా జనం నమ్మేలా లేదు. అందుకే బహుముఖ వ్యూహం అమలు చేయక తప్పదు.

రకరకాల యత్నాలు

జగన్ కు పాలన చాతకాదు. మొన్నటి దాకా. జగన్ పాలన అరాచకం ఇప్పుడు. ఎందుకు మారింది ఇలా? జగన్ కు పాలన చాతకాదు అన్నా జనం నమ్మడం లేదు. ఎందుకు అంటే గ్రౌండ్ రియాల్టీ వాళ్లకు తెలుసు. అందుకే ఇక ఈ జనాన్ని నమ్ముకుని లాభం లేదు. మేకను కొట్టేయలంటే అది కుక్క అని నమ్మించాల్సిందే. పైగా జనాలను తన పక్కకు తిప్పుకుంటూనే ఎక్కడిక్కడ రాజకీయ నాయకులు కోరలు తీసే పనిలో పడ్డారు జగన్. ఇది మరీ డేంజరు. పార్టీలను పడగొట్టి, వ్యాపారాలను దెబ్బతిసి, నాయకులను మూలన పెడితే, 2024 నాటికి పరిస్థితి ఏమిటి?

అందుకే అంతవరకు రానివ్వకూడదు. ఆంధ్రలో అరాచకం జరిగిపోతోంది. కావాలంటే కోర్టు తీర్పులు చూడండి. కావాలంటే కేసులు చూడండి. కావాలంటే కుహనా మేధావుల ప్రకటనలు చూడండి. కావాలంటే మీడియా డిబేట్లు చూడండి. ఇవన్నీ చూసి అర్జెంట్ గా జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేయాలి. ఇది..ఇది కదా కావాల్సింది. ఇప్పుడు ఈ యత్నం కేవలం ఒక్క సామాజిక వర్గం చేస్తే సరిపోదు. పైగా జనం ఆ వర్గాన్ని నమ్మడం ఎప్పుడో మానేసారు.  అందుకే కొత్త యుక్తులు పన్నుతున్నారు. కొత్త శక్తుల్ని దరి చేర్చుకుంటున్నారు.

అందుకే కేవిపి కోటరీ?

ఇప్పుడు అందులో భాగంగా కోవిపి కోటరీ రంగప్రవేశం చేసిందని రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా వైకాపా వర్గాల్లో వినిపిస్తోంది. ఒకప్పుడు వైఎస్ హయాంలో కేవిపి ఎలా చక్రం తిప్పారో, ఇప్పుడు విజయసాయి అలా తిప్పుతున్నారు. ఇప్పుడు ఆయన పార్టీలో కీలకంగా ఎదిగారు. ఇది పార్టీలోని పలువురికి కాస్త ఇబ్బందిగానే వుంది అని బోగట్టా. జగన్ ను వీక్ చేయడానికి బహుముఖ వ్యూహాలు అవసరం.

జగన్ పాలన అరాచకం అన్నది ఓ యాంగిల్.

జగన్ పార్టీలో లుకలుకలు తీసుకురావడం ఇంకో యాంగిల్.

జగన్ పార్టీపై న్యూట్రల్ జనాలు, నయా మేధావుల దాడి మరో కోణం.

ఇవన్నీ కాకుండా కోర్టులకు ఎక్కడం, ఆ వ్యవహారం వేరు.

ఇవన్నీ చేస్తూనే, భాజపాను ఎలాగైనా కాళ్లా వేళ్లా పడైనా దగ్గరకు తీసుకోవాలి. అలా జరిగాలి అంటే ఆంధ్రలో భాజపా జనాలను కూడా దగ్గరకు తీయాలి. ఆంధ్రలోని భాజపా ను దగ్గరకు తీసి, దారిలోకి తెచ్చుకోవాలి.

ఇలాంటి బహుళార్థక సాధక వ్యవహారాలు సాధ్యం కావాలి అంటే అన్ని వర్గాల నాయకులు కలిసి రావాలి.

మీడియా ఎలాగూ వుంది. మన వర్గం వుంది. ఇప్పుడు అందులో క్రమంగానే కేవిపి కూడా జగన్ వైరి వర్గంతో చేతులు కలిపినట్లు ఆంధ్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

వైఎస్/కేవిపి వర్గం

వైఎస్ చుట్టుూ వున్నది ఆయన వర్గమా? కేవిపి వర్గమా అన్న అనుమానం ఇప్పుడు కలుగుతోంది. కెవిపి ద్వారా టికెట్ పొందిన సబ్బం హరి, కేవిపి వియ్యంకుడు రఘురామకృష్ణం రాజు, కేవిపి సన్నిహితుడు ఉండవల్లి, ఇలా ఒక వర్గం అంతా ఇప్పుడు జగన్ మీదకు వస్తున్నారు. చిత్రమేమిటంటే వైఎస్ కొడుకు, వైఎస్ అంటే మాకు ప్రాణం అనేవారు, జగన్ పై సోనియా కక్ష సాధిస్తుంటే పెదవి కదిపిన దాఖలా లేదు.

తనపై కేసులను సమర్థవంతంగా అబేయన్స్ లో వుంచుకోగలిగిన కేవిపి నాడు జగన్ కు ఎందుకు అండగా నిలవలేదని ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. జగన్ అపర మండేలాలా వుండాలని ఉండవల్లి అంటున్నారు. వైఎస్ అలాగే వున్నారుగా? బాలకృష్ణ లాంటి వారిని వైఎస్ అండ లేకుండా కాపాడడం సాధ్యం అయ్యే పనేనా? మరి ఆ విశ్వాసాలు ఏమైనా జగన్ మీద వున్నాయా?  నిజంగా కేవిపి, ఉండవల్లి, సబ్బం హరి తలచుకుంటే ఆ రోజుల్లో జగన్ మీద ఈగ వాలేదా?

మరి ఆనాడే జగన్ బాగోగులు పట్టించుకొని వారు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటారు. పైగా విజయసాయి వుండగా? ఇప్పుడు ఇదే జగన్ వైరి వర్గానికి కలిసి వచ్చింది. జగన్ మీద రకరకాల కారణాలతో కోపంగా వున్న ఈ కేవిపి కోటరీని జగన్ ను ఎలాగైనా కిందకు లాగాలని చూస్తున్నవర్గం దగ్గరకు తీసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తన్నాయి. శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, విశాఖ సబ్బం హరి, ఈస్ట్ ఉండవల్లి, వెస్ట్ రఘురామ కృష్ణం రాజు వీరంతా కేవిపి మనుషులుగా వుంటే వైఎస్ కోటరీగా చలామణీ అయినవారే అని, ఇప్పుడు వీరంతా జగన్ పై దానికి ఆయుధాలుగా మారుతున్నారని, వైకాపా శ్రేణులు అంటున్నాయి.

మోడీ చేతిలోనే అంతా

రాష్ట్రంలోని సామాజిక వర్గ బేధాలు, డబ్బు, రాజకీయం అన్నీ కలిసినా జగన్ ను ఏమైనా చేయాలి అంటే మోడీ సహకారం లేకుంటే అస్సలు జరగదు. ఇప్పటికిప్పుడు మోడీ ఎందుకు హడావుడిగా జగన్ ను దించేయాలనుకుంటారు? ఇప్పుడు మీడియా భూతద్దంలో చూపిస్తున్నవి ఏమిటి?

రమేష్ కుమార్ ఉదంతం...అచ్చెం నాయుడు..జెసి బ్రదర్స్ ఉదంతాలు.

జెసి బ్రదర్స్ వ్యవహారం క్లియర్ గా తెలుస్తూనే వుంది. అచ్చెం నాయుడి వ్యవహారం దర్యాప్తులో వుంది. రమేష్ కుమార్ వ్యవహారం ఒక్కటే కాస్త తొంగి చూడాలి అనుకుంటే చూసేది.

ఇక రాజధాని వ్యవహారం. అది కూడా మోడీకి మరీ మోజైన అంశమేం కాదు. అది విశాఖ అయినా, అమరావతి అయినా మోడీకి ఒకటే. భాజపా కింది స్థాయి నాయకులు వివిధ ఈక్వేషన్లతో ఎలాగైనా మాట్లాడొచ్చు కానీ, ఇప్పటికిప్పుడు జగన్ ను వదిలేసి భాజపా బావుకునేది ఏమీ లేదు. అలాంటి ఆలోచన వస్తే గిస్తే, నాలుగో ఏడు రావాలి. ఇప్పటికిప్పుడు జగన్ ను కిందకు దింపి తేదేపా చేతిలో రాష్ట్రాన్ని పెట్టి భాజపా సాధించేది ఏమిటి? ఇప్పుడు చంద్రబాబు కాళ్లా వేళ్లా పడొచ్చు. అంతమాత్రం చేత నమ్మకమైన వ్యక్తినో కాదో మోడీకి ఇప్పటికే రెండు సార్లు అనుభవం అయింది.

అందుకే నాలుగేళ్లు దాటాలి. ఎన్నికలు ఏడాదిలోకి రావాలి. జగన్ సంగతి ప్రజల్లో ఎలా వుందో తెలియాలి. పవన్ తో కలిసి భాజపా ముందుకు వెళ్తే ఏ మేరకు లాభమో ఓ అంచనా అందాలి. అప్పుడు మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు ఏమైనా చేయాలనుకునేది.

మరి ఎందుకిదంతా?

ఇది మరో మార్గం.వైకాపాలో అసమ్మతి రాజేసి చూస్తే ఎలా వుంటుంది? పైగా రెండేళ్ల తరువాత మంత్రులను మారుస్తా అంటున్నారు. అవినీతి మరక పడనీయడం లేదు. ఎమ్మెల్యేలను తిననీయడం లేదు. మంత్రులకు కూడా అవకాశాలు అంతంత మాత్రంగా వున్నాయి. అందువల్ల దీన్ని వాడుకుంటే ఎలా వుంటుంది? వైకాపాను దానంతట దాన్ని కిందకు దిగేలే చేయడానికి ఏమైనా అవకాశం వుంటుందా? ఇదీ ఆలోచన.

కానీ ఇది తెలుగుదేశం వల్ల సాధ్యం కాదు. వైకాపాతో సంబంధాలు వున్నవారు రంగంలోకి దిగాలి. అలా ఎవరు? అప్పుడు వినిపించే పేరు కెవిపి. వైఎస్ కోటరీ లీడర్ ఘా వుంటూ కేవిపి ఎలా చక్రం తిప్పారో అందరికీ తెలిసిందే. అలనాడు వైఎస్ పార్టీలో వున్నవారే ఇప్పుడు తొంభై శాతం మంది వైకాపాలో వున్నారు. అందువల్ల అట్నుంచి నరుక్కు వచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని వైకాపా వర్గాల్లో వినిపిస్తున్న మాట.

కేవిపి మంత్రాంగం ఫలించి, తెలుగుదేశం పార్టీ వ్యూహం అమలు జరిగి, ఇఫ్పటికిప్పుడు యాభై మంది ఎమ్మెల్యేలు భాజపాలోకి వచ్చేసినా, ఆ పార్టీకి ఒక్క అభ్యర్థి కూడా లేడు. మరి ఏమిటి ప్రయోజనం?  వైకాపాను చీల్చితే తేదేపాకు లాభం కానీ భాజపాకు కాదు. చంద్రబాబుకు.  రాజకీయ అస్థిరత అని, తద్వారా ఆయన అనుభవం, తన సమర్థత డప్పేసి మళ్లీ అధికారంలోకి రావడానికి ఇది రూటు అవుతుందని ఓ వర్గం భావిస్తోంది. మరి ఈ వలలోకి కేవిపి ఎలా దిగారో అన్నది ఆయనకే తెలియాలని వైకాపా వర్గాలు అంటున్నాయి.

కేవిపి పేరు రాజకీయ గుసగుసల్లో వినిపించడాన్ని తేలిగ్గాతీసుకోవాలా?  గ్యాసిప్ గా తీసుకోవాలా? అన్నది క్లారిటీ వస్తే జగన్ టీమ్ ప్లానింగ్ ఏమిటన్నది తెలుస్తుంది. కానీ ఇక్కడ మళ్లీ ఇంకో పాయింట్ కూడా వుంది. పత్రికల్లో, మీడియాలో, ప్రెస్ మీట్ ల్లో, యూ ట్యూబ్ లో వున్న హడావుడి జనాల్లో లేదు అన్నది. ప్రభుత్వం నుంచి రకరకాల స్కీముల్లో డబ్బులు అందుకుంటున్న జనాలకు ఈ హడావుడి అస్సలు పట్టడం లేదు.  వారందరికీ ఇంకా జగన్ అంటే అభిమానంగానే వుంది. అదే తెలుగుదేశం పార్టీని కలవరపెడుతున్న విషయం కూడా.

నిజానికి అదే జగన్ కు శ్రీరామరక్ష కూడా.

చాణక్య
[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?