అబ్జర్వేషన్: ఏపీలో టీఆర్‌ఎస్‌.!

ఓ రాజకీయ పార్టీ అన్నాక ఎక్కడన్నా పోటీ చేయొచ్చుగాక. అది ఆ పార్టీకి అక్కడ వుండే ఓట్లపైన నమ్మకాన్ని బట్టి ఆధారపడి వుంటుంది. ఏముందిలే, గాలమేద్దాం.. 'చేప' పడితే పడింది, లేదంటే లేదు.. అనుకోవడం…

ఓ రాజకీయ పార్టీ అన్నాక ఎక్కడన్నా పోటీ చేయొచ్చుగాక. అది ఆ పార్టీకి అక్కడ వుండే ఓట్లపైన నమ్మకాన్ని బట్టి ఆధారపడి వుంటుంది. ఏముందిలే, గాలమేద్దాం.. 'చేప' పడితే పడింది, లేదంటే లేదు.. అనుకోవడం రాజకీయ పార్టీలకి అలవాటే. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో వున్నాయి. టీఆర్‌ఎస్‌ ఇప్పటిదాకా తెలంగాణకే పరిమితమైనా, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కీ విస్తరించాలనుకుంటోందట. 

అవును మరి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే వున్నాయట కదా.. అందుకే, ఆయన తన జన్మభూమి రుణం తీర్చుకోవాలనుకుంటున్నారేమో.! జస్ట్‌ సరదాకి. ఇందులో నిజమెంతో ఆ పైవాడికే ఎరుక.! అయితే, ఈ మధ్యకాలంలో టీఆర్‌ఎస్‌ నేతలు, ఆంధ్రప్రదేశ్‌ మీద మక్కువ ఎక్కువగానే చూపిస్తున్నారు. కారణమేంటన్నది తెలియడంలేదుగానీ, ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు, 'ఏపీలోనూ మా పార్టీ విస్తరించే అవకాశాలు లేకపోలేదు..' అని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్న విషయాల్ని ఎలా లైట్‌ తీసుకోగలం.? 

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, హైద్రాబాద్‌లో పెద్ద సంఖ్యలోనే సీమాంధ్రులున్నారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో వారిలో చాలామంది మద్దతు టీఆర్‌ఎస్‌కి లభించింది. ఇదే ధైర్యంతో ఇప్పుడు టీఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో తన ఉనికిని చాటుకోవాలనుకుంటోందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా విన్పిస్తోన్న మాట. 

అయితే, గతంలో సీమాంధ్రుల్ని తిట్టిన తిట్టు తిట్టుకుండా తిట్టిన టీఆర్‌ఎస్‌ సంగతేంటి.? అంటే, ఏముంది.. రాజకీయ నాయకులకు నాలిక మడతేసేయడం చాలా తేలిక. అప్పుడు తిట్టారు, ఇప్పుడు పొగుడుతారు.. పెద్దగా తేడాలేమీ వుండవు. సో, 2019 ఎన్నికల నాటికి, ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్‌ ఒక చోటో, పది చోట్లో పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 

అంతా బాగానే వుందిగానీ, టీఆర్‌ఎస్‌.. ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తే, అక్కడ సెంటిమెంట్లను రెచ్చగొట్టేదెవరు.? తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీ.. అని టీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. తెలంగాణలో ఆంధ్రా పార్టీకి చోటు లేదని ఆ పార్టీ నేతలంటున్నారు. అలాగైతే, టీఆర్‌ఎస్‌కి ఆంధ్రప్రదేశ్‌లో ఛాన్స్‌ ఎలా వుంటుందట.? ఈ ప్రశ్న రేపు ఎవరో ఒకరు వేయకుండా వుంటారా.? దానికీ, ఓ విరుగుడు వుంది. 

అదేంటంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోబట్టే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలోకి దూసుకుపోతోందన్నది టీఆర్‌ఎస్‌ వాదన. అమరావతి ఎలా రాజధాని అయ్యింది.? విజయవాడ ఇంతలా ఎందుకు అభివృద్ధి చెందింది.? విశాఖ ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షిస్తోంది.? ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమా.? అన్నది టీఆర్‌ఎస్‌ నేతల ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ఇబ్బందుల సంగతేమిటి.? కేంద్రాన్ని దేబిరించాల్సిన ఈ దుస్థితి ఏమిటి.? అదంతా మీ వల్ల కాదా.? అని టీఆర్‌ఎస్‌ని ఎవరైనా ప్రశ్నిస్తేనో.! 

కేసీఆర్‌ ఎప్పుడూ వ్యూహాత్మకంగానే రాజకీయాల్లో ముందడుగు వేస్తుంటారు. ఎంతో పెద్ద స్కెచ్‌ వేసి వుంటే తప్ప, టీఆర్‌ఎస్‌ నేతల నుంచి 'ప్రో ఆంధ్రా' మాటలు బయటకు రావు. సో, 2019 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సందడిని ఆశించవచ్చుగాక.!