అబ్జర్వేషన్‌: అతి సర్వత్ర వర్జయేత్‌.!

30 లక్షల డెబిట్‌ కార్డులు ఇబ్బందుల్లో పడ్డాయి.. ఎవరో చేసిన తప్పుకి, ఆ 30 లక్షల మంది కార్డుదారుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. చిన్న మాల్‌ వేర్‌.. దేశాన్ని కుదిపేసింది. అంతేనా, ప్రపంచాన్ని వణికిస్తోందిప్పుడు…

30 లక్షల డెబిట్‌ కార్డులు ఇబ్బందుల్లో పడ్డాయి.. ఎవరో చేసిన తప్పుకి, ఆ 30 లక్షల మంది కార్డుదారుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. చిన్న మాల్‌ వేర్‌.. దేశాన్ని కుదిపేసింది. అంతేనా, ప్రపంచాన్ని వణికిస్తోందిప్పుడు ఈ 'మాల్‌ వేర్‌'. 

కంప్యూటర్‌తో పరిజ్ఞానం వున్న ప్రతి ఒక్కరికీ ఈ మాల్‌ వేర్‌ సుపరిచితమే. యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ని వినియోగిస్తే, చాలావరకు వైరస్‌ల నుంచి దూరంగా వుండొచ్చు. కానీ, ఎంత పకడ్బందీగా యాంటీ వైరస్‌ ఉపయోగించినాసరే మాల్‌ వేర్‌ని ఆపడం కష్టం. ఎందుకంటే, ఎప్పటికప్పుడు కొత్తగా మాల్‌ వేర్స్‌, ట్రోజన్స్‌.. ఇలా రకరకాల రూపంలో కంప్యూటర్లను కొల్లగొట్టేస్తూనే వుంటున్నారు అక్రమార్కులు. అసలు వీటిని ఎవరు తయారు చేస్తారు.? 

పాకిస్తాన్‌ నుంచి అక్రమంగా ఇండియాలోకి వచ్చి విధ్వంసాల్ని సృష్టించేవారిని టెర్రరిస్టులంటున్నాం.. ఈ మాల్‌ వేర్‌, ట్రోజన్‌ సృష్టికర్తల్ని కూడా తీవ్రవాదులనే అనాలి. వీళ్ళు ఇంటర్నెట్‌ టెర్రరిస్టులన్నమాట. మామూలుగా ఈ తరహా వైరస్‌లతో, కంప్యూటర్లు మాత్రమే పాడైపోతాయి. అది కూడా సాఫ్ట్‌వేర్‌ మాత్రమే పాడవుతుంది. కానీ, కంప్యూటర్‌ని మనం ఇష్టమొచ్చినట్లు వాడేస్తున్నాం కదా. అఫ్‌కోర్స్‌, కంప్యూటర్‌ని మించి స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎక్కువైపోయింది కదా. అదే అసలు సమస్య. 

స్మార్ట్‌ ఫోన్‌ పనిచెయ్యాలన్నా, ఏటీఎం వర్కవుట్‌ అవ్వాలన్నా, కంప్యూటర్‌లో పనిచెయ్యాలన్నా.. సాఫ్ట్‌వేర్‌ అవసరం. ఆ సాఫ్ట్‌వేర్‌ని ఈ వైరస్‌, మాల్‌వేర్‌, ట్రోజన్స్‌ టార్గెట్‌ చేసేస్తున్నాయి. ఇదివరకటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. పక్కనే దుకాణానికి వెళ్ళి అగ్టిపెట్టి తెచ్చుకునేంత సమయం వుండడంలేదు. ఆ అగ్గిపెట్టెను కూడా ఇంటర్నెట్‌లో బుక్‌ చేసేస్తే, ఇంటికే వచ్చేస్తోంది. ఇది జస్ట్‌ ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. 

పొద్దున్న లేచింది మొదలు, సాయంత్రం నిద్రపోయేదాకా.. అంతా ఇంటర్నెట్‌ మీదనే. బ్యాంకింగ్‌ కార్యకలాపాలు పూర్తిగా ఇంటర్నెట్‌ ఆధారితమైపోయాయి. ఇకనేం, ఇంటర్నెట్‌ టెర్రరిస్టులకి పండగే పండగ. 30 లక్షల కార్డులేం ఖర్మ, మొత్తంగా ప్రపంచాన్ని స్తంభించేయగలరిప్పుడు ఈ ఇంటర్నెట్‌ టెర్రరిస్టులు. ఆధార్‌ కార్డుతో అన్నిటికీ లింక్‌ పెడుతున్నాం.. ఆధార్‌లో మొత్తం వ్యక్తిగత సమాచారం నమోదవుతోంది.. దాన్ని అన్నిటికీ వాడేస్తున్నప్పుడు, డబ్బులు దోచేయడం కాదు.. వ్యక్తిగత సమాచారం దోచెయ్యడం ఇంటర్నెట్‌ టెర్రరిస్టులకు పెద్ద పనా.? కానే కాదు. 

30 లక్షల కార్డుల్ని బ్యాంకులు రీప్లేస్‌ చేసేస్తాయి.. ఇంకా సెక్యూరిటీ ఫీచర్లతో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు జరుగుతాయి.. కాదనలేం. కానీ, అది కూడా హ్యాకింగ్‌కి గురైతే.? ఇదేమీ ఆషామాషీ సమస్య కాదు. దీనికి ఖచ్చితంగా పరిష్కారం కనుగొని తీరాల్సిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇంటర్నెట్‌ టెర్రరిస్టులు తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇండియా – పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాల నేపథ్యంలో హ్యాకర్లు చాలా కార్పొరేట్‌ సంస్థల వెబ్‌సైట్లపై తమ ప్రతాపం చూపించేశారు. అదే బ్యాంకింగ్‌ రంగంపై చూపిస్తేనో.? ఇంకేమన్నా వుందా.? అందుకే అన్నారు పెద్దలు అతి సర్వత్ర వర్జయేత్‌ అని. కానీ, దాన్ని పాటించేదెవరు.?