ఇకపై అన్ని లావాదేవీలు బ్యాంకు ద్వారానే జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 'లేఖ' ద్వారా విజ్ఞప్తి చేశారు. నల్లధనాన్ని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యల్లో భాగంగా 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లను నిషేధించాలని ఆయన ఎప్పటినుంచో అభిప్రాయపడ్తున్న విషయం విదితమే.
రాజకీయాలు పక్కన పెట్టి, నిజాల్ని మాట్లాడుకుందాం. నల్లధనం అంటే ఏమిటి.? అది నల్ల రంగులో వుంటుందా.? అన్న అనుమానం చాలామందిలో వుంది. పేరుకే నల్లధనంగానీ, అది నిజానికి నల్లగా వుండదు. చీకట్లో మగ్గుతోన్న సొమ్ము అని దానర్థం. చీకట్లో మగ్గుతోందంటే, వాడకుండా వుంటోందని కాదు, 'ఓటుకు నోటు' కేసులో వాడారే.. అలాంటిదన్నమాట.!
ఓటుకు నోటు కేసు ఎలా తెరపైకి వచ్చింది.? ఆ కేసులో దొరికిందెవరు.? ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఎవరు.? అన్న విషయాలు తెలుగు ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నిర్వాకం అది. టీడీపీ ఎమ్మెల్యేనే ఆ కేసులో అడ్డంగా బుక్కయిపోయారు. అలా బుక్కయిపోయిన ఆయనగార్నే, చంద్రబాబు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేశారు. ఆగండాగండీ, బహుశా ఆ సొమ్ముని కూడా బ్యాంకు లావాదేవీల ద్వారానే చంద్రబాబు తెప్పించి వుండొచ్చేమో.!
విలువల గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి వందసార్లు ఆలోచించాలి. మచ్చ ఎక్కడో కాదు, తన కిందే వుందన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోయినట్లు నటించొచ్చుగాక, ప్రజలకు వాస్తవాలు తెలుసు. సమయం, సందర్భం వచ్చినట్లు ఎలా సమాధానం చెప్పాలో, ప్రజలే నిర్ణయించుకుంటారు. ఇక, చంద్రబాబు మాట్లాడుతోంటే, నల్లధనం గురించి వైఎస్ జగన్ కూడా మాట్లాడెయ్యాలి కదా.! తప్పదు మరి.!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును ఎదుర్కొంటున్నారు. ఆ కేసులో ఆయన నిండా మునిగిపోయారన్నది నిర్వివాదాంశం. ఆయనా, నల్లధనం గురించీ, అవినీతి గురించీ మాట్లాడేస్తూనే వున్నారు. ఆ మాటకొస్తే, దేశంలో వున్న రాజకీయ నాయకుల్లో నూటికి 99 మంది అవినీతిపరులేనంటూ పలు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ఈ రాజకీయ నాయకులే నల్లధనం గురించి లెక్చర్లు దంచేస్తారు.
అందుకే, దేశాన్ని నల్లధనం అనే మహమ్మారి వీడదుగాక వీడదు. ప్రతిపక్షంలో వుండగా, బీజేపీ నల్లధనం గురించి మాట్లాడింది.. విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తామని చెప్పింది. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చాక, విదేశాలు ఈ విషయంలో సహకరించడంలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. కాంగ్రెస్, తాము అధికారంలో వుండగా నల్లధనం ఊసెత్తలేదు. ఇప్పుడు నల్లధనం గురించి డిమాండ్ చేస్తోంది.
ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదు.. అందరూ ఆ తానులోని గుడ్డ పీలికలే.. అందరూ అవినీతి సామ్రాజ్యానికి అధిపతులే. ఎనీ డౌట్స్.? ఓటెయ్యడానికి ఐదొందల నుంచి వెయ్యిదాకా.. ఒక్కోసారి ఐదు వేల దాకా రేటు కట్టేస్తున్నారు రాజకీయ నాయకులు. అక్కడ వుంది, ఇక్కడ లేదనడానికి వీల్లేదు. నల్లధనం, దేశంలో తెలతెల్లగా వెలుగు విరజిమ్మతూనే వుంది. అయినా, అది ఎప్పటికీ ఓ మిలియన్ డాలర్ల క్వశ్చనే. జనాన్ని అలా మాయలో ముంచేస్తున్నాయి రాజకీయ పార్టీలు.