అత్యాధునిక స్కార్పీన్ జలాంతర్గామికి సంబంధించి ఏకంగా 22 వేల పేజీల సమాచారం లీక్ అయ్యిందంటూ ఆస్ట్రేలియా వెల్లడించేదాకా, భారత్ ఈ విషయాన్ని గుర్తించలేకపోయింది. 'ది ఆస్ట్రేలియన్' అనే పత్రికలో వచ్చిన కథనంతో భారత్ ఉలిక్కిపడింది. కేంద్ర రక్షణ శాఖ, ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది కూడా. 'అది వంద శాతం నిజం కాకపోవచ్చు..' అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సన్నాయి నొక్కులు నొక్కడంలోనే వ్యవహారం ఎంత సీరియస్సో అందరికీ అర్థమయిపోయింది.
డిఫెన్స్‌కి సంబంధించినంతవరకు ప్రతి వ్యవహారమూ అత్యంత రహస్యంగా వుంచబడ్తుంది. కానీ, ఎంతటి రహస్యాన్నయినాసరే, తనక్కావాలనుకున్నప్పుడు దాన్ని సాధించగలగడం చైనాకి వెన్నతోపెట్టిన విద్య. ఈ విషయంలో చైనా వ్యూహాల్ని చూసి అగ్రరాజ్యం అమెరికా సైతం ఆశ్చర్యపోతుంటుంది. రష్యా నుంచీ, అమెరికా నుంచి, ఇంకా పలు అగ్ర దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని 'దొంగిలించడంలో' చైనాకి వున్న చెడ్డపేరు అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ 'స్కార్పీన్ లీక్' వెనుక కూడా చైనా హస్తం వుందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
22 వేల పేజీల సమాచారం అంటే చిన్న విషయమా.? మొత్తంగా ఆ సమాచారంతో ఓ సబ్‌మెరైన్‌ని తయారుచేసెయ్యొచ్చు. తయారుచేయడం కాదిక్కడ మేటర్. దాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యర్థులు సన్నద్ధమైపోతారు. అత్యాధునిక యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, యుద్ధ నౌకల తయారీ విషయంలో చాలా 'గోప్యం' పాటిస్తుంది ఏ దేశమైనాసరే. రెండు మూడు దేశాలు కలిసి ప్రయోగాలు చేపట్టేసమయంలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యంత గోప్యంగా వుంచుతారు.
స్కార్పీన్ జలాంతర్గామికి సంబంధించి భారత్ – ఫ్రాన్స్ మధ్య ఒప్పందం వుంది. ఆ ఒప్పందం నేపథ్యంలోనే ఆరు జలాంతర్గాములు భారతదేశంలో తయారవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేసుకుని మరీ వీటిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ జలాంతర్గాములు ఆస్ట్రేలియా సహా కొన్ని దేశాల్లో అందుబాటులో వున్నప్పటికీ, భారత్‌లో తయారవుతున్న జలాంతర్గాముల టెక్నాలజీ కాస్త భిన్నం. వీటిని అత్యాధునిక జలాంతర్గాములుగా పిలుస్తున్నారు.
ఒకవేళ చైనా గనుక స్కార్పీన్ సమాచారాన్ని దొంగిలించడమే నిజమైతే, అది భారత్‌కి ప్రమాద ఘంటికలు మోగించినట్లేనన్నది నిస్సందేహం. ఎందుకంటే, భారత్‌కి శతృదేశాలంటూ వుంటే అవి చైనా, పాకిస్తాన్ మాత్రమే. స్కార్పీన్ సమాచారంతో, యుద్ధ క్షేత్రంలో వాటిని మట్టుబెట్టేందుకు ధీటుగా అటు చైనా, ఇటు పాకిస్తాన్ కొత్త వ్యూహాలు రచించడానికి వీలుంది. ఇదే ఇప్పుడు భారత్‌ని ఆందోళనలోకి నెట్టేసింది. ఓ పక్క, భారత్ అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్రహ్మూెస్ క్షిపణుల్ని మోహరించడం పట్ల చైనా గుస్సా అవుతున్న వేళ, ఈ స్కార్పీన్ లీక్ సగటు భారతీయుల్ని షాక్‌కి గురిచేసింది.
అయితే, స్కార్పీన్ లీక్ అన్నది ఇండియా నుంచి జరిగింది కాదంటూ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తుండడం కొసమెరుపు.