తెలుగు భాష, తెలుగు సంస్కృతిని పరిరక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించిందట. ఇటీవలే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఓ జీవోని కూడా విడుదల చేసిందండోయ్. వ్యాపార సంస్థలు తమ బోర్డుల్ని (నామ ఫలకాలు అనాలేమో) తెలుగులోనే వుంచాలని ఆ జీవోలో పేర్కొన్నారు. ఇంకోపక్క, ఓ కమిటీని వేసి, తమిళనాడుకి పంపించారు. తమిళనాడులో కాస్త భాషాభిమానం ఎక్కువ. అక్కడ తమిళంలోనే బోర్డులు దర్శనమిస్తాయి. అందుకన్నమాట.
మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ తమిళనాడులో పర్యటించి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఓ నివేదిక ఇస్తుంది. బాగానే వుంది.. తెలుగు భాషాభివృద్ధి కోసం, తెలుగు సంస్కృతిని కాపాడటం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు చిత్తశుద్ధితో వున్నవే అయితే అభినందించి తీరాల్సిందే. కానీ, అసలు దీనికోసం ముందుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరగాలి కదా.!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తెలుగు భాషా, సంస్కృతి, సంప్రదాయలపై చర్చ జరిగితే, ఆ చర్చల ద్వారా వచ్చిన ఫలితాలు, సూచనలు, సలహాల ఆధారంగా చర్యలు తీసుకుని వుంటే ఓ పద్ధతిగా వుండేది. తెలుగు భాషాభివృద్ధి కోసం, తమిళనాడుకి వెళ్ళాల్సిన దుస్థితి దాపురించిందన్నమాట. 'వాట్ ఐ యామ్ సేయింగ్.. బ్రీఫింగ్..' అంటూ హైటెక్ హంగులకు పోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ జరుగుతుందని ఎలా అనుకోగలం.?
అసలంటూ ఆంధ్రప్రదేశ్‌లో అయినా తెలుగు భాషాభిమానులతో ఇప్పటిదాకా ప్రభుత్వం చర్చలు జరిపిన దాఖలాల్లేవు. ప్రతి విషయానికీ సింగపూర్, చైనా, జపాన్ పేర్లు ప్రస్తావించే చంద్రబాబు, ఏ విషయంలోనూ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు చోటివ్వలేదు. ఇప్పుడూ అంతే. తెలుగు భాషని ఎలా కాపాడుకోవాలో విజయవాడలో వున్నోళ్ళకు తెలుస్తుందా.? చెన్నయ్‌లో వున్నోళ్ళకు తెలుస్తుందా.? లక్షలు, కోట్లు ఖర్చు చేసి విహార యాత్రలు చేయాలనే సరదా అధికారంలో వున్నవారికి వుంటే వుండొచ్చుగాక. వాటికి ఈ 'ఉద్ధరింపు' అనే కలర్ ఇవ్వడం ఎందుకట.? ముఖ్యమంత్రిగారూ ముందుగా 'బ్రీఫింగ్.. వాట్ ఐ యామ్ సేయింగ్..' వంటి మాటలు కట్టిపెట్టి, విదేశీ సంస్థల వైపు పరుగులు పెట్టడం మాని.. రాష్ట్రంలో 'టాలెంట్'ని గుర్తించడం, రాష్ట్రంలో ప్రజల మనోభావాల్ని గౌరవించడం నేర్చుకుంటే, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. కాస్త ఆలోచించండి సారూ!