వాళ్ళిద్దరూ విడిపోయారు.. మరి వీళ్ళెప్పుడు.?

నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం.. ఓ రెండు జీవితాలతో చెలగాటమాడుతోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. కానీ, అవిభక్త కవలలు వీణా – వాణి మాత్రం ఇంకా విడిపోలేదు.. విడిపోయే పరిస్థితులూ కన్పించడంలేదు. 'మేమిద్దరం…

నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం.. ఓ రెండు జీవితాలతో చెలగాటమాడుతోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. కానీ, అవిభక్త కవలలు వీణా – వాణి మాత్రం ఇంకా విడిపోలేదు.. విడిపోయే పరిస్థితులూ కన్పించడంలేదు. 'మేమిద్దరం విడిపోవాలనుకోవడంలేదు..' అంటూ ఆ పిల్లలు ఇప్పుడు చెబుతున్నారు. కానీ, ఎంత కాలం తలలు అతుక్కుని వాళ్ళిద్దరూ అలా జీవితాన్ని గడపగలరు.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇద్దరూ కలిసే వుంటారు, కానీ ఒకర్ని ఒకరు చూసుకోలేరు. ఇదీ వీణా – వాణిల పరిస్థితి. 

పరిచయం అక్కర్లేదు తెలుగు ప్రజలకి వీణా – వాణి గురించి. ఎన్నో ఏళ్ళుగా వీళ్ళిద్దరూ మీడియాలో కన్పిస్తున్నారు. నిజానికి, డాక్టర్‌ నాయుడమ్మ సారధ్యంలోనే వీరిద్దరికీ ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం సర్జరీ జరగాల్సి వుంది. ఆ సర్జరీ జరిగి వుంటే, ఇప్పుడు వీణా – వాణి వేర్వేరుగా.. హ్యాపీ హ్యాపీగా వుండేవారే. ఇప్పుడు పరిస్థితి అది కాదు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, కాంప్లికేషన్స్‌ పెరిగిపోయాయి. విదేశీ వైద్యులు వచ్చి, పరిశీలించి వెళుతున్నారు తప్ప, సర్జరీపై క్లారిటీ రాని పరిస్థితి. 

నేడు ఈ ఇద్దరూ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. హైద్రాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రి తప్ప ఇంకేమీ తెలియదు వీణా – వాణిలకు. అక్కడే వీరిద్దరి సంరక్షణ కొనసాగుతోంది. 'విదేశాలకు పంపిస్తాం.. ఎన్ని కోట్లు ఖర్చయినాసరే సర్జరీ చేయిస్తాం..' అంటూ రాజకీయ నాయకులు ప్రకటనలు చేస్తూనే వున్నారు.. తమ పబ్లిసిటీ కోసం వందలు, వేల కోట్లు వృధా చేస్తున్నారు.. ఇద్దరు చిన్నారులకు కొత్త జీవితాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఇదీ వీణా – వాణిల దుస్థితి. 

పై ఫొటోలో చూస్తున్నారు కదా.. వీణా – వాణిలతోపాటు ఇంకో అవిభక్త కవలల్ని. న్యూయార్క్‌లో ఈ అవిభక్త కవలలకు సర్జరీ జరిగింది. వారి వయసు కేవలం 13 నెలలు. 27 గంటల పాటు సర్జరీ చేసి, విజయవంతంగా ఇద్దర్నీ విడదీశారు వైద్యులు. అదృష్టవశాత్తూ ఇద్దరూ ప్రాణాలతోనే వున్నారు. వైద్య చరిత్రలో ఇలాంటి అద్భుతాలకు కొదవేమీ లేదు. మన తెలుగునాట, మన భారతదేశంలోనూ ఇలాంటి సర్జరీలు ఇంతకు ముందు ఎన్నో జరిగాయి.. జరుగుతూనే వున్నాయి. కానీ, వీణా – వాణిల విషయంలోనే ఎందుకిలా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.?