ఎమ్బీయస్ : ఉచిత కరోనా వాక్సిన్ ప్రహసనం

కరోనా అనుకున్నదాని కంటె మహమ్మారిలా తయారైంది. వ్యాధి విశ్వవ్యాప్తమై 8 నెలలైనా యిప్పటిదాకా వైరస్ స్వభావం గురించి కానీ, వ్యాప్తి గురించి కచ్చితమైన పరిజ్ఞానం సైంటిస్టులకే సమకూరలేదు. ప్రపంచ దేశాలన్నీ తాము గమనించిన విషయాలను…

కరోనా అనుకున్నదాని కంటె మహమ్మారిలా తయారైంది. వ్యాధి విశ్వవ్యాప్తమై 8 నెలలైనా యిప్పటిదాకా వైరస్ స్వభావం గురించి కానీ, వ్యాప్తి గురించి కచ్చితమైన పరిజ్ఞానం సైంటిస్టులకే సమకూరలేదు. ప్రపంచ దేశాలన్నీ తాము గమనించిన విషయాలను ఎప్పటికప్పుడు యితర దేశాలతో పంచుకుంటూ వస్తున్నా,  ఓ రోజుకా రోజు సమాచారం మారిపోతూ వస్తోంది. వ్యాధి వచ్చిన తర్వాత ఎలా నయం చేయాలో యిప్పటివరకు నిర్దిష్టమైన విధానం ఏర్పడలేదు. ఈ మధ్యే డాక్టర్లు ఓ ప్రోటోకాల్ (చికిత్సా పద్ధతి) అవలంబిస్తున్నారని విన్నాను. అంతలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అదేమీ పనిచేయదని తేల్చేసింది. రీపర్పస్‌డ్ డ్రగ్స్ పనిచేయటం లేదట. ప్లాస్మా చికిత్స కూడా పనిచేయటం లేదట. రోగం వచ్చినవాళ్లలో కొంతమందికి తగ్గుతోంది. కొంతమందికి తగ్గటం లేదు. ఒక్కొక్కరి మీద ఒక్కోలా ప్రభావం చూపుతోంది. మృతులలో అన్ని వయసుల వాళ్లూ వుంటున్నారు. దీని వెనకాల వున్న ప్రిన్సిపుల్ ఏమిటో డాక్టర్లకు అంతు పట్టటం లేదు. అంతా దైవాధీనం అయిపోయింది.

రోగం రాగానే మందు కనుక్కుంటారు. వాక్సిన్ కంటె అది చాలా సులభం. మందు వున్నా వాక్సిన్ లేని వ్యాధులు ఎన్నో వున్నాయి. వాక్సిన్ కనుగొనడం చాలా కష్టం. కానీ కరోనా విషయంలో మందు కంటె వాక్సిన్ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇంతదాకా అంతూ, దరీ కనబడటం లేదు. వాక్సిన్ ఎప్పటికి వస్తుందో, వచ్చాక కూడా ఎంతకాలం రక్షణ యిస్తుందో, ప్రజలకు ఎలా ఉపయోగ పడుతుందో తెలియదు కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులకు మాత్రం బాగా ఉపయోగపడుతోంది. ముఖ్యంగా ఎక్కడ ఎన్నికలు వుంటే ఆ దేశంలో! వాక్సిన్ విషయంలో గందరగోళం గురించి 15 రోజుల క్రితమే రాశాను. ఆ తర్వాత పరిస్థితి మెరుగు పడలేదు. జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్లు పరిశోధన ఆపేశారు.  ఆక్స్‌ఫర్డ్ వారి టీకా మూడో దశ ప్రయోగాల్లో బ్రెజిల్‌లో వాలంటీరు చనిపోయాడు.

కానీ అమెరికా ఎన్నికలలో వాక్సిన్‌ను ఎడాపెడా వాడేసుకుంటున్నారు. కరోనా కట్టడే అన్నిటికన్నా పెద్ద ఎన్నికల అంశం అయిపోయిందక్కడ. ట్రంప్ ఆ విషయంలోనే దెబ్బ తినేట్లున్నాడు. ఇప్పటికే 2.24 లక్షల మంది పోయారు. 2021 ఫిబ్రవరి నాటికి 5 లక్షల మంది దాకా పోయే ప్రమాదం వుందని వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ చెప్తోంది. కానీ ట్రంప్ ఈ పాండెమిక్ అతి త్వరలో అంతం కాబోతోందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. జో బైడెన్ అమెరికన్ ప్రజలను ఆ పేరు చెప్పి ఊరికే హడల గొడుతున్నాడని ఆరోపిస్తున్నాడు. నిజానికి అక్టోబరు నెలాఖరు కల్లా రాష్ట్రాలన్నీ వాక్సిన్ పంపిణీకి సిద్ధంగా వుండాలంటూ ట్రంప్ బిల్డప్ యిచ్చాడు కానీ ఏమీ జరగలేదు. అయినా ప్రపంచంలో అందరి కంటె ముందు మనకే వస్తుంది అంటూ ప్రగల్భాలు పలుకుతూనే వున్నాడు.

ఈ లోగా జో బైడెన్ తను గెలిస్తే అమెరికా పౌరులందరికీ ఉచితంగా వాక్సిన్ యిస్తానని వాగ్దానం చేసేశాడు. ఏదైనా వాగ్దానం చేసేముందు దాని బజెట్ ఎంతవుతుందో ఆలోచించుకుని మరీ చేస్తారు. ఈ వాక్సిన్ విషయంలో రెండు డోసులు తీసుకోవాలా, మూడా, బూస్టర్ కూడా తీసుకోవాలా? తీసుకున్నాక అది యిచ్చే రక్షణ ఏడాదా? ఆర్నెల్లా? ఏమీ తెలియదు. ఉత్పత్తి ప్రారంభమయ్యాక కానీ ధర ఎంత వుంటుందో ఎవరూ ఊహించలేరు. ఇలాటి సందర్భంలో ఉచితంగా యిచ్చేస్తాం అని అనడం బాధ్యతారాహిత్యం కాదా? మొదటిసారే ఉచితమా? ఆర్నెల్ల తర్వాత మళ్లీ వేయించుకోవాల్సి వస్తే అప్పుడేం చేస్తారు? ఉన్న ఆరోగ్యపథకాలే ఎత్తేశారు. ఇది ఫ్రీగా యిస్తారా? అదీ అందరికీ యిస్తారా? వాగ్దానం చేసేముందు కాస్తయినా ఆలోచించాలి కదా!

సాధారణంగా బిజెపి తెలుగు అభిమానులు వాపోతూ వుంటారు. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలు సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకుంటూ, దక్షిణాన బిజెపి ఎదగకుండా చేస్తున్నాయనీ, మోదీకి ఉచితాలివ్వడమంటే చికాకని, గుజరాత్‌లో యివ్వకుండా అభివృద్ధి మీదే దృష్టి పెట్టాడనీ, యిక్కడ ప్రాంతీయ పార్టీలకు మాత్రం అటువంటి యింగితం లేదని, డబ్బంతా తగలేస్తున్నారనీ అంటూంటారు. గుజరాత్‌లో వ్యవహారమే వేరు. అక్కడ మోదీయే కాదు, వేరే ఎవరూ కూడా ఉచితాలు యివ్వకుండానే యిన్నాళ్లూ నెగ్గుకువచ్చారు. ఇప్పుడు బిజెపి ఉచితాలలో ప్రాంతీయ పార్టీలతో పోటీ పడుతోందనే దానికి తాజా ఉదాహరణ – బిహార్ ఎన్నికలలో కరోనా వాక్సిన్ ఉచితంగా యిస్తానని హామీ యివ్వడం!

వాక్సిన్ తయారీ గురించి కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ చేత జులై 2021 కల్లా 25 కోట్ల మందికి టీకాలు యిస్తామని ప్రజలకు ఆశలు కల్పించారని 15 రోజుల క్రితం రాశాను. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఆశాజనకంగా ఏమీ లేవు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వారి ఆక్స్‌ఫర్డ్ వాక్సిన్ ఒక్కటే మూడో దశ పరీక్షల్లో వుంది. జైడస్ కాడిలా, కోవాక్సిన్ యింకా అక్కడి దాకా రాలేదు. కోవాక్సిన్ రెండో దశ పరీక్షలు 750 మంది మీద చేస్తామని చెప్పి అనుమతులు తీసుకున్నారు కానీ ఏ కారణం చేతనో సగానికి సగం తగ్గించి, 380 మంది మీదనే చేశారు. పరీక్షలు పూర్తయ్యేయో లేదో, వాటి డేటాను విశ్లేషించే సమయం కూడా తీసుకోకుండా మూడో దశ ప్రయోగాలకు అనుమతి యిచ్చేశారు ప్రభుత్వం వారు. కోవాక్సిన్ ఫేజ్ 1 ఫలితాలు సైతం ప్రకటించలేదు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కూడా జంతువుల మీద జరిగిన పరీక్షా ఫలితాలు యిచ్చారంతే. అవైనా ఈ-ప్రింట్లే తప్ప పియర్ రివ్యూడ్ జర్నల్స్‌లో పబ్లిష్ అయినవి కావు. రెండో దశ ఫలితాలు ప్రకటించే సమస్యే ఉత్పన్నం కాదు. మధ్యంతర డేటా కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు మూడో దశ ప్రయోగాలను దేశంలో 25-30 చోట్ల 26 వేల మంది మీద చేస్తామంటున్నారు. నవంబరు మధ్య నుంచి మొదలుపెడతారట.

2021 జూన్ నాటికి వాక్సిన్ విడుదల చేసే అవకాశం వుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. అవకాశం మాత్రమే అనేది యిక్కడ ముఖ్యమైన పాయింటు. ఎందుకంటే మూడో దశ ప్రయోగాలలోనే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ బోల్తా పడుతున్నాయి. అయ్యేదాకా ఎవరికీ నమ్మకం లేదు. కంపెనీయే జూన్‌లో విడుదల చేస్తాం అంటోంది. ఆ తర్వాత భారీగా ఉత్పత్తి మొదలెట్టి పంపిణీ చేస్తారు. ఇదంతా కొన్ని నెలలు పట్టే వ్యవహారం. అలాటప్పుడు జులై కల్లా 25 కోట్ల మంది టీకాలు వేసేస్తామని ఆరోగ్యమంత్రి ఎలా అనగలరు? ఇదే అనుమానంగా వుందనుకుంటే బిహార్‌లో ఎన్నికల సందర్భంగా నిర్మలా సీతారామన్ బిహార్ ప్రజలందరికీ కోవిడ్ వాక్సిన్ ఉచితంగా యిస్తామని వాగ్దానం చేసేశారు. ఏదైనా హామీ యిచ్చేటప్పుడు ఎంత ఖర్చవుతుంది? బజెట్‌లో దానికి అవకాశం వుందా లేదా అనేది చూసుకోవాలి.

విదేశాల్లో తయారయ్యే టీకాకు ఎంత ధర నిర్ణయిస్తారో తెలియదు. మన ప్రభుత్వమేమీ వాళ్లతో ముందే ఎడ్వాన్సు యిచ్చి ఫ్యూచర్స్ బుక్ చేసుకోలేదు. మన ఇండియాలో తయారయ్యే వాక్సినే మనకు లభ్యమౌతుంది అనుకోవాలి. అది ఎంత వుండబోతుంది? సీరమ్ వాళ్లు ఏప్రిల్‌లో చెప్పినపుడు డోసు 13 డాలర్లకు యిస్తాం అన్నారు. అంటే రూ. 950 అన్నమాట. ఆగస్టుకు వచ్చేసరికి డోసు రూ.250 లోపే యిస్తామన్నారు. చివరకు ఎంతకు తేలుస్తారో తెలియదు. భారత్ వాళ్లు ధర గురించి అస్సలు కమిట్ కావటం లేదు. ‘‘సీరమ్ వాళ్లకు గేట్స్ వాళ్లు, కోవాక్స్ వాళ్లు నిధులు సమకూర్చారు. మా కెవ్వరూ ఏమీ యివ్వలేదు. మూడో దశ ప్రయోగాలకు రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మరో 120-150 కోట్లతో కొత్త ఫెసిలిటీ కడుతున్నాం. ధర ఎంతకు వర్కవుటవుతుందో యిప్పుడే చెప్పలేం.’’ అంటున్నారు.

మనిషికి రెండు డోసులు అంటున్నారు. బూస్టర్ డోసు అవసరం పడదనుకుందాం. కనీసం రూ.500 ఖర్చవుతుంది. బిహార్ జనాభా 12.40 కోట్లట. మనిషికి 500 రూ.ల చొప్పున మొత్తం రూ. 6200 కోట్లన్నమాట. దీని ప్రభావం ఆర్నెల్లుంటుందో, ఏడాది వుంటుందో తెలియదు. అప్పటికి రోగం చప్పబడి వుంటే ప్రభుత్వం వేయించకపోవచ్చు. ప్రజలూ పట్టుబట్టక పోవచ్చు. తగ్గకపోతే మాత్రం యిది రికరింగ్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. దీనికి బిహార్ బజెట్‌లో ప్రొవిజన్ పెట్టారో లేదో తెలియదు. బిహార్‌ను ప్రస్తుతం కుదిపివేస్తున్న సమస్య నిరుద్యోగ సమస్య. అందుకని తేజస్వి యాదవ్ తను అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు. నీతీశ్ దాన్ని ఎద్దేవా చేశాడు. తీరా చూస్తే బిజెపి 19 లక్షల ఉద్యోగాలు యిస్తానని వాగ్దానం చేసింది. దానికి తోడు యీ ఉచిత వాక్సిన్ వాగ్దానమొకటి.

ఎన్నికలు వస్తే బిజెపిని పట్టలేం. 2015 ఆగస్టులో మోదీ బిహార్‌లోని ఆరా సభలో ఏం చెప్పారు? ‘‘బిహార్‌ అభివృద్ధికై కేంద్రనిధు లిద్దామనుకుంటున్నాను. ఎంత కావాలి? 50 వేల కోట్లా? 60, 70, 75, 80!? అబ్బే ఏకంగా లక్షా యిరవై ఐదు వేల కోట్ల నిధులిస్తా, పండగ చేస్కోండి’’ అన్నారు.  ఓ పక్క ఆంధ్ర బజెట్ లోటు పూడ్చటం లేదు. వెనకబడిన 7 జిల్లాలకు నిధులు విడుదల చేయలేదు. రాజధానికై డబ్బివ్వలేదు. అయినా వాళ్లకా ఆఫర్. ఎంత యిస్తామన్నా బిహార్ ఓటర్లు నమ్మలేదు. 2014లో మోదీకి పూలరథం పట్టినా రాష్ట్రానికి వచ్చేసరికి బిజెపిని ఓడించేశారు. అధికారం రాలేదు కాబట్టి ఆ 1.25 లక్షల కోట్లు యిచ్చి వుండరు. తర్వాత నీతీశ్ కుప్పిగంతు వేసి యిటు వచ్చినా యిచ్చినట్లు లేదు. ఉంటే నిరుద్యోగ సమస్య యిలా వుండేది కాదు.

ఈలోగా అదే సంవత్సరం నవంబరులో కశ్మీర్ ఎన్నికలు వచ్చాయి. అక్కడ 80 వేల కోట్ల సాయం ప్రకటించారు. అక్కడ సంయుక్త ప్రభుత్వంలో భాగస్వామి ఐనా, గత ఐదేళ్లలో వాళ్లకు విదల్చలేదు సరి కదా, వారి కున్న సౌకర్యాలు తీసేశారు. అది మంచాచెడా అన్నది యిక్కడ చర్చనీయాంశం కాదు. ఎన్నికల వేళ బిజెపి ఎంత బరి తెగించి వాగ్దానాలు చేస్తుంది అన్నదే చూస్తున్నాం. బిహార్‌లో ఉచిత వాక్సిన్ అనగానే తక్కిన దేశం గొడ్డు పోయిందా? అని విమర్శలు వచ్చాయి. వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి చేత ప్రకటన చేయించారు – మేమూ ఉచితంగా యిస్తాం అని. మధ్యప్రదేశ్, అసాం, పాండిచ్చేరి ముఖ్యమంత్రులూ టపటపా ప్రకటించేశారు. వీళ్లంతా మా అభివృద్ధి నిలిచిపోయింది, మాకు కేంద్రం నుంచి రావలసిన బాకీలు రానే లేదు, చాలా కటకటగా వుంది అని ఫిర్యాదు చేస్తున్నవారే. మరి వాక్సిన్ ఉచితంగా యివ్వడానికి డబ్బులెలా వస్తాయనుకుంటున్నారు? ఎన్నికలు దగ్గర్లో వున్నాయి కాబట్టి అలాటి శంకలు పెట్టుకోలేదు.

దిల్లీ ముఖ్యమంత్రి మేం యివ్వలేం కానీ కేంద్రమే దేశజనాభా మొత్తానికి ఉచిత వాక్సిన్‌లు యివ్వాలి అని డిమాండ్ చేశారు. ఒడిశాలోని బాలాసోర్‌లో ఉపయెన్నిక జరగబోతోంది. అక్కడకు ఎన్నికల ప్రచారానికి వచ్చిన బిజెపి మంత్రి ప్రతాప్ సారంగీని ఒడిశా రాష్ట్రమంత్రి ఆర్‌పి స్వెయిన్ ‘తక్కిన రాష్ట్రాలలో ఉచిత వాక్సిన్ అంటున్నారు, మన రాష్ట్రానికి మీరేం చేస్తున్నారు?’ అని అడిగాడు. వెంటనే సారంగీ ‘దేశమంతా ఉచితంగా వాక్సిన్‌లు యిస్తాం’ అనేశాడు. కేంద్రంలో ఆయన చూసే శాఖలు పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ యిత్యాదులు. ఆర్థిక మంత్రి కాదు, ఆరోగ్యమంత్రి కాదు. ఆయన మాటకు ఎంత విలువ వుంటుందో తెలియదు. అసలు ఆర్థికమంత్రి రాష్ట్రాలకు రావలసిన జిఎస్‌టి బకాయిలు సైతం తొక్కిపెట్టారు, పోలవరానికి ఎంగిలి చేత్తో కూడా విదల్చటం లేదు. మరి 135 కోట్ల మందికి ఉచితంగా వాక్సిన్ యిస్తామంటే డబ్బులిస్తారా?

ముందు అన్ని వాక్సిన్‌లు తయారవ్వాలి కదా! ఏ యే వర్గాల వారికి యివ్వాలో ప్రాధాన్యతా క్రమం జాబితా తయారు చేస్తున్నారు. అది పక్కన పడేసి, మధ్యలో ఎక్కడ ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి యిస్తామంటూ మెలిక పెడితే ఎలా? వాక్సిన్‌లు అటు మళ్లించి, మిగతా రాష్ట్రాలలో వైద్యుల దగ్గర్నుంచి ఎండగడతారా? నోట్ల రద్దు సమయంలో దేశమంతా ఎటిఎంలు మూతపడినా ఎన్నికలు వస్తున్న యుపిలో మాత్రం క్యాష్ లభ్యమయ్యేట్లా ఎటిఎంలు పనిచేశాయ్. ఇప్పుడు వాక్సిన్‌ల సంగతీ అంతేనేమో! ఎన్నికలు అయిపోయాక గత 1.25 లక్షల కోట్ల హామీ లాగానే బిహార్‌లో దీన్ని తుంగలో తొక్కి ఎన్నికలు జరగబోయే బెంగాల్‌లో యిస్తామని ప్రకటిస్తారేమో!

అమెరికాలో ఉచితంగా యిచ్చినా యివ్వగలరేమో నాకు తెలియదు. సిరిగల వానికి చెల్లున్.. అన్నారు. మన దేశ ఆర్థిక స్థితి 25 వారాలలో 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందంటున్నారు. ఇంత భారం మోయగలదా కేంద్ర ప్రభుత్వం? ఒకవేళ మోస్తే కరోనా సెస్ అంటూ దానికి రెట్టింపు వసూలు చేస్తుందా? ముందులో యిలా చెప్పి, తర్వాత రాష్ట్రాలదే భారం అనవచ్చు. వలస కార్మికులను సరైన సమయంలో ఆదుకోకుండా, తర్వాత శ్రామిక రైళ్ల టిక్కెట్ల దగ్గర్నుంచి రాష్ట్రాలతో బేరమాడిన ఘన చరిత్ర కేంద్రప్రభుత్వానికి వుంది.

అసలు అందరికీ ఉచితంగా వాక్సిన్ ఎందుకు యివ్వాలి? కరోనా వస్తే హాస్పటల్స్‌కి లక్షలు ఖర్చు పెడుతున్నవారికి కూడా ఉచితంగా యివ్వడంలో అర్థముందా? దారిద్ర్యరేఖకు దిగువున వున్నవారికి, వలస కార్మికులకు, నగరాల్లో మురికివాడల్లో వుండేవారికి ఫ్రీగా యిస్తాం అని ప్రకటిస్తే సముచితంగా, నమ్మశక్యంగా వుండేది. అమలు చేసేందుకు వెసులుబాటు వుండేది. అందరికీ ఉచిత వాక్సిన్ అనే నినాదం బిజెపి వారి మరో ‘‘జుమ్లా బాత్’’గా మారుతుందేమో చూడాలి.

ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2020)
[email protected]