రమేశ్‌కుమార్ గారు ఎన్నికల పేరు చెప్పి ఎన్ని కలలు కంటున్నారో చూస్తూంటే ఆశ్చర్యంగా వుంది. పాపం ఆయనకు ఒకటే ఆత్రమట, అర్జంటుగా స్థానిక ఎన్నికలు జరపకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడ దెబ్బ తినిపోతుందోనని!
ప్రజాస్వామ్యం పట్ల యీ అక్కర యిన్నాళ్లూ ఎక్కడ దాగుందో తెలియటం లేదు. ఆయన ఎన్నికల కమిషనర్ అయ్యాక టిడిపి హయాంలో ఎన్నికలు జరపకపోయినా కిమ్మనలేదు. కోర్టు చెప్పినా చలించలేదు. నాకెందుకు వచ్చిన గొడవ, రిటైరయ్యాక వచ్చిన పదవి కదా, ఏదో కృష్ణారామా అనుకుంటూ, కడుపులో చల్ల కదలకుండా కాలక్షేపం చేసేసి పోతే చాలనుకున్నారు కాబోలు. టిడిపి ప్రభుత్వాన్ని అడిగో అడగకుండానో తనంతట తాను ఎన్నికలు ప్రకటించలేదు. ఇప్పట్లా ప్రతిపక్ష పార్టీలను పిలిచి సమావేశాలు నిర్వహించలేదు. ఎన్నికలు జరపకపోతే రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రానికి కేంద్రనిధులు రాకుండా పోతాయని చింత పడినది లేదు.
అధికారం చేతులు మారింది. వైసిపి గద్దె కెక్కింది. నెలలు గడిచాయి. వారికైనా గుర్తు చేయలేదు. స్థానిక ప్రజాప్రతినిథులకు తగిన గుర్తింపు రావాలంటూ, వారి హక్కులకై గళమెత్తలేదు. తన హోదాని ఉపయోగించుకుని ప్రభుత్వానికి గుర్తుచేస్తూ కానీ, హెచ్చరికగా కానీ లేఖలు రాయలేదు. నిధులు రాకపోతే వాళ్లే అవస్థలు పడతారు, మనకేం అని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు నిమ్మగడ్డ వారు! ప్రభుత్వమే చివరకు తలపెట్టింది. ఇక అక్కణ్నుంచి వైసిపికి అనుకూల వాతావరణం స్పష్టంగా కనబడింది.
ఇప్పుడున్న దశలో, ఉచితాలతో జగన్ వెలిగిపోతున్న స్థితిలో, బలమైన అవినీతి ఆరోపణలూ, అక్రమాలూ బయటపడని దశలో వైసిపికి వ్యతిరేకంగా పోటీ చేస్తే లాభమేమిటి అని యితర పక్షాల రాజకీయ నాయకులు లెక్కలు వేశారు. పైగా అప్పటికి జగన్ పాలన ఏడాది కూడా పూర్తి చేసుకోలేదు. కరోనా తలెత్తలేదు. ప్రభుత్వవ్యతిరేకత టిడిపి మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా గట్టిగా గోచరించటం లేదు. అమరావతి ఉద్యమం కూడా ఆ మూడు, నాలుగు గ్రామాలకే పరిమితమై పోయింది. రాజధాని వికేంద్రీకరణ ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఉత్సాహాన్ని రగిలించింది కూడా. వాలంటీరు వ్యవస్థ యువతకు కొద్దోగొప్పో ఉపాధి అవకాశాలను కల్పించింది.
పోనీ ప్రతిపక్షం బలంగా ఏమైనా వుందా అంటే టిడిపిలోంచి ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు. జారుకోనివారు స్తబ్ధంగా వుంటున్నారు. లోకేశ్ జనాల్లో తిరిగి క్యాడర్‌ను ఉత్తేజితం చేయటం లేదు. కాలం గడిచేకొద్దీ జగన్ పొరపాట్లు చేయకపోతాడా, అప్పుడే మనం రంగంలోకి దిగి చెడుగుడు ఆడేయవచ్చు అని టిడిపి సీనియర్ నాయకులు గట్టుమీద కూర్చుని చూస్తున్నారు. ఇక జనసేనాని, ఎన్నికల ఓటమి తర్వాత సినిమాలకు మరలిపోయారు. ప్రభుత్వవిధానాలకు నిరసన తెలపడానికి నిరాహారదీక్షల కంటె సన్యాసులు చేసే దీక్షలకు మొగ్గు చూపుతున్నారు. రోడ్డెక్కి రాస్తారోకోలు చేసే పాతపద్ధతులకు స్వస్తి చెప్పి, ఫామ్‌హౌస్‌లో చెట్లతో ముచ్చట్లాడుతున్నారు. క్యాడర్‌కు పాపం ఏదో చేయాలని వుంది కానీ దిశానిర్దేశం చేయవలసిన సేనాపతి స్వామీజీ అయిపోయారు. ఆయన గంభీరమైన ఆలోచనలను తెలుగులోకి అనువదించి చెప్పేందుకు మధ్యలో ఎవరూ లేకుండా పోయారు.
ఇలాటి పరిస్థితుల్లో ప్రతిపక్ష అభ్యర్థులు చప్పగా వుండిపోవడంతో వైసిపి వారు చెలరేగిపోయారు. మనదే రాజ్యం అనుకున్నారు. ఏకగ్రీవం అయితే మరీ గొప్పగా వుంటుందనుకుని, ఎవరైనా మామూలు వ్యక్తి నామినేషన్ వేయబోయినా అడ్డుకున్నారట. ఇవన్నీ జరుగుతున్నా రమేశ్ కుమార్ ఊరుకున్నారు. ఇన్ని ఏకగ్రీవాలున్నా ఆయనేమీ ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు. ఒకరకంగా అది కరక్టే. ఎందుకంటే గత స్థానిక ఎన్నికల సమయంలో టిడిపి, వైసిపి పోటాపోటీగా వున్నాయి. కాంగ్రెసు పూర్తిగా తుడిచిపెట్టుకు పోలేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా ఏకపక్షమై పోయింది. అందువలన రమేశ్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడిపోయారు.
ఇంతలో ఏదో జరిగింది. అదేమిటో ఎప్పటికీ బయటకు రాదు. రమేశ్ తన స్వభావానికి విరుద్ధంగా సడన్‌గా చురుగ్గా అయిపోయారు. తన బెస్ట్ పార్ట్ ఆఫ్ ద కెరియర్ను గవర్నరు కొలువులో తాపీగా గడిపేసి, వివాదరహితంగా రిటైరై పోయిన వ్యక్తి హఠాత్తుగా వివాదాల్లోకి దూకడానికి నిశ్చయించు కున్నారు. ‘ఎన్నికల కమిషన్ అనేది వుందా? లేదా? ఏం జరుగుతోంది యిక్కడ?’ అని బాబు హుంకరించడం తడవు, ఎన్నికలు వాయిదా వేసి పడేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించలేదూ ఏమీ లేదు. ఎన్నికల కోడ్ పేరు చెప్పి అధికారాలను చేతుల్లోకి తీసుకుని టపటపా అధికారులను బదిలీ చేసేశారు. ఆయనకు దొరికిన సాకేమిటంటే కరోనా! అప్పటికి కేంద్రప్రభుత్వం కూడా అదేమీ ఎమర్జన్సీ కాదనే అంటోంది. కానీ ఈయనకు మాత్రం దాని తీవ్రత ముందుగా గోచరించింది.
రాష్ట్రప్రభుత్వం అదేమీ సీరియస్ కాదు పొమ్మంది. పారాసిటమాల్‌తో పోయేదానికి యింత రాద్ధాంతమా అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తీరా చూస్తే కరోనా క్రమక్రమంగా తన విశ్వరూపాన్ని చూపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు, ఐసిఎమ్ఆర్కు, హేమాహేమీలైన ప్రపంచ శాస్త్రజ్ఞులకు కూడా కొరకరాని కొయ్యగా మారి, యిప్పటిదాకా భయపెడుతూనే వుంది. ఇన్ని మరణాలు సంభవిస్తాయని ఎవరూ ఊహించలేక పోయారు. మన దేశంలో మరణాల శాతం తక్కువే కానీ, దాని కారణంగా ధననష్టం విపరీతంగా కావడంతో భయపెడుతోంది. ఇప్పటికీ అది చకచకా వ్యాపిస్తోంది. ఆంధ్ర వరకు చూస్తే పరీక్షలు ఉధృతంగా చేయడంతో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా వుంది, మరణాల సంఖ్య అంత తీవ్రంగా లేకపోయినా! నిజంగా ఎన్నికలు నిర్వహించి వుంటే కేసుల సంఖ్య పాపమంతా దానిపై పడేది. ఆ విషయంలో ఆంధ్రప్రభుత్వం రమేశ్‌కు ధన్యవాదాలు చెప్పుకోవాలి.
కానీ ప్రభుత్వాధినేత అలా అనుకోలేదు. తన ప్రభుత్వాన్ని గుర్తించడానికి నిరాకరించి, దానితో సంప్రదించకుండా ఎన్నికలు నిలిపివేసి, అధికారులను బదిలీ చేసిన రమేశ్‌పై పగబట్టారు. ఆయన ఉద్యోగం తీసేసి, మరొకర్ని వేసేశారు. రమేశ్ సుప్రీం కోర్టు దాకా వెళ్లి, తన పదవి మళ్లీ తను తెచ్చుకున్నారు. ప్రభుత్వం మొహం వేళ్లాడేసింది. కానీ రమేశ్ అధికారాన్ని తను గుర్తించదలచుకోలేదు. 2021 మార్చి వరకు, అంటే ఆయన పదవిలో వున్నంతవరకు ఎన్నికలు నిర్వహించకూడదని నిశ్చయించు కున్నారనుకోవాలి. కరోనా భయం యింకా తగ్గలేదు కాబట్టి, నిర్వహించక పోవడానికి వీళ్ల కీసారి మంచి సాకు దొరికింది. ప్రభుత్వంపై పోరాడి గెలిచిన కీర్తి రమేశ్‌కు దక్కింది. ఇద్దరూ హ్యేపీ అనుకుంటూన్న సమయంలో మళ్లీ ఏదో జరిగింది. రమేశ్ గారు ఎన్నికలు జరుపుతానని పంతం పడుతున్నారు.
ఎన్నికలు వాయిదా వేసినప్పుడు రమేశ్‌గారికి ప్రజారోగ్యంపై ఎంత చింతో అని టిడిపి, యితర పక్షాలు కొనియాడాయి. స్వయంగా డాక్టరు కాకపోయినా కరోనా విశ్వరూపాన్ని ముందుగా దర్శించిన ద్రష్ట అన్నారు. ప్రజారోగ్యం గురించి ప్రభుత్వానికి చింత లేకపోయినా, ఆయన కుంది అని మెచ్చుకున్నారు. దానికి రాజకీయపరమైన రంగు పులమడం తప్పు, ఆయనను చిత్తశుద్ధిని శంకించడం మరీ తప్పు అని కూకలేశారు. మరి ఆయనకా చింత హఠాత్తుగా మాయమై పోయిందెందుకో? ఆయన వాయిదా వేసిన నాటికి ఆంధ్రలో కేసులు పదికి లోపే ఉన్నాయి. దేశం మొత్తం మీదే 93. ఇప్పుడు దేశంలో 80 లక్షల కేసులు. ఆంధ్రలో 8.18 లక్షలు. దేశంలో మరణాలు 1.21 లక్షలు, ఆంధ్రలో 6660. ఎన్నికలు వాయిదా వేసినపుడు రమేశ్ గారు ఆరువారాల్లో కరోనా సద్దు మణుగుతుం దనుకున్నారు కాబోలు, ఆరువారాలే వాయిదా వేశారు.
ఆరువారాలు కాదు కదా, ఆరార్లు ముప్ఫయారు వారాలైనా తగ్గేట్టు లేదు. కరోనాకు యిప్పటికీ సరైన మందు లేదు, వాక్సిన్ లేదు. టెస్టుల మీద ప్రజలకు నమ్మకం లేదు, ఉత్తి పుణ్యాన పాజిటివ్ అని చూపిస్తున్నారని అనుమానం. పాజిటివ్ వచ్చి, ఆసుపత్రిలో చేరితే లక్షలకు లక్షలు ఆవిరై పోతున్నాయి. జీవితకాలం ఆదా అంతా కరిగిపోయి, అప్పుల పాలవుతున్నారు. ఇతర రోగాలు ఎన్ని వచ్చినా యింట్లో గచ్చాకుపుచ్చాకుతో నయం చేసుకుందామని చూస్తున్నారు తప్ప ఆసుపత్రికి వెళ్లడానికి యిన్ఫెక్షన్ భయం. దాంతో ఆ రోగాలు ముదురుతున్నాయి. ఎప్పుడు కొంప ముంచుతాయో తెలియదు.
సినిమా థియేటర్లు బావురుమంచున్నాయి. పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. ఫంక్షన్ల శుభాకాంక్షలన్నీ జూమ్ మీటింగుల్లోనే. కరోనాతో చచ్చిపోతే అంత్యక్రియలు కూడా సరిగ్గా జరపటం లేదు. మామూలుగా పోయినా, కరోనాతో పోయారేమోనన్న భయంతో జనాలు మొహం తిప్పుకుంటున్నారు. పరామర్శకు కూడా వెళ్లటం లేదు. చదువుకునే వారికి స్కూల్స్ లేవు, కాలేజీలు లేవు. ఆన్లైన్లో ఎంత చదువు వంటపడుతోందో తెలియటం లేదు. ఐటీ వాళ్లకు మార్చి దాకా వర్క్ ఫ్రమ్ హోమే అంటున్నారు. బేఫర్వాగా తిరిగేవాళ్లు తిరుగుతున్నారు కానీ అధికాంశం ప్రజలు జాగ్రత్త పడుతూనే వున్నారు.
ఇలాటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తానంటూ రమేశ్ ముచ్చటపడడం దేనికో తెలియటం లేదు. అప్పట్లో మే నెల వస్తే ఎండలకు కరోనా మాడిమసై పోతుందనుకున్నారు. అందుకే రమేశ్ ఆరువారా లన్నట్లున్నారు. కానీ మనం ఎండలకు మండాం, వానలకు తడిసిముద్దయ్యాం కానీ కరోనా మాత్రం ఆత్మపదార్థంలా ఎండక, తడవక, కాలక, నశించక అలాగే వుంది. దినదినాభివృద్ధి చెందుతోంది. యూరోప్‌లో మళ్లీ ఉధ్యతమౌతోంది. ఇక్కడ నవంబరు డిసెంబరులలో సెకండ్ వేవ్ వస్తోంది కాసుకోండి అంటున్నారు.
షాపులు తెరిచిపెట్టారు కానీ ఖాళీగానే వుంటున్నాయి. ప్రజలంతా హోమ్ డెలివరీపై ఆధారపడ్డారు. 65 ఏళ్లు దాటినవారిని పిల్లలు బయటకు వెళ్లద్దంటూ కట్టడి చేస్తున్నారు. షాపుల వారు కూడా రావద్దంటూ డిస్కరేజ్ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రధాని దగ్గర్నుంచి మన్‌కీ బాత్ సెలవిస్తున్నారు. ఇక బార్లా తెరిచినవేమిట్రా అంటే బార్లు. కరోనా కట్టడికై ఆదాయం కావాలి కాబట్టి అది తాగుబోతుల దగ్గర్నుంచే పీల్చగలరు కాబట్టే కేంద్రం కూడా రాష్ట్రాలకు అనుమతులిచ్చేసింది. కానీ పోలింగు బూత్‌లు బార్లలో పెట్టరు కదా! ఇన్ని తెలిసి రమేశ్ గారు యిప్పుడు ఎన్నికలంటున్నారేమిటి? ప్రజారోగ్యం పట్ల ఆయన చింత, శ్రద్ధ, అక్కర ఏమై పోయినట్లు?
అసలు శాంతిభద్రతల మాటేమిటి? గతంలో వైసిపి కారణంగా తనకు ప్రాణహాని వుందన్నారు. కేంద్రమంత్రికి ఓ ఉత్తరం పడేసి, తను పొరుగు రాష్ట్రానికి జంపై పోయారు. మరి యిప్పుడా భయం పోయిందా? ప్రభుత్వాధినేత తన ఫ్యాక్షన్ కుటుంబ నేపథ్యాన్ని (రమేశ్‌గారు లేఖలో రాసినదే) మార్చేసుకున్నారా? గంగలో మునిగి పునీతులైపోయి, కాశీలో హింసాత్మక ప్రవృత్తికి, విపరీత స్వభావానికి నీళ్లొదిలేశారా? రమేశ్ గారికి దానిపై నమ్మకం కుదిరి యిప్పుడు తన సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకున్నారా? కుటుంబాన్ని ఆంధ్రకు షిఫ్ట్ చేశారా? ఎన్నికల కమిషనర్‌కే భరోసా లేనప్పుడు, సాధారణ ఓటరుకు ఏం భరోసా వుంటుంది? వాళ్లకు కూడా ఒక్కోరికీ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారా?
అబ్బే అక్కర లేదు, యిలాగే కానిచ్చేసేద్దాం అని రమేశ్ గారంటే మాత్రం రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని సర్టిఫికెట్టు యిచ్చినట్లే. అలా యిస్తే టిడిపి వారు నొచ్చుకుంటారు. వారి ప్రకారం రాష్ట్రంలో దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు, రైతులకు, ప్రజాఉద్యమ కారులకు, వ్యాపారస్తులకు, సామాన్యులకు.. అంతెందుకు ఏ వర్గానికీ భద్రత లేకుండా పోయింది. ఏ ఆస్తికీ రక్షణ లేకుండా పోయింది. రాయలసీమ రౌడీలు ఎప్పుడు వచ్చి తమపై దాడి చేస్తారా అని ప్రజలంతా భయంతో వణికి ఛస్తున్నారు. ఎన్నికలు నిర్వహించే శాంతియుత పరిస్థితి నెలకొంది అని రమేశ్ గారు అంటే, ‘ఎన్నికల కమిషన్‌కు కళ్లు లేవా?’ అని బాబు హుంకరించే ప్రమాదం వుంది జాగర్త.
శాంతిభద్రతలు ఒక్కటే కాదు, ఎన్నికల నిర్వహణకు ప్రజారోగ్యపరిస్థితి కూడా ప్రధాన అంశమై పోయిందిప్పుడు. ఎన్నికల నిర్వహణకు అనువైన సమయమిది అని రమేశ్ గారంటే రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ అద్భుతంగా వుంది అని కితాబు యిచ్చినట్లే! ఇదీ టిడిపి నాయకులకు రుచించే విషయం కాదు. కరోనా పరిస్థితి దేశంలోని అన్ని రాష్ట్రాల కంటె ఆంధ్రలో అధ్వాన్నంగా వుందని గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత కేసులు పెరగడానికే అవకాశం ఎక్కువుంది. పెరగగానే దాని పాపమంతా ప్రభుత్వం మీదే పడుతుంది. తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి పెట్టిన శ్రద్ధలో పదోవంతైనా ప్రజలను కాపాడడంపై పెట్టి వుంటే కేసులు యిన్ని పెరిగేవి కావు అని స్టేటుమెంట్లు కురుస్తాయి.
ఎన్నికలు నిర్వహించే పరిస్థితి వుందా అని వారిని అడగకుండానే రమేశ్ ఎన్నికల శంఖం పూరించారు. అలా అడగాలి కదే అని టిడిపి, దాని మిత్రపక్షాలు ఆయనకు హితవు పలకలేదు. రేపు తాము అధికారంలోకి వస్తే మరో అధికారి యిలాగే ప్రవర్తించవచ్చేమోనన్న భయమో, అధికారంలోకి వచ్చినప్పటి మాట కదా అన్న ధీమాయో తెలియదు. నిజంగా వైసిపిని తోసిరాజని ఎన్నికలు నిర్వహించేయడానికి రమేశ్ సిద్ధపడి ప్రకటించేశారనుకోండి. ఇప్పుడు మాత్రం పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు రావా? టిడిపి మార్చిలో కంటె నవంబరు నాటికి బాగుపడిందా? మధ్యకాలంలో యింకా ఎక్కువమంది ఎమ్మేల్యేలు జారుకున్నారు.
కరోనా టైములో జనాలు బెంబేలెత్తినపుడు వాళ్ల మధ్య తిరిగి, ధైర్యం చెప్పి, ఎన్టీయార్ ట్రస్టు ద్వారా చికిత్స చేయిస్తామనో, టెస్టులు చేయిస్తామనో, క్యాంపులు నిర్వహిస్తామనో అని వుంటే పరిస్థితి బాగుండేదేమో కానీ, టిడిపి ముఖ్యనాయకులు జనాల్లో తిరగలేదు. ఇక తండ్రీకొడుకూ చూడబోతే హైదరాబాదుకే పరిమితమయ్యారు. కనీసం అక్కడి జనాల్లో తిరిగినా అక్కడ మీడియాయైనా కవర్ చేసేది. తెలంగాణాలో పార్టీ యూనిట్ వున్నా గాలికి వదిలేశారు. ‘దిఖ్తా హై, బిక్తా హై’ అని సామెత. జగన్ ఊరూరూ వెళ్లడం మూలానే జనం స్వయంగా చూసి, ఫీలై ఆదరించారు. ఈ తండ్రీ తనయులు కష్టకాలంలో కనబడకుండా జూమ్‌లో ఆరోపణలు చేస్తూ కాలం గడిపితే ఎలా? తండ్రికి జూమ్, తనయుడికి అదీ లేదు, ట్విటర్ మాత్రమే. అది ఆయనే ఆపరేట్ చేస్తాడో, వేరెవరైనా చమక్కులు వేసేవారిని పెట్టుకున్నాడో తెలియదు. కరోనా వచ్చిన ఆర్నెల్లకు (సామెతలేవీ గుర్తు చేసుకోకండి) జనంలోకి వచ్చి నన్ను చూసి జగన్ వణికిపోతున్నాడంటూ ప్రగల్భాలు పలికితే జనాలు నమ్మేస్తారా?
ఇలాటి పరిస్థితిలో మళ్లీ ఎన్నికలు నిర్వహించినా ఏకగ్రీవాలు తగ్గుతాయా? తగ్గకపోతే వైసిపి వాళ్ల ధాష్టీకం అంటూ టిడిపి, సిపిఐ వగైరాలు గగ్గోలు పెట్టరా? ఎడాపెడా పిల్స్ వేయరా? దానితో కోర్టుల ఆదేశాలు, డిజిపిని, అధికారులను కోర్టుకు పిలిచి మందలించడాలు.. వగైరాలు. అధికారులు కరోనా కట్టడే చేస్తారా? కోర్టుకు హాజరే అవుతారా? ఎన్నికల ప్రచారం ప్రారంభం కాగానే కరోనా కేసులు పెరుగుతాయి. వెంటనే టిడిపియే ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని పిటిషన్ పెట్టవచ్చు. సరే వాయిదా వేస్తున్నాను, కరోనా తగ్గేదాకా, రేదర్ తగ్గిందని నేను ఫీలయ్యేదాకా, ఎన్నికల కోడ్ పేరు చెప్పి అధికారం నడిపేస్తాను ఆయన రమేశ్ గారనవచ్చు. గతంలో కోడ్ అనగానే ఎలా రెచ్చిపోయారో చూశాం కదా!
రమేశ్ గారి దృష్టిలో ప్రభుత్వానికి విలువేమీ లేదు. వాయిదా వేసినప్పుడూ సంప్రదించలేదు, యిప్పుడూ లేదు. అన్నిటికీ కోర్టునే నమ్ముకున్నారు. వాళ్లే తనకు ఉద్యోగం మళ్లీ యిప్పించారు. వాళ్లే తనకు పాలనాధికారం మళ్లీ యిస్తారన్న ఆశ. దీనికి తోడు ఆయన రాజకీయ నాయకులతో భుజాలు రాసుకుని తిరుగుతున్నారని హోటల్ సమావేశం ద్వారా తెలిసింది. సుజనా యిప్పుడు ఏ పార్టీలో వున్నా, ఎవరికి సన్నిహితుడో అందరికీ తెలుసు. పైగా సుప్రీంలో ఖరీదైన లాయర్లను పెట్టుకోగల సత్తా రమేశ్ గారికి వచ్చిందంటే ఆయనకున్న కనక్షన్లు లాకాయిలూకాయివి కావు. ఐఏఎస్‌ల జీతాలు మరీ అంత ఎక్కువేమీ కాదు. సాఫ్ట్వేర్ యింజనీర్లకే ఎక్కువ వస్తాయి. రమేశ్ గారు అవినీతికి పాల్పడ్డ దాఖలాలేవీ లేవు. ఇప్పుడు హఠాత్తుగా స్తోమత వచ్చిందంటే ఆశ్చర్యం కాదా? మార్చి వరకు ఉద్యోగంలో వుంటే వచ్చే జీతాని కంటె ఎక్కువగా లాయరు ఫీజు యిచ్చారంటే ముప్పావలా కోడిపిల్లకు మూడు రూపాయల పందిపిల్లను దిష్టి తీసినట్లుంది.
మామూలు ఉద్యోగి అయితే పోతే పోనిమ్మని ఊరుకునేవారు. కానీ యిక్కడ రాజకీయ నాయకుల మధ్య ప్రతిష్ఠకు సంబంధించిన విషయమై పోయింది. ఇప్పుడు కూడా ఫైనల్‌గా ఆయనంతట ఆయనే ఎన్నికలు పెట్టగలుగుతారని ఎవరూ అనుకోలేరు. ఈ పేరు చెప్పి ప్రభుత్వాన్ని చికాకు పెట్టడమే లక్ష్యమై వుంటుంది. దీన్ని అదనుగా చూసుకుని ‘తన కిష్టం లేని అధికారిని సహించలేని దురహంకారి ఫ్యాక్షనిస్టు జగన్’ అని తండ్రి, ‘నన్ను చూసి బెదిరిపోయి, ఎన్నికలు పెట్టడానికే దడుస్తున్నాడొహోయ్’ అని తనయుడూ ప్రచారం చేసుకోవడానికి తప్ప వేరెందుకూ పనికి రాదనుకుంటున్నాను.
బిహార్‌లో ఎన్నికలు పెట్టారు కదా యిక్కడెందుకు పెట్టకూడదు అంటే అక్కడ రాజ్యాంగపరమైన అవసరం ఉంది. అసెంబ్లీ కాలాన్ని పొడిగించాలంటే చాలా తతంగం వుంది. అందుకని పెట్టారు. అక్కడ రాజకీయ వాతావరణం వేడిగా వుంది, ఎవరు గెలుస్తారో చప్పున చెప్పలేని పరిస్థితి. అయినా మొదటి విడతలో 55 శాతం కంటె తక్కువ మంది ఓటేశారు. ప్రజల్లో కొంతమందికైనా కరోనా భయం వుందని అనుకోవాలి. మరి యిక్కడ అర్జన్సీ ఏమిటి? రమేశ్ గారి పదవీకాలం మార్చిలో అయిపోతుందన్న బెంగ తప్ప! గుజరాత్లో స్థానిక ఎన్నికలు మూణ్నెల్లు వాయిదా వేశారు. అక్టోబరులోనే! వాటికి రాష్ట్రాలు యిస్తున్న ప్రాముఖ్యత అంతే! స్థానిక ప్రజాప్రతినిథులకు భాగస్వామ్యం లేకుండా పోవడం దురదృష్టకరమే, కానీ ఏళ్ల తరబడి అదే పరిస్థితి. ఇంకో ఆర్నెల్లు సాగుతుంది, అంతేగా!
కరోనా భయం లేదని తన చర్యల ద్వారా రమేశ్ గారు చాటుకుని వుంటే వేరేలా అనుకోవచ్చు. కానీ ఆయన సమావేశాలు ఏర్పాటు చేయడం దగ్గర్నుంచి జాగ్రత్తలు పడి, అందర్నీ ఒకసారి రావద్దన్నారు. ఈయన పేరే ఉన్న ప్రఖ్యాత డాక్టరు రమేశ్ గారు కోవిడ్ భయంతో పోలీసు విచారణకు స్వయంగా రానంటున్నారు. తన మటుకు తాను జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు వచ్చినా ఫర్వాలేదనుకుంటూ యీ రమేశ్ గారు ఎన్నికల నిర్వహణకు కంకణం కట్టుకున్నారు. జగన్ సర్కారు అన్జాన్ కొడుతోంది. మార్చిలోగా జరపకూడదని దాని పంతం. జరపాలని యీయన పంతం. ఎన్నికల కమిషనర్‌కు వేరే సైన్యమేమీ లేదు. సైన్యాధిపతిని అడక్కుండా యుద్ధం ప్రకటించేశాడీయన. ప్రభుత్వం అడుగు ముందుకేయనంటుంది. ఈయన వాళ్లకు రాసే బదులు కోర్టులో పిటిషన్లు దంచుతూంటాడు. ఇక కోర్టుల వారికే పని. కొన్ని కేసుల్లో నెలల తరబడి వాయిదా వేస్తూంటారు. వీటిల్లో మాత్రం టపటపా కేసులు నడిపించేస్తారని అనుకోవచ్చు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కాలక్షేపానికి లోటు లేకుండా చూస్తున్నారు!
ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2020)