పశ్చిమ యూరోప్‌లో రైటిస్టు ధోరణులు, అతివాద ధోరణులు యిటీవలి కాలంలో పుంజుకుంటున్నాయి. ఐసిస్ కారణంగా కొన్ని దేశాల్లో సంక్షోభం చెలరేగి, శరణార్థులు యీ దేశాలకు వచ్చిపడి తక్కువ కూలీకే పని చేయడానికి సిద్ధపడడంతో స్థాని నిరుద్యోగులు, చిరుద్యోగులు నష్టపోతున్నారు. గ్లోబలైజేషన్ అనే నినాదంతో, ప్రపంచమంతా సరిహద్దులు లేని గ్లోబల్ విలేజి అంటూ ఆసియా దేశాలలో చొరబడుతూ వచ్చిన పాశ్చాత్యదేశాలు యిప్పుడు ఆ మాటే మర్చిపోతున్నాయి. అక్కడి ప్రజల్లో జాతీయవాదం పేరుతో జాత్యహంకారం పెరుగుతోంది. మేము వేరు, శరణార్థి జాతుల వారు వేరు అని వాదిస్తున్నారు. యూరోప్ దేశాల ప్రజలు బయటి దేశాల వాళ్లెవరూ రాకుండా అడ్డుగోడలు కట్టాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వాలు లొంగుతున్నాయి కూడా. యూరోపియన్ యూనియన్ (ఇయు) లో సభ్యత్వం వుంటే శరణార్థులను ఆదుకోవాల్సిన అగత్యం పడుతోందని, అందువలన బ్రిటన్ తరహాలో మనమూ ఇయు నుంచి తప్పుకోవాలని ఫ్రాన్సు, నెదర్‌లాండ్స్ వంటి దేశాల్లో రైట్ వింగ్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. గత్యంతరం లేక ప్రభుత్వాలు తల వొగ్గుతున్నాయి.
హంగేరీ పార్లమెంటు జనవరిలో ''జ్యూయలరీ చట్టం'' పేరుతో ఒక చట్టం చేసింది. శరణార్థులకు ఆశ్రయం కల్పించే ఖర్చుల నిమిత్తం వారి వద్ద నున్న విలువైన ఆభరణాలను సొంతం చేసుకునే హక్కును ఆ చట్టం ప్రభుత్వానికి కల్పించింది. అయినా జూన్‌లో సర్వే జరిపితే శరణార్థులను రానివ్వని పార్టీకి ఓటేస్తామని 25% మంది ప్రజలు అన్నారు. శరణార్థుల పట్ల కఠిన వైఖరి వహిస్తాననని హంగేరీ ప్రభుత్వం అనడంతో 68% ప్రజలు దాన్ని సమర్థించారు. ప్రతీ దేశానికి ఇయు శరణార్థుల కోటా యింత అని కేటాయించడాన్ని ఒప్పుకుంటారా? అనే ప్రశ్నతో అక్టోబరు 2 న ప్రజాభిప్రాయం సేకరించింది. 44% మంది ఓటింగులో పాల్గొన్నారు. వారిలో 98% మంది ఇయు శరణార్థుల పాలసీని వ్యతిరేకించారు. ఇయుకు మూలస్తంభంగా నిలిచిన జర్మనీ అధినేత్రి ఏంజెలా మెర్కెల్‌కు వ్యతిరేకంగా నియో-నాజీలు ఎఎఫ్‌డి (ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ) పార్టీ పేర ఏర్పడి ఆమెకే సవాలు విసురుతున్నారు. మొత్తం 16 స్టేట్ పార్లమెంట్లు వుంటే 10 వాటిల్లో ప్రాతినిథ్యం సంపాదించుకున్నారు. సెప్టెంబరులో జరిగిన స్థానిక ఎన్నికలో మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ పార్టీ కంటె ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలలో వాళ్లు మరింత బలపడతారని అంచనా.
2015 వేసవి నాటికి ముస్లిము దేశాల నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలలోకి 10 లక్షల మంది శరణార్థులు వచ్చిపడడంతో ఆ యా దేశాల్లో ముస్లిములు తమ సంస్కృతిని నాశనం చేస్తున్నారని గగ్గోలు పుట్టింది. ముస్లిం శరణార్థులను రానివ్వకూడదని, దేశంలో వున్న ఇస్లామిక్ స్కూళ్లను మూసేయాలని, బురఖాను నిషేధించాలని ఆ దేశాల ప్రజలు అనసాగారు. ఫ్రాన్సులో కొన్ని మునిసిపాలిటీలు ముస్లిం యువతులు ఈత కొట్టేటప్పుడు వేసుకునే బుర్కిని (బికినిల్లా కాకుండా ఒళ్లు కనబడకుండా వేసుకునే స్విమ్మింగ్ డ్రెస్సులు)లను నిషేధించాయి. దీనితో బాటు ఐసిస్ ఇస్లామ్ పేరుతో టెర్రరిజం అవలంబిస్తోంది కాబట్టి, ముస్లిముల నందరినీ అనుమాన దృక్కులతో చూస్తూ, వారిని తమ దేశాల్లో రానివ్వకూడదని యూరోపియన్ ప్రజల కోరిక. ప్రజల యీ మూడ్‌ను సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్షాల వారు నడుం బిగించారు. హిట్లర్ కాలం నాటి జాతివాదాన్ని ధైర్యంగా వినిపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఔననక తప్పటం లేదు. స్లొవాకియా, ఎస్టోనియా, బల్గేరియా, పోలండ్ దేశాలు శరణార్థుల్లో క్రైస్తవులను మాత్రమే స్వీకరిస్తామని చెపుతున్నాయి.
ఇస్లాం వ్యతిరేకత, రైటిస్టు భావాలు కలిసి పోయి రైటిస్టు పార్టీలకు మంచి వూపు వచ్చింది. ఫ్రాన్సులో యిటీవల టెర్రరిస్టు దాడులు జరగడంతో నేషనల్ ఫ్రంట్ పార్టీ అనే రైటిస్టు పార్టీకి 2.50 కోట్ల ఓటర్లు పాల్గొన్న స్థానిక ఎన్నికలలో 68 లక్షల ఓట్లు పడ్డాయి. స్వీడన్‌లో డెమోక్రాట్స్ పార్టీ నడిచే రైటిస్టు పార్టీకి 2010లో 6% ఓట్లు వస్తే 2014 నాటికి 13% వచ్చాయి.నెదర్లాండ్స్‌లో యిప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీ ఫర్ ఫ్రీడమ్ పేరుతో వున్న రైటిస్టు పార్టీకి 150 సీట్లలో 33 సీట్లు వస్తాయట. ఇవన్నీ ప్రస్తుతపు ఉదారవాదాన్ని కట్టిపెట్టి, బయటివారిని దేశంలోకి రానివ్వకూడదనే నినాదంతోనే పనిచేస్తున్నాయి. ఇటలీలో వామపక్షాలకు గట్టి పట్టుండే టస్కనీలో రైటిస్టు పార్టీ ఐన నార్దరన్ లీగ్ పార్టీ 20% ఓట్లు సంపాదించింది. ఆస్ట్రియాలో ఫ్రీడమ్ పార్టీ కూడా అదేబాటలో నడుస్తోంది.
హిట్లర్ నాజీ సేనలో ఎస్‌ఎస్ విభాగం యూదుల మారణకాండ వంటి అత్యంత ఘోరకృత్యాలు చేసింది. హిట్లర్ ఆస్ట్రియాపై దండెత్తి తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నపుడు ఆస్ట్రియా సైనికాధికారులు కొందరు ఆ విభాగంలో చేరి, ఆ జాతిహననంలో పాలుపంచుకున్నారు. ఆ అధికారుల్లో కొందరు 1956లో స్థాపించిన పార్టీయే ఫ్రీడమ్ పార్టీ. 1978 వరకు మాజీ ఎస్‌ఎస్ సభ్యులే దాన్ని నడిపించారు. అందువలన మేధావులే కాక, సామాన్య ప్రజలు కూడా ఆ పార్టీని ఏవగించుకునేవారు. 'నేను ఆ పార్టీకి ఓటేస్తాను' అని చెప్పుకునేవారిని మనస్సాక్షి లేనివారిగా పరిగణించేవారు. 2005లో హెంజ్ క్రిస్టియన్ స్ట్రాష్ అనే డెంటిస్టు పార్టీ పగ్గాలు చేపట్టాక పార్టీ యిమేజిని సరిదిద్దాడు. గతంలో ఇజ్రాయేలును శత్రుదేశంగా పరిగణించే విధానాన్ని వదిలిపెట్టి ముస్లిములను, అరబ్బు దేశాలను శత్రువులుగా చూడమన్నాడు. ''గతకాలపు ఫాసిజమే యీనాడు పొలిటికల్ ఇస్లామ్‌గా రూపుదిద్దుకుంది. దాన్ని మనం ఎదిరించాలి.'' అంటూ చెప్తూ వచ్చాడు. ఈనాడు ఆ దేశాలన్నిటిలో ఇస్లాం భయం పట్టుకోవడంతో అతని మాటలకు విలువ పెరిగింది.
2008లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఇయులో గ్రీసు, స్పెయిన్ వంటి అప్పుల పాలైన కొన్ని దేశాలు బాగా దెబ్బతిన్నాయి. ఆస్ట్రియా అలాటి దుర్గతినుంచి తప్పించుకుంది. రష్యా పతనమయ్యాక గతంలో కమ్యూనిస్టు పాలనలో వున్న తూర్పు యూరోప్ దేశాలలో ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. అక్కణ్నించి అనేక మంది నిరుద్యోగ యువతీయువకులు పశ్చిమ యూరోప్‌లోని ధనిక దేశాలకు వచ్చిపడ్డారు. అది స్థానికులకు బాధగా వుంది. దానికి తోడు కొత్తగా శరణార్థుల సమస్య వచ్చిపడేసరికి వూరికే భయపడడం ఎక్కువైంది. నిజానికి శరణార్థులు వచ్చాక క్రైమ్ రేటు పెరిగిన దాఖలాలు లేవు. కానీ యీ గణాంకాలు ఎవరికీ అక్కరలేదు. ప్రజల్లో భయాలు ఎక్కువై పోయి, తాము నమ్మినదే నిజమనుకుంటున్నారు. 2015లో సర్వే ఒకటి జరిపి జనాలను అడిగి చూశారు. 'మీ దేశంలో ఎంత మంది శరణార్థులు తలదాచుకున్నారని అనుకుంటున్నారు?' అని. జర్మనీల జనాభాలో 26% విదేశీయులే అని అక్కడి వాళ్లు చెప్పారు. నిజానికి దానిలో సగం కంటె తక్కువ మంది 12% మంది వున్నారంతే. ఫ్రాన్సు, బెల్జియం, యుకె, నెదర్లాండ్స్‌లో కూడా పరిస్థితి అలాగే వుంది.
ప్రజల్లో యిలాటి భయాలు వుంటే స్ట్రాష్ లాటి వాళ్లు వూరకే వుంటారా? తన ఫ్రీడమ్ పార్టీ అనుచరుల్ని పంపి శరణార్థుల శిబిరాలు వేయకూడదని ప్రదర్శనలు నిర్వహింపచేశాడు. ట్రంప్ తరహాలో హంగరీతో సరిహద్దు వద్ద కంచె కట్టాలని డిమాండ్ చేశాడు. 2013 నాటికే ఆ పార్టీకి పార్లమెంటులో 20% సీట్లు దక్కాయి. రాష్ట్రాలలో, మునిసిపాలిటీల్లో గణనీయంగా ఓట్లు తెచ్చుకోసాగింది. 2016 వచ్చేసరికి మరింత అనుకూల పరిస్థితి ఏర్పడింది. 30 సం||ల వయసు కంటె తక్కువ వున్న యువతీయువకులలో అది అత్యంత పాప్యులర్ పార్టీ. రాజధాని వియన్నాలో 31% ఓట్లు వచ్చాయి. డిసెంబరులో జరగబోయే అధ్యక్ష ఎన్నికలలో స్ట్రాష్ తన పార్టీ తరఫున నార్బర్ట్ హాఫర్‌ను నిలబెట్టబోతున్నాడు. అతనికి నెగ్గే అవకాశాలున్నాయంటున్నారు. ఎందుకంటే ఏప్రిల్‌లో జరిగిన మొదటి విడత ఎన్నికలలో ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తే అతనికి 35% ఓట్లు పడ్డాయి. 2018లో అత్యున్నత స్థానమైన ఐన ఛాన్సెలర్ పదవికి పోటీ జరుగుతుంది. స్ట్రాష్ దానికి పోటీ చేయవచ్చు. నెగ్గినా నెగ్గవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2016)