ఎమ్బీయస్‌: ఓటు కన్నా కలం పోటు గొప్ప…

కత్తి కన్న కలం గొప్ప అని చిన్నప్పుడు చదువుకున్నాం. హరియాణా రాజ్యసభ ఎన్నికలో ఓటు కన్న కలం.. ఆట్టే మాట్లాడితే కలంలో సిరా శక్తివంతమైనది అని తేలింది.   ఇంకా లోతు కెళితే సిరా…

కత్తి కన్న కలం గొప్ప అని చిన్నప్పుడు చదువుకున్నాం. హరియాణా రాజ్యసభ ఎన్నికలో ఓటు కన్న కలం.. ఆట్టే మాట్లాడితే కలంలో సిరా శక్తివంతమైనది అని తేలింది.   ఇంకా లోతు కెళితే సిరా రంగు ఫలితాలను తారుమారు చేసేసింది. అయితే ఆ రంగులను తారుమారు చేసినదెవరో తెలియటం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి నాయకులు చేస్తున్న అనేక వింతలను చూస్తున్నాం. ఇప్పటిదాకా ఎవరూ తొక్కని కొత్త పుంతను హరియాణా అసెంబ్లీ చూపించింది.

హరియాణా అసెంబ్లీలో 90 సీట్లున్నాయి. బిజెపికి 47, లోకదళ్‌కు 20, కాంగ్రెసుకు 17 మంది ఎమ్మెల్యేలున్నారు. తక్కిన ఆరుగురు స్వతంత్రులు. రాజ్యసభ ఎంపీ కావాలంటే అభ్యర్థికి 30 ఓట్లు పడాలి. బిజెపి అధికారికంగా నిలబెట్టి గెలిపించుకున్న అభ్యర్థి బిరేంద్ర సింగ్‌కు 30 ఓట్లు పడ్డాయి. బిజెపి వద్ద అదనంగా 17 వున్నాయి. ఇంకో అభ్యర్థిని నిలబెడితే అవి చాలవు. అందుకని జీ మీడియా వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్రను స్వతంత్రుడిగా నిలబెట్టి మద్దతు యిస్తానంది. సుభాష్‌ ఆరుగురు స్వతంత్రుల మద్దతు కూడా సంపాదించాడు. అలా అయినా 23తో ఆగిపోయింది. అవతల అతనికి ప్రత్యర్థిగా, మరో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన ఢిల్లీ లాయరు, మాజీ ఎంపీ అయిన ఆర్‌ కె ఆనంద్‌కు కాంగ్రెసు, లోకదళ్‌ మద్దతిస్తున్నాయి.  అంటే 37 ఓట్లు అతని వద్ద వున్నాయన్నమాట. జూన్‌ 11 నాటి ఎన్నికలో ఆనంద్‌ గెలుపు తథ్యం అనుకుంటూ వుంటే ఛూమంతర్‌ జరిగింది. కళ్లు తెరిచి చూస్తే సుభాష్‌కు 29 ఓట్లు పడి గెలిచాడు, ఆనంద్‌ కు 21 ఓట్లే వచ్చి ఓడాడు. 37 రావాల్సింది 21 మాత్రమే రావడమేమిటి? 14 ఓట్లు చెల్లవని రిటర్నింగ్‌ ఆఫీసరు నిర్ణయించాడు. అతన్ని అభ్యర్థిగా నిలబెట్టడం యిష్టం లేని కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హూడా తన ఓటు ఖాళీగా వుంచేశాడు. మరొకటి ఓటేసిన ఎమ్మెల్యే తన ఓటును మరో ఎమ్మేలేకు చూపించడం చేత తిరస్కరింపబడింది. అలా రెండు ఓట్లు తిరస్కరించగా మిగిలిన 12 ఓట్లు ఒకే ఒక్క సింపుల్‌ కారణం చేత తిరస్కరించబడ్డాయి. అదేమిటంటే ఓటుపై సంతకం చేసిన ఎమ్మెల్యేలు వయొలెట్‌ కలర్‌ యింకు పెన్నుతో బదులు రాయల్‌ బ్లూ కలరు యింకు పెన్నుతో సంతకాలు పెట్టారు. ఆ 12 చెల్లి వుంటే ఆనంద్‌కు సుభాష్‌ కంటె 4 ఓట్లు ఎక్కువ వచ్చి గెలిచేవాడు. ఎమ్మెల్యేలు వాళ్ల జేబుల్లో వేరే వేరే రంగుల పెన్నులు పెట్టుకుని బూతులోకి వెళ్లి సంతకాలు పెట్టలేదు. అక్కడ టేబులు మీద వున్న పెన్నునే వాడారు. మరి ముందు వాళ్ల పెన్నులో వయొలెట్‌ రంగు వుండి, తర్వాతి వారి పెన్నుల్లో రాయల్‌ బ్లూ రంగు ఎలా దూరింది? పెన్నులో రంగు మారలేదు, పెన్నులే మారాయి. అలా మార్చినదెవరు? 

ఇంకెవరు బిజెపి ఎమ్మెల్యే అసీమ్‌ గోయలే అంటాడు ఆనంద్‌. బిజెపి వాళ్లలో కొందరు ఓటేశాక అతను లోపలకి వెళ్లి ఓటేసేటప్పుడు బూతులో టేబులు మీదున్న వయొలెట్‌ కలరు సిరా వున్న పెన్నును జేబులో పెట్టేసుకుని, అక్కడ రాయల్‌ బ్లూ కలరు సిరా వున్న పెన్నును పెట్టాడు. అతని తర్వాత వెళ్లిన కాంగ్రెసు సభ్యులు 12 మంది ఆ పెన్నునే వాడారు. సిరా మారుతుందని ఎవరనుకుంటారు? బొత్తిగా ఎరుపు, ఆకుపచ్చ లాటివైతే తేడా కొట్టొచ్చినట్లు తెలుస్తుంది కానీ యీ రెండు రంగులకు తేడా తక్కువే కదా. వాళ్లు ఓటేశాక బిజెపికి, సుభాష్‌కు మద్దతిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే జయ ప్రకాశ్‌ ఓటేయడానికి వెళ్లి వయొలెట్‌ పెన్ను అక్కడ పెట్టేసి రాయల్‌ బ్లూ పెన్ను జేబులో పెట్టుకుని తెచ్చేశాడు. అందుచేత తర్వాత వచ్చిన వాళ్లందరూ వయొలెట్‌ పెన్నునే వాడారు. 'కావాలంటే ఎన్నికల ప్రక్రియను రికార్డు చేసిన వీడియో చూడండి. తక్కిన ఎమ్మెల్యే లందరూ ఓటేయడానికి 4- 21 సెకండ్లు తీసుకుంటే అసీమ్‌ మాత్రం 49 సెకండ్లు తీసుకున్నాడు. అంతేకాదు, పెన్నులు మార్చిన అసీమ్‌, జయ ప్రకాశ్‌ యిద్దరూ పాంటు జేబుల్లోకి చేతులు పెట్టుకున్నారు చూడండి.'' అంటాడు ఆనంద్‌, ఆ వీడియోను మీడియాకు చూపిస్తూ. ''మగవాళ్లు జేబుల్లోకి చేతులు పోనిచ్చి గోక్కోవడం వింతేమీ కాదు'' అని కొట్టి పారేశాడు సుభాష్‌. ఓట్లు లెక్కించేటప్పుడు 'ఓటు మీద సరైన సిరాతో సంతకాలు పెట్టారో లేదో చూడండి' అంటూ అతను ఎన్నికల అధికారిని అడగడం వలన యిదంతా పథకం ప్రకారం సాగిందని అనుమానం కలుగుతోంది. 

ఈ పథకంలో రిటర్నింగ్‌ ఆఫీసరుగా వ్యవహరించిన హరియాణా ఎన్నికల అధికారి రాజేందర్‌ నందలాల్‌కూడా భాగస్వామే అని మరో అనుమానం బలంగా వుంది. సుభాష్‌ తరఫున పనిచేసిన అతని లాయరు వికె మోహన్‌ నందలాల్‌తో ఎన్నికలకు ముందు తరచుగా మాట్లాడాడు. జూన్‌ 2 నుండి 10 లోగా మొత్తం 24 కాల్స్‌ చేశాడు. వాటిలో కొన్ని నందలాల్‌ యింటి దగ్గర వుండగా కూడా చేశాడు. ఆనంద్‌ కాల్‌ రికార్డు సంపాదించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. నందలాల్‌, సుభాష్‌ ఆ రికార్డును కొట్టి పారేయలేకపోయారు. ''ఎన్నికల ప్రక్రియపై వాళ్ల కేవో అనుమానాలుండి నాకు ఫోన్‌ చేశారు. వాటిని తీర్చడం నా ధర్మం.'' అంటాడు నందలాల్‌. 'తక్కిన అభ్యర్థులు ఆయనకు ఒక్కసారీ కాల్‌ చేయలేదు. మీరు మాత్రం ఏకంగా అన్నిసార్లు కాల్‌ చేసేటన్ని సందేహాలేమున్నాయి' అని మీడియా మోహన్‌ను అడిగితే అతను మీడియాతో మాట్లాడడానికి యిచ్చగించలేదు. 

ఆనంద్‌కు టిక్కెట్టివ్వడం హూడాకు యిష్టం లేదు. అతను మొండికేస్తున్నాడు కాబట్టి కాంగ్రెసు అధిష్టానం ఆనంద్‌కు ఓటేయమని విప్‌ జారీ చేసింది. 'రాష్ట్రపతి ఎన్నికలో, రాజ్యసభ ఎన్నికలో అలా విప్‌ జారీ చేయకూడదు, చట్టవిరుద్ధం' అంటాడు సుభాష్‌. జూన్‌ నెలాఖరులో ఎన్నికల కమిషన్‌ సుభాష్‌ను పిలిచి విచారించింది. అతను ''17 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలలో 15 మంది ఆనంద్‌కు ఓటేయడానికి యిష్టపడలేదు.'' అన్నాడు. వాళ్లు హూడా మనుష్యులు కావచ్చు. చట్టం ఎలా వున్నా అధిష్టానం మాట కాకుండా తన మాట చెల్లడానికి హూడా కూడా బిజెపితో, సుభాష్‌తో చేతులు కలిపి వుండవచ్చని ఒక అంచనా. ఏది ఏమైనా ఈ ఘటన తర్వాత కాంగ్రెసు మేల్కొంది. అధిష్టానంతో ప్రమేయం లేకుండా రాష్ట్ర యూనిట్లు తలెగరేస్తూండడం ఎట్టకేలకు గుర్తించి, 2015 ఆగస్టు తర్వాత యిన్నాళ్లకు ఓ సమావేశం ఏర్పాటు చేసి కోఆర్డినేషన్‌ కమిటీ ఏర్పరచింది. సుభాష్‌ ఎన్నికను ఎన్నికల కమిషన్‌ గుర్తిస్తుందో లేదో త్వరలోనే తెలిసిపోతుంది.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2016)

[email protected]