ఝార్‌ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ పదవి ఎక్కుతూండగానే చేసిన పని పత్థల్‌గడీ ఉద్యమ సందర్భంగా ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయడం! పరిశీలన లేకుండా యావత్తు కేసులు ఎత్తివేయడంలో విజ్ఞత లేదని అతని భాగస్వామి పక్షమైన కాంగ్రెసు భావిస్తోంది. సొరేన్ పార్టీ ఐన జెఎంఎం (ఝార్‌ఖండ్ ముక్తి మోర్చా), కాంగ్రెస్, లాలూ పార్టీ ఐన ఆర్‌జెడి కలిసి పోటీ చేస్తూ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందిస్తామని డిసెంబర్లోనే అన్నాయి కానీ యిప్పటిదాకా అది తయారు కాలేదు. దాని కోసం ఆగకుండా తమ మానిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటీ అమలు చేస్తూ పోతామని హేమంత్ అంటున్నాడు. జెఎంఎం, కాంగ్రెసు తమ మానిఫెస్టోలలో చిత్తం వచ్చినట్లు వాగ్దానాలు చేశాయి. ఎలా నెరవేరుస్తారో తెలియదు. అయితే హేమంత్ అధికారంలోకి వస్తూనే అంగన్‌వాడీ వర్కర్ల, టీచర్ల జీతం బకాయిలు చెల్లించాడు. చాలాకాలంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తానన్నాడు.
పత్థల్‌గడీ ఉద్యమం గురించి నేను 2018 జులైలో రాశాను. వీలైతే చూడండి. గిరిజనుల సంప్రదాయం ప్రకారం గ్రామంలో చావు, పుట్టుక లాటి ఏదైనా ముఖ్య సంఘటన జరిగినప్పుడు ఒక శిలాఫలకం పాతుతూ ఉంటారు. 1996లో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ ఏరియాలలో గిరిజనుల హక్కుల గురించి చట్టం చేసినపుడు ఝార్‌ఖండ్‌లో పని చేసిన యిద్దరు ఐఏఎస్ అధికారులు బిడి శర్మ, బండి ఓరాన్‌లు అక్కడి భూములపై గిరిజనులకు హక్కు దఖలు పరిచే రాజ్యాంగ సూత్రాలను శిలాఫలకాలపై చెక్కించి ప్రతీ గ్రామంలో పాతించారు. గత బిజెపి ప్రభుత్వం 2017లో గిరిజనుల భూములను గిరిజనేతరులకు కట్టబెట్టాలని ప్రయత్నించినపుడు ఆ రాజ్యాంగ సూత్రాలను ఉటంకిస్తూ ఎక్కడ పడితే అక్కడ ఆ శిలాఫలకాలను ఆందోళనకారులు పాతారు. దాంతో ఆ ఉద్యమానికి పత్థల్‌గడీ ఉద్యమమనే పేరు వచ్చింది.
ముఖ్యమంత్రి రఘువర్ ఆ ఉద్యమాన్ని అణచి వేయాలని, వేలాది ఉద్యమకారులపై దేశద్రోహం కేసులు పెట్టేశాడు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ కేసైనా సరే దేశద్రోహం చుట్టూనే తిరుగుతోంది. అయినా గిరిజనులు వెరవకుండా చాలా నెలలపాటు తీవ్రమైన ఉద్యమం జరపడంతో గవర్నరు ద్రౌపది ముర్ము దడిసి, ప్రభుత్వం పంపిన ఆర్డినెన్సుపై సంతకం పెట్టలేదు. ప్రభుత్వం అప్పటికి ఊరుకుంది. కానీ రఘువర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైతే, ఎప్పటికైనా తమ భూములకు ముప్పు తప్పదని గిరిజనుల భయం. దాన్ని ప్రతిపక్షంలో ఉన్న జెఎంఎం బాగా ఉపయోగించుకుంది. తాము అధికారంలోకి వస్తే అలాటి చట్టాన్ని చేయమని చెప్పడంతో బాటు, ఉద్యమసందర్భంగా పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తానని వాగ్దానం చేసింది.
రఘువర్ రాష్ట్రానికి తొలి గిరిజనేతర ముఖ్యమంత్రి కావడంతో బాటు చాలా అహంకారిగా పేరుబడ్డాడు. అధికారులను, జర్నలిస్టులను కూడా తిట్టేవాడట. పార్టీ సహచరులతో సంప్రదింపులు లేవట. గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రదేశాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్లను మూసివేయడంతో అతనికి గిరిజనులు అతన్ని ఏవగించుకున్నారు. బిజెపి జాతీయ అంశాలపై ప్రధానంగా ప్రచారం చేసి దెబ్బ తిందని, ప్రతిపక్షాలు నిరుద్యోగం వంటి స్థానిక అంశాలపై ప్రచారం చేసి లాభపడ్డాయని డిసెంబరు 23 నాటి వ్యాసంలోనే రాశాను. దానికి తోడు రఘువర్‌పై వ్యతిరేకత ఎంతలా ఉందంటే 1995 నుంచి అతను గెలుస్తూ వచ్చిన జంషడ్‌పూర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి యీసారి 16 వేల తేడాతో ఓడిపోయాడు. ఓడించినది అతని పాత కాబినెట్ సహచరుడు సరయూ రాయ్. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే యోధుడు. అతను రఘువర్ అవినీతి ఎత్తి చూపిస్తూ ఉంటే బిజెపి అతనిరి పార్టీకి టిక్కెట్టు నిరాకరించింది. పార్టీలోంచి బయటకు వచ్చి, స్వతంత్రుడిగా పోటీ చేసి రఘువర్‌కు, బిజెపికి బుద్ధి చెప్పాడు.
రఘువర్ ముఖ్యమంత్రిగా ఉండగానే 2019 పార్లమెంటు ఎన్నికలలో 14 సీట్లలో 12 సీట్లు గెలవడంతో బిజెపికి ధైర్యం వచ్చింది. అతన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపింది. గిరిజనులు తమపై ఆగ్రహంగా ఉన్నారని, వాళ్లు గిరిజన పార్టీ ఐన జెఎంఎంకు మూకుమ్మడిగా ఓట్లేస్తారనీ గ్రహించి, వాళ్ల ఓట్లు చీల్చడానికి మరో గిరిజన పార్టీ ఐన ఎజెఎస్‌యు (ఆల్ ఝార్‌ఖండ్ స్డూడెంట్స్ యూనియన్)ను దింపింది. వాళ్లు మొదటి నుంచి బిజెపి మిత్రపక్షమే. కానీ యీసారీ పొత్తు పెట్టుకుంటే తమపై గల ఆగ్రహం వాళ్లపై కూడా పడుతుందని ఆలోచన చేసి, రెండూ ప్రత్యర్థి పార్టీలన్న బిల్డప్ యిచ్చింది. బిజెపి 53 మంది అభ్యర్థులతో తమ తొలిజాబితా విడుదల చేయగానే తమకు యిస్తానని ఒప్పుకున్న సీట్లలో కూడా అభ్యర్థులను నిలిపిందని నిరసిస్తూ ఎజెఎస్‌యు పొత్తు నుండి తప్పుకుంది. ఎజెఎస్‌యు 10-12 సీట్లు గెలిచి వస్తే అవసరమైతే ఎన్నికల తర్వాత దానితో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని బిజెపి ప్లాను.
అయితే యిది పారలేదు. 'జనసేన, టిడిపికి 'బి' టీము, వీళ్లకు ఓటేస్తే వాళ్లకు ఓటేసినట్లే' అని ఆంధ్రలో వైసిపి ప్రచారం చేసినట్లే ఝార్‌ఖండ్‌లో జెఎంఎం ప్రచారం చేసింది. బిజెపిపై ఆగ్రహంగా ఉన్న గిరిజనులు ఎజెఎస్‌యుకు కూడా ఓట్లేయలేదు. దానికి 8% ఓట్లు, 2 సీట్లు మాత్రం వచ్చాయి. (గతంలో 3 ఉండేవి) గిరిజన ప్రాంతాల్లో 28 నియోజకవర్గాలు ఉంటే బిజెపికి 2 రాగా, ప్రత్యర్థి కూటమిలో జెఎంఎంకు 19, కాంగ్రెసుకు 6 వచ్చాయి. దళిత ఓట్లు చీలాయి. బిజెపికి ఒసి, ఒబిసిల మద్దతు లభించింది. 33.4% ఓట్లు 25 సీట్లు లభించాయి. (గతంలో 37 ఉండేవి) బిహార్‌లో దాని భాగస్వామ్య పక్షాలుగా ఉంటూ యిక్కడ మాత్రం విడిగా పోటీ చేసిన జెడియు, ఎలెజ్‌పిలకు ఒక్కటీ రాలేదు. జెఎంఎం కూటమికి 47 సీట్లు వచ్చాయి. జెఎంఎంకు 18.8% ఓట్లు, 30 సీట్లు రాగా (2014లో వచ్చినవి 19), కాంగ్రెసుకు 13.9% ఓట్లు, 16 సీట్లు, ఆర్‌జెడికి 1 సీటు వచ్చాయి.
ఝార్‌ఖండ్‌లో మరో ముఖ్యమైన వ్యక్తి దాని తొలి ముఖ్యమంత్రి, గిరిజన నాయకుడు బాబూలాల్ మరాండీ. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో బిజెపి అతన్ని తీసేసి అర్జున్ ముండాను అతని స్థానంలో కూర్చోబెట్టింది. అతనికి కోపం వచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఝార్‌ఖండ్ వికాస్ మోర్చా (జెవిఎం) అనే పార్టీ పెట్టాడు. 2014లో 8 సీట్లు గెలిస్తే, బిజెపి వారిలో 6గుర్ని ఎగరేసుకుని పోయింది. ఈ సారి తమతో పొత్తు పెట్టుకోమని హేమంత్ అడిగితే 'నీ నాయకత్వాన్ని నేను అంగీకరించను' అంటూ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేశాడు. 3 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల ఫలితాలు రాగానే హేమంత్ గతాన్ని మనసులో పెట్టుకోకుండా వెళ్లి 'మీ సలహాలు కావాలి' అని అడిగితే మరాండీ సంతోషించేశాడు. తప్పకుండా అన్నాడు.
అలాగే ముఖ్యమంత్రి అయ్యాక హేమంత్ తను గతంలో రఘువర్‌పై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసును ఉపసంహరించుకున్నాడు. 2013 జులై- 2014 నవంబరుల మధ్య ముఖ్యమంత్రిగా ఉండగా అతను చాలా పొగరుగా వుండేవాడని, మంత్రులతో సరిగ్గా వ్యవహరించేవాడు కాడనీ పేరు బడ్డాడు. ముగ్గురు మంత్రులను హఠాత్తుగా చెప్పాపెట్టకుండా తొలగించాడు కూడా. ఈసారి తను మారానని చూపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అధికారంలోకి రాగానే పత్థల్‌గడీ కేసులన్నీ ఎత్తివేస్తున్నానన్నాడు. అవి ఖుంటీ జిల్లాలోనే 10 వేలున్నాయి. అలా అన్నీ ఎత్తివేయకూడదనీ, ఉద్యమ కేసులు ఎత్తివేయవచ్చు కానీ మానభంగం, కిడ్నాప్, హత్య కేసులు ఎత్తివేస్తే ఎలా అని కాంగ్రెసు మంత్రి రామేశ్వర్ ఓరాన్ అన్నాడు.
2017లో ఖుంటీ జిల్లాలో ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున వచ్చిన ఐదుగురు అమ్మాయిలను కొందరు ఎత్తుకుపోయి, మానభంగం చేసి, తర్వాత చంపేశారు. అదేమిటంటే వాళ్లు 'బయటివాళ్లు, మన ఉద్యమాన్ని నాశనం చేయడానికి వచ్చారు' అన్నారు. బిజెపి ఎంపీ కారియా ముండా యింటి బయట కాపలా కాస్తున్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులను ఉద్యమకారులు ఎత్తుకుపోయారు. ఉద్యమ సమయంలో గ్రామస్తులు అధికారులను గ్రామాల్లోకి రానిచ్చేవారు కారు. ఇదే సందని కొందరు గంజాయి పండించసాగారు. వారికి మావోయిస్టులు అండగా నిలిచేవారు. పంట పండాక దాన్ని అంతర్జాతీయ విపణిలో అమ్ముకుని తమ పార్టీకి నిధులు సమకూర్చుకునే వారు. వెలుగులు చిమ్మే దీపం కింద నీడ ఉన్నట్టే ఉద్యమం చాటున యిలాటి నేరాలు జరుగుతాయి. వీటికి సంబంధించిన కేసులు ఎత్తివేయకూడదని కాంగ్రెసు వాదిస్తోంది. అసలే ఝార్‌ఖండ్ 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటూ వచ్చింది. బిజెపియేతర మిశ్రమ ప్రభుత్వాల ఆయుర్దాయం బహు తక్కువ. ఐదేళ్లూ ఆ రాష్ట్రాన్ని పాలించిన ఘనత తాజా మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్‌కే దక్కింది. ఇక యీ సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్తు ఎలా ఉంటుందో యిప్పుడే వూహించడం భావ్యం కాదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2020)
[email protected]