ఎమ్బీయస్ – గ్రేట్ ఆంధ్రా ఆర్కయివ్స్ 2020 క్యూ 3

నా పాత ఆర్టికల్స్ వెతికేవారి సౌలభ్యం కోసం యీ బ్లాగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2009 నుంచి ఇప్పటిదాకా 12 సంవత్సరాల ఆర్టికల్స్‌కు ఏడాదికి 4 యూనికోడ్, 4 పిడిఎఫ్ చొప్పున ఫైళ్లు ఈ బ్లాగ్‌లో దొరుకుతాయి. 2009 ఉందనుకోండి. జనవరి నుంచి మార్చి Q1, ఏప్రిల్ నుంచి జూన్ Q2.. అలాగన్నమాట. ఫైలు మొదట్లో ఆ క్వార్టర్‌లో రాసిన ఆర్టికల్స్ జాబితా వుంటుంది. అది చూస్తే మీకు కావలసిన వ్యాసం దానిలో వుందో లేదో తెలిసిపోతుంది. యూనికోడ్‌ ఫైల్లో సెర్చింగ్ యీజీ. కానీ ప్రింట్ తీస్తే అందంగా రాదు. అందువలన ఇదే ఫైల్‌ను అను7లోకి మార్చి, పిడిఎఫ్ కూడా లభ్యం చేశామన్నమాట.

నేను 2015 మధ్యలో భగవద్గీతపై ఆర్టికల్ రాశానని, అది మళ్లీ చదివితే బాగుంటుందని తోచిందనుకోండి. ఆ ఏడాది క్యూ2 యూనికోడ్ ఫైళ్లలోకి వెళ్లి, వర్డ్ ఫైల్ కాబట్టి ‘ఫైండ్’ ఆప్షన్ ఎంచుకుని అక్కడ భగవద్గీత అని తెలుగులో టైపు చేస్తే (తెలుగులో టైప్ చేయడానికి జీమెయిల్‌లో కుడివైపు పైన ఇన్‌పుట్ టూల్స్ (పెన్ను బొమ్మ)లో తెలుగు ఎంచుకోవచ్చు. మెయిల్ కంపోజ్ చేస్తున్నట్లుగా టైపు కొట్టి దాన్ని కాపీ చేసి యిక్కడ పేస్ట్ చేయవచ్చు) ఆ ఫైల్ మొత్తంలో ఆ మాట ఎక్కడెక్కడుందో అదే కనిపెట్టి చూపించేస్తుంది. మీరు చదివాక నచ్చి, ప్రింట్ఔట్ తీసుకుందా మనుకుంటే పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి, కావలసిన పేజీ మాత్రం అచ్చు తీసుకోవచ్చు. ఉజ్జాయింపుగా అనుకున్న పీరియడ్ తప్పితే అదే ఏడాది క్యూ3 , పక్క ఏడాది క్యూ1… యిలా కాస్త వెతుక్కోవాలి.

ఈ ఆర్టికల్స్‌లో సీరియల్స్ కలపలేదు. వాటిని విడిగా ఈ-బుక్స్‌గా తయారుచేద్దామని ప్లాను. అంటే బైబిల్, రాజీవ్ హత్య, తమిళ రాజకీయాలు, నిజాం కథలు, గోడ్సే, ప్రాణ్, హేమమాలిని, వినోద్ మెహతా.. యిలాటివన్న మాట. సాహిత్యాంశ వున్న కన్యాశుల్కం, మృచ్ఛకటికం, నచ్చిన కథ లాటి వాటితో యింకోటి చేయవచ్చు. ఆర్టికల్స్ ఫ్రీగా చదువుకోవచ్చు, అయితే వెతుక్కునే శ్రమ వుంటుంది. ఆ శ్రమ పడనక్కరలేకుండా చక్కగా ఫోటోలతో సహా పుస్తకాలుగా తయారుచేసి యిస్తాం కాబట్టి ఈ-బుక్స్‌ను కొనుక్కోవాలి. 1/8 డెమీ సైజులో ప్రియాంకా 15-15 ఫాంట్‌లో అచ్చు వేసిన పుస్తకాలు రూపాయికి పేజీ చొప్పున అమ్ముతున్నారు. ఈ-బుక్స్ కాబట్టి రూపాయికి 4 పేజీలిద్దామని ప్లాను. అంటే 200 పేజీల పుస్తకాన్ని 50 రూ.లు పెట్టి కొనాలన్నమాట. ఈ బుక్స్ కోసం యిదే బ్లాగ్‌లో వేరే ఆప్షన్ చూడండి. ఇది మీకు ఉపయోగకరంగా వుంటుందని ఆశ. ఇబ్బంది వుంటే తెలియపరచండి. – ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

[email protected]