cloudfront

Advertisement


Home > Movies - Interviews

అవును.. మెగా మేనల్లుణ్ణి నేను: సాయి ధరమ్ తేజ

అవును.. మెగా మేనల్లుణ్ణి నేను: సాయి ధరమ్ తేజ

యూత్ అంటే ఎలా వుండాలి..రిఫరీ ఈల సౌండ్ బయటకు వస్తున్న క్షణంలోనే బుల్లెట్ లా దూసుకుపోవాలి.. మాస్ అంటే ఎలా వుండాలి.. థియేటర్లో ఈల ఆగకుండా వినపడాలి.. మరి అలాంటి యూత్.. ఇలాంటి మాస్ మూవీ చేస్తే అది ఎలా వుంటుంది.. అచ్చం సాయిధరమ్ తేజ సినిమాలా వుంటుంది. అవును సాయి ధరమ్ తేజ.. ఇప్పడు థర్డ్ జెన్ మాస్ హీరోకి పెర్ ఫెక్ట్ ఎగ్జాంఫుల్.. చిరంజీవి.. పవన్.. బన్నీ ల తరువాత మెగా ఫ్యామిలీలో ఈడు మామోలోడు కాదు అని ప్రేక్షకులు అనుకుంటున్న హీరో. ఎవరు ఏం అనుకుంటున్నారన్నది కాదు.. ఎవరికి ఏం కావాలి అన్నది చూసుకుంటూ దూసుకుపోయే రకం ఈ కుర్రాడు. ఇతగాడు నటించిన సుప్రీమ్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ తో గ్రేట్ ఆంధ్ర చిట్ చాట్..

సుప్రీమ్....టైటిల్ తోనే సంగం అట్రాక్షన్ కొట్టేసారు. .సినిమా మీద ఫుల్ పాజిటివ్ బజ్ తెచ్చుకున్నారు.. ఎలా వచ్చింది సినిమా.?

అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ అండీ.. ఇవ్వాళ ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారు కూడా. నిర్మాత సేఫ్ గా వుండాలన్నా కూడా ఇది ఫార్ములా.

మాస్.. ఎంటర్ టైనర్.. రీమిక్స్.. ఇవన్నీ మీ ఫార్ములాలో భాగమేనా?

నా ఫార్ములా అని కాదు.. మనల్ని నమ్మి నిర్మాత కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నపుడు, దాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మన మీద ఎక్కువ వుంటుంది. సో.. అలా సక్సెస్ కావాలి అంటే సినిమాలో ఏయే ఎలిమెంట్స్ వుండాలి అన్నదానిపై దర్శకుడు, నిర్మాతతో కలిసి ఆలోచించాలి.. అమలు చేయాలి. సో.. అది అందరి ఫార్ములా.

చిరు,పవన్ లను గుర్తుకు తెచ్చేలా గెటప్ లు, నటన అవి కూడా ఈ ఫార్ములాలో భాగమేనా?

ఏమండీ.. ఎంత కాదన్నా నేను వాళ్ల మేనల్లుణ్ణి.. ఎవరికైనా మామయ్యల పోలికలు ఎక్కువ వస్తాయంటారు. అది నిజమో కాదో నాకు తెలియదు.. నాలో కొన్ని పోలికలు వుండి వుండొచ్చు.. రామ్ చరణ్ ను చూడండి.. కొన్ని సీన్లలో, కొన్ని ఫీచర్లలో చిరంజీవి గారిలా కనిపిస్తాడు.. దానికి అతనేం చేయగలడు. జీన్స్.. వాటిని మనలోంచి తీసి అవతల పడేయలేం కదా?

జీన్స్ సరే.. పాటల రీమిక్స్.. టైటిల్స్ లో..?

నిజానికి ఈసినిమాలో పాట రీమిక్స్ వద్దన్నాను. కానీ చివరకు తప్పలేదు. అదీ కాక సినిమాలో మామయ్య పేర్లు వినిపిస్తేనే జనానికి పూనకం వచ్చేస్తుంది.. అదీ మెగాభిమానం అంటే.. మరి అలాంటిది వాళ్లను కొద్దిగా గుర్తు చేస్తే.. వంద రూపాయిలు పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకుడిని ఆనందింపచేయడం కన్నా ఇంకేం కావాలి?

ఈ 'సిత్రాలు' మీ మామయ్యలు చూసారా..?

చిరంజీవి గారు మూడు సినిమాలు చూసారు. పవన్ కళ్యాణ్ గారు చూడలేదు.

మరి మీరు చూడమని అడగలేదా? 

ప్రతి సినిమాకు అడుగుతాను.. చూస్తారా అని.. ఆయన ఎప్పుడు చూస్తానంటే అప్పుడు చూపించడానికి రెడీ. హీ ఈజ్ మై గురు.. గాడ్.. అన్నీ. సినిమాల్లోకి వస్తానంటే మామయ్యలు ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ ఎప్పటికీ మరిచిపోలేను.

వెబ్ సైట్లు చదువుతుంటారా..గ్యాసిప్ లు చదవితే ఏమనిపిస్తుంది.. ?

లైట్ తీస్కోవడమే.. చదవడం ఆపను.. చదువుతాను.. నవ్వుకుని పక్కన పెట్టేస్తాను. వాటిని సీరియస్ గా మాత్రం తీసుకోను.

మెగాస్టార్ 150 వ సినిమా.. మీరు కూడా రెడీయేనా?

అబ్బో.. ఎప్పుడో అప్లికేషన్ పెట్టేసాను.. నా విషయాలు అన్నింటితో ఓ ప్రొఫైల్ క్రియేట్ చేసి మరీ ఇచ్చేసా.. మామయ్యను అడిగా.. నిర్మాతగా చరణ్ ను అడిగా.. చిన్న పాత్రయినా చాలు.. అంటూ

ఒరిజనల్ మూవీ చూసి ఏదో పాత్రపై రుమాలు వేసేయలేకపోయారా?

జూనియర్ ఆర్టిస్ట్ లా చిన్న షాట్ లో వుండే పాత్ర అయినా చాలు.. పెద్దమామయ్యతో ఒక్క ఫ్రేమ్ లో అలా కనిపిస్తే చాలు. నేను రెడీ

మరి అలాంటపుడు మిగిలిన మెగా హీరోలతో మల్టీ స్టారర్లకు కూడా సై అనేయచ్చుగా. ?

నేను రెడీ..మెగా హీరోలనే కాదు. మరే హీరోలైనా.. సరియైన కథ కుదరాలి అంతే.. నేను రెడీ.

సుప్రీమ్.. పెద్ద మామయ్య ఫస్ట్ బిరుదులోంచి.. తిక్క.. చిన్న మామయ్య డైలాగ్ లోంచి..అదెలా వుంటుంది.?

అది కూడా యూత్ ఫుల్ సబ్జెక్ట్ అండి.. మంచి డెప్త్ వున్న స్టోరీ. 

వరుణ్ తేజ మాదిరిగా క్లాస్ సినిమాల మీద దృష్టి పెట్టడం లేదా?

ఎవరి స్టయిల్ ఆఫ్ మూవీస్ వారివండీ.. వరుణ్ కు ఆ స్టయిల్ నప్పింది.. నాకు ఈ స్టయిల్ నప్పింది. చూద్దాం ఫ్యూచర్ ఇంకా చాలా వుంది..

సో..ఆల్ ది బెస్ట్..

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి.