cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Interviews

భయమేసిందిగానీ, బాలీవుడ్‌ ఆదరించింది: సుధీర్‌బాబు

భయమేసిందిగానీ, బాలీవుడ్‌ ఆదరించింది: సుధీర్‌బాబు

టాలీవుడ్‌లో చిన్న సినిమాల వరకూ పెద్ద హీరో అనిపించుకున్నాడు సుధీర్‌బాబు. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌కి బంధువే అయినా, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న ఈ యంగ్‌ హీరో, అనూహ్యంగా బాలీవుడ్‌ మూవీ 'బాఘీ'లో ఛాన్స్‌ దక్కించుకున్నాడు. 'బాఘీ' సినిమా ప్రమోషన్‌లో ఎక్కువగా సుధీర్‌ పేరే విన్పించింది. సినిమా విడుదలకు ముందూ, విడుదల తర్వాత బాలీవుడ్‌లో సుధీర్‌ గురించే అంతా చర్చించుకున్నారు. ఆ సినిమాలో అతని పాత్ర అలాంటిది. హీరోతో సమానంగా 'బాఘీ'లో సుధీర్‌కి అవకాశం దక్కడమే ఇక్కడ విశేషం. అసలు బాలీవుడ్‌లో సుధీర్‌కి ఛాన్స్‌ ఎలా దక్కింది? ఆ ఛాన్స్‌ బాలీవుడ్‌లో అతనికి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిందా? బాలీవుడ్‌కి వెళ్ళడంలో అతని అనుభూతులేంటి? ఇలా రకరకాల ప్రశ్నలు. మరి, సుధీర్‌బాబు తన బాలీవుడ్‌ కెరీర్‌ గురించి ఏమంటున్నాడో తెలుసుకుందామా.? 

'బాఘీ'లో ఛాన్స్‌ ఎలా దక్కిందంటే.. 

తొలిసారిగా తెరపై సుధీర్‌ కన్పించింది నెగెటివ్‌ రోల్‌లోనే. అది 'ఏమాయ చేశావె' సినిమా. అందులో హీరోయిన్‌ సమంతకి సోదరుడిగా కన్పించాడు సుధీర్‌. ఆ తర్వాత హీరో అయ్యాడు. డాన్సుల్లో సత్తా చాటాడు. సిక్స్‌ప్యాక్‌తో ఆకట్టుకున్నాడు. తన సినిమాల్ని చూసి, బాలీవుడ్‌లో తనకు 'బాఘీ' సినిమాలో నటించే ఛాన్స్‌ ఇచ్చారంటున్నాడు సుధీర్‌బాబు. 

నెగెటివ్‌ అయినా పాజిటివ్‌ రెస్సాన్సే వచ్చింది కదా.! 

'బాఘీ' సినిమాలో సుధీర్‌బాబు విలన్‌గా కన్పించాడు. నెగెటివ్‌ రోల్‌ అయినా, మంచి రెస్పాన్స్‌ తనకు 'బాఘీ' సినిమాతో వచ్చిందంటున్నాడు సుధీర్‌బాబు. అంతేనా, ఈ సినిమా తర్వాత తనకు లేడీ ఫ్యాన్స్‌ పెరిగిపోయారని ముసిముసి నవ్వులు నవ్వేస్తున్నాడు. 'బాఘీ' సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డాడట. హీరో టైగర్‌ ష్రాఫ్‌ ట్రైన్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ స్పెషలిస్ట్‌. అతనితో పోటీపడి పోరాట సన్నివేశాల్లో నటించడానికి తొలుత భయపడినా, ఆ తర్వాత అలవాటు పడ్డాడట. తనకు డాన్స్‌ అంటే ఎంతో ఇష్టమనీ, ఫైట్స్‌ చేస్తున్నంతసేపూ దాన్నీ ఓ డాన్స్‌గానే భావించానంటాడు ఈ యంగ్‌ హీరో. యాక్షన్‌ హీరో అంటే తనకు జాకీచాన్‌ మాత్రమేననీ, అతన్ని గుర్తుకు తెచ్చుకుని ఫైట్స్‌ చేశానని సుధీర్‌బాబు చెప్పుకొచ్చాడు. 

స్పోర్ట్‌ నుంచి సినిమాల్లోకి రావడం వెనుక.. 

సుధీర్‌బాబు బ్యాడ్మింటర్‌ ప్లేయర్‌ అయినా, అనుకోకుండా సినిమా రంగంలోకి వచ్చాడు. ఎందుకలా? అని ప్రశ్నిస్తే, మెచ్యూరిటీ లెవల్స్‌ పెరిగే వయసొచ్చాక ప్రయారిటీస్‌ మారిపోతాయనీ, సినిమా రంగంలోకి అనుకోకుండానే రావడం జరిగిందనీ, ఇప్పుడు సినీ రంగంలో సత్తా చాటడమే తన లక్ష్యమంటున్న సుధీర్‌బాబు, ఒకవేళ సినీ రంగంలోకి రాకపోయుంటే, తన తండ్రికి సంబంధించిన బిజినెస్‌లు చూసుకునేవాడినని చెప్పాడు. 

నెగెటివ్‌ రోల్‌ కోసం కొంచెం భయపడ్డా.. 

టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ కృష్ణకీ, ఆయన తనయుడు మహేష్‌కీ బోల్డంత అభిమానగణం వుంది. వాళ్ళంతా తననూ అభిమానిస్తున్నారు గనుక, సినిమాల్లో విలన్‌గా నటిస్తే వారెలా ఫీలవుతారోనని తొలుత ఆందోళన చెందినప్పటికీ, నటుడిగా అన్ని పాత్రల్లోనూ రాణించాల్సి వుంటుందని తనకు తాను సర్ది చెప్పుకున్నాననీ, మహేష్‌ నుంచి ఈ విషయంలో తనకు పూర్తి మద్దతు లభించిందనీ, సినిమా చూశాక తనను మహేష్‌ అభినందించాడనీ, అది ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతున్నాడు సుధీర్‌బాబు. 

జిమ్నాస్టిక్స్‌లో అనుభవం పనికొచ్చింది 

టైగర్‌ ష్రాఫ్‌ జిమ్నాస్టిక్స్‌లో చిన్నప్పటినుంచీ ఎంతో అనుభవం గడించాడు. అలాగే తనకూ జిమ్నాస్టిక్స్‌తో పరిచయం వుంది గనుక, ఇద్దరికీ పెద్దగా సమస్యలు తలెత్తలేదంటున్న సుధీర్‌బాబుకి షూటింగ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌ విషయంలో ట్రైనింగ్‌ చాలా కొత్తగా అనిపించిందట. కలరియపట్టు సహా పలు పోరాట విద్యల్లో ప్రావీణ్యం 'బాఘీ' ద్వారా తనకు అభించడం పట్ల సుధీర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. 

అక్షయ్‌కుమార్‌ అంటే ఇష్టం 

బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు బాగానే వస్తున్నాయట సుధీర్‌బాబుకి. బాగా ఇష్టపడే హీరో అక్షయ్‌కుమార్‌ అట. అక్షయ్‌కుమార్‌తో సినిమా చేసే ఛాన్స్‌ వస్తే ఎగిరి గంతేస్తానంటున్నాడు. బాలీవుడ్‌ సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించాలంటే, మకాం ముంబైకి మార్చాల్సిందేనట. అలాగని, తనకు తెలుగులో వున్న మార్కెట్‌నీ, అక్కడున్న ఫాలోయింగ్‌నీ మర్చిపోనంటున్నాడు. బాలీవుడ్‌ సినిమాల్లో సత్తా చాటాలంటే, ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాల్సి వుంటుందన్న సుధీర్‌బాబు, బాలీవుడ్‌లోకి వచ్చేముందు తాను విన్న మాటలకీ, ఇక్కడి పరిస్థితులకీ చాలా వ్యత్యాసం వుందనీ, తాను భయపడినంత గందరగోళం బాలీవుడ్‌లో లేదని స్పష్టం చేశాడు. హిందీలో మాట్లాడటం మొదట్లో కష్టం అనిపించిందనీ, కొన్ని కఠినమైన పదాలకి అర్థం తెలుసుకునే క్రమంలో 'బాఘీ' హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ తనకెంతో సాయపడిందన్నాడు సుధీర్‌. 

నేను తన్నులు తింటే నా పిల్లలకి కష్టమే కదా 

'తెరపై నేను హీరోని కొడితే నా పిల్లలు నన్ను హీరోలా చూస్తారు.. అదే నేను తన్నులు తింటే వారికి నచ్చదు. 'బాఘీ' సినిమా చూసి నా పిల్లలు తట్టుకోలేకపోయారు..' అని నవ్వేశాడు సుధీర్‌. 'బాఘీ'లో నటించడం గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అనీ, ఆ సినిమాలో నటించే అవకాశం తనకొచ్చినప్పుడు తాను సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ మెంబర్‌నని ఆ టీమ్‌కి తెలియదని సుధీర్‌బాబు చెప్పాడు. బాలీవుడ్‌ సినిమాల్ని సుధీర్‌బాబు రెగ్యులర్‌గా చూస్తాడట. 'బాజీరావ్‌ మస్తానీ', 'భజరంగీ భాయిజాన్‌' ఇటీవలి కాలంలో వచ్చిన తనకు బాగా నచ్చిన చిత్రాలని చెప్పాడాయన.