cloudfront

Advertisement


Home > Movies - Interviews

బోయపాటి తరహాలో బన్నీ స్టయిల్ సినిమా

బోయపాటి తరహాలో బన్నీ స్టయిల్ సినిమా

బోయపాటి శ్రీను..ఈ పేరు వింటేనే సగటు మాస్ ప్రేక్షకులకు ఓ పూనకం వచ్చేస్తుంది. సినిమాలో ఏ సీన్ ను ఏ రేంజ్ కు తీసుకెళ్లాలో కొలతలు.. కూడికలు.. తీసివేతలు పక్కాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పటివరకు నందమూరి అభిమానులను మాత్రమే అలరించిన ఆయన మెగాభిమానుల అభిమానం సంపాదించేందుకు రెడీ అయిపోయారు. 

మెగా ఫ్యామిలీ హీరో బన్నీతో కలిసి సరైనోడు అంటూ జనం ముందుకు వస్తున్నారు. కచ్చితంగా హిట్ కొడతానని, ప్రేక్షకులను అలరించే అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమా అందిస్తున్నానని బోయపాటి ధీమాగా చెబుతున్నారు..అందరు హీరోలతో అన్ని రకాల సినిమాలు చేయడమే తన లక్ష్యం అంటున్నారు. సరైనోడు సినిమా విడుదల సందర్భంగా చాలా బిజీగా వున్న బోయపాటి, కాస్త విరామం దొరకగానే 'గ్రేట్ ఆంధ్ర'తో ముచ్చటించారు. 

తొలిసారి మెగా హీరోతో సినిమా... ఎలా వుందీ అనుభవం?

నిజానికి నేను ముందు ఇండస్ట్రీలో పరిచయం అయింది మెగా ఫ్యామిలీకే. అన్నయ్య సినిమాతో. నేను తొలిసారి కథ చెప్పింది బన్నీకే. చాలా హెవీ కథ.. తన యూత్ ఫుల్ ఇమేజ్ కు తేడా వస్తుందేమో అని చిన్న ఆలోచనలో పడ్డారు. అదే భద్ర.. దాంతో బన్నీనే స్వయంగా దిల్ రాజుకు నన్ను పరిచయం చేసారు. అలా అప్పటి నుంచి మా పరిచయం కొనసాగుతూనే వుంది.  అయినా నేను ఫలానా హీరోతోనే చేస్తాను అని ఎప్పుడూ చెప్పలేదు కదా? అందరు హీరోలతో చేయాలి.. అన్ని రకాల సినిమాలు చేయాలి అన్నదే నా లక్ష్యం. 

అరవింద్ గారి బ్యానర్ లో సినిమా చేయడం అంటే చాలా కష్టం అని.. వాళ్లను ఒప్పించడం ఒకంతట సాధ్యం కాదని...?

అబ్బే అదంతా సరి కాదండీ.. మన దగ్గర విషయం వుంటే, అరవింద్ గారి బ్యానర్ అంత కంఫర్ట్ ఇంకెక్కడా రాదు. మన దగ్గర విషయం వుండి.. సరైన సబ్జెక్ట్ వుంటే వాళ్లను ఒప్పించడం సులువు. అంతే కానీ మనదగ్గర విషయం లేకపోతే.. వాళ్లతో కష్టం అనేయడం సులువు. నా దగ్గర ఫుల్ ప్లెజ్డ్ సబ్జెక్ట్ వుంది.. అది వాళ్లకు పక్కాగా నచ్చింది.. అందువల్ల నాకే సమస్య ఎదురుకాలేదు.

క్లయిమాక్స్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డారని..?

అబ్బే లేదండీ.. అదంతా వట్టిమాట. మేం ఒకటి అనుకున్నాం.. దాన్ని ఫైనల్ చేయడం కాస్త ఆలస్య మైంది. దానికి సరైన లోకేషన్ అదీ కుదరలేదు. అక్కడా ఆలస్యమైంది. దాంతో వేరే విధంగా జనంలోకి వార్తలు వెళ్లాయి అంతే.

ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ చేసి వుంటే మరింత బాగుండేదని..?

ఎవరికి వారే నండి.. ఈ సినిమాకు థమనే కరెక్ట్. నాకు దేవీశ్రీ ప్రసాద్ మంచి స్నేహితుడు. మనం కొన్ని మాట్లాడతాం. అవి పూర్తిగా వినాలి.. ఏ కంటెస్ట్ లో అన్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ నేను దేవీ మంచి మిత్రులమే.

అంటే భవిష్యత్ లో మీరు కలిసి పనిచేసే అవకాశం వుందా..?

వైనాట్.. తప్పకుండా చేస్తాం..

2016లో మెగా క్యాంప్ లో సినిమా ఓ మంచి విషయం.. మరి బాలయ్య బాబు వందో సినిమా చేజారడం.. ?

కొన్ని మన చేతుల్లో వుండవండీ. ముఖ్యంగా నేను ఒక విషయంలో థాంక్స్ చెప్పాలి. అభిమానులు, మీడియా, సినిమా జనాలు, అందరూ బాలయ్య బాబు వందో సినిమా నేనే చేయాలి.. చేస్తే బాగుంటుంది అని ఏదో విధంగా అభిప్రాయాలు వ్యక్తం చేసారు. దానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.

బాలయ్య బాబుతో సినిమా అంటే సింహా.. లెజెండ్ కు మించి వుండాలి. అలా వుండాలి అంటే కనీసం నాకు నాలుగు నెలల సమయం కావాలి. లైన్ చెప్పేసాను.. ఆయన ఓకె అన్నారు. కానీ సరైన స్క్రిప్ట్ తయారు కావాలంటే నాలుగు నెలలు సమయం కావాలి నాకు.  ఇక్కడ ఇంకో సమస్య వచ్చింది. మనం ఒక మాట ఇస్తే దాని మీద నిల్చోవాలి. బెల్లంకొండ శ్రీనివాస్ కు ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాను. పోనీ దాన్ని ఏదో విధంగా సర్దు బాటు చేద్దాం అనుకున్నా నాలుగు నెలల టైమ్ మాత్రం అవసరం అని చెప్పాను. అదే కుదరలేదు.

బాలయ్య ఏమన్నారు?

ఆయన ఒకటే అన్నారు. మనం కలిసి సినిమా చేయడం ముఖ్యం.. నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే చేద్దాం అని. 

బాలయ్య, ఎన్టీఆర్ బన్నీ లాంటి టాప్ హీరోలతో సినిమా చేసాక, బెల్లంకొండ లాంటి అప్ కమింగ్ హీరోతో సినిమా చేయడం అంటే..?

డైరక్టర్ గా నాకు అలాంటివి వుండకూడదు.. పైగా మాట ఇచ్చాను చేస్తానని. చేయాల్సిందే. 

ఆ తరువాత ఏమిటి? రామ్ చరణ్ తోనా?

అలా ఏదీ అనుకోలేదండీ.. పిలిచి, ఆఫర్ ఇచ్చి, నాకు నాలుగు నెలలు టైమ్ ఇస్తే, ఏ హీరోకైనా మాంచి స్క్రిప్ట్ తయారుచేసి చేతిలో పెట్టగలను. ఆ దమ్ము నాకుంది.

బాలయ్య వందోసినిమా, మెగాక్యాంప్ సినిమా, దేవీ శ్రీ ప్రసాద్, ఆఖరికి గోదావరి పుష్కరాలు..ఎప్పుడూ వార్తల్లో వ్యక్తేనా మీరు?

అదేం లేదండీ.. ఓ పెద్దాయిన పిలిచి సాయం పట్టమంటే గోదావరి పుష్కరాలకు వెళ్లా.. అంతకు మించి మరేం లేదు. పని చేసుకుంటూ వెళ్లడమే.. వార్తల్లో వుండాలని నేను అనుకోవడం లేదు..

కమింగ్ బ్యాక్ టు సరైనోడు.. ఇది ఏ విధంగా చూడాలి.. ఎందుకంటే మీరు అన్ని రసాలు బీభత్సంగా పండిస్తారు.. ఎంటర్ టైన్ మెంట్ తప్ప అన్న చిన్న కామెంట్ వుంది. బన్నీ చూస్తే ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ హీరో..?

మీరన్నది నిజమే. కానీ ఏ హీరోకి అవసరం అయినట్లు అలా స్క్రిప్ట్ అందించగలను నేను. ఈ సినిమా చూసాక మీరే అంగీకరిస్తారు ఆ విషయం. సరైనోడులో కూడా బన్నీ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ కు ఎక్కడా ఏ లోటూ లేదు. రాదు. ఇక నా మార్కు ఎమోషన్ మామూలే. సో..బోయపాటి తరహాలో బన్నీ స్టయిల్ సినిమా ఇది.

చిరంజీవి గారు సినిమా చూసారా? ఏమన్నారు?

బాగుందన్నారు..అన్నీ పీక్ రేంజ్ లో వున్నాయన్నారు. 

సో..బెస్టాఫ్ లక్

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి